డీఎస్‌సీతో నిరుద్యోగులకు తీరని బాధలు | unemployed suffer will not solve with DSC | Sakshi
Sakshi News home page

డీఎస్‌సీతో నిరుద్యోగులకు తీరని బాధలు

Published Thu, Dec 4 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

డీఎస్‌సీతో నిరుద్యోగులకు తీరని బాధలు

డీఎస్‌సీతో నిరుద్యోగులకు తీరని బాధలు

 ఇన్ బాక్స్

 టెట్‌కు అర్హత సాధించిన వారికిచ్చే సర్టిఫికెట్ ఏడేళ్ల వరకు చెల్లు బాటవుతుందని చెప్పారు. కాని ఇప్పుడు టెట్, డీఎస్సీ రెండిం టికీ కలిపి ఒకే పరీక్ష ఉంటుందని, గతంలో టెట్ క్వాలిఫై అయిన వారు మళ్లీ టెట్ ప్లస్ డీఎస్సీ పరీక్షను రాయాలని షరతు పెట్టా రు. అలాంటప్పుడు గత టెట్ సర్టిఫికెట్‌కున్న ఏడేళ్ల వ్యాలిడిటీ పరిస్థితేమిటి? ఒక డీఎస్సీకి మరో డీఎస్సీకి విధానాలు మారు తుంటే మేమెలా సిద్ధం కావాలి? ఇప్పటికే టెట్ పరీక్ష రాసి అర్హత సాధించిన మాకు మళ్లీ కోచింగ్‌కు సిద్ధమవటం తలకు మించిన భారమే. ఏ ప్రభుత్వ ఉద్యోగానికీ లేనన్ని పరీక్షలను ఉపాధ్యాయ ఉద్యోగాలకు పెట్టి నిరుద్యోగులను కుంగదీస్తున్నారు. పైగా ఎస్‌సీఆర్‌టీ ప్రకారం ప్రస్తుత విద్యాసంవత్సరంలో జరుగుతున్న పాఠ్యపుస్తకాలతోటే టెట్, డీఎస్సీ పెట్టాలంటున్నారు. కానీ గతం లో ఉన్న పాత పాఠ్యపుస్తకాలను అనుసరించి పరీక్ష ఉంటుందని పాత, కొత్త పాఠ్యపుస్తకాలకు బోధించే విధానం మాత్రమే వేరని వాటిలో ఉండే సబ్జెక్టు ఒకటేనని మన ప్రభుత్వం సర్దిచెబుతోం ది. నిజానికి ఎస్‌సీఆర్‌టీ ప్రకారం పాఠశాల విద్య ప్రస్తుతం గుణాత్మక విద్యావిధానంలో అమలవుతోంది. కాని పాత పాఠ్య పుస్తకాలు గుణాత్మక విద్యావిధానం ప్రకారం లేవు. అంటే పాత పాఠ్యపుస్తకాలననుసరించి డీఎస్సీ పరీక్ష రాయాలి. తరువాత పాఠశాలల్లో పిల్లలకు కొత్త పాఠ్యపుస్తకాలను గుణాత్మక విద్యావి ధానంలో చెప్పాల్సి ఉంటుంది. అంటే చదివేది పాత పాఠ్యపుస్త కాలు, పిల్లలకు బోధించాల్సింది మాత్రం కొత్త పాఠ్యపుస్తకాలు. ఇలా కాకుండా పాత పద్ధతి ప్రకారం టెట్, డీఎస్సీలకు విడివి డిగా తగిన సమయం కేటాయించి నిర్వహిం చాలి. పైగా, ఎంతోమంది నిరుద్యోగులు ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్నారు. టెట్, డీఎస్సీ కోచింగ్ కోసం విద్యాసంవత్సరం మధ్యలో వారు పని చేస్తున్న పాఠశాలలను వదిలి బైటకువచ్చి ఎగ్జామ్ పూర్తి చేసుకుని మరలా పోస్టు కోసమని ప్రైవేట్ స్కూల్‌కు వెళితే వాళ్ల పోస్టుల్లో మరొకరు ఉంటున్నారు. కాబట్టి ఈ టెట్, డీఎస్సీ పరీక్షలను విద్యాసంవత్సరం మధ్యలో కాకుండా మే, జూన్ నెల లో నిర్వహిస్తే మంచిది. కోర్టుల ద్వారా ఈ సమస్యను పరిష్క రించుకునేంత ఆర్థికస్తోమత లేనందున ఇలా పత్రిక ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. నిరుద్యోగుల ఆశలను పట్టించుకుంటారని, అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము.
 జ్యోతి,  వినుకొండ, గుంటూరు జిల్లా

 ‘మేముసైతం’ సందేశం భేష్
 ఉత్తరాంధ్రను వణికించిన హుద్ హుద్ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన ‘మేము సైతం’  కార్యక్రమం అందరినీ అలరించింది. సాటి మనుషు లను ఆదుకోవడం మనందరి బాధ్యత అనే సందేశాన్నీ ఇచ్చింది. ఈ వినోద కార్యక్రమాల ద్వారా వచ్చిన  11.51 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించడం అభినందనీయం. ప్రకృతి వైపరీత్యాల వల్ల తెలుగు ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద కలిగినా వారిని ఆదుకోవడంలో తెలుగు సినీ పరిశ్రమ ముందుంటోంది. గతంలో ఎన్నో విపత్తులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేశాయి. అప్పుడు కూడా తెలుగు ప్రజలకు అండగా నిలబడిన ఘనత మన చిత్ర పరిశ్రమది. ఈసారి అక్టోబర్‌లో ఉత్తరాంధ్రను హుద్ హుద్ తుపాను భయపెట్టింది. దీంతో  వెంటనే చిత్ర పరిశ్రమలోని చాలా మంది ప్రముఖులు స్పందించారు. ఎవరికి తోచిన సహాయం వారు అందించారు. మీకు అండగా మేమున్నా మంటూ చేయూతనిచ్చారు. ఏది ఏమైనప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ఒక తాటిపై నిలిచి ఉత్తరాంధ్ర బాధితులను ఆదు కోవడం ప్రశంసనీయం.
 బట్టా రామకృష్ణ దేవాంగ,  సౌత్ మోపూరు, నెల్లూరు జిల్లా
 
 ‘చిత్ర’ స్పందన ఇక్కడేదీ?
 విశాఖలో జరిగిన హుద్‌హుద్ తుపాన్ బాధితుల కోసం తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్పందించిన తీరు అమోఘం. ఆంధ్రప్రాం తంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రతిసారీ పరిశ్రమ బాగానే స్పందిస్తుంది. సంతోషం. నిజానికి తెలుగు చిత్రపరిశ్రమకు ఆయువుపట్టు నైజాం ప్రాంతం. ఈ ప్రాంతంలోనే వ్యాపారం ఎక్కువ. స్టూడియోలకు, ఫిలింనగర్‌లకు, ఫిల్మ్ సొసైటీలకు, థియేటర్లకు భూములు ఇచ్చింది ఈ ప్రాంతమే. కానీ, ఈ ప్రాం తంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వరదలు, కరువుకాట కాలు వచ్చినప్పుడు చిత్రపరిశ్రమ స్పందించలేదు. తెలంగా ణలో ఫ్లోరోసిస్ బాధితుల కోసం, వడగండ్ల వానలకు నష్టపో యిన రైతుల కోసం, చేనేత కార్మికుల కోసం చిత్ర పరిశ్రమ స్పం దించిన దాఖలా లేదు. ఇక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుం టున్నా చిత్రపరిశ్రమ కనీసంగా స్పందించలేదు. అదే సమయం లో తెలంగాణలో ప్రతి నటీనటులకు చాలామంది అభిమానులు ఉన్నారు. ప్రాంతాలకు అతీతంగా వీరు నటీనటులను అభిమాని స్త్తున్నారు. తెలంగాణ కోసం కూడా స్పందించాలని చిత్రపరిశ్రమ పెద్దలను కోరుతున్నాము. ఇక్కడి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతిని ధులు ఈ విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
 సురేష్ కాలేరు,  భువనగిరి, నల్లగొండ జిల్లా

 వికలాంగుల విన్నపం
 ప్రపంచ వికలాంగుల దినోత్సవం (డిసెంబర్ 3) సందర్భంగా సభలూ సమావేశాలూ నిర్వహించడమే కాకుండా వారికి ఇచ్చే పెన్షన్ రూ. 1,500కు పెంచడం చాలాబాగుంది. ప్రభుత్వ చర్య వికలాంగులకు నజరానా అనే చెప్పాలి. దీంతోపాటు వికలాం గుల కోసం నూతనంగా మంచి సంక్షేమ పథకాలను చేపట్టాలి. వారికి ప్రత్యేక గృహ సముదాయం, కాలనీలు నిర్మించి ఇవ్వాలి. బ్యాంకుల ద్వారా వారికి ప్రత్యేక రుణాలు కల్పించాలి. వారి సౌకర్యార్థం మరుగు దొడ్లు నిర్మించాలి. గ్యాస్ పథకం ద్వారా సబ్సిడీలు అందించాలి. వికలాంగుల హాస్టళ్లు ఏర్పర్చి సౌక ర్యాలు కల్పించాలి. డిసెంబర్ 3 నుంచి 10 వరకు వికలాంగుల వారోత్సవాలు నిర్వహించి వికలాంగుల సంక్షేమం కోసం బడ్జెట్, పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, రెవెన్యూ, పంచా యతీరాజ్, విద్య, ఆరోగ్యం, రేషన్ కార్డులు వంటి అంశాలపై 7 రోజుల పాటు చర్చించాలి. అన్ని రకాల ఉద్యోగాల్లో, వృత్తుల్లో వికలాంగులకు డిసెంబర్ 3న సెలవుదినం ప్రకటించాలి. ప్రతిభా వంతులైన వికలాంగులను ఈ వారోత్సవాల సందర్భంగా ప్రోత్సహించాలి.
 ఈదునూరి వెంకటేశ్వర్లు,  నెక్కొండ, వరంగల్ జిల్లా

 ‘ఉసూరు’ మానియా ఆసుపత్రి
 మన ఆరోగ్య మంత్రిగారు రాత్రి మొత్తంగా ఉస్మానియా ఆసు పత్రిలో ఉండి రోగులను పరామర్శించడం బాగుంది కానీ ఒక్కరోజు ఆయన ఆసుపత్రిలో ఉంటే సమస్యలు తీరిపోతా యా? ఆయన వస్తున్న సంగతి తెలిసి సిబ్బంది పైపైన శుభ్రం చేసి చేతులు దులుపుకున్నారు. ఆసుపత్రి లోపల అన్ని విభాగాల పనితీరు చూసి అప్పుడు చెప్పాలి. అంతే కాని తూతూ మంత్రం తనిఖీ వల్ల ఏమీ ఒరగదని రోగుల మాట.. ఉస్మానియాకి వెళ్తే గేటు దగ్గర నుంచి అవినీతిమయం, చేయి తడిపితే కానీ లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. వీల్‌చైర్ ఉండదు. స్ట్రెచ్చర్ దొరకదు. ఎలా గోలా లోపలికి వెళితే పారిశుధ్యం అంతంత మాత్రమే. కుక్కలు, ఎలుకలు, పందికొక్కులు, సమస్త జీవరాసులకూ ఉస్మానియానే నిలయం. పైగా భయంకర దుర్గంధం, గోడలనిండా ఉమ్ములు. ఇక వైద్యులు ఎప్పుడొస్తారో తెలియని స్థితి. సెలైన్ బాటిల్స్ కొరత. బెడ్లు లేక రోగులు నేలమీదే పడుకుంటున్నారు. రోగులు వైద్యం అందే లోపే చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి మాత్రం మారదు. ప్రభుత్వం ఇకనైనా అక్కడ సౌక ర్యాలు మెరుగుపర్చాలి.
 రాజ్యలక్ష్మి,  చిక్కడపల్లి, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement