ఉపాధ్యాయ విద్యలో నాణ్యతేదీ?
ఇన్ బాక్స్
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు, పట్టణాలలో నెలకొల్పి న ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల్లో చదువుతున్న ఛాత్రో పాధ్యాయులకు నాణ్యమైన శిక్షణ అందడం లేదు. దీం తో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత వారు విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్యను అందించ లేకపోతున్నారు. బీఈడీ, డీఈడీ శిక్షణా కాలేజీల్లో సరైన విద్యార్హతలున్న అధ్యాపకులు ఉండటం లే దు. అందువలన బీఈడీ కోర్సు చేసిన వారే ఛాత్రోపాధ్యాయులకు అధ్యాపకులు గా బోధన చేస్తున్నారు. ఫలితంగా ఉపాధ్యా య విద్య పట్ల ప్రతి ఒక్కరిలో అనాసక్తత పెరుగుతోంది. మరో వైపున తెలంగాణ ప్రభుత్వం, ఎన్‌సీటీఈలు ఇబ్బడిముబ్బడిగా ఉపాధ్యా య విద్యా కాలేజీలకు అనుమతులను ఇస్తున్నాయి. దీంతో కేవలం లాభాపేక్ష వైఖరితోనే కాలేజీలు పుట్టుకు రావడంతోపాటు, విద్యార్థులకు నామమాత్రంగానే శిక్షణ అందుతోంది. దీంతో సత్ఫలితాలు రావడంలేదు. ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో నిరంతరం నాణ్యమైన విద్యను అందిం చేలా, అనుభవం గల అధ్యాపకులను నియమించేలా ప్రభుత్వం తగిన చొరవ చూపాలి.
- కామిడి సతీష్‌రెడ్డి పరకాల, వరంగల్ జిల్లా
అధిక సంతానమా, నియంత్రణా?
గత అరవై సంవత్సరాల నుంచి భారతదేశం ఎంత అభివృద్ధి చెందినా అధిక జనాభా వలన దేశం అనేక రంగాల్లో తగినన్ని నిధులు, వనరులు లేక నిర్వీర్యమైపోయింది. యాభై కోట్ల జనాభాను మాత్రమే భరించగల మన దేశం 130 కోట్ల మందిని ఎలా భరించగలగటం అసాధ్యం. దేశంలో రాజకీయ, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తీవ్రస్థాయిని చేరడానికి కారణం అధిక జనాభా. కొద్ది మేరకు ధనిక మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. కాని కొన్ని మతాల వారు మరియు సంతానాన్ని ఆదాయ వనరులుగా భావించే కార్మికులు, కూలీలు కుటుంబ నియంత్రణ పాటించకుండా జనాభాను అధికాధికంగా పెంచుతున్నారు. ఫలితంగా ఆ దేశ జనాభా పెరిగిపోతోంది. దీంతో జనాభా సమతుల్యత దెబ్బతిన్నది. కనుక ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే కుల మత రాజకీయాలు పక్కన పెట్టి నిర్బంధ కుటుంబ నియంత్రణ చట్టం చేసి కఠినంగా అమలు చేయాలి. మానవ వనరుల పరంగా దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టడం అంటే జనాభాను అదే పనిగా పెంచాలని అర్థం కాదు. రాజకీయ నేతలు అధిక సంతానంపై ఇటీవల చేస్త్నున వరుస ప్రకటనలు ఏ రకంగా చూసినా సమంజసం కాదు.
- గోపాలుని శ్రీరామమూర్తి వినుకొండ, గుంటూరు జిల్లా
భారత జట్టుకు జేజేలు
లబ్ డబ్ .. లబ్ డబ్.. ఇది ఆదివారం భారత క్రికెట్ అభిమానుల గుండెచప్పుడు. ప్రపంచకప్‌లో భాగంగా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన భారత్, పాకిస్థాన్‌ల క్రికెట్ పోరు ఆద్యంతం కనువిందు చేసింది. దాయాది పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే భారత ఘన విజయం సాధించింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైనా... ప్రపంచకప్‌లో మాత్రం తమ తొలి మ్యా చ్‌లోనే అదర గొట్టే ఆట తీరును భారత జట్టు ప్రదర్శించడం విశేషం. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం భారత్‌నే వరించడంతో, కోట్లాది భారతీయుల ముఖాల్లో ఆనందం పెల్లుబికింది. ఈ మ్యాచ్ ప్రపంచకప్‌కే కళ తెచ్చింది అనడంలో అతిశ యోక్తి లేదు. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన భారత ఆటగాళ్ల సమిష్టి కృషి ఫలితంగానే ఈ విజయం దక్కింది. దీంతో భారత్ వరుసగా ఆరు ప్రపంచకప్ పోటీల్లో పాకిస్థాన్‌పై వరుస విజయాలు సాధించింది. మన ఆటగాళ్లు ఇదే ఆటతీరుతో విజయ పరంపరను చివరి వరకూ కొనసాగించాలి. గతంలో రెండుసార్లు వరల్డ్‌కప్‌ను మనదేశానికి తీసుకొచ్చిన టీమ్ ఇండియా ముచ్చటగా మూడోసారి కూడా కప్‌ను ఎగురేసుకొచ్చి విశ్వవిజేతగా నిలవాలని ఆశిద్దాం.
- బట్టా రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూరు
బాసర భక్తులకు బస్టాండ్
ఆదిలాబాద్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రానికే తల మానికం. ఇది చదువులతల్లి, జ్ఞాన సరస్వతి ఆలయం. నిత్యం వేలాది భక్తులతో శోభాయ మానంగా కళకళలాడుతోంది. భక్తులు తమ పిల్లలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుని పిల్లలకు అక్షరాభ్యాసం కార్య క్రమంలో పాల్గొని, పూజలు నిర్వహిస్తుంటారు. బాసర సరస్వతిమాత ఆలయ చరిత్ర విస్తృత ప్రచారం లోకి రావడంతో దేశం నలు మూలల నుండి యాత్రి కులు నిత్యం వేలాది సంఖ్యలో వస్తుంటారు. ఈ దేవస్థానం వద్ద భక్తులకు స్వచ్ఛంద సంస్థలు, ఆయా సమాజాల వారు ధర్మసత్రాలు, నిత్య అన్నదాన కార్య క్రమం చేపడుతూ అందరి ప్రశంసలందుకుంటున్నారు. కాని ఇక్కడ ఒకే ఒక్క లోపం ఏమిటంటే ప్రయాణీకుల సౌకర్యార్థం బాసర సరస్వతి మందిరం వద్ద ఆర్టీసీ బస్సులు రోడ్డు పక్కనే ఉన్న ఇరుకైన స్థలంలో నిలబడ తాయి. వీరి ఇక్కట్లు తీరాలంటే సరస్వతి ఆలయం పక్కనే విశాలమైన పది ప్లాట్‌ఫారాలున్న బస్టాండ్ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సత్వరం స్పందించి భక్తులకు సౌకర్యాలను మెరుగుపర్చాలి.
- గంగాప్రసాద్ అప్పా బోధన్, నిజామాబాద్ జిల్లా