కాలుష్యాన్ని గమనించాలి
ఇన్ బాక్స్
గణపురం(ఎం) మండలం, పరిసరాలు టీఎస్ జెన్కో, కాకతీయ లోంగోవాల్ ప్రాజెక్టుల వల్ల పారిశ్రామికంగా కొంత అభివృద్ధిని సాధి స్తున్నాయి. కానీ దీని వల్ల ఈ ప్రాంత పర్యావరణం కలుషితమవు తోంది. ప్రజలు ఎన్నో ఇక్కట్లకు గురవుతున్నారు. దీనికి పరిష్కారం ఒక్కటే. ఈ ప్రాంతాల నిండా ప్రభుత్వ భూములలో సామాజిక అడవులు పెంచడానికి తక్షణమే చర్యలు తీసు కోవాలి. ఈ బాధ్యతను టీఎస్ జెన్కో, కాకతీయ- లోంగోవాల్ ప్రాజెక్టు వారే స్వీకరించాలి. ఇందులో భాగంగానే ఈత, తాటి చెట్లను పెంచి గీత కార్మికులను ఆదుకోవాలి. కాలుష్య సమస్య మరింత తీవ్రం కాకుండానే ఆధునిక పరిజ్ఞానం ఆధారంగా నివారణకు కృషిని ఆరంభించాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’తో గణపురం పెద్ద చెరువును కూడా అభివృద్ధి చేయాలి. కట్టను విస్తరించి మినీ ట్యాం క్‌బండ్‌గా రూపొందించాలి. తెలంగాణ మహనీయుల, త్యాగధనుల విగ్రహాలను ఏర్పాటు చేయించాలి. విగ్రహాలను ఏర్పాటు చేయడం వలన స్థానికుల చరిత్ర వెలుగులోకి వస్తుంది. అలాగే కాలుష్యం మీద దృష్టి పెట్టడం ఆధునిక దృష్టికి కొలమానం కాగలదు. ఆ రెండింటినీ కరీంనగర్ పట్టణంలో ఆవిష్కరించి అందరికీ ఆదర్శం కావాలి.
తాళ్ల హరిప్రసాద్ గణపురం, వరంగల్ జిల్లా
ఆ విమర్శలు గుర్తు లేవా?
ఆధార్‌తో, వంటగ్యాస్ సిలిండర్ సబ్సిడీని అనుసంధానం చేయడంలో ప్రభుత్వాలు అతడి కంటె ఘనుడు ఆచంట మల్లన్న అన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. సిలిండర్‌పై ఇచ్చే సబ్సిడీని ఆధార్‌తో ముడిపెట్టి, బ్యాంకు ద్వారా తిరిగి చెల్లించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయిం చింది. దీని మీద దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనాయి. ప్రజా గ్రహాన్ని యూపీఏ ప్రభుత్వం చవి చూడవలసి వచ్చింది. దీనితో కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది. నిజానికి ఈ విధానాన్ని అప్పుడు ప్రతిపక్షం స్థానంలో ఉన్న ఎన్‌డీఏ కూడా విమర్శించింది. ఆధార్ అనుసంధానం ద్వారా కాంగ్రెస్ నిరాధా ర్‌గా మారిందని వెంకయ్యనాయుడు విమర్శించారు కూడా. ఇప్పుడు అదే నిర్ణయాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం అమలు చేయడం వింత కాదా? మధ్య తరగతి కుటుంబాలను ఎంతగానో ఇబ్బందికి గురిచేస్తున్న ఈ పద్ధతికి ఇకనైనా స్వస్తి పలకాలి. ఏ విధంగా చూసినా ఈ పద్ధతిలోని హేతు బద్ధత ఏమిటో సామాన్య జనానికి అంతుపట్టడం లేదు. ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించడం, అందులో కొంత మళ్లీ వినియోగదారుల ఖాతా లలో జమచేయడం, ఇంత ప్రక్రియ ఎందుకో ప్రభుత్వాలు ఇకనైనా ఆలోచించాలి. ఏ వ్యవస్థనైనా కాలం గడిచేకొద్దీ సరళతరం చేయాలి తప్ప మరింత జటిలం చేయరాదు.
రఘుముద్రి అప్పలనరసమ్మ బాలిగాం, శ్రీకాకుళం జిల్లా
యాత్రల మతలబేమిటి?
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విదేశీ యాత్రల హడావుడి చూస్తుంటే ప్రజలకు సందేహాలు కలుగుతున్నాయి. దీనికి తోడు పలువురు నాయకులు, రాజకీయ విశ్లేషకులు కూడా ఈ యాత్రలను ప్రశ్నించారు. ఆయన విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి ఆహ్వానించడం కోసమే తాను యాత్రలు చేస్తున్నానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ దీనిని ఎక్కువ మంది నమ్మడం లేదు. అందుకు కారణం ఆయన నైజం. గతంలో ఆయన విదేశీయాత్రల పేరుతో చేసిన నిర్వాకం, ఎదుర్కొన్న విమర్శలు. తాను అధికారంలో ఉన్నా, లేకున్నా సింగ పూర్‌తో తన అనుబంధం సాగుతుందని ఇటీవల ఆయన అన్నట్లు వార్తాపత్రికల్లో కూడా వెలువడింది. సింగపూర్‌కు చంద్రబాబుతో ఉన్న అనుబంధం గతంలో కూడా వివాదాస్పదమే. కాబట్టి బాబు యాత్రల మర్మమేమిటో ఆయనే వెల్లడించడం మంచిది. రాజధాని నిర్మాణాన్నీ, ఇతర ప్రణాళికలను అంత ఆగమేఘాల మీద విదేశీ సంస్థలకు అప్ప గించాలని చంద్రబాబు అనుకోవడం అందరికీ తెలుసు. ఇంత తొందర ఎందుకు? అని అన్ని వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. కొత్త రాష్ట్రం అభి వృద్ధిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడుల విషయంలో ఎవరికీ స్వలాభా పేక్ష ఉండరాదు.
అయినాల కనకరత్నాచారి కొరిశపాడు, ప్రకాశం జిల్లా
మళ్లీ మోసపోయిన ప్రజలు
పాత ప్రభుత్వాలతో విసిగిపోయిన ప్రజలు కొత్త పార్టీలకు ఓట్లు వేసి మోసపోయారు. పాత ముఖాలే అని తెలిసినా, మార్పు ఉంటుందని ఆశపడి ఓట్లు వేశారు. కానీ భంగపడ్డారు. భారతదేశంలో రాజకీయ పార్టీల చేతుల్లో నాయకుల మాటలతో సామాన్య ప్రజానీకం చిరకాలంగా మోసపోతూనే ఉంది. ఇందుకు ప్రజాస్వామ్య విధానంలో ఉన్న లొసుగులను నాయకులు ఉపయోగించుకుంటున్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్నదీ సరికొత్త మోసమే. ఇద్దరూ తమ ఎన్నికల ప్రణాళికలను తుంగలో తొక్కి మాట్లాడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు గడుస్తున్నాయి. అత్యంత ప్రాధాన్యం కలిగిన సమస్యల గురించి కూడా ఆయన ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. రైతుల రుణాలు రద్దు కాలేదు. నిరుద్యోగులను మరింత నిరాశ పరుస్తూ ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్లు పెంచారు. ఈ సమస్యలను పరి ష్కరించకుండా, కమిటీల పేరుతో జాప్యం చేస్తూ, ఏదో పేరు చెప్పి విదేశాలకు వెళుతున్నారు. కేంద్రం కూడా నవ్యాంధ్రను అన్ని విధాలా ఆదుకుంటామని వాగ్దానం చేసి, ఇప్పుడు గాలికి వదిలేసింది. జాతీయ సమస్యల పరిష్కారం కోసం ఆలోచించకుండా మోదీ కూడా విదేశీ యాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదెంత వరకు సబబు?
ఈశ్వర్ ప్రొద్దుటూరు, కడప జిల్లా