ఓటు మీ హక్కు.. వినియోగించుకోండి | Use your right to vote | Sakshi
Sakshi News home page

ఓటు మీ హక్కు.. వినియోగించుకోండి

Published Fri, Jan 25 2019 5:22 AM | Last Updated on Fri, Jan 25 2019 5:22 AM

Use your right to vote - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓటరు జాబితాలో పేరు నమోదు.. పొరపాట్ల సవరణ.. చిరునామా మార్పు తదితరాల గురించి ఎంతగా ప్రచారం చేస్తున్నా అది ప్రజలందరికీ చేరడం లేదని, వీటిపై వారందరికీ అర్థమయ్యేలా సరళమైన తెలుగుభాషలో ఓటరు నమోదుపై చైతన్యం కలిగేలా ఇంటింటికీ పోస్టుకార్డుల పంపిణీని చేపట్టామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. అంతే కాకుండా తమవైపు నుంచి ప్రజలకు చేరవేస్తున్న సమాచారంతోపాటు వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తెలుసుకునేందుకు కూడా ఉపకరిస్తుందని సీఈఓ చిరునామాతో రిప్లయ్‌ పోస్టుకార్డుతో కూడిన లేఖలను పంపామన్నారు.

‘ఓటు మీ హక్కు.. ఓటు వేయడం మీ బాధ్యత’అంటూ రజత్‌కుమార్‌ స్వీయ సంతకంతో కూడిన లేఖల్ని రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే మేరకు రాష్ట్రంలోని కోటి ఐదు లక్షల కుటుంబాలకు చేరేలా వీటిని పంపించి నట్లు తెలిపారు. సంక్రాంతికన్నా ముందుగానే పంపాలనుకున్నప్పటికీ, ఆలోగా అన్ని పోస్టుకార్డుల్ని పోస్టల్‌శాఖ తమకు సమకూర్చలేకపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు పోయిందని, ఓటు వేయలేకపోయాని పలువురు వేదన వ్యక్తం చేయడంతో రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ ఒక్కరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు ఈ లేఖలు ఉపకరించగలవన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆలోచన రావడానికి కారణం.. ప్రజల నుంచి వస్తున్న స్పందన గురించి గురువారం రజత్‌కుమార్‌ ‘సాక్షి’కి వెల్లడించారు. 

ఓటర్ల ఇళ్ల వద్దకుబూత్‌స్థాయి అధికారులు
రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా నగరంలో బీఎల్‌ఓలు (బూత్‌స్థాయి అధికారులు) తమ ఇళ్లకు రాలేదని, ఇంటింటికీ సర్వే చేయకుండానే ఓట్లు తొలగించారని పలువురు తమ దృష్టికి తేవడంతో ఈ రకంగానైనా బీఎల్‌ఓలు ప్రతీ ఇంటికీ వెళ్తారనే ఉద్దేశంతోనూ తిరుగు పోస్టుకార్డుతో కూడిన లేఖల పంపిణీని బీఎల్‌ఓల ద్వారా చేపట్టామన్నారు.ప్రతి ఇంటికి వెళ్లి లేఖను ఇవ్వడంతోపాటు వారి నుంచి అకనాలెడ్జ్‌మెంట్‌కూడా తీసుకోవాల్సి ఉన్నందున కచ్చితంగా వెళతారనే ధీమా వ్యక్తం చేశారు. ఈ రకంగానైనా బీఎల్‌ఓలకు, ఓటర్లకు మధ్య సంబంధం ఏర్పడుతుందన్నారు. తమ లక్ష్యాన్ని నూరు శాతం పూర్తిచేసేవారికి ప్రోత్సాహక బహుమతులిచ్చే ఆలోచన ఉందని చెప్పారు. 

లేఖలకు ఓటర్ల నుంచి ధన్యవాదాలు
లేఖలు పంపినందుకు ధన్యవాదాలు అంటూ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, తాను దాదాపు వంద లేఖల్ని చదివానని తెలిపారు. కొందరు ఖాలీ రిప్లయ్‌ కార్డులు కూడా పంపారని, చాలామంది ఎపిక్‌కార్డులు రాలేదని ఫిర్యాదు చేశారన్నారు. ప్రకటనల కోసం చేస్తున్న ఖర్చులో భాగంగానే ఇంటింటికీ పోస్టుకార్డు పంపినట్లు తెలిపారు. వాట్సాప్‌ మెసేజ్‌లు, ఎస్‌ఎంఎస్‌ల గురించి కూడా ప్రస్తావన వచ్చినప్పటికీ, బీఎల్‌ఓలు ప్రజలను నేరుగా కలుసుకునేందుకు పోస్టుకార్డుల్ని పంపిణీ చేశామన్నారు. ఉర్దూ చదివే వారికోసం ఉర్దూలోనూ ఈ లేఖలు పంపించనున్నట్లు తెలిపారు. ఓటు నమోదుపై ప్రజలకు ఏమాత్రం అవగాహన లేదనడం కూడా సరికాదని, అసెంబ్లీ ఎన్నికల ముందు రెండునెలల్లో ఇరవై లక్షలమందికి పైగా నమోదు చేసుకున్నారని చెప్పారు. దివ్యాంగులు, థర్డ్‌జెండర్‌లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేపట్టిన కార్యక్రమాలు అసెంబ్లీ పోలింగ్‌లో మంచి ఫలితమిచ్చాయని చెప్పారు.

వివరాలతో లేఖలు..
ఓటరు నమోదుపై చాలామందికి సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేసేందుకూ, వారికి సులభంగా అర్థమయ్యేలా కొత్తగా పేరు నమోదు చేసుకోవాలంటే ఏ ఫారం నింపాలి.. చిరునామా మారితే ఏ ఫారం భర్తీచేయాలి.. పొరపాట్ల సవరణకు ఏ ఫారం వినియోగించాలో లేఖలో వివరించామన్నారు. ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయవచ్చో కూడా తెలిపామన్నారు. పోలింగ్‌కు ముందు నామినేషన్ల గడువు వరకు ఓటరు జాబితాలో ఎప్పుడైనా పేరు నమోదు చేసుకోవచ్చునని, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాత్రం ఇప్పుడే సరిచూసుకోవాలని రజత్‌కుమార్‌ ప్రజలను కోరారు. ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు దరఖాస్తు చేసుకుంటే ఓటు వేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement