కరీంనగర్ రూరల్ : ‘ఆసరా’ సామాజిక భద్రత పింఛన్ల మంజూరులో అక్రమాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనర్హులను గుర్తించి ఏరివేయాలంటూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 4,705 మంది అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగించారు. స్వయంగా పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి తొలగించాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులకు లేఖలు రాశారు. వికలాంగుల సదరెం సర్టిఫికెట్లపై ముగ్గురు వైద్యుల సంతకాలుంటేనే పింఛన్‌మంజూరు చేయాలంటూ జిల్లా కలెక్టర్ నీతుకుమారిప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో పింఛన్‌దారులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో మొత్తం 3,98,647 మంది లబ్ధిదారులున్నారు. వీరిలో వికలాంగులు 63,745, వృద్ధాప్య 1,89,020, వితంతు 1,27,362, చేనేత 8,152, గీతకార్మికులు 10,365 మంది లబ్ధిదారులున్నారు. జనవరికి సంబంధించిన పింఛన్ డబ్బులు రూ.43.48 కోట్లు మంజూరుకాగా.. ఆదివారం నుంచి పలు గ్రామాల్లో లబ్ధిదారులకు పంచాయతీ కార్యదర్శులు పంపిణీ చేస్తున్నారు. వికలాంగులకు సదరెం సర్టిఫికెట్లపై వైద్యుల సంతకాలున్న లబ్ధిదారులకు మాత్రమే రూ.1500 అందించారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలతోపాటు విచారణాధికారులు దరఖాస్తులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అనంతరం లబ్ధిదారులను ఎంపికచేశారు. అయినా పలు గ్రామాల్లో అనర్హులకు పింఛన్లు మంజూరైనట్లు ఆరోపణలు వచ్చాయి.
అనర్హులను గుర్తించాలని కేటీఆర్ లేఖ..
ఆసరా పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను గుర్తించడానికి సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు సహకరించాలని కోరుతూ ఐటీ, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ లేఖలు రాశారు. అనర్హుల ఏరివేతకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలనే మంత్రి విజ్ఞప్తితో లబ్ధిదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. అయితే తమను తొలగించవద్దంటూ పలువురు సర్పంచులు, ఎంపీటీసీలపై ఒత్తిడి తె స్తున్నారు. ఒకవైపు అనర్హులను తొలగించాలనే మంత్రి ఆదేశాలు.. మరోవైపు తమకు అన్యాయం చేయవద్దంటూ లబ్ధిదారులు చేస్తున్న ఒత్తిళ్లతో సర్పంచులు అయోమయానికి గురవుతున్నారు. పింఛన్లు తొలగిస్తే తమకు చెడ్డపేరు వస్తుందని, రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతుందని పలువురు వెనుకంజవేస్తున్నారు.
సదరెం సర్టిఫికెట్లపై
వెద్యుల సంతకాలుండాలి...
వికలాంగులకు జారీ చేసిన సదరెం సర్టిఫికెట్లపై ముగ్గురు వైద్యుల సంతకాలుంటేనే పింఛన్ ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. సదరెం ఐడీ నంబరుతో పింఛను మంజూరు చేసిన అధికారులు ప్రస్తుతం సర్టిఫికెట్ చూపిస్తేనే డబ్బులిస్తామనడంతో లబ్ధిదారులు సర్టిఫికెట్లకోసం పరుగులు తీస్తున్నారు. అయితే పలువురు లబ్ధిదారులకు సదరెం సర్టిఫికెట్లను అధికారులు జారీ చేయకపోవడంతో ఏమి చేయాలో తెలియక బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా బ్రోకర్లు సర్టిఫికెట్ల పేరిట వికలాంగులను దోచుకుంటున్నారు. సదరెం సర్టిఫికెట్‌పై వైద్యుల సంతకాలు లేని లబ్ధిదారుల జాబితాను డీఆర్‌డీఏ కార్యాలయానికి పంపించి వైద్యుల సంతకాలతో సర్టిఫికెట్లను అందజేస్తామని కరీంనగర్ ఎంపీడీవో దేవేందర్‌రాజు తెలిపారు.
ఇప్పటికే 4,705మంది తొలగింపు..
ఆసరా పథకంలో ఇప్పటికే పలు కారణాలతో 4,705 మంది అనర్హులను గుర్తించి అధికారులు తొలగించారు. గత నెలలో ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించగా.. 2,474 మంది అనర్హులను గుర్తించారు. జాబితాలో ఉన్న మృతులను 1070 మంది, రెండు గ్రామాలు, రెండు పేర్లతో పింఛన్లు పొందుతున్న 358 మంది, ఉపాధికోసం వలస వెళ్లిన 803 మందిని గుర్తించి జాబితానుంచి తొలగించారు.
ముగ్గురు డాక్టర్ల సంతకం తప్పనిసరి..
- కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్
ముకరంపుర : ఆసరా పథకం కింద వికలాంగుల పింఛన్ పొందుతున్న వారు సదరెం ధ్రువీకరణ సర్టిఫికెట్లలో ముగ్గురు డాక్టర్ల సంతకం తప్పనిసరని, లేకుంటే వాటిని ఎంపీడీవోలకు అందజేయాలని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ కోరారు. ఎంపీడీవోలు, డీఆర్ డీఏ సహకారంతో సర్టిఫికెట్లపై ముగ్గురు డాక్టర్ల సంతకం చేయించి తిరిగి వారికి అందజేస్తారని తెలిపారు. వికలాంగుల పింఛన్ పొందుతున్న వారు పంపిణీ సమయంలో తప్పనిసరిగా సదరెం సర్టిఫికెట్లను చూపించాలని సూచించారు. డాక్టర్ల సంతకం కోసం వికలాంగులు డాక్టర్ల వద్దకు వెళ్లవద్దని సూచించారు. అధికారులతో సహకరించాలని కోరారు.
‘ఆసరా’ అక్రమాలపై అలర్‌ట
Published Mon, Feb 16 2015 2:30 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement