మాట్లాడుతున్న కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘలపై 11 ఫిర్యాదులు అందగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. రెండు కేసులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపించామని చెప్పారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించేందుకు 12 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 14 స్మాటిక్స్ సర్వేలెన్స్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు టీంల ద్వారా రూ.1.03 కోట్ల నగదు, 2,215 గ్రాముల బంగారం పట్టుకున్నట్లు వివరించారు. 1,151 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నవంబర్ 9 వరకు ఓటరు నమోదుకు ఫారం 6 దరఖాస్తులు సమ ర్పిస్తే జాబితాలో నమోదు చేస్తామని తెలిపారు.
కరీంనగర్‌సిటీ టవర్‌సర్కిల్: నేటి పొదుపే రేపటి మదుపు అని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రతిఒక్కరూ పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్న మొత్తాల పొదుపు ఏజెంట్ల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ ప్రధాన తపాలా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి వ్యక్తికి పొదుపు గురించి వివరించి, పొదుపు చేసేలా చూడాలని ఏజెంట్లను కోరారు. కుటుంబంలోని గృహిణులు పొదుపు చేయడం చేస్తారని, వాటిని డబ్బాల్లో దాచిపెట్టకుండా పోస్టాఫీసులో జమచేయడం వల్ల వడ్డీ పొందవచ్చన్నారు. పొదుపు చేసిన చిన్న మొత్తాలే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతాయని తెలిపారు.
జిల్లాలో సుమారు 400 మంది పొదుపు ఏజెంట్లు పని చేస్తుండడం అభినందనీయమన్నారు. వారు చేయించే కోటి, అరకోటి రూపాయల బిజనెస్‌పై గతంలో అందించే ప్రోత్సాహకాలను మళ్లీ అందించే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం కరీంనగర్ ప్రధాన తపాలా శాఖ కార్యాలయంలో అత్యధిక మొత్తంలో పొదుపు చేయించిన ఏజెంట్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కరీంనగర్ డివిజన్ తపాల కార్యాలయాల సూపరింటెండెంట్ బి.సురేశ్‌కుమార్ మాట్లాడుతూ 1924 అక్టోబర్ 30న ఇటలీలో పొదుపు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారని తెలిపారు.
తపాలా శాఖలో పొదుపు చేయడానికి కిసాన్ వికాస పత్రాలు, మంత్లీ ఇన్‌కం స్కీం, జీపీఎఫ్‌లతోపాటు పలు పథకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పొదుపు చేసిన సొమ్ము ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల చదువుల కోసం, అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య ఖర్చులకు, పిల్లల వివాహాల ఖర్చుకోసం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నమొత్తాల పొదుపు ఏజెంట్ల సంఘం రాష్ట్ర అద్యక్షుడు రావికంటి కృష్ణకిషోర్, పోస్ట్‌మాస్టర్ నర్సింహస్వామి, చిన్నమొత్తాల పొదుపు ఏజెంట్లు, తపాలాశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment