ప్రచారం చేయొద్దు... | Telangana Election Commission Declared Don't Do Election Campaign | Sakshi
Sakshi News home page

ప్రచారం చేయొద్దు...

Published Sat, Nov 17 2018 1:39 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Telangana Election Commission Declared Don't Do Election Campaign - Sakshi

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న రీసోర్స్‌ పర్సన్స్‌ (ఆర్పీ)లు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహిళా సంఘాలకు ప్రాతినిథ్యం వహించే ఆర్పీల ఎన్నికల ప్రచారంపై స్పష్టతనిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ జీవో జారీ చేశారు. దీంతో ఆర్పీలను రాజకీయ ప్రచారం కోసం వాడుకోవాలా..వద్దా... అనే వివాదానికి తెరపడింది. 

సాక్షి, పెద్దపల్లి: ఆర్పీలను ఎన్నికల ప్రచారంలో వాడుకొనే వ్యవహారంలో రామగుండం నియోజకవర్గంలో నెలకొన్న వివాదం, ఈ స్పష్టతకు దారితీసింది.  ఈ నెల 2న రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీదేవసేనతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ ఆర్పీల విషయంపై వాదనకు దిగారు. నిబంధనల పేరిట తన ప్రచారానికి అధికారులు అడ్డుపడుతున్నారని అసహనం వ్యక్తంచేశారు. ప్రచారానికి ఆర్పీలను వాడుకోవడంలో ఎందుకు అభ్యంతరం చెబుతున్నారంటూ ప్రశ్నించారు. 

ఆర్పీల విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదిస్తామని, రాష్ట్ర ఎన్నికల అధికారి నుంచి వచ్చిన వివరణ మేరకే స్పందిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అప్పటి వరకు మెప్మా విభాగంలో పనిచేస్తున్న రీసోర్స్‌ పర్సన్స్‌ ఏ రాజకీయ పార్టీకి కాని, అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ప్రకటించారు. ఈ నెల 3న ఇదే విషయంపై రాష్ట్ర ఎన్నికల అధికారికి కలెక్టర్‌ నివేదిక పంపించారు. స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌ ఈనెల 9న వివరణ ఇచ్చారు. రీసోర్స్‌ పర్సన్స్‌ ఎవరికి అనుకూలంగా కూడా ప్రచా రం చేయరాదని ఆదేశాలు జారీ చేశారు.

ఊపిరి పీల్చుకున్న ఆర్పీలు
గంపగుత్త ఓట్ల కోసం మహిళా సంఘాలను ప్రభావితం చేయడం అభ్యర్థులకు ఎన్నికల్లో కొత్త కాదు. ఎన్నికల ప్రచారంలో, ఓట్లల్లో మహిళా సంఘాలు కీలకం కావడంతో నేతలంతా గ్రూప్‌లపైనే దృష్టి పెడుతారు. ఈ క్రమంలోనే మహిళా సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్పీలపై కొంతమంది అభ్యర్థులు ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. తమ ద్వారానే ఉద్యోగాలు పొందారని, తమకు ప్రచారం చేయకపోతే మీ సంగతి తేల్చుతామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న ఎన్నికల సంఘం ఆర్పీల ఎన్నికల ప్రచారంపైనా స్పష్టత ఇచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement