Rajat Kumar Saini
-
సీసీఎల్ఏ డైరెక్టర్‌గా రజత్‌కుమార్ సైనీ
సాక్షి, హైదరాబాద్: వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ సైనీని భూపరి పాలన విభాగం ముఖ్య కమిషనర్ కార్యాలయం డైరెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పోలింగ్ రోజున ఇవి పాటించాలి..
సాక్షి, కొత్తగూడెం: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున ఓటు హక్కు వినియోగించుకునే జిల్లా ఓటర్లకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్త్రీ, పురుషులు వేర్వేరుగా క్యూలైన్ పాటించి పోలీసు శాఖ వారికి సహకరించాలి. పోలింగ్ స్టేషన్‌కు వచ్చే ఓటర్లు సెల్‌ఫోన్ తీసుకు రావొద్దు. మద్యం సేవించి ఓటు వేయడానికి రాకూడదు. పోలింగ్ కేంద్రానికి ఎలాంటి మారణాయుధాలు, వాటర్ బాటిళ్లు, ఇంక్ బాటిళ్లు తీసుకురావొద్దు. రాజకీయ పార్టీలకు చెందిన స్టిక్కర్లు, టోపీలు, కండువాలు, జెండాలు తదితర వాటితో పోలింగ్ కేంద్రానికి రావొద్దు. ఓటర్ కార్డుపై ఓటరు వివరాలు అన్నీ సరిగ్గా ఉంటే ఓటర్ ఐడీ కార్డుతో ఓటు వేయవచ్చు. లేదంటే ఇతర గుర్తింపు కార్డుల్లో కొన్ని చూయించాలి. పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్లు మార్కు చేయబడిన లైనులోపల మాత్రమే ఓటర్లకు ప్రవేశం. ఓటు వేసిన వెంటనే తిరిగి పోలింగ్ కేంద్రం విడిచి వెళ్లిపోయి మరొక ఓటరుకు అవకాశం ఇవ్వాలి. పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్లు అవతల ఓటు వేయడానికి వచ్చిన వారి వాహనాలను పార్క్ చేయాలి. పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల అవతల మాత్రమే రాజకీయ పార్టీ వారు నీడనిచ్చే లాంటివి ఏర్పాటు చేసుకుని ఒక చిన్న టేబుల్, రెండు కుర్చీలతోపాటు ఇద్దరు మాత్రమే ఉండాలి. పార్టీ జెండాలు కానీ, గుర్తులు కానీ బ్యానర్లుగాని ప్రదర్శించకూడదు. ఏ పార్టీ వారు కూడా ఎటువంటి టెంట్లను ఏర్పాటు చేయకూడదు. టిఫిన్లు, భోజనాలు తదితరవి ఓటర్లకు సరఫరా చేయరాదు. ఓటర్ స్లిప్పులు ఇచ్చేవారు ఎటువంటి పార్టీ గుర్తులు లేకుండా తెల్లని కాగితంలో ముద్రించనవి మాత్రమే ఇవ్వాలి. అభ్యర్థి పేర్లు మొదలైనవి కలిగిన వాటిపై ఇవ్వకూడదు. -
ఇకపై ఇసుక ఉచితమే..
సాక్షి, భద్రాచలంటౌన్: పట్టణంలో ఇళ్లు నిర్మించుకునే వారు ఇక నుంచి ఇసుకను ఉచితంగా తెచ్చుకోవచ్చని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భద్రాచలంలో ఇసుక అక్రమ రవాణా ఎక్కువైందని, ఇళ్లు నిర్మించుకునే వారు ట్రాక్టర్‌కూ రూ. 3వేల నుంచి 4వేల వరకు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయంపై పట్టణ ప్రజలు తనను సంప్రదించడంతో ఈ విషయాన్ని కలెక్టర్ రజత్‌కుమార్ శైనీతో చర్చించినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన కలెక్టర్ పట్టణ వాసుల వరకు ఇసుకను తెచ్చుకొనే విధంగా హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు రెవిన్యూ శాఖలకు ఆదేశాలు త్వరలోనే జారీ చేయనున్నట్లు వివరించారు. భద్రాచలం పట్టణం దాటి ఇసుక రవాణా జరిగినట్లయితే పీడీ యాక్టు నమోదు చేయిస్తామని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొలిశెట్టి రంగారావు, మాజీ గ్రంథాలయం చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి, సరేళ్ల నరేష్, హనుమంతు, డేగల నాగేశ్వరరావు, దుద్దుకూరి సాయిబాబు, కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తులను ఆన్లైన్ చేయాలి
సాక్షి, సూపర్‌బజార్(కొత్తగూడెం): పోలింగ్ కేంద్రాల వారీగా వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను ఆన్లైన్ చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ హాలులో ఓటరు నమోదు, తొలగింపు, మార్పులు, కళ్యాణలక్ష్మి, భూమి రికార్డుల శుద్ధీకరణ తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో పేరు తొలగింపును తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించడంతోపాటు నోటీసులు జారీ చేసిన తరువాత మాత్రమే తొలగించాలని అన్నారు. ఓటరు జాబితాలో పేరు తొలగింపు కోసం ఆన్లైన్ ద్వారా ఫారం 7లో వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో పోలింగ్ కేంద్రాల వారీగా వచ్చిన దరఖాస్తులను అప్లోడ్ చేయాలని అన్నారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా లబ్ధిదారులకు ఆర్థికసాయం అందజేయడానికి వచ్చిన దరఖాస్తులను తక్షణం విచారణ జరిపించాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గౌతం, జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం సబ్ కలెక్టర్ భవేష్‌మిశ్రా, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. సస్యరక్షణ కరపత్రాన్నిఆవిష్కరించిన కలెక్టర్ కొత్తగూడెంరూరల్: ఆయిల్‌పామ్, కొబ్బరి, జామ, ఇతర ఉద్యాన పంటలను ఆశిస్తున్న సర్పిలాకార తెల్లదోమ ఉనికి, ప్రభావం–సస్యరక్షణ చర్యలపై రూపొందించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆవిష్కరించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎంతో మేలు చేసేవిధంగా ఉద్యాన శాఖాధికారులు ఈ కరపత్రాన్ని రూపొందించారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, ఎస్పీ సునీల్‌దత్, ఉద్యానవన శాఖాధికారి జినుగు మరియన్న తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్‌కు ఎమ్మెల్యేల జాబితా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నిక ల్లో విజయం సాధించిన అభ్యర్థుల జాబితాను బుధవారం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు సమర్పించారు. అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ముగిస్తున్నామని, రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు సైతం ముగిసిందన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు 30 రోజుల్లోగా ఎన్నికల వ్యయాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. లక్షల ఓట్ల గల్లంతు అవాస్తవం.. ఓటర్ల జాబితాలో 24 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం లో అవాస్తవమని సీఈఓ అన్నారు. అంత మొత్తంలో ఓట్లు గల్లంతు జరిగితే ఓట్లు కోల్పోయిన వ్యక్తులు, రాజకీయ పార్టీలు ఒప్పుకునేవారు కాదని, ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్య తలత్తేదన్నారు. ప్రతిసారి ఎన్నికల్లో కొన్ని ఓట్లు గల్లంతు కావడం సహజమేనన్నారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు చనిపోయిన, చిరునామా మారిన ఓటర్ల తొలగింపు కోసం ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఏటా ప్రతి ఒక్కరూ తమ పేరు జాబితాలో ఉందో లేదో చూసుకోవాలన్నారు. 2015 లో ప్రచురించిన ఓటర్ల జాబితాలో 2.81 కోట్ల ఓటర్లు ఉండగా, ఆ తర్వాత నిర్వహించిన జాతీయ ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా చనిపోయిన, చిరునామా మారిన 24 లక్షల ఓట్లను తొలగించామన్నారు. 2018లో మూడుసార్లు ఓటర్ల జాబితా సవరణ నిర్వహించగా, 20 లక్షలకు పైగా కొత్త ఓటర్లను నమోదు చేశామన్నారు. ఓటర్ల తొలగింపునకు ముందు 7 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ ప్రతి ఓటరుకు స్థానిక బీఎల్ఓలు నోటీసులు జారీ చేశారన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2019లో భాగంగా ఓటర్ల నమోదు కోసం డిసెంబర్ 24 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, 2018, డిసెంబర్ 31 నాటి కి 18 ఏళ్లు నిండే వ్యక్తులతో పాటు ఓటర్ల జాబితాలో పేరు లేని వ్యక్తులూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. మానవ తప్పిదాలతోనే ఈవీఎం సమస్యలు ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓటమిపాలయ్యామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ చేసిన ఆరోపణలను సీఈవో తోసిపుచ్చారు. ఈవీఎంలను ట్యాంపర్ చేసేందుకు ఆస్కారం లేదన్నారు. పటిష్ట పోలీసు బందోబస్తు, సీసీటీవీ కెమెరాల నిఘా మధ్య ఈవీంలను భద్రపరిచామన్నారు. 100 శాతం వీవీప్యాట్ ఓట్లను లెక్కిం చాలన్న కాంగ్రెస్ విజ్ఞప్తి ఆచరణలో సాధ్యం కాదన్నా రు. మానవ తప్పిదాలతో కౌంటింగ్ సమయంలో ఈవీఎంలతో రెండు రకాల సమస్యలు తలెత్తాయన్నారు. రాష్ట్రంలోని 92 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్‌లో వేసిన ఓట్లను తొలగించకుండానే పోలిం గ్ను ప్రారంభించడంతో మాక్ పోలింగ్, అసలు పోలింగ్ ఓట్లు కలిసిపోయాయన్నారు. మాక్ పోలింగ్ తర్వాత సీఆర్సీ (క్లియర్ రిపోర్ట్ క్లోజ్) మీటను ప్రిసైడింగ్ అధికారులు నొక్కడం మరిచిపోవడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడం ద్వారా ఈ పోలింగ్ కేంద్రాల ఓట్లను పరి గణనలోకి తీసుకున్నామన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ‘పోల్ ఎండ్’ మీట నొక్కకపోవడంతో రెండు పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను కౌంటింగ్ రోజు తెరుచుకోలేదన్నారు. స్థానిక అభ్యర్థులు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ‘పోల్ ఎండ్’ మీటను నొక్కిన తర్వాత ఈ ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిం చామని, ఆ తర్వాత ఆ ఓట్ల సంఖ్యను వీవీ ప్యాట్ ఓట్ల సంఖ్యతో సరి చూసుకున్నామన్నారు. ఈ రెండు సందర్భాలోనూ వాస్తవంగా పోలైన ఓట్లతో వీవీ ప్యాట్ ఓట్ల సంఖ్యతో సరిపోయాయన్నారు. ఫలితాలపై గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 88 టీఆర్ఎస్, 19 కాం గ్రెస్, 7 ఎంఐఎం, 2 టీడీపీ, చెరొక బీజేపీ, ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులతో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి పేర్లతో జాబితాను ఇందులో పొందుపరిచింది. -
ఈవీఎంల ట్యాంపరింగ్: స్పందించిన రజత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు కోరడంతో.. పలు నియోజకవర్గాల్లో కొన్ని వీవీప్యాట్లను కూడా లెక్కించినట్టు వెల్లడించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కానే కాదని, ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లోకి వెళ్లడం కూడా సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఓట్ల ట్యాలీలో తేడా రాలేదన్నారు. మాక్ పోల్ తర్వాత.. సీఆర్సీ బటన్ నొక్కితే మాక్ పోల్ ఓట్లు వెళ్లిపోతాయని, రిజల్ట్ బటన్ నొక్కితే ఎర్రర్ వచ్చిందని తెలిపారు. అప్పుడు ఏజెంట్స్ అందరి ముందూ క్లోసర్ బటన్ కొట్టి.. 17 సీ లిస్ట్ ప్రకారం ఓట్లు ట్యాలీ అయ్యాక ఫలితాలు లెక్కపెట్టామన్నారు. 100 శాతం వీవీప్యాట్లను లెక్కపెట్టాలంటే.. బ్యాలెట్ పేపర్ తరహా అవుతుందని, అది సాధ్యం కాదని తెలిపారు. గవర్నర్‌కు గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్, కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఎస్కే రుడోలా బుధవారం గవర్నర్ నరసింహన్‌కు అందజేశారు. -
ప్రచారం చేయొద్దు...
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న రీసోర్స్ పర్సన్స్ (ఆర్పీ)లు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహిళా సంఘాలకు ప్రాతినిథ్యం వహించే ఆర్పీల ఎన్నికల ప్రచారంపై స్పష్టతనిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ జీవో జారీ చేశారు. దీంతో ఆర్పీలను రాజకీయ ప్రచారం కోసం వాడుకోవాలా..వద్దా... అనే వివాదానికి తెరపడింది. సాక్షి, పెద్దపల్లి: ఆర్పీలను ఎన్నికల ప్రచారంలో వాడుకొనే వ్యవహారంలో రామగుండం నియోజకవర్గంలో నెలకొన్న వివాదం, ఈ స్పష్టతకు దారితీసింది. ఈ నెల 2న రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీదేవసేనతో టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ ఆర్పీల విషయంపై వాదనకు దిగారు. నిబంధనల పేరిట తన ప్రచారానికి అధికారులు అడ్డుపడుతున్నారని అసహనం వ్యక్తంచేశారు. ప్రచారానికి ఆర్పీలను వాడుకోవడంలో ఎందుకు అభ్యంతరం చెబుతున్నారంటూ ప్రశ్నించారు. ఆర్పీల విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదిస్తామని, రాష్ట్ర ఎన్నికల అధికారి నుంచి వచ్చిన వివరణ మేరకే స్పందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అప్పటి వరకు మెప్మా విభాగంలో పనిచేస్తున్న రీసోర్స్ పర్సన్స్ ఏ రాజకీయ పార్టీకి కాని, అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ప్రకటించారు. ఈ నెల 3న ఇదే విషయంపై రాష్ట్ర ఎన్నికల అధికారికి కలెక్టర్ నివేదిక పంపించారు. స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్‌కుమార్ ఈనెల 9న వివరణ ఇచ్చారు. రీసోర్స్ పర్సన్స్ ఎవరికి అనుకూలంగా కూడా ప్రచా రం చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. ఊపిరి పీల్చుకున్న ఆర్పీలు గంపగుత్త ఓట్ల కోసం మహిళా సంఘాలను ప్రభావితం చేయడం అభ్యర్థులకు ఎన్నికల్లో కొత్త కాదు. ఎన్నికల ప్రచారంలో, ఓట్లల్లో మహిళా సంఘాలు కీలకం కావడంతో నేతలంతా గ్రూప్‌లపైనే దృష్టి పెడుతారు. ఈ క్రమంలోనే మహిళా సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్పీలపై కొంతమంది అభ్యర్థులు ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. తమ ద్వారానే ఉద్యోగాలు పొందారని, తమకు ప్రచారం చేయకపోతే మీ సంగతి తేల్చుతామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న ఎన్నికల సంఘం ఆర్పీల ఎన్నికల ప్రచారంపైనా స్పష్టత ఇచ్చింది. -
భూ రికార్డుల సమగ్ర వివరాలు ‘మీ సేవలో’
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం సవరించిన సమగ్ర రికార్డులను ‘మీసేవ’లో అందుబాటులో ఉంచుతున్నట్టు ధరణి ప్రత్యేకాధికారి రజత్‌కుమార్ సైనీ తెలిపారు. ‘మా భూమి ఏమైపోయిందో’ శీర్షికన రాష్ట్రంలోని భూ రికార్డులు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో రికార్డుల్లో తమ భూమి ఎవరి పేరు మీద ఉందోననే ఆందోళనలో రైతాంగం ఉందని ‘సాక్షి’ ఈ నెల 23న కథనాన్ని ప్రచురించింది. స్పందించిన అధికారులు సమగ్ర భూ రికార్డుల వివరాలను మీసేవ కేంద్రాల్లోకి అందుబాటులో కి తెచ్చారు. మీసేవలో నిర్దేశిత ఫీజు చెల్లించి పహాణి, ఆర్వోఆర్1–బీ రికార్డులను తీసుకోవచ్చని రజత్‌కుమార్ చెప్పారు. సవరించిన రికార్డులన్నింటినీ పబ్లిక్ డొమైన్‌లోకి అందుబాటులో కి తెచ్చేందుకు మరికొంత సమయం పడుతుం దని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో రిజి స్ట్రేషన్లు, భూ రికార్డుల నిర్వహణ పరిశీలన దశలో ఉందని, పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుందన్నారు. -
‘నీరు విడుదల చేయకుంటే ఆత్మహత్యలే’
మానవపాడు: జూరాల ఆర్డీఎస్ కాలువలకు వెంటనే నీరు విడుదల చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. నెల రోజులైన నీరు విడుదల చేయక పోవటంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని, దీంతో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వలు పరిశీలించేందుకు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ వస్తున్నారని తెలుసుకున్న సుమారు 200 మంది రైతులు శనివారం ఆర్డీఎస్ ప్రధాన కాల్వ వద్దకు వచ్చారు. తమ సమస్యలను వివరించి, వెంటనే నీరు విడుదల చేయాలని కలెక్టర్‌కు రైతులు వినతిపత్రం సమర్పించనున్నారు. -
సిరివరాలు
పీఓ ఏమన్నారంటే.. తనకు ఆప్యాయంగా ఆహ్వానం పలికిన అమాయకపు సిరివర గ్రామ గిరిజనులపై పీఓ రజత్ కుమార్ సైనీ వరాల జల్లు కురిపించారు. గెడ్డ నుంచి గ్రామానికి తాగునీటిని తెచ్చుకునేందుకు పైపులు. 1000ఏలో వ్యవసాయ గట్లకు ఉపాధి పనులు, 30 సోలార్ లైట్లు, సబ్సిడీ రుణాలు, ట్రైకార్లో రైస్ మిల్లు, ఆటోలు, ఉచిత విత్తనాలు, సుఖ ప్రసవాలు జరిపించేందుకు మహిళలకు శిక్షణ, యువతకు డ్రైవింగ్, కంప్యూటర్ తదితర వాటిలో శిక్షణ తదితర అనుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా బడి ముఖం చూడని తాడిపుట్టి, సిరివర ఉపాధ్యాయుల సస్పెన్షన్‌కు డీఈఓకు సిఫారసు చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వృక్షాలతో నిండిన కొండలు. ఎత్తై లోయలు..ఎవరి ఊపిరి వారికే భయం గొలిపే భయంకర నిశ్శబ్ద వాతావరణం..మా వోయిస్టు ప్రభావిత ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో భీకర వాతావరణం. ఎక్కడ ఏ మూల నుంచి ఏ జంతువు వచ్చి దాడిచేస్తుందో...? ఏ విషపురుగులు మీద డతాయో..తెలియని ప్రమాదకర దారి..అక్కడక్కడా విసిరేసినట్లున్న గిరిజన డలు..రాయనక..రప్పనక..కొండనక..కాననక..వాగనక..వంకనక..శ్రమ అనక..చెమట అనక..ఎత్తై ఆరు కొండలను దాటి...సుమారు 7 గంటల పాటు నడిచారు ఐటీడీఏ పీఓ రజత్‌కుమార్ సైనీ. పార్వతీపురం సబ్-ప్లాన్‌లో గిరిశిఖరాలలో ఉన్న సాలూరు మండలం కొదమ పంచాయతీలోని ఆంధ్రా-ఒడిశా మధ్య శతాబ్దాలుగా సర్వేకు నోచుకోకుండా మిగిలిన ‘సిరివర’ గిరిజన గ్రామంలో గిరిజనుల సమస్యలు, వారి జీవన విధానాన్ని అవలోకనం చేసుకునేందుకు ఐటీడీఏ పీఓ రజత్ కుమార్ సైనీ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఆ గ్రామ గిరిజనుల సమస్యలు వింటూ..తక్షణమే పరిష్కరిస్తూ.. ‘సిరివర’కు వరాలజల్లు కురిపించారు. నా పేరు రజత్ కుమార్ సైనీ...ఐటీడీఏ పీఓను: సాలూరు మండలం, కొదమ పంచాయతీ, ‘సిరివర’ గ్రామ గిరిజనులందరికీ నమస్కారం...నేను ఈ రోజు ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను. మీ సమస్యలను ఒక్కొక్కటి..ఒక్కొక్కరుగా నాకు చెప్పండి. ‘సిరివర’ గ్రామస్తులు: నమస్కారం సారూ..మా సమస్యలు తెలుసుకోడానికి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మా గూడెంకు వచ్చినం దుకు...స్వాగతం...ఐటీడీఏ పీఓ వచ్చారంటే...నమ్మలేని నిజంగా ఉంది... మీరొచ్చినందుకు సంతోషంగా ఉంది. తాగు నీటికి పైపులు...! ఐటీడీఏ పీఓ: మీ పేరేంటి చెప్పండి...? సిరివర గ్రామ గిరిజనుడు: నా పేరు సీదరపు సిత్తురు... పీఓ :మీ ప్రధానమైన సమస్య చెప్పండి...? సిత్తురు: మాకు తాగు నీరు కష్టంగా ఉంది. గెడ్డ దూరంగా ఉంది. ఆ నీరు తాగితే రోగాల బారిన పడుతున్నాం. పీఓ: గెడ్డ ఎంత దూరముంది...? నీరు క్లోరినేషన్ చేస్తున్నారా...? వేడి నీరు తాగుతున్నారా...? సిత్తురు: కిలో మీటరు దూరముంది. అలా తెచ్చి తాగుతుంటాం. వర్షాకాలంలో బురద నీరు. ఆకులు, పుల్లలు కుళ్లిపోయిన కలుషిత నీరే తాగుతూ రోగాల బారిన పడుతున్నాం. పీఓ : సరే...సోషల్ కన్జర్వేషన్‌లో...గెడ్డ నుంచి గ్రామానికి నీరు తీసుకురావడానికి ఎన్ని పైపులు కావాలంటే అన్ని మంజూరు చేస్తున్నాను. ఆ నీరు గ్రామానికి తెచ్చి ట్యాంకులో వేసి, క్లోరినేషన్ మాత్రలు అందులో కలుపుకొని తాగండి. అప్పుడు జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు. ఉపాధిలో పొలం గట్లకు టైంగ్ పీఓ : మీ పేరు చెప్పండి...? గ్రామస్తుడు: నా పేరు సీదరపు సింగురు... పీఓ : ఉపాధి పనులు చేస్తున్నారా..? సింగురు: ఉపాధి పనులు చేయలేదు...! ఉపాధి ఏపీఓ దిలీప్: ఇది అన్ సర్వేయ్‌డ్ ఏరియా....అందుకే ఇక్కడ భూ అభివృద్ధిలో ఉపాధి పనులు లేవు. గతంలో ట్యాంకులు చేశాం సార్...ఈ మధ్యనే 1000ఏలో సర్వే చేశాం సార్...80 మంది పనులు కావాలన్నారు. పీఓ : సరే...1000ఏలో ఇక్కడ ఉపాధి పనులివ్వండి. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులివ్వండి. పీఓ : సింగురూ...ఉపాధి పనులు ఇస్తే...చేస్తారా...? ఏ పనులు చేస్తారు...? సింగురు: ఎందుకు చేయం. అందరం చేస్తాము. అయితే పొలాలకు రాళ్లతో గట్లు వేసుకుంటాము...అనుమతివ్వండి...? పీఓ : సరే..మీకు ఎన్ని రోజులు కావాలంటే.. అన్ని రోజులు ఉపాధి పనులను ఏపీఓ ఇస్తారు. చేయండి. అలాగే మీ పొలాలకు టైంగ్(రాతి కట్టడాలు) వేసుకోండి. ఇది మీకు మాత్రమే స్పెషల్ పర్మిషన్. టీచర్ల సస్పెన్షన్‌కు ఆదేశాలు.. పీఓ : మీరు చెప్పండి మీ పేరేమిటి..? సిరివర గిరిజనుడు: నా పేరు సీదరపు సొంబురు సామంతు పీఓ : మీరు చెప్పండి. మీ ఊరిలో ఇంకా ఏ సమస్య ఉంది...? టీచర్లు రోజూ బడికి వస్తారా...? చిన్న పిల్లలు వీధుల్లో తిరుగుతున్నారెందుకు...? బడికి పంపించ లేదా...? సామంతు:టీచర్లు బడికి రారు. పీఓ : బడి ఎక్కడుంది...? ఎంతమంది టీచర్లున్నారు..? సామంతు: బడి లేదు...ఒకరి ఇంటి దగ్గర అప్పుడు చెప్పేవారు. ఇద్దరు టీచర్లున్నారు. పీఓ : ఎన్ని రోజులకొకసారి వస్తారు...? సామంతు: టీచర్లొచ్చి ఎన్ని నెలలయ్యిందో...? గురుతు లేదు. ఇద్దరు రారు. సుధీష్ టీచర్ అప్పుడప్పుడు సంతకొచ్చి కలుస్తాడు. హెడ్మాస్టర్ అస్సలు రాడు. అందుకే పిల్లలు అ..ఆ..లు రాకుండా ఊరి మీద, పొలాల కాడ...కొండకాడ తిరిగి గాలిబారిపోతున్నారు. పీఓ : సరే ఆ టీచర్ల సంగతి నేను చూస్తాను. కొద్దిగా పెద్ద పిల్లల్ని మన ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలకు పంపించండి. పీఓ: సురేష్(సీసీతో) ఇక్కడ స్కూలు ఎంపీపీదా...? ఐటీడీఏదా...? ఆ టీచర్ల వివరాలు తీసుకోండి. డెలివరీ చేసేందుకు శిక్షణ పీఓ : మీ పేరు చెప్పండి...? ప్రసవాలకు ఆస్పత్రికి వెళ్తున్నారా...? సిరివరపు గిరిజన మహిళ: నా పేరు సీదరపు బిందిరి...ప్రసవాలు ఇంటి దగ్గరే అవుతాయి. ఆస్పత్రికి కొండ దిగి వెళ్లలేము. అందుకే... పీఓ : ఇక్కడ ఏఎన్ఎం ఎవరు...? ఆవిడ వస్తుందా...? ఏఎన్ఎం:సార్...నేనే ఇక్కడ ఏఎన్ఎంని నా పేరు సీహెచ్.బుజ్జి పీఓ : చెప్పండి...డెలివరీకి ఆస్పత్రికి ఎదుకు తీసుకెళ్లడం లేదు..? మీరు ఎన్ని పంచాయతీలు చూస్తున్నారు...? పల్లకీలు ఉపయోగపడుతున్నాయా...? ఏడాదికి ఎన్ని డెలివరీలు అవుతున్నాయి...? డెలివరీ తర్వాత మీరు చూస్తున్నారా...? ఇక్కడ ఆశ కార్యకర్త ఉన్నారా? మందులు ఉన్నాయా...? క్లోరినేషన్ మాత్రలున్నాయా..? ఏఎన్ఎం : సార్ డెలివరీకి ఆస్పత్రికి రారు. కొండలు దిగడం కష్టం. ఏడాదికి 10 నుంచి 12 డెలివరీలు అవుతున్నాయి. ఒక్క కొదమ పంచాయతీ చూస్తున్నాను. మొత్తం 16 గ్రామాలున్నాయి. డెలివరీ తర్వాత మెడికల్ కేర్ ఇస్తున్నాం. ఆశ వర్కర్ ఈ గ్రామంలోనే ఉంది. బరువు వల్ల పల్లకీ ఉపయోగించడం లేదు సార్... పీఓ: సరే...డెలివరీ చేసేందుకు గ్రామస్తులకు మనమే శిక్షణ ఇద్దాం. కొంతమందిని ఎంపిక చేయండి..! సబ్సిడీ రుణాలు... పీఓ సైనీ: మీ పేరు చెప్పండి...? ఐకేపీ సీసీ వస్తారా...? మహిళా సంఘాలు ఎలా ఉన్నాయి..? సమస్య ఏమైనా ఉందా...? సిరివర గిరిజన మహిళ: నా పేరు సీదారపు నీలస...మహిళా సంఘం ఉంది. సీసీ రాదు. బ్యాంకుకు వస్తది. మాకు ఈ ఏడాది, గత ఏడాది...లోను రాలేదు. మ్యాచింగ్ గ్రాంట్ రాలేదు. పీఓ : సరే...మీ వద్దకు సీసీ కంటే పెద్ద ఆఫీసర్ని పంపిస్తాను. బ్యాంకులోను అయితే సబ్సిడీ ఉండదు. నేను మీకు సబ్సిడీ లోను లిస్తాను. ఏమి లోను కావాలి. కోరుకోండి. సీదారపు నీలస: మాకు గొర్రెల లోను ఇవ్వండి. రైసు మిల్లు ఇవ్వండి. పీఓ : సరే ట్రైకార్లో మీకు రూ.2లక్షల రైస్ మిల్లు. ఆటోలు కావాలంటే ఇస్తాను. దుగ్గేరు నుంచి మెండ ంగి వరకు నడుపుకోండి. మంచి డబ్బులు వస్తాయి. పంచాయతీ సెక్రటరీ పాపారావు గారూ...ట్రైకార్ అప్లికేషన్లు సిద్ధం చేయండి. విత్తనాలు, ఆయిల్ ఇంజిన్లు ... పీఓ : మీ పేరు చెప్పండి...? పంటలు ఏమి పండిస్తారు...? విత్తనాలు ఎక్కడ నుంచి వస్తాయి...? పంటలు ఎక్కడ అమ్ముతారు...? గిరిజనుడు: నా పేరు సీదరపు లాహిరి సార్...మేము విత్తనాలు సొంతంగా తయారు చేసుకుంటాం. వరి, చిక్కుడు, సామలు, సోలు(రాగులు), గోధుమలు, జొన్న, కందులు పంటలు పండిస్తాం. కందులు మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మకాలు చేస్తాం. వరితో పాటు మిగతా పంటలన్నీ తిండికి ఉపయోగిస్తాం. పీఓ సైనీ: వ్యవసాయానికి ఏమి కావాలి...అడగండి...? లాహిరి: ఆయిల్ ఇంజిన్లు ఇవ్వండి. పీఓ సైనీ: ఆయిల్ ఇంజిన్లతోపాటు మీకు ఐటీడీఏ నుంచి మంచి విత్తనాలిస్తాం. ఆ విత్తనాలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. వాటిలో కొన్ని మీరు తిని, మిగతావి విశాఖ, విజయనగరం లాంటి పట్టణాలకు పట్టుకెళ్లి అమ్మండి. మంచి ధర వస్తుంది. ఆ పంటల అమ్మకానికి కూడా ఏర్పాట్లు చేస్తాం. పీఓ ప్రయాణం ఎలా సాగిందంటే...! కోడి కూత కూయగానే ఉదయం 5గంటలకు తన బంగ్లా నుంచి చేత లోగో పట్టుకొని ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా పార్వతీపురం ఐటీడీఏ పీఓ రజత్ కుమార్ సైనీ బయలు దేరారు. అక్కడ నుంచి పార్వతీపురం మండలం పెదబొండపల్లి, తాళ్లబురిడి మీదుగా మక్కువ మండలం దుగ్గేరుపై నున్న మెండంగి గ్రామానికి 6గంటల ప్రాంతంలో తన వాహనంలో చేరుకున్నారు. అప్పుడప్పుడే మంచు తెరలు వీడుతుండడంతో తట్ట,పార పట్టుకుని..కాయకష్టం కోసం పయనమవుతున్న గిరిజనులంతా..ఇంత తెల్లవారి తమగ్రామానికి ఐటీడీఏ పీఓ రావడం చూసి...ఒకింత ఆశ్చర్యం...మరింత సంతోషంతో..చుట్టూ చేరి...తమ గూడెం పల్లెకొచ్చిన పీఓను పిల్లా పాపలతో వారు కొండపైకి సాదరంగా సాగనంపారు. అలా ఓ గంటసేపు కొండలెక్కాక...దారిలో వచ్చిన ‘తాడిపుట్టి’ గ్రామంలో గిరిజనులతో పీఓ కాసేపు ముచ్చటించి...వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అక్కడే ఆదేశించారు. అనంతరం కాలు జారితే లోయలోకి జారిపోతామన్న రాళ్లరప్పల భయంకర దారిలో నడక ప్రయాణం కొనసాగించారు. గంటసేపు ప్రయాణం తర్వాత ‘డొయివర’ అంచున వెళ్తున్న సమయంలో ఆ గ్రామానికి చెందిన సీదరపు పొన్న అయ్యా...నాకు రేషన్, ఆధార్, ఉపాధి...ఏ కార్డూ లేదు. నేను ఆంధ్రావావాడినే...అంటూ పీఓకు తన ఆవేదన చెప్పాడు. అక్కడే ఉపాధి ఏపీఓ దిలీప్‌ను పీఓ పిలిచి తక్షణమే ఉపాధి హామీ కార్డు ఇచ్చి, పనులిచ్చి...ఆ కార్డుతో మిగతా కార్డులు చేయించాలని ఆదేశించారు. అనంతరం వాగులు, వంకలు, గెడ్డలు...కర్రల వంతెనలు దాటి...గిరిశిఖరంలో ఉన్న ‘సిరివర’కు చేరుకున్నారు. తనకు ఆప్యాయంగా ఆహ్వానం పలికిన ఆ అమాయకపు గిరిజనులకు పీఓ రజత్ కుమార్ సైనీ వరాల జల్లు కురిపించారు. పొట్టతగ్గుతుంది కదా..! పీఓ తన ప్రయాణంలో బడి ముఖం చూడని తాడిపుట్టి, సిరివర ఉపాధ్యాయులను సస్పెన్షన్‌కు డీఈఓకు సిఫార్సు చేయాలని ఆదేశించారు. అనంతరం తనను బతిమాలుతున్న టీచర్ని చూసి...వారానికోసారైనా బడికొస్తే...జీతంతోపాటు బరువు కూడా తగ్గుతారు కదా...? అని చలోక్తులు విసిరారు. అలాగే తన దఫేదార్ ఎస్.రమణతో వారానికి ఓ హిల్‌టాప్ గ్రామానికి వెళ్దామా...? నీ పొట్ట తగ్గుతుందని హాస్యమాడారు. కొండ దిగొచ్చే సమయంలో కొండనుంచి వెదురు బొంగుల ద్వారా వస్తున్న నీటితో ముఖం కడుక్కుని, ఆ నీరు తాగారు. పీఓ రాకతో సిరివర పున్నమై పూసింది. పది మంది మేలు కోరిన ‘సాక్షి’కి పులకించిన ‘సిరివర’ తన దీవెనలు గుమ్మరించింది.