కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్ శైనీ, అధికారులు
సాక్షి, సూపర్‌బజార్(కొత్తగూడెం): పోలింగ్ కేంద్రాల వారీగా వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ హాలులో ఓటరు నమోదు, తొలగింపు, మార్పులు, కళ్యాణలక్ష్మి, భూమి రికార్డుల శుద్ధీకరణ తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో పేరు తొలగింపును తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించడంతోపాటు నోటీసులు జారీ చేసిన తరువాత మాత్రమే తొలగించాలని అన్నారు. ఓటరు జాబితాలో పేరు తొలగింపు కోసం ఆన్‌లైన్ ద్వారా ఫారం 7లో వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో పోలింగ్ కేంద్రాల వారీగా వచ్చిన దరఖాస్తులను అప్‌లోడ్ చేయాలని అన్నారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా లబ్ధిదారులకు ఆర్థికసాయం అందజేయడానికి వచ్చిన దరఖాస్తులను తక్షణం విచారణ జరిపించాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గౌతం, జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం సబ్ కలెక్టర్ భవేష్‌మిశ్రా, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
సస్యరక్షణ కరపత్రాన్నిఆవిష్కరించిన కలెక్టర్
కొత్తగూడెంరూరల్: ఆయిల్‌పామ్, కొబ్బరి, జామ, ఇతర ఉద్యాన పంటలను ఆశిస్తున్న సర్పిలాకార తెల్లదోమ ఉనికి, ప్రభావం–సస్యరక్షణ చర్యలపై రూపొందించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆవిష్కరించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎంతో మేలు చేసేవిధంగా ఉద్యాన శాఖాధికారులు ఈ కరపత్రాన్ని రూపొందించారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, ఎస్పీ సునీల్‌దత్, ఉద్యానవన శాఖాధికారి జినుగు మరియన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment