సాధనమే చం‘ధనం’
‘నీ ప్రయాణంలో కరాటే అనేది వెలిగే కాగడాలా ఉండాలి’ అంటాడు ఒక మార్షల్ ఆర్టిస్ట్. పరిస్థితుల ప్రభావం వల్ల, రకరకాల కారణాల వల్ల దారి ΄పొడుగునా ఆ వెలుగును కాపాడుకోవడం అందరి వల్ల సాధ్యం కాకపోవచ్చు. తండ్రి పక్కనపెట్టిన కాగడా పట్టుకొని కరాటేలో విజయపథంలో దూసుకుపోతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలానికి చెందిన మన్యం బిడ్డ కొండపల్లి చందన.
కాస్త సరదాగా చెప్పుకోవాలంటే చందన వాళ్ల ఇంట్లో ‘కరాటే’ అనేది పాత చుట్టంలాంటిది. తండ్రి కొండపల్లి జంపన్నకు కరాటే అంటే ఎంతో ఇష్టం. ఎన్నో కలలు కన్నాడు. బ్లాక్‌బెల్ట్ వరకు వెళ్లాడు. తెల్లవారుజామునే ‘హా’ ‘హూ’ అంటూ తండ్రి సాధన చేస్తుంటే ఆ శబ్దాలు నిద్రలో ఉన్న చందన చెవుల్లో పడేవి. ఆ శబ్దాల సుప్రభాతంతోనే నిద్ర లేచేది. నాన్న సాధన చేస్తుంటే ఆసక్తిగా చూసేది. ఆ తరువాత సరదాగా తాను కూడా సాధన చేసేది. అలా కరాటేతో పరిచయం మొదలైంది.
చిన్నప్పటి నుంచే ఆటల్లో ప్రతిభ కనబరుస్తున్న చందనను తల్లిదండ్రులు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో చేర్పించారు. అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయిని సుధకు కరాటేలో ప్రవేశం ఉంది. ఇతర ఆటలతో పాటు కరాటే కూడా విద్యార్థులతో సా«ధన చేయించేది. స్కూలు మొత్తంలో ఓ పదిమంది విద్యార్థినులు కరాటేలో ప్రతిభ చూపిస్తుండటంతో ఆ శిక్షణను కొనసాగిస్తూనే వివిధ పోటీలకు విద్యార్థులను తీసుకువెళ్లేవారు. ఎనిమిదో తరగతి నుంచే కరాటే పోటీలలో పాల్గొంటూ బహుమతులు గెలుస్తూ వచ్చింది
చందన.
విరామం కాదు ఆరంభ సంకేతం
వరంగల్‌లో జరిగిన జిల్లా స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం గెలుచుకోవడంతో చందన విజయపరంపర మొదలైంది. విశాఖపట్నం, ఖమ్మంలలో జరిగిన పోటీల్లోనూ తన ప్రతిభను చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ముంబై, దిల్లీలో జరిగిన పోటీల్లోనూ పతకాలు సా«ధించింది. అయితే పదోతరగతి తర్వాత ఆటలతోపాటు చదువు ముఖ్యం అంటూ కుటుంబంపై వచ్చిన ఒత్తిడి కారణంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి బయటకు వచ్చి హన్మకొండలోని ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌లో చేరింది.
‘ఇక కరాటే ఆపేసిట్లేనా!’ అడిగే వాళ్లు చాలామంది. అయితే ఆ విరామం మరిన్ని విలువైన విజయాలు సాధించడానికి ఆరంభ సంకేతం అనేది చాలామందితోపాటు చందనకు కూడా తెలియదు.
ఇప్పటికీ కలగానే ఉంది!
కరాటేలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న చందనను వదులుకోవడానికి గురుకుల పాఠశాల వారు ఇష్టపడలేదు. ఆమె వేరేచోట చదువుతున్నా తమ స్కూల్ తరఫున పోటీలకు పంపడం ప్రారంభించారు. గత నెల గోవాలో జరిగిన అండర్ 18, వరల్డ్‌కప్ చాంపియన్ షిప్‌లో చందన పాల్గొంది. తొలిరౌండ్‌లో కర్ణాటక అమ్మాయిపై గెలిచింది. ఆ తర్వాత వరుసగా ఆఫ్రికా, చైనాలకు చెందిన అమ్మాయిలపై విజయం సాధించింది. ‘గోవాకు వెళ్లేప్పటికి నాకు తెలుగు తప్ప మరో భాష రాదు.
అక్కడంతా బాగా పాష్‌గా కనిపించడంతో కొంత తడబడ్డాను. ప్రాక్టీస్ కూడా ఎక్కువ చేయలేదు. దీంతో నేషనల్, ఇంటర్నేషనల్ చాంపియన్లతో పోటీపడి నెగ్గగలనా అని సందేహించాను. కర్ణాటక అమ్మాయితో త్వరగానే గేమ్ ముగిసింది. ఆ తర్వాత నాకంటే ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్న ఆఫ్రికన్ అమ్మాయితో పోటీ పడ్డాను. ఇక్కడే నా పని అయిపోతుందనుకున్నా. గేమ్‌నే నమ్ముకుని గెలిచాను. చిన్నప్పటి నుంచి కరాటే అంటే చైనానే గుర్తుకు వస్తుంది. అలాంటిది చివరగా చైనా అమ్మాయిపై విజయం సాధించడం ఇప్పటికీ కలగానే ఉంది’ అంటుంది చందన.
గోవా విజయంతో 2025 జనవరిలో మలేషియాలో జరగబోయే పోటీలకు అర్హత సాధించింది. కనే కల విజయాన్ని పరిచయం చేస్తుంది. ఆ విజయం ఎప్పుడూ మనతో చెలిమి చేయాలంటే ఆత్మవిశ్వాసం ఒక్కటే సరిపోదు. లక్ష్యసాధన కోసం బాగా కష్టపడే గుణం కూడా ఉండాలి. కొండపల్లి చందనలో ఆ గుణం కొండంత ఉంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.
అదే నా లక్ష్యం
నాన్నకు కరాటే అంటేప్రాణం. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఆయన కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. ఆయనకు ఎన్నో కలలు ఉండేవి. స్కూల్‌లో నేను కరాటే బాగాప్రాక్టీస్ చేస్తున్నానని ఎవరో చెబితే నాన్న ఎంతో సంతోషించారు. దీంతో మరింత ఇష్టం, పట్టుదలతో కరాటే సాధన చేశాను. ‘ఆడపిల్లకు కరాటేలు ఎందుకు! చక్కగా చదివించక’ అంటుండేవారు ఇరుగు ΄పొగురు, బంధువులు. అయితే వారి మాటలతో అమ్మానాన్నలు ప్రభావితం కాలేదు. అమ్మ శారద నా వెన్నంటే నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు తేవాలన్నదే నా లక్ష్యం. అయితే ఈ ప్రయాణంలో ముందుకు వెళ్లే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. చేయూత అందిస్తే నా ప్రయాణం సులువు అవుతుంది.
– చందన
– కృష్ణ గోవింద్,
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
ఫొటోలు : యాసారపు యాకయ్య
Comments
Please login to add a commentAdd a comment