Bhadradri Kothagudem
-
మధ్యాహ్న భోజనానికీ ఫేస్ రికగ్నిషన్!
కొత్తగూడెం అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదు కోసం ఉపయోగిస్తున్న ఫేస్ రికగ్నిషన్ (ఎఫ్ఆర్ఎస్) డేటాను మధ్యాహ్న భోజన పథకా నికి కూడా ఉపయోగించాలని భద్రాద్రి కొత్తగూడెం, పెద్దప ల్లి జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలను సరిచేసి, మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అధ్యయనం చేయాలని గత శనివారం ప్రభుత్వం ఆదేశించింది.దీంతో భద్రాద్రి కొత్తగూడెం, పెద్ద పల్లి జిల్లాల కలెక్టర్లు జితేశ్ వి.పాటిల్, కోయ శ్రీహర్ష రెండు జిల్లాల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు, బిల్లుల చెల్లింపు తదితర అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పథకంలో మార్పుచేర్పులపై రాష్ట్రస్థాయిలో 12 మంది ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో భద్రాద్రి, పెద్దపల్లి కలెక్టర్లు, డీఈఓలతోపాటు కొత్తగూడెం ఎంఈఓ, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉన్నా రు. వీరు మరోమారు అధ్యయనం చేసి సంస్కరణలపై నివేదిక సమర్పించనున్నారు. బిల్లుల పెండింగే సమస్య..మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధు లు సమకూరుస్తున్నాయి. వారానికి మూడుసార్లు కోడిగుడ్ల తో పాటు ఆకు, కూరగాయలతో మెనూ అమలు చేస్తున్నా రు. ఇటీవల మెనూలో మార్పులు చేసినా పూర్తిస్థాయిలో అమలు కావటంలేదు. ఈ పథకం బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సకాలంలో బిల్లులు అందక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంలో 54,200 మంది కార్మికులు ఉండగా, భద్రాద్రి జిల్లాలో 2,150 మంది పని చేస్తున్నారు. ఈ జిల్లాలో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించి గతేడాది నవంబర్ నుంచి.. 9, 10 తరగతుల వారివి సెప్టెంబర్ నుంచి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. వీరికి నెలకు రూ.3,000 చొప్పున ఇచ్చే గౌరవ వేతనాలు కూడా అందాల్సి ఉంది.కలెక్టర్ల నివేదికలోని అంశాలు⇒ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ సిస్టం ద్వారా నమోదు చేస్తున్నారు. ఇదే డేటాను మధ్యాహ్న భోజన బిల్లులకూ అనుసంధానం చేయాలి. దీనివల్ల రోజువారీగా ఎందరు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతుందో తెలిసిపోతుంది. ⇒ ప్రస్తుతం 1 నుంచి 5 వరకు.. 6 నుంచి 8వ తరగతి వరకు ..9 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించి మూడేసి బిల్లులు రూపొందిస్తున్నారు. అలాగే, కోడి గుడ్లకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వేతన బిల్లు.. ఇలా ఆరు బిల్లులను రూపొందించి ప్రభుత్వానికి పంపుతున్నారు. వీటి ఆధారంగా ఈ–కుబేర్ నుంచి కార్మికులకు బిల్లుల సొమ్ము అందిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడైనా అవాంతరం ఎదురైతే నెలల తరబడి బిల్లులు పేరుకుపోతు న్నాయి. దీంతో కొందరు వంట సిబ్బంది అప్పులు చేసి భోజనాలు వండిపెడుతున్నారు. ఎలాంటి జాప్యం లేకుండా బిల్లుల తయారీ, చెల్లింపునకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను భోజన బిల్లులకు అనుసంధానిస్తే మెరుగైన ఫలితం ఉంటుందని కలెక్టర్లు నివేదికలో సూచించారు. -
తగ్గేదే లేదు.. ఒగ్గేదే లేదు!
‘నీ ప్రయాణంలో కరాటే అనేది వెలిగే కాగడాలా ఉండాలి’ అంటాడు ఒక మార్షల్ ఆర్టిస్ట్. పరిస్థితుల ప్రభావం వల్ల, రకరకాల కారణాల వల్ల దారి ΄పొడుగునా ఆ వెలుగును కాపాడుకోవడం అందరి వల్ల సాధ్యం కాకపోవచ్చు. తండ్రి పక్కనపెట్టిన కాగడా పట్టుకొని కరాటేలో విజయపథంలో దూసుకుపోతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలానికి చెందిన మన్యం బిడ్డ కొండపల్లి చందన.కాస్త సరదాగా చెప్పుకోవాలంటే చందన వాళ్ల ఇంట్లో ‘కరాటే’ అనేది పాత చుట్టంలాంటిది. తండ్రి కొండపల్లి జంపన్నకు కరాటే అంటే ఎంతో ఇష్టం. ఎన్నో కలలు కన్నాడు. బ్లాక్‌బెల్ట్ వరకు వెళ్లాడు. తెల్లవారుజామునే ‘హా’ ‘హూ’ అంటూ తండ్రి సాధన చేస్తుంటే ఆ శబ్దాలు నిద్రలో ఉన్న చందన చెవుల్లో పడేవి. ఆ శబ్దాల సుప్రభాతంతోనే నిద్ర లేచేది. నాన్న సాధన చేస్తుంటే ఆసక్తిగా చూసేది. ఆ తరువాత సరదాగా తాను కూడా సాధన చేసేది. అలా కరాటేతో పరిచయం మొదలైంది.చిన్నప్పటి నుంచే ఆటల్లో ప్రతిభ కనబరుస్తున్న చందనను తల్లిదండ్రులు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో చేర్పించారు. అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయిని సుధకు కరాటేలో ప్రవేశం ఉంది. ఇతర ఆటలతో పాటు కరాటే కూడా విద్యార్థులతో సా«ధన చేయించేది. స్కూలు మొత్తంలో ఓ పదిమంది విద్యార్థినులు కరాటేలో ప్రతిభ చూపిస్తుండటంతో ఆ శిక్షణను కొనసాగిస్తూనే వివిధ పోటీలకు విద్యార్థులను తీసుకువెళ్లేవారు. ఎనిమిదో తరగతి నుంచే కరాటే పోటీలలో పాల్గొంటూ బహుమతులు గెలుస్తూ వచ్చింది చందన.విరామం కాదు ఆరంభ సంకేతంవరంగల్లో జరిగిన జిల్లా స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం గెలుచుకోవడంతో చందన విజయపరంపర మొదలైంది. విశాఖపట్నం, ఖమ్మంలలో జరిగిన పోటీల్లోనూ తన ప్రతిభను చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ముంబై, దిల్లీలో జరిగిన పోటీల్లోనూ పతకాలు సా«ధించింది. అయితే పదోతరగతి తర్వాత ఆటలతోపాటు చదువు ముఖ్యం అంటూ కుటుంబంపై వచ్చిన ఒత్తిడి కారణంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి బయటకు వచ్చి హన్మకొండలోని ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్లో చేరింది. ‘ఇక కరాటే ఆపేసిట్లేనా!’ అడిగే వాళ్లు చాలామంది. అయితే ఆ విరామం మరిన్ని విలువైన విజయాలు సాధించడానికి ఆరంభ సంకేతం అనేది చాలామందితోపాటు చందనకు కూడా తెలియదు.ఇప్పటికీ కలగానే ఉంది!కరాటేలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న చందనను వదులుకోవడానికి గురుకుల పాఠశాల వారు ఇష్టపడలేదు. ఆమె వేరేచోట చదువుతున్నా తమ స్కూల్ తరఫున పోటీలకు పంపడం ప్రారంభించారు. గత నెల గోవాలో జరిగిన అండర్ 18, వరల్డ్‌కప్ చాంపియన్ షిప్లో చందన పాల్గొంది. తొలిరౌండ్లో కర్ణాటక అమ్మాయిపై గెలిచింది. ఆ తర్వాత వరుసగా ఆఫ్రికా, చైనాలకు చెందిన అమ్మాయిలపై విజయం సాధించింది. ‘గోవాకు వెళ్లేప్పటికి నాకు తెలుగు తప్ప మరో భాష రాదు. అక్కడంతా బాగా పాష్‌గా కనిపించడంతో కొంత తడబడ్డాను. ప్రాక్టీస్ కూడా ఎక్కువ చేయలేదు. దీంతో నేషనల్, ఇంటర్నేషనల్ చాంపియన్లతో పోటీపడి నెగ్గగలనా అని సందేహించాను. కర్ణాటక అమ్మాయితో త్వరగానే గేమ్ ముగిసింది. ఆ తర్వాత నాకంటే ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్న ఆఫ్రికన్ అమ్మాయితో పోటీ పడ్డాను. ఇక్కడే నా పని అయిపోతుందనుకున్నా. గేమ్నే నమ్ముకుని గెలిచాను. చిన్నప్పటి నుంచి కరాటే అంటే చైనానే గుర్తుకు వస్తుంది. అలాంటిది చివరగా చైనా అమ్మాయిపై విజయం సాధించడం ఇప్పటికీ కలగానే ఉంది’ అంటుంది చందన.గోవా విజయంతో 2025 జనవరిలో మలేషియాలో జరగబోయే పోటీలకు అర్హత సాధించింది. కనే కల విజయాన్ని పరిచయం చేస్తుంది. ఆ విజయం ఎప్పుడూ మనతో చెలిమి చేయాలంటే ఆత్మవిశ్వాసం ఒక్కటే సరిపోదు. లక్ష్యసాధన కోసం బాగా కష్టపడే గుణం కూడా ఉండాలి. కొండపల్లి చందనలో ఆ గుణం కొండంత ఉంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.అదే నా లక్ష్యంనాన్నకు కరాటే అంటేప్రాణం. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఆయన కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. ఆయనకు ఎన్నో కలలు ఉండేవి. స్కూల్లో నేను కరాటే బాగాప్రాక్టీస్ చేస్తున్నానని ఎవరో చెబితే నాన్న ఎంతో సంతోషించారు. దీంతో మరింత ఇష్టం, పట్టుదలతో కరాటే సాధన చేశాను. ‘ఆడపిల్లకు కరాటేలు ఎందుకు! చక్కగా చదివించక’ అంటుండేవారు ఇరుగు ΄పొగురు, బంధువులు. అయితే వారి మాటలతో అమ్మానాన్నలు ప్రభావితం కాలేదు. అమ్మ శారద నా వెన్నంటే నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు తేవాలన్నదే నా లక్ష్యం. అయితే ఈ ప్రయాణంలో ముందుకు వెళ్లే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. చేయూత అందిస్తే నా ప్రయాణం సులువు అవుతుంది.– చందన– కృష్ణ గోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఫొటోలు : యాసారపు యాకయ్య -
‘అందరూ ఒక్కటై నన్ను బలిపశువును చేశారు’.. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలిస్కానిస్టేబుల్ బుక్యా సాగర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతుంది.జిల్లాలోని బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో బుక్యాసాగర్ విధులు నిర్వహించారు. అయితే గంజాయి కేసులో తనని బలిపశువుని చేశారని, చేయని నేరాన్ని తనపై మోపారని, నిందను భరించలేక పురుగులు మంది తాగి చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో వాపోయాడు కానిస్టేబుల్ బుక్యా సాగర్. గతంలో బూర్గంపాడులో పనిచేసిన ఇద్దరు ఎస్ఐలు సంతోష్ ,రాజకుమార్,బీఆర్ఎస్ నాయకుడు నాని తనని బలిపశువుని చేశాడని వాపోయాడు. పురుగులు మందు తాగిన తర్వాత సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపాడు బుక్యాసాగర్. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు సాగర్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధిత కానిస్టేబుల్. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్కౌంటర్..!
-
వన ఉత్పత్తులకు.. దమ్మక్క బ్రాండ్!
అడవుల జిల్లాగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలుగా గిరిజన మహిళలు ఎదుగుతున్నారు. ఐదేళ్ల కిందట శిక్షణతో మొదలైన వారి ప్రయాణం నేడు ఈ కామర్స్ వాకిలి వరకు చేరుకుంది. వీరి విజయ గాథ...నైపుణ్య శిక్షణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మహిళలు 2018లో హైదరాబాద్‌కు ఐటీడీఏ తరఫున వెళ్లారు. అక్కడ సబ్బులు, షాంపులు తయారు చేసే ఓ సంస్థలో మూడు నెలలు శిక్షణ తీసుకున్నారు. ఆ శిక్షణతోనే సరిపెట్టుకోకుండా అదే కంపెనీ లో మరో తొమ్మిది నెలల పాటు పనిచేసి తమ నైపుణ్యానికి మరిన్ని మెరుగులు అద్దుకున్నారు. ఇందులో పదిహేను మంది సభ్యులు కలిసి దమ్మక్క జాయింట్ లయబిలిటీ గ్రూప్‌గా ఏర్పడ్డారు. రూ. 25 లక్షలతో షాంపూ, సబ్బుల తయారీ పరిశ్రమ స్థాపించాలని నిర్ణయించుకున్నారు.అవరోధాలన్నింటినీ అధిగమిస్తూ..దమ్మక్క గ్రూప్ సభ్యుల ఉత్సాహం చూసి అప్పటి ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు బ్యాంకు అధికారులతో మాట్లాడి లోను ఇప్పించడంతో భద్రాచలంలో 2019 నవంబరులో షాంపూ తయారీ యూనిట్నుప్రారంభించారు. పనిలో చేయి తిరగడం అలవాటైన కొద్ది రోజులకే 2020 మార్చిలో కరోనా విపత్తు వచ్చి పడింది. లాక్డౌన్ లు, కరోనా భయాల వల్ల బయటకు వెళ్లి పని చేసేందుకు ఇంట్లో కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడం ఒక ఇబ్బందైతే, మరోవైపు తయారీ యూనిట్లో షాంపూ బాటిళ్లు పేరుకుపోయాయి. ఇంతలోనే ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు షాంపూ బాటిళ్లు కావాలంటూ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి ఆర్డర్ రావడంతో కొంత ఊతం లభించింది.’’ అంటూ దమ్మక్క గ్రూపు జాయింట్ సెక్రటరీ బేబీరాణి అనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.ఊపందుకున్న అమ్మకాలు..షాంపూ కొనుగోలుకు జీసీసీ నుంచి మార్కెట్ అందుబాటులో ఉండటంతో పాటు షాంపూ నాణ్యత విద్యార్థులకు నచ్చడంతో క్రమంగా దమ్మక్క యూనిట్ పనితీరు గాడిలో పడింది. 100 మిల్లీలీటర్ల షాంపూ బాటిళ్ల తయారీ 2021లో యాభైవేలు ఉండగా 2022 ముగిసే నాటికి లక్షకు చేరుకుంది. ఆ మరుసటి ఏడాది ఏకంగా రెండు లక్షల బాటిళ్ల షాంపూలు తయారు చేసి విక్రయించారు. షాంపూల తయారీలో వచ్చిన అనుభవంతో ఈ ఏడాది మొదట్లో గ్లిసరిన్ ప్రీమియం సబ్బుల తయారీనిప్రారంభించి జీసీసీ స్టోర్లలో ప్రయోగాత్మకంగా అమ్మకాలుప్రారంభించగా... తొలి దఫాలో ఐదు వేల సబ్బులు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత అమ్మకాలు ఊపందుకున్నాయి.బ్యాంక్ రుణం కూడా తీర్చేశారు!యూనిట్ ఆరంభమైన తర్వాత ఏడాదిలో కేవలం మూడు నెలలే గ్రూపు సభ్యులకు పని దొరికేది. షాంపూ, సబ్బులకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది వరుసగా ఎనిమిది నెలలు అంతా పని చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బ్యాంకు రుణం కూడా తీర్చేశారు. ప్రతి సభ్యురాలికి ఖర్చులు పోను కనీసం రూ.10 వేల వరకు ఆదాయం వచ్చినట్టు గ్రూప్ ట్రెజరర్ పూనెం విజయలక్ష్మి తెలిపారు.ఈ కామర్స్ దిశగా..రాబోయే రోజుల్లో ఈ కామర్స్ వేదికగా ఈ ఉత్పత్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు గ్రూపు అధ్యక్షురాలు తాటి రాజసులోచన తెలిపారు. ఈ మేరకు బ్రాండ్‌నేమ్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. అది విజయవంతం అయితే మరెందరో కొత్త వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సాక్షి, భద్రాచలంఇవి చదవండి: డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్! -
రాజరికం నుంచి జనతా సర్కార్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఐదు వందలకు పైగా స్వతంత్ర రాజ్యాలు ప్రిన్సిలీ స్టేట్స్ పేరుతో ఉన్నాయి. వీటిని దేశంలో విలీనం చేయడానికి అప్పటి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నించారు. ఈమేరకు నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి బస్తర్ మహారాజుగా ప్రవీర్‌చంద్ర భంజ్‌దేవ్ హాజరై విలీన ఒప్పందంపై సంతకం చేశారు. దీంతో దేశంలో 13వ పెద్దరాజ్యంగా ఉన్న బస్తర్ స్టేట్ భారత్‌లో 1948 జనవరి 1న విలీనమైంది.ప్రవీర్సేన పేరుతో పోటీఓ వైపు మహారాజుగా కొనసాగుతూనే మరోవైపు 1957లో కాంగ్రెస్ పార్టీ తరఫున జగదల్పూర్ స్థానం నుంచి ప్రవీర్‌చంద్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే మహారాజుగా తనకు దక్కాల్సిన హక్కుల విషయంలో భారత ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేక ఇరు పక్షాల మధ్య అనుమాన బీజాలు మొలకెత్తాయి. మరోవైపు బ్రిటీష్ కాలం నుంచి ఉన్న బైలడిల్లా గనులపై పట్టు కోసం కేంద్రం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో ఇటు కేంద్రం, అటు బస్తర్ మహారాజు మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలు పక్కాగా అమలు చేయాలని మహారాజు ప్రవీర్‌చంద్ర గళం విప్పడం మొదలెట్టారు. ఆ తర్వాత అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ప్రవీర్సేన పేరు మీద అభ్యర్థులను బరిలో నిలబెట్టి 11 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ విసిరారు. ఆ ఎన్నికల్లో బస్తర్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు.హత్యకు గురైన నాటి బస్తర్ మహారాజు ప్రవీర్‌చంద్ర భంజ్‌దేవ్ కేంద్రంపై పోరాటంరాజా ప్రవీర్‌చంద్ర లెవీ విధానాన్ని వ్యతిరేకిస్తూ చిత్రకూట్ జలపాతం దగ్గరున్న లోహండిగూడా దగ్గర వేలాది మందితో బహిరంగసభ నిర్వహించారు. ఆ తర్వాత రైళ్లలో న్యూఢిల్లీ వరకు పెద్ద సంఖ్యలో ఆదివాసీలను తీసుకెళ్లి పార్లమెంట్ ముందు భారీ నిరసన వ్యక్తం చేశారు. దీంతో బస్తర్‌లో అశాంతికి కారణం అవుతున్నాడనే నెపంతో ప్రవీర్చంద్రను అరెస్ట్ చేసి నర్సింగాపూర్ జైల్లో బంధించారు. మహారాజుపై దేశద్రోహి అనే ముద్రను వేసి జైలులో పెట్టడంతో బస్తర్ అట్టుడికిపోయింది. ప్రజాగ్రహం అంతకంతకూ పెరుగుతుండటంతో రాజును విడుదల చేసిన ప్రభుత్వం ఆయనకు ఉన్న హోదాలను రద్దు చేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది.నక్సల్బరీబస్తర్ మహారాజు ప్రవీర్‌చంద్ర మహారాజ హత్య జరిగిన మరుసటి ఏడాదే బెంగాల్లో చారుమజుందార్ ఆధ్వర్యంలో 1967లో నక్సల్బరీ పోరాటం మొదలైంది. వర్గశత్రువు రక్తంలో చేతులు ముంచనిదే విప్లవం రాదంటూ ఆయుధాలు ఎక్కుపెట్టిన చారుమజుందార్ భావావేశం అనతికాలంలోనే ఆంధప్రదేశ్‌ను చుట్టుముట్టింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎర్రజెండాలు రెపరెపలాడాయి. ఇక్కడి పల్లెల్లో విప్లవాగ్నులు రగిలించిన నక్సలైట్లు, గతంలో అన్నమదేవుడు నడిచిన పాతదారిలోనే వరంగల్ మీదుగా గోదావరి దాటి బస్తర్ అడవుల్లోకి 1980వ దశకంలో వెళ్లారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వ పాలనలో అధికారుల దాష్టీకాలతో విసిగిపోయిన ఆదివాసీలకు విప్లవ భావాలు కొత్త దారిని చూపాయి. ఫలితంగా పదిహేనేళ్లు గడిచే సరికి అక్కడ నక్సలైట్లకు కంచుకోటగా మారింది. జనతా సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి మావోయిస్టులు చేరుకున్నారు. దీనికి ప్రతిగా అప్పుడు ఆపరేషన్ గ్రీన్‌హంట్ ఇప్పుడు కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. ఇరువర్గాల మధ్య పోరులో బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారుతోంది. ఇప్పటి వరకు అన్ని వైపుల నుంచి ఏడువేల ఐదు వందల మంది చనిపోయారు.మహారాజు హత్యమహారాజునైన తన హక్కులకే దిక్కు లేనప్పుడు ఇక ఆదివాసీల çపరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే భావనతో ధిక్కార స్వరాన్ని రాజా ప్రవీర్‌చంద్ర మరింతగా పెంచారు. ఈ క్రమంలో ప్యాలెస్‌లో మద్దతుదారులతో ఆందోళన చేస్తున్న ప్రవీర్చంద్రను పోలీసు దళాలు చుట్టుముట్టాయి. ఆందోళనకారుల్లో కొందరిని విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆదివాసీలు బాణం, బల్లెం చేతబట్టి పోలీసులపైకి దాడికి సిద్ధమయ్యారు. ఆదివాసీ సైన్యంతో రాజు తమపై దాడికి దిగారని, ఫలితంగా ఆత్మరక్షణ కోసం తాము కాల్పులు జరిపామంటూ పోలీసులు చెప్పారు. 1966 మార్చి 25న జరిగిన ఈ కాల్పుల్లో మహారాజు ప్రవీర్ చంద్ర చనిపోయారు. ఈ ఘటనతో సుమారు 650 ఏళ్లుగా సాగుతున్న రాజరిక పాలన స్థానంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన బస్తర్‌లో మొదలైంది. -
రాధే మరణశిక్షను అంగీకరించింది
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘పార్టీ, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి పోలీ సులు బంటి రాధ అలియాస్ నీల్సోను కోవ ర్టుకుట్రలో భాగం చేయడం ద్వారా ఆమె మరణానికి కారకులయ్యారు.. చివరకు రాధే తాను చేసిన ద్రోహానికి మరణశిక్ష విధించడం సరైందని మనస్ఫూర్తిగా అంగీకరించింది’ అని మావోయిస్టు పార్టీ ఆంధ్రా–ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణే‹శ్వెల్లడించారు. ఈ మేరకు ఆయన పేరి ట శుక్రవారం ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ లోని వివరాల ప్రకారం.. ‘పోలీసు ఉన్నతాధి కారులు ఆమె కులం, జెండర్‌ను ఉపయోగించుకొని అవాస్తవాలతో కొన్ని సంఘాల పేరి ట పోస్టర్లు, ప్రకటనలు, పాటలు విడుదల చేశారు. నిత్యం దళిత, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడే పోలీసు లకు రాధ కులం, మహిళ అని మాట్లాడే అర్హ త లేదు. పీడితవర్గ మహిళగా సమస్యల్ని ఎదుర్కొని వాటికి పరిష్కారంగా విప్లవ రాజకీయాలను మనస్ఫూర్తిగా స్వీకరించి స్వచ్ఛందంగా పార్టీ లో చేరింది. సభ్యురాలి నుంచి నాయ కత్వ స్థానంలోకి ఎదగడానికి ఆమె పట్టుదల, పార్టీ కృషి ఉంది. ఆపై ఆమె కుటుంబ బలహీనతలను పోలీసులు వాడు కొని విప్లవద్రోహిగా మార్చి పార్టీ నాయక త్వాన్ని నిర్మూలించాలని చూశా రు. ఇంతలోనే పార్టీ అప్రమత్తం కావడం, పోలీసుల పథకం విఫలమైంది’. అని పేర్కొన్నారు. వాళ్లకు మానవత్వం లేదు..బండి రాధను చంపి మృతదేహాన్ని రోడ్డుపై పడవేసిన మావోయిస్టు నేతలు మాయ మాటలతో ప్రకటనలు విడుదల చేయడం వారి క్రూరత్వానికి నిదర్శనమని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత చదువు పూర్తిచేసిన రాధను బలవంతంగా పార్టీలో చేర్చుకొని జీవితాన్నే లేకుండా చేసిన మావోలకు మానవత్వమే లేదని ఈ ఘటనతో అర్థమవుతోందని చెప్పా రు. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి పోలీసులే బాధ్యత వహించాలని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. రాధను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టి లైంగికంగా వేధిస్తూ కులం పేరుతో దూషించారని ఆమె సోదరుడు కూడా ఆరోపించా డని తెలిపారు. మావోయిస్టుల్లో కీలకపాత్ర పోషించిన దళిత మహిళ రాధపై పోలీస్ ఇన్ఫార్మర్ అని ముద్రవేయడం ఆ పార్టీ నేత ల నీచమైన ఆలోచనలకు నిదర్శనమన్నారు. -
అయ్యో రియాన్షిక.. ప్రాణం తీసిన పెన్ను
భద్రాచలం అర్బన్, సాక్షి: కళ్ల ముందే చిరునవ్వులతో హోం వర్క్ చేస్తున్న చిన్నారి(4) ఊహించని రీతిలో ప్రమాదానికి గురైంది. తలలో పెన్నుతో నరకయాతన పడుతున్న ఆ బిడ్డను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఎలాగైనా ఆమెను బ్రతికించుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ, విధికి కన్నుకుట్టి ఆ పసికందు ప్రాణాన్ని బలిగొంది.భద్రాచలం సుభాష్‌నగర్‌కు చెందిన చిన్నారి రియాన్షిక తలలో పెన్ను గుచ్చుకుని ప్రాణం పొగొట్టుకుంది. సోమవారం రాత్రి ఆమె హోం వర్క్ చేస్తున్న టైంలో బెడ్ మీద నుంచి కింద పడిపోయింది. అయితే ప్రమాదవశాత్తు పెన్ను ఆమె తలలో గుచ్చుకుంది. వెంటనే ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతికష్టం మీద వైద్యులు శస్త్రచికిత్స చేసి పెన్ను తొలగించారు. పెన్ను తొలగించడంతో బాలికకు ప్రాణాపాయం తప్పినట్టేనని వైద్యులు భావించారు. ఆమె తల్లి, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం వైద్యులకు ఫోన్ చేసి ఆరా తీశారు. కానీ, పరిస్థితి విషమించి రియాన్షిక కన్నుమూసింది. సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ సోకడంతోనే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. బతికిందని సంతోషించే లోపే బిడ్డ మృతి చెందిందన్న వార్త విని ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గుండెలు అవిసేలా రోదిస్తుండడం.. చూసేవాళ్లను కంటతడి పెట్టిస్తోంది. -
తెలంగాణలోకి మావోయిస్టులు?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దండకారణ్యంలో పోలీసు నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా తిరిగి తెలంగాణ బాట పడుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై భద్రతా దళాలు దాడులను తీవ్రం చేశాయి. జనవరిలో ఆకురాలే కాలంలో మొదలైన ముప్పేట దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీంతో ఆత్మరక్షణ కోసం మావోయిస్టు పార్టీలో కీలక నేతలు తమ వ్యూహాలను మార్చినట్లు సమాచారం.దళాలుగా సంచరించడం వల్ల పోలీసులు, కేంద్ర బలగాల దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్నామనే అభిప్రాయం ఆ పార్టీ నాయకత్వంలో ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో కీలక నాయకులను కాపాడుకోవడంతో పాటు పార్టీ ఉనికిని చాటుకునేందుకు వీలుగా తెలంగాణ వైపు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇక్కడి నుంచి కొత్త రిక్రూట్మెంట్లపైనా దృష్టి సారించినట్లు తెలిసింది.గోదావరి తీరం వెంట కదలికలుగోదావరి తీరం వెంబడి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో వివిధ కమిటీల పేర్లతో మావో యిస్టులు తమ ఉనికి చాటేందుకు గత నాలుగైదేళ్లుగా ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నాలు ఎక్కు వగా లేఖలు, పోస్టర్లు, బ్యానర్ల వంటి అంశానికే పరిమితమయ్యాయి. దీంతో పార్టీ విస్తరణ విషయంలో సానుకూల ఫలితాలు పొందలేక వెనకడు గు వేశారు.ఇప్పుడు మావోయిస్టులు రూటు మార్చారు. దళాల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి బదులు ఇద్దరు ముగ్గురు సభ్యులతో టీమ్‌లుగా ఏర్పడి తెలంగాణలో పార్టీ విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. రెండు వారాలుగా గోదావరి తీరం వెంట ఉన్న గ్రామాల్లో మావోయిస్టుల కదలికలు కని్పంచడం ఇందుకు బలం చేకూరుస్తోంది.మద్దతుపై రెక్కీ టీమ్‌ల ఆరామావోయిస్టు పార్టీలో తలపండిన నాయకులు, ఉద్యమ వ్యూహాలు తెలిసిన వారు చిన్న టీమ్‌లుగా విడిపోయారు. ఈ బృందాలు ఇటీవల భద్రాద్రి – ములుగు జిల్లా సరిహద్దులో ఉన్న అటవీ గ్రామాల దగ్గర నుంచి గోదావరి తీరం దాటి రెక్కీ టీమ్‌లుగా వ్యవహరిస్తున్నా యని సమాచారం. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో తునికాకు కాంట్రాక్టర్లకు మావోల నుంచి హుకుం జారీ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణలోకి వచ్చిన రెక్కీ టీమ్ సభ్యులు తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో పరిస్థితి ఎ లా ఉంది? సానుభూతిపరుల నుంచి మద్దతు లభిస్తుందా, లేదా? అనే అంశాలను బేరీజు వేయడంపై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్కు చెందిన నాయకుల కదలికలపైనా దృష్టి సారించారని సమాచారం. చర్ల మండల కేంద్రంలో ఐదుగురిని గురువారం ఛత్తీస్‌గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఏ కారణాలతో అదుపులోకి తీసుకున్నారనేది స్పష్టత రాకపోయినా ఈ అంశం ఇప్పుడు ఏజెన్సీలో చర్చనీయాంశంగా మారింది. -
సడన్ బ్రేక్ ప్రాణం తీసింది..
దమ్మపేట: రోడ్డుపై నిర్మించిన స్పీడ్ బ్రేకర్లు ఓ లారీ డ్రైవర్ ప్రాణాలను బలి తీసుకున్నాయి. స్పీడ్ బ్రేకర్లను ముందుగా గమనించని డ్రైవర్.. సడన్ బ్రేక్ వేయడంతో లారీలో ఉన్న రైల్వే ట్రాక్ పట్టాలు కేబిన్‌లోకి దూసుకొచ్చి తగలడంతో అతడి శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుర్వాయిగూడెంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి రైల్వే ట్రాక్ పట్టాల లోడ్‌తో ట్రాలీ లారీ తమిళనాడులోని తిరుచనాపల్లికి వెళుతోంది. లారీని మధ్యప్రదేశ్‌కు చెందిన కాకు(36) నడుపుతుండగా, ఆకాష్ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. దమ్మపేట మండలం గుర్వాయిగూడెం సమీపంలోని మూలమలుపు వద్ద స్పీడ్ బ్రేకర్లను గమనించని కాకు.. అక్కడికి రాగానే సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ట్రాలీలో ఉన్న రైల్వే ట్రాక్ పట్టాలు కేబిన్‌లోకి దూసుకురాగా లారీ ఒక పక్కకు పడిపోయింది.పట్టాలు డ్రైవర్‌పై పడడంతో శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహం కేబిన్‌లో ఇరుక్కుపోయింది. క్లీనర్ మాత్రం కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న సీఐ జితేందర్‌రెడ్డి, ఎస్సై సాయికిశోర్‌రెడ్డి నాలుగు జేసీబీలతో రెండు గంటల పాటు శ్రమించి పట్టాలను, డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం అశ్వారావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
హామీలన్నీ అమలు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఈటల
సాక్షి, కొత్తగూడెం: పోరాడి సాధించుకున్న తెలంగాణాలో అహంకారానికి స్థానం లేదని ప్రజలు నిరూపించారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాటలు తప్ప హమీల అమలు లేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని పేర్కొన్నారు. ఆరు నెలల ఈ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. చైతన్యవంతులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ప్రజాస్వామ్య విలువ పెంచాలని కోరారు.వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ.. కొత్తగూడెం క్లబ్‌లోని ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ జాతీయ నాయకులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణా ఉద్యమంలో తొలి తూటా దిగింది కొత్తగూడెం గడ్డ పైనేనని తెలిపారు. ఈ జిల్లా చైతన్య వంతమైన జిల్లా అని పేర్కొన్నారు. సమాజం పట్ల మంచి అవగాహన ఉన్న గ్రాడ్యుయేట్స్.. మంచి ఎవ్వరో చెడు ఎవ్వరో తెలుసుకుని ఓటు వేయాలని సూచించారు.ఎన్నికల ఫ్లెయింగ్ స్కాడ్ పేరుతో తమకు ఇబ్బందులు గురిచేయాలని చూశారని ఈటల ఆరోపించారు. లక్ష కోట్ల యజమాని అయిన గుడిసెల్లో ఉన్న వారికైనా ఒకటే ఆయుధం ఓటు అని తెలిపారు. ప్రతి హామీలపై పోరాటం చేసే పార్టీ బీజేపీ పార్టీ మాత్రమేనని అన్నారు. భారత్ తెచ్చి 12వేల కోట్ల టాయిలెట్ కట్టించిన ఘనత తమదేనని పేర్కొన్నారు. ఫోన్ పే, గూగుల్ పే తెచ్చింది నరేంద్రమోీదీనేనని.. 10 సంవత్సరాల పరిపాలనలో కొన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవే నిర్మించింది బీజేపీనేనని అన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ తెచ్చి.. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసిన ఘనత మోదీనేనని ఈటల తెలిపారు. -
కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తగా ఇవ్వలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమయితే.. నియామక పత్రాలు ఇచ్చింది మాత్రమే రేవంత్ రెడ్డి అని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చానని రేవంత్ అబద్దపు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కొత్తగూడెం ఇల్లందులో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా ఉన్న వాళ్లకు పట్టం కడితే ప్రశ్నించే గొంతుకైతారని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌కు బద్ది చెప్పాలంటే, 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలంటే, ఆ ఒత్తిడి ఉండాలంటే దమ్మున్న రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాడని తెలిపారు. పచ్చి అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యావంతులు కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజుల్లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. కేసీఆర్ హయాంలో టెట్‌కు దరఖాస్తు ఫీజు రూ. 400 పెడితే.. ఇదే రేవంత్ నానా యాగీ చేశారు. ఇవాళ టెట్ పరీక్షకు వెయ్యి పెట్టారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి. మొదటి కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీ వేస్తామన్నారు. ఆ హామీ కూడా నెరవేరలేదు. సింగరేణిలో 24 వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చాం. సింగరేణిని అదానీకి అమ్మేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నాడు. ఇదే విషయంపై మోదీతో రేవంత్ కూడబలుక్కున్నాడు. చివరకు సింగరేణిని కూడా ప్రయివేటుపరం చేస్తారు.ప్రైవేట్ రంగంలో 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బీఆర్ఎస్ కృషి చేసింది. సోషల్ మీడియాలో మాపై వ్యతిరేక ప్రచారం వల్లే మా అభివృద్ధి ప్రచారంలోకి రాలేకపోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ నరేంద్ర మోీదీ తలుపులు తెరుచుకొని ఉన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి కంకణం కట్టుకున్నారు. 56 కేసులు ఉన్న ఒక బ్లాక్ మెయిలర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి టికెట్ ఇచ్చింది. ఇప్పటికైనా ఆలోచించి పట్టబద్రులు ఓటు వేయాలి’ అని కోరారు. -
చదువు మాన్పించి పెళ్లి చేశారని.. నవ వధువు ఆత్మహత్య
భద్రాద్రి: చదువు మాన్పించి పెళ్లి చేశారనే మనస్తాపంతో నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన విషాదఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మంగయ్యబంజర్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మంగయ్యబంజర్ గ్రామానికి చెందిన భూక్యా దేవకి(23) ఈ ఏడాది కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులకు వెళ్తానని పట్టుబట్టినా.. తల్లి ఆరోగ్యం బాగుండడం లేదనే సాకుతో కుటుంబసభ్యులు వివాహానికి ఒప్పించారు. ఇదే మండలంలోని దుబ్బతండాకు చెందిన గుగులోత్ బాలరాజుతో మార్చి 28న దేవకికి వివాహం జరిపించారు. కాగా, 16 రోజుల పండుగ నిమిత్తం నూతన వధూవరులను ఈనెల 12న మంగయ్యబంజర్ తీసుకొచ్చారు. 13వ తేదీ అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో దేవకి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను మొదట జూలూరుపాడు ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెంకు తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. తల్లి భూక్యా పద్మ ఫిర్యాదు మేరకు చండ్రుగొండ ఎస్సై మాచినేని రవి కేసు నమోదు చేశారు. -
ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పార్టీకి వచ్చింది ఒకసీటే: రేవంత్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం మార్కెట్ యార్డు సభా ప్రాంగణంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, కొమటి రెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మణుగూరు బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రూ. 22,500 కోట్లతో ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామని అన్నారు. మహిళల పేరు మీదే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లని అన్నారు. తెలంగాణలో నాలుగున్నర లక్షల ఇళ్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్‌కు ఖమ్మం జిల్లాకు బలమైన బంధం ఉందని అన్నారు రేవంత్. మొదటి నుంచి ఖమ్మం ప్రజలు కేసీఆర్‌ను నమ్మలేదని చెప్పారు. 2014, 2018, 2023లో కూడా ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పార్టీకి వచ్చింది ఒకసీటేనని గుర్తు చేశారు. కేసీఆర్ చెప్పిన కథనే మళ్ళీ మళ్ళీ చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ను బొంద పెట్టారని దుయ్యబట్టారు. పేదవారితో కేసీఆర్ ఆటలాడుతున్నారని మండిపడ్డారు. రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్‌ను కేంద్రం 1200 చేసిందని విమర్శించారు. ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో అక్కడే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని అన్నారు. ఏ ఊరిలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో.. ఆ ఊళ్లోనే మేము ఓట్లు అడుగుతామని..ఈ ఛాలెంజ్‌కు బీఆర్ఎస్ రెడీనా అని సవాల్ విసిరారు. -
ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై కిడ్నాప్ కేసు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై కిడ్నాప్ కేసు నమోదు నమోదైంది. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా.. ఓ కౌన్సిలర్‌ను ఎమ్మెల్యే కనకయ్య కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎమెల్యే కోరం కనుకయ్య, మరో 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఇల్లందు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్‌పై అవిశ్వాస ఓటింగ్‌కు ముందు హైడ్రామా చోటుచేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాసం నేపథ్యంలో పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. ఛైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరారావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడానికి 17 మంది కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు. మరో ఇద్దరు కౌన్సిలర్లు ఆయనకు మద్దతు తెలిపితే అవిశ్వాసం వీగిపోతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ నాగేశ్వరరావును కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య బలవంతంగా లాక్కెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆ పల్లెను చూసింది నలుగురు ఎమ్మెల్యేలే!
రాష్ట్రంలో అంతరించిపోతున్న ఆదిమ జాతుల్లో ఒకటైన కొండరెడ్లకు ఓటు హక్కు కల్పించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో ఈ ఏడాది కొత్తగా 71 మంది కొండరెడ్లు ఓటుహక్కు పొందారు. సమాజానికి దూరంగా అడవుల్లో నివసించే కొండరెడ్లను సైతం ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడంపై జిల్లా యంత్రాంగం చేసిన కృషిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్ సైతం అభినందించారు. దీంతో ఒక్కసారిగా కొండరెడ్లు ఫోకస్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలపై కొండరెడ్ల జీవన స్థితిగతులతో పాటు అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. దట్టమైన అడవిలో..: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ – దమ్మపేట మార్గంలోని దట్టమైన అటవీ మార్గంలో ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఒక ఫారెస్ట్ చెక్ పోస్టు వస్తుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం లేని కాలిబాటలో 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. . కొండరెడ్లు నివాసముండే పూసుకుంట అనే గ్రామం వస్తుంది. ఇక్కడ 138 మంది కొండరెడ్లు నివసిస్తున్నారు. ఇందులో 80 మందికి గతంలో ఓటుహక్కు ఉండగా ఈ ఏడాది కొత్తగా 14 మందికి ఓటుహక్కు వచ్చింది. ఆ గ్రామం చూసిన ఎమ్మెల్యేలు నలుగురే..: గడిచిన డెబ్బై ఏళ్లుగా ఈ గ్రామాన్ని సందర్శించింది కేవలం నలుగురు ఎమ్మెల్యేలే. వారే జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావు, వగ్గేల మిత్రసేన, తాటి వెంకటేశ్వర్లు. కొండ రెడ్ల ఓట్లు తక్కువగా ఉండటం, ఇతరులతో కలవకుండా వేరుగా నివసిస్తుండడంతో బడా నేతలు కానీ రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం లేదు. ఎన్నికల వేళ కేవలం ఓటర్లుగానే పరిగణిస్తున్నారు తప్ప అరుదైన గిరిజన జాతిగా గుర్తించడం లేదు. ఫలితంగా ఈ జాతి అంతరించిపోయే ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. గవర్నర్ రాకతో..: రాష్ట్ర గవర్నర్ తమిళసై 2022 ఏప్రిల్‌లో ప్రత్యేకంగా పూసుకుంట గ్రామాన్ని సందర్శించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలో ప్రధాన రహదారి నుంచి 13 కి.మీ దూరంలో పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆమె పలకరించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ గ్రామానికి ప్రభుత్వపరంగా వివిధ పక్కా భవనాలు మంజూరయ్యాయి. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయగా, రవాణా సౌకర్యం కోసం ఎలక్ట్రిక్ ఆటో సమకూర్చారు. అలాగే, ఇక్కడి ప్రజలకు వెదురుతో అలంకరణ వస్తువులు తయారు చేయించడంపై శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. ఆ సౌకర్యాలు మూణ్నళ్ల ముచ్చటే..: గవర్నర్ రాకతో హడావుడిగా వచ్చిన సౌకర్యాలు ఇప్పుడు మూలనపడ్డాయి. ఆర్వో ప్లాంట్‌లో వాటర్ ట్యాంక్ పగిలిపోగా, బ్యాటరీ ఆటో రిపేరుకు వచ్చింది. శిక్షణా కేంద్రానికి వేసిన తాళం తీయడం లేదు. వీటిపై ఐటీడీఏ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. వెదురు బుట్టల మార్కెటింగ్‌పై దృష్టి సారించకపోవడంతో స్థానికులు వాటి తయారీపై ఆసక్తి చూపడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లదీ ఇదే పరిస్థితి. కొండ దిగినా..: డెబ్బై ఏళ్లుగా ప్రభుత్వాలు, ఐటీడీఏ చేసిన ప్రయత్నాలతో కొండలు దిగి కింద ఉన్న అడవుల్లో కొందరు గ్రామాలను ఏర్పాటు చేసుకుంటే మరికొందరు మైదాన ప్రాంతాల సమీపాన ఉండే అడవుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ పరంగా వీరి కోసం అమలు చేసే పథకాల అమలులోనూ చిత్తశుద్ధి లోపించడంతో సరైన ఫలితాలు రావట్లేదు. దాంతో వారు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. ప్రమాదపుటంచున..: అడవుల్లో ఉండటం, జీవన విధానం, సంస్కృతి, ఆహారపు అలవాట్లు, వేషభాషల ఆధారంగా 1975లో దేశవ్యాప్తంగా ఆరుదైన ఆదిమజాతులను (ప్రిమిటీవ్ ట్రైబల్ గ్రూప్) ప్రభుత్వం గుర్తించింది. అయితే రానురానూ ఈ ఆదిమ జాతుల జనాభా వేగంగా తగ్గిపోతుండటంతో 2006లో అత్యంత ప్రమాదంలో ఉన్న ఆదిమ జాతులుగా పేరు మార్చారు. ఈ కేటగిరీకి చెందిన 12 రకాల ఆదిమ జాతులు ఉమ్మడి ఏపీలో ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో నాలుగు రకాలైన ఆదిమ తెగలే ఉన్నాయి. 2018–19లో రాష్ట్ర గిరిజన శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలం (జనాభా 40 వేలు), తోటి (4 వేలు), నల్లమల్ల అడవుల్లో చెంచులు (16 వేల జనాభా)తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 వేల మంది కొండరెడ్లు ఉన్నట్టు తేలింది. తాజాగా ఓటర్ల జాబితాకు వచ్చేసరికి కొండరెడ్ల జనాభా సగానికి సగం తగ్గిపోయి కేవలం 1,054కే పరిమితమైంది. ఇందులో 692 మందికి ఓటు హక్కు ఉంది. వీరంతా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఉన్న ఏడు కొండరెడ్డి గూడెల్లో నివాసం ఉంటున్నారు. రోడ్డు కావాలి.. మా ఊరికి రోడ్డు కావాలని ఎప్పటి నుంచో చెబుతున్నాం. వర్షాకాలం వస్తే ఊరు దాటడం కష్టం. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే దేవుడే దిక్కు. నీళ్ల ప్లాంటు, అంబులెన్స్, ఆటోలు పని చేయడం లేదు. – ఉమ్మల దుర్గ, పూసుకుంట చదువు ఆపేశాను నాకు ఇటీవలే ఓటు హక్కు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను, తమ్ముడు తొమ్మిదో తరగతితోనే చదువు ఆపేసి పనులకు వెళ్తున్నాం. – ఇస్మాయిల్‌రెడ్డి, వీరారెడ్డిగూడెం -తాండ్ర కృష్ణగోవింద్ -
రోడ్డుపై బాలింత.. మధ్యలోనే వదిలి వెళ్లిన 102 వాహనం
బూర్గంపాడు (భద్రాద్రి కొత్తగూడెం): బురదమయంగా ఉన్న ఆ గ్రామ రహదారిపై వాహనం వెళ్లే పరిస్థితి లేక మూడు రోజుల బాలింతను రోడ్డుపైనే దింపి 102 వాహనం వెళ్లిపోయి న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. సారపాక సమీపంలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి చెందిన పార్వతి 3 రోజుల క్రితం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి అమ్మఒడి వాహనంలో ఇంటికి పంపించారు. అయితే ఆ వాహనం గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సరిగా లేకపోవడంతో డ్రైవర్ శ్రీరాంపురం రహదారిపై దించేశాడు. దీంతో పార్వతి చంటిబిడ్డతో రెండు కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరుకుంది. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితం ఇదే గ్రా మానికి చెందిన ఓ మహిళ పాముకాటుకు గురి కాగా, వాహన సౌకర్యం లేక మోసుకుంటూ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గ్రామానికి రోడ్డు వేయాలని స్థానికులు వేడుకుంటున్నారు. చదవండి: గణేష్ నిమజ్జనంలో అపశృతి.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో.. -
గల్లంతైన ఎమ్మెల్యే ఆశలు.. హెల్త్ డైరెక్టర్ అడుగులు ఎటువైపు?
కొత్తగూడెం బీఆర్ఏస్ ఎమ్మెల్యే టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు ఆశలు గల్లంతయ్యాయి. టికెట్ ఆశించి భంగపాటే మిగిలింది. చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసిన వర్క్ అవుట్ కాలేదన్న భావనలో ఉన్నారు గడల. ఎమ్మెల్యే చాన్స్ చేజారడటంతో గడల సైలెంట్ అయిపోతారా? లేక వేరే దారి చూసుకుంటారా? గడల పొలిటికల్ రూట్ మ్యాప్ ఏవిధంగా ఉండబోతుంది? ఒక్కరోజు ముందు కూడా హడావిడి బీఆర్ఏస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశించిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు నిరాశే మిగిలింది. టికెట్‌పై ఏన్నో ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ దీవెనెలు సైతం తనకే ఉంటాయన్నారు. బీఆర్ఏస్ అభ్యర్థుల ప్రకటనకు ఒక్క రోజు ముందు కూడ కొత్తగూడెంలో హడావుడి చేశారు. కొత్త కొత్తగూడెం నినాదంతో కొత్తగూడెం మున్సిపాలిటీలో పాదయాత్ర ప్రారంభించారు. రాజకీయం అంటేనే సేవ.. కట్ చేస్తే! 23 వ వార్డులోని అమ్మవారి ఆలయంలో పూజ నిర్వహించి జీఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులతో కలిసి గడప గడపకి పాదయాత్ర చేపట్టారు. గడప గడపకు వెళ్తూ అడపడుచులకు పసుపు-కుంకుమ, గాజులు, కరపత్రంతో కలిగిన ప్యాకెట్ ఇస్తూ వార్డులో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయాల్లోకి రావడంపై డాక్టర్ గడల శ్రీనివాస రావు స్పందిస్తూ రాజకీయం అంటేనే సేవ అని, కొత్తగూడెంలో ప్రజలకు సేవ చేయటం తన కర్తవ్యంగా భావిస్తున్నానన్నారు. ఇంటింటికీ పాదయాత్ర భారీ ఆర్భాటంతో చేపట్టడంతో అధికార బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలోనూ పెద్ద చర్చకే దారి తీసింది. సీన్ కట్ చేస్తే.. హెల్త్ డైరెక్టర్‌గానే కొనసాగుతారా? లేక మరుసటి రోజే బీఆర్ఏస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్‌లో కొత్తగూడెం టికెట్ సిట్టింగ్ ఏమ్మేల్యే వనమా వెంకటేశ్వర్ రావుకే దక్కింది. దీంతో గడల ఆశలు గల్లంతై పోయాయని కొత్తగూడెం నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తుంది. టికెట్ దక్కకపోవడంతో గడల కార్యచరణ ఏ విధంగా ఉండబోతుందన్న చర్చ నడుస్తుంది. హెల్త్ డైరెక్టర్ గానే కోనసాగుతారా? లేక వేరే దారి చూసుకుంటారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. చదవండి: కరీంనగర్: బీఆర్ఎస్కు షాక్.. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ రాజీనామా వేరే పార్టీలోకి! ఒకవేళ వేరే పార్టీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకునే అవకాశం ఉంటే.. హెల్త్ డైరెక్టర్ పదవి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇప్పట్లో వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో సైలెంట్‌గా ఉండే వచ్చేసారి ఏమైనా గుర్తించండి అని కేసీఆర్ నుంచి హమీ తీసుకొని తన పని చేసుకుంటారా అన్న చర్చ నడుస్తుంది. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా.. తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు సొంత ప్రాంతమైన కొత్తగూడెంలో కొన్ని నెలలుగా జీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టిన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కేవలం వికెండ్‌లో మాత్రమే ఉంటాయి. అయితే గడల వ్యవహరంపై గతంలో ప్రతిపక్షాలు తీవ్రస్తాయిలో పైర్ అయ్యాయి. హెల్త్ డైరెక్టర్‌గా ఉండి రాజకీయాలు చేయడం ఏంతవరకు సబబని నిలదిశాయి. అదే సమయంలో ప్రతిపక్షాల విమర్శలను సైతం గడల పెద్దగా పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటు వెళ్లారు. చేయాల్సిన ప్రయత్నాలు చేసినా.. చివరికి భంగపాటే జీఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో గడల కార్యక్రమాలు ప్రారంభించినప్పటి నుంచి అనేక వివాదాలు గడల చుట్టు తిరుగుతూ వచ్చాయి. ఓ ఏంపీపీ ఇంట్లో మిరపకాయ పూజలు చేయడం, అనేక కార్యక్రమాల్లో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం పెద్ద దూమారమే రేపాయి. అంతేకాదు ప్రగతి భవన్లో నిమిషం వ్యవధిలో రెండు సార్లు సీఏం కేసీఆర్ కాళ్లు మొక్కడంపై సైతం ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. ఇలా నిత్యం వివాదాల్లోనే ఉంటు వచ్చారు గడల.. ఇవన్నీ పక్కన పెట్టి కొత్తగూడెం టికెట్ కోసం చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసినా చివరకు భంగపాటే మిగిలిందన్న భావనలో ఉన్నారు గడల శ్రీనివాస్ రావు.. మరి హెల్త్ డైరెక్టర్ పొలిటికల్ ఎంట్రీ ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. -
భద్రాద్రి వీడియో.. కళ్లముందే కొట్టుకుపోయారు
ములకలపల్లి: వరినాట్లు వేసేందుకు వెళ్లి తిరిగి వస్తూ తల్లీకూతుళ్లు వాగులో కొట్టుకు పోయారు. కుమార్తె క్షేమంగా బయటపడగా, తల్లి మాత్రం గల్లంతయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుమ్మరి పాడు గ్రామానికి చెందిన సుమారు 20 మంది మహిళల బృందం బుధవారం చాపరాల పల్లిలో వరినాట్లు వేశారు. తిరిగి వెళ్లే సమయంలో గ్రామ శివారులోని పాములేరు వాగు లోలెవల్ చప్టాపై ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇంటికి చేరాలనే ఆత్రుతతో అందరూ గుంపులుగా చేతులు పట్టుకుని వాగు దాటే ప్రయత్నం చేశారు. అయితే మధ్యలో వరద ధాటికి తల్లీకూతుళ్లైన కుంజా సీత, కుర్సం జ్యోతి కొట్టుకుపోయారు. వరద ఉధృతితో సహచర కూలీలు వారిని రక్షించలేకపోయారు. కాసేపటికి జ్యోతి ఓ చెట్టు కొమ్మను పట్టుకుని ఉండగా స్థానికులు కాపాడారు. సీత జాడ మాత్రం రాత్రి వరకు లభించలేదు. ತೆಲಂಗಾಣದ ಭದ್ರಾದ್ರಿ ಕೊತ್ತಗುಡ್ಡಂ ಜಿಲ್ಲೆಯ ಮುಲಕಪಲ್ಲಿ ಮಂಡಲ್ನ ಮಹಿಳೆಯರು ಗುಂಪಾಗಿ ಸೇತುವೆ ದಾಟುವಾಗ ಓರ್ವ ಮಹಿಳೆಯೊಬ್ಬರು ನೀರಿನಲ್ಲಿ ಕೊಚ್ಚಿಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. #KannadaNews #Newsfirstlive #Telangana #kothagudem #Mulakapally #Rains #Flood pic.twitter.com/BnL3Wq54w4 — NewsFirst Kannada (@NewsFirstKan) July 27, 2023 -
కలసిరాని మంత్రి పదవి... ఎమ్మెల్యేగా గెలిచినా తప్పని తలనొప్పులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వనమా వెంకటేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారు. ఆయన జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే మంత్రి పదవి రాక ముందు.. వచ్చిన తర్వాత అన్నట్టుగా స్పష్టమైన విభజన రేఖ గీయొచ్చు. ప్రజల మధ్యే ఉంటూ.. పాల్వంచ పారిశ్రామికంగా ఎదుగుతున్న తరుణంలో వార్డు సభ్యుడిగా వనమా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రజల్లోనే ఉండేవారు. ప్రతిరోజూ ద్విచక్ర వాహనంపై పంచాయతీ పరిధిలో అన్ని వార్డులు, గ్రామాలకు వెళ్లి వచ్చేవారు. ఆ తర్వాత సర్పంచ్‌గా ఎన్నికై న వనమా చేస్తున్న కృషిని అప్పటి కలెక్టర్లు ఈమని పార్థసారధి, పీవీఆర్కే ప్రసాద్ మెచ్చుకున్నారు. ఆ రోజుల్లోనే మూడుసార్లు ఉత్తమ సర్పంచ్‌గా నాటి గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పరకాల శేషాచలం చే తులమీదుగా బంగారుపతకాలను అందుకున్నారు. ఆ తర్వాత అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రో త్సాహంతో చిన్న వయసులోనే భూ తనఖా (ల్యాండ్ మార్టిగేజ్) బ్యాంక్‌కు చైర్మన్‌గా ఎన్నికై ప్రతిభ చూపారు. 1989లో కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. రికార్డుస్థాయిలో ఇళ్ల మంజూరు.. పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు రికార్డు స్థాయిలో కొత్తగూడెం నియోజకవర్గానికే 18 వేల ఇళ్లు మంజూరు చేయించి రికార్డు సృష్టించారు. ఇది చూసి అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సైతం ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్సార్ మంత్రి వర్గంలో వైద్య విధాన పరిషత్ మంత్రిగా పని చేశారు. పాల్వంచ ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేశారు. నియోజకవర్గ ప్రజల తలలో నాలుకగా ఉంటూ వచ్చారు. మంత్రిగా పోటీ చేసి ఓటమి.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హోదాలో పోటీ చేసిన వనమా ఓడిపోయారు. ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా పోటీ చేయగా సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు చేతిలో వనమా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వనమాకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. దీంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. వరుసగా రెండు ఓటముల తర్వాత చావోరేవో తేల్చుకోవాల్సిన తరుణంలో 2018లో ఇవే తనకు చివరి ఎన్నికలంటటూ హస్తం గుర్తుపై పోటీ చేసి గెలుపొందారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికే కరోనా కారణంగా ప్రజల్లో ఎక్కువగా తిరగలేకపోయారు. ఆ వెంటనే వనమా కుమారుడు రాఘవపై పోలీస్ కేసులు నమోదు కావడం ఆయనకు ఇబ్బందులు తెచ్చింది. ఇటీవల కాలంలో కొత్తగూడెం టికెట్ కోసం గులాబీ పార్టీలోనే ఆశావహుల నుంచి పోటీ ఎక్కువైంది. తీవ్రమైన పోటీని తట్టుకుంటూ మరోసారి కొత్తగూడెం నుంచి కారు గుర్తుపై పోటీ చేసేది తానేనంటూ వనమా ధీమా ప్రకటించారు. ఈ తరుణంలో అనూహ్యంగా అనర్హత వేటుకు గురయ్యారు. -
కిలో కూరగాయలు రూ.20కే!.. ఎక్కడో తెలుసా!
సాక్షి, కొత్తగూడెం: ఆకాశాన్నంటిన కూరగాయల ధరలతో అల్లాడుతున్న వినియోగదారులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఓ కూరగాయల వ్యాపారి కుటుంబం ఉపశమనం కలిగించింది. టమాటా ధరచూస్తే నోట మాటరాని పరిస్థితి. పచ్చిమిర్చి ముట్టుకోకుండానే మంటమండుతున్న వేళ ప్రజలెవరూ మార్కెట్ ముఖం చూడకపోవడంతో పలురకాల కూరగాయల ధరలు తగ్గించింది. ఇన్నిరోజులు ధరల దరువుతో వెలవెలబోయిన మార్కెట్లో తాజాగా వినియోగదారుల సందడి నెలకొంది. ఇల్లెందుకు చెందిన కూరగాయల వ్యాపారి యాకూబ్ కుమారులు గౌస్, జానీ, ఖాజా మానవతాదృక్పథంతో ముందుకు వచ్చి ఐదు రకాల కూరగాయల ధరలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. కిలో రూ.60 పలుకుతున్న బెండ, దొండ, సొరకాయ, వంకాయ, ఆలుగడ్డను కేవలం రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ విషయమై గౌస్, జానీ, ఖాజా మాట్లాడుతూ కూలీలు, చిరుద్యోగులు కూరగాయలు కొనే పరిస్థితి లేకపోవడంతో తమ తండ్రి స్ఫూర్తితో లాభనష్టాలు చూసుకోకుండా ధరలు తగ్గించినట్లు తెలిపారు. -
మొక్కలంటే వ్యసనం.. ఓ ప్రకృతి ప్రేమికుడి కథ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన హరినాథ్ గత పదేళ్లుగా మొక్కల పెంపకమే లోకంగా బతుకుతున్నాడు. ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లి రోడ్లు, అడవులవెంట తిరుగుతూ విత్తనాలు చల్లడమే ఆయన పని. ఆరు పదుల వయసులో అలుపెరగకుండా అడవుల పెంపకమే లక్ష్యంగా శ్రమిస్తున్న ఆయన ఈ పనికి దిగడం వెనుక ఆసక్తికరమైన కథ దాగుంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం హరినాథ్ తల్లిదండ్రులు కష్టపడటంతో పాల్వంచ సమీపాన జగన్నాథపురంలో ఆ కుటుంబానికి 1970వ దశకంలో 50 ఎకరాలకు పైగా భూమి సొంతమైంది. చదువు కోసం పాల్వంచలోని కేటీపీఎస్ స్కూల్‌కు రోజూ నడిచి వెళ్లే హరినాథ్ ఆకాశం కనిపించకుండా పెరిగిన చెట్లు, వాటి మధ్యన తిరిగే పక్షులు, పాములు, వన్యప్రాణులను చూస్తుండేవాడు. అయితే హరినాథ్ ఎస్సెస్సీ, ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలోకి అడుగుపెట్టగానే విలాసాలు దరిచేరాయి. చదువు పూర్తయి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో ఉద్యోగిగా పనిచేసిన ఆయన జూదం, తాగుడులాంటి వ్యసనాల్లో చిక్కుకుపోయారు. యాభై ఏళ్లు దాటినా బయటపడలేకపోయారు. దీంతో భూమి హరించుకుపోగా రూ.30 లక్షల అప్పు మిగిలింది. వనజీవి రామయ్య స్ఫూర్తితో.. కేటీపీఎస్ ఉద్యోగిగా కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు 2013లో విలాసాలు, వ్యసనాలపై వైరాగ్యం ఏర్పడింది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితికి చేరుకోగా టీవీలో పద్మశ్రీ వనజీవి రామయ్య జీవితంపై వచ్చిన కథనం హరినాథ్‌ను ఆకట్టుకుంది. దట్టమైన అడవి మీదుగా స్కూల్‌కు వెళ్లిన రోజులు గుర్తుకురాగా.. ప్రస్తుతం పాల్వంచ – కొత్తగూడెం పరిసర ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్‌గా మారడం కళ్లెదుట కనిపించింది. దీంతో వనజీవి మార్గంలో నడవాలనే నిర్ణయానికి రాగా, కొత్తగూడెంకు చెందిన మొక్కల వెంకటయ్య తదితరులు పరిచయమయ్యారు. అలా పదేళ్లుగా పాల్వంచ – కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పెంపే లక్ష్యంగా హరినాథ్ గడుపుతున్నాడు. మొక్కల పెంపకమే లక్ష్యంగా... ఏటా మార్చి నుంచి జూన్ వరకు 40 రకాల చెట్ల విత్తనాలను సేకరిస్తాడు. ఆ విత్తనాలను జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అడవుల్లో చల్లుతాడు. పాల్వంచ, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, సుజాతనగర్ మండలాల పరి ధి రోడ్లు, అడవులు, కార్యాలయాలు.. ఖాళీ స్థలం కనిపి స్తే చాలు ఔషధాలు, పండ్లు, నీడనిచ్చే నలభై రకాల మొ క్కల విత్తనాలు చల్లుతున్నాడు. పండ్లను కోతులు, పక్షు లు తింటున్నప్పుడు కలిగే సంతోషం తనకు జీవితంలో ఎప్పుడూ కలగలేదని హరినాథ్ చెబుతుంటాడు. 2016 లో ఉద్యోగ విరమణ చేశాక వచ్చే పెన్షన్ నుంచే మొక్కల పెంపకానికి ఖర్చు భరిస్తున్నాడు. పదేళ్ల క్రితం హరినాథ్ మొలుపెట్టిన పయనానికి ఇప్పుడు మరో ఇరవై మంది సాయంగా ఉంటున్నారు. మరో ఏడు జిల్లాల నుంచి వనప్రేమికులు విత్తనాలు తీసుకెళ్తుంటారు. మొక్కలపై అవగాహన పెంచండి పదేళ్లుగా లక్షలకొద్దీ విత్తనాలు చల్లుతున్నాను. పశువుల కాపర్ల అత్యుత్సాహంతో చెట్లు చనిపోతున్నాయి. మొక్కల సంరక్షణపై పశువుల కాపర్లకు అవగాహన కలి్పస్తే మంచిది. నాకు ముగ్గురు ఆడపిల్లలు. నేను వ్యసనాల్లో మునిగిపోయినప్పుడు వాళ్ల బాగోగులు మా ఆవిడే చూసు కుంది. వ్యసనాల నుంచి బయటకు వచ్చాక ప్రకృతి రక్ష ణ, అడవుల పెంప కంపై ధ్యాస పె ట్టా. నా సహకారం లేకున్నా ముగ్గురు పిల్లలు చదువు పూ ర్తి చేసి అమెరికాలో స్థిరపడ్డారు. ఇది ప్రకృతి నాకు తిరిగి ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నా. –హరినాథ్ -
తెలంగాణ నర్సుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు.. 27 ఏళ్లుగా సేవలు
వృత్తే దైవంగా,సేవే పరమార్థంగా భావించిన తేజావత్ సుశీలకు ఈ యేడాది ప్రతిష్టాత్మక ‘ఫ్లారెన్స్ నైటింగేల్’ అవార్డు దక్కింది.తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట ప్రాథమిక వైద్యశాలలోఏఎన్ఎంగా సేవలందిస్తున్న సుశీల గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా 27 ఏళ్ల తన కెరీర్ గురించి సుశీల ‘సాక్షి’తో పంచుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన తేజావత్ సుశీల జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా నర్సులు చేస్తున్న ఉత్తమ సేవలకుగాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ఏటా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2022, 2023 సంవత్సరాలకుగాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించారు. ఇందులో 2022కుగాను ఏఎన్ఎమ్ కేటగిరీలో తెలంగాణకు చెందిన నర్సు తేజావత్ సుశీల రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట సమీపంలో కనీసం రహదారి సదుపాయం కూడా లేని మారుమూల ప్రాంతంలో ఉండే గుత్తికోయలకు అందించిన సేవలకు గుర్తుగా నైటింగేల్ అవార్డును అందించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 1973 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 614 మంది నర్సులు ఉత్తమ నర్సులకు నైటింగేల్ అవార్డులు అందుకున్నారని కేంద్రం తెలిపింది. ‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని వీ వెంకటాయపాలెం అనే గ్రామం మా సొంతూరు. 1996లో ఏఎన్ఎంగా తొలి పోస్టింగ్ మణుగూరులో వచ్చింది. ఆ తర్వాత సుజాతనగర్లో కొన్నాళ్లు పని చేశాను. 2010 నుంచి ఏజెన్సీ ప్రాంతమైన ఎర్రగుంట పీహెచ్సీలో పని చేస్తున్నాను. 27 ఏళ్ల కెరీర్లో పనిలోనే సంతృప్తి వెతుక్కుంటూ వస్తున్నాను. మా ఇల్లు, నాకు కేటాయించిన గ్రామాలు తప్ప పెద్దగా బయటకి పోయిందీ లేదు. హైదరాబాద్‌కు కూడా వెళ్లడం తక్కువే. చదువుకునేప్పటి నుంచి ఈ రోజు వరకు... ఏనాటికైనా ఢిల్లీని చూస్తానా అనుకునేదాన్ని. కానీ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వరకు నా ప్రయాణం ఉంటుందని అనుకోలేదు. దేశ ప్రథమ మహిళ చేతుల మీదుగా అవార్డు అందుకున్న క్షణాలు మరువలేనివి. రెండు ప్రయాణాలు 2010 సమయంలో ఛత్తీస్గడ్ నుంచి గుత్తి కోయలు తెలంగాణకు రావడం ఎక్కువైంది. నా పీహెచ్సీ పరిధిలో మద్దుకూరు సమీపంలో గుత్తికోయలు వచ్చి మంగళబోడు పేరుతో ఓ గూడెం ఏర్పాటు చేసుకున్నట్టు అక్కడి సర్పంచ్ చెప్పాడు. ఆ గ్రామానికి తొలిసారి వెళ్లినప్పుడు ఎవ్వరూ పలకరించలేదు. నేనే చొరవ తీసుకుని అన్ని ఇళ్లలోకి తలుపులు తీసుకుని వెళ్లాను. ఓ ఇంట్లో ఓ మహిళ అచేతనంగా పడుకుని ఉంది. పదిహేను రోజుల కిందటే ప్రసవం జరిగిందని చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మనిషి నీరసించిపోయి ఉంది. ఒళ్లంతా ఉబ్బిపోయి ఉంది. వెంటనే ఆ గ్రామ సర్పంచ్‌ను బతిమాలి ఓ సైకిల్ ఏర్పాటు చేసి అడవి నుంచి మద్దుకూరు వరకు తీసుకొచ్చాను. అక్కడి నుంచి ఆటోలో కొత్తగూడెం ఆస్పత్రికి వచ్చాం. పరిస్థితి విషమించడంతో వరంగల్ తీసుకెళ్లాలని సూచించారు. 108లో ఆమెను వెంటబెట్టుకుని వరంగల్‌కు తీసుకెళ్లాను. 21 రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఆ తల్లిబిడ్డలు ఇద్దరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత అక్కడున్న వలస గుత్తి కోయలకు నాపై నమ్మకం కలిగింది. ఏదైనా సమస్య ఉంటే సంకోచం లేకుండా చెప్పుకోవడం మొదలు పెట్టారు. రక్తం కోసం బతిమాలాను ఓసారి గుత్తికోయగూడెం వెళ్లినప్పుడు పిల్లలందరూ నా దగ్గరకు వచ్చారు కానీ జెమిలీ అనే ఏడేళ్ల బాలిక రాలేదు. ఏమైందా అని ఆరా తీస్తూ ఆ పాప ఇంట్లోకి వెళ్లాను. నేలపై స్పృహ లేని స్థితిలో ఆ పాప పడుకుని ఉంది. బ్లడ్ శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తే మలేరియా పాజిటివ్‌గా తేలింది. వెంటనే పీహెచ్‌సీకి అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకువస్తే పాప పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెప్పారు. ఖమ్మం తీసుకెళ్లమన్నారు. ఆక్కడకు వెళ్తే వరంగల్ పొమ్మన్నారు. కానీ డాక్టర్లను బతిమాలి అక్కడే వైద్యం చేయమన్నాను. ఆ పాపది ఓ-నెగెటివ్ గ్రూప్ రక్తం కావడంతో చాలా మందికి ఫోన్లు చేసి బతిమాలి రెండు యూనిట్ల రక్తం సంపాదించగలిగాను. చివరకు ఆ పాప ప్రాణాలు దక్కాయి. మరోసారి ఓ గ్రామంలో ఓ బాలింత చంటిపిల్లకు ఒకవైపు రొమ్ము పాలే పట్టిస్తూ రెండో రొమ్ముకు పాలిచ్చేందుకు తంటాలు పడుతున్నట్టు గమనించాను. వెంటనే ఇన్ఫెక్షన్ గుర్తించి ఆస్పత్రికి తరలించాను. అర్థం చేసుకోవాలి మైదానం ప్రాంత ప్రజలకు ఒకటికి రెండు సార్లు చెబితే అర్థం చేసుకుంటారు. వారికి రవాణా సదుపాయం కూడా బాగుంటుంది. కానీ వలస ఆదివాసీల గుత్తికోయల గూడేల్లో పరిస్థితి అలా ఉండదు. ముందుగా వారిలో కలిసిపోవాలి. ఆ తర్వాత అక్కడి మహిళలను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే భర్త/తండ్రి తోడు రావాలి. వాళ్లు పనులకు వెళితే సాయంత్రం కానీ రారు. వచ్చే వరకు ఎదురు చూడాలి. వచ్చినా పనులు వదిలి ఆస్పత్రికి వచ్చేందుకు సుముఖంగా ఉండరు. ఆస్పత్రి కోసం పని వదులుకుంటే ఇంట్లో తిండికి కష్టం. అన్నింటికీ ఒప్పుకున్నా.... ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే అడవుల్లో ఉండే గుత్తికోయ గ్రామాలకు రవాణా కష్టం. క్షేత్రస్థాయిలో ఉండే ఈ సమస్యలను అర్థం చేసుకుంటే అత్యుత్తమంగా వైద్య సేవలు అందించే వీలుంటుంది. కోవిడ్ సమయంలో మద్దుకూరు, దామరచర్ల, సీతాయిగూడెం గ్రామాలు నా పరిధిలో ఉండేవి. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఈ మూడు గ్రామాల్లో కలిపి ఓకేసారి 120 మందిని ఐసోలేçషన్లో ఉంచాను. ఇదే సమయంలో మా ఇంట్లో నలుగురికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రాణనష్టం రాకుండా సేవలు అందించాను. నా పరిధిలో ఉన్న గ్రామాల్లో ఏ ఒక్కరూ కోవిడ్‌తో ఇంట్లో చనిపోలేదు. వారి సహకారం వల్లే వృత్తిలో మనం చూపించే నిబద్ధతను బట్టి మనకంటూ ఓ గుర్తింపు వస్తుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకప్పుడు అర్థరాత్రి ఫోన్ చేసినా డాక్టర్లు లిఫ్ట్ చేసి అప్పటికప్పుడు సలహాలు ఇస్తారు. అవసరాన్ని బట్టి హాస్పిటల్‌కు వచ్చి కేస్ అటెండ్ చేస్తారు. అదే విధంగా నాతో పాటు పని చేసే ఇతర సిబ్బంది పూర్తి సహకారం అందిస్తారు. ఇక ఆశా వర్కర్లు అయితే నా వెన్నంటే ఉంటారు. ఏదైనా పని చెబితే కొంత ఆలçస్యమైనా ఆ పని పూర్తి చేస్తారు. వీరందరి సహకారం వల్లే నేను ఉత్తమ స్థాయిలో సేవలు అందించగలిగాను. ఈ రోజు నాకు దక్కిన గుర్తింపుకు డాక్టర్ల నుంచి ఆశావర్కర్ల వరకు అందరి సహకారం ఉంది’’ అని వివరించారు సుశీల. – తాండ్ర కృష్ణగోవింద్ సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం -
భద్రాద్రిలో ఘోర ప్రమాదం.. కిన్నెరసాని వాగులో దూసుకెళ్లి..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బుర్గంపాడు మండల పరిధిలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులోని వేలేరు బ్రిడ్జి పై నుంచి కిన్నెరసాని వాగులో పడింది ఓ ట్రాలీ వాహనం. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. వాహనం అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 20 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా ఏలూరు జిల్లా(ఏపీ) నర్సాపురం మండలం తిరుమల దేవి పేట కు చెందిన వాళ్లు. భద్రాచలం రామాలయం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్లకు బూర్గంపాడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందుతోంది. ఇదీ చదవండి: మళ్లీ వస్తా అని చెప్పి కానరాని లోకాలకు -
షాకింగ్.. గుండెపోటుతో పదమూడేళ్ల బాలిక మృతి
భద్రాద్రి కొత్తగూడెం: వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటు రావడం సాధారణమైపోయింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదమూడేళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. జిల్లాకు చెందిన కరకగూడెం మండలం అనంతారానికి చెందిన నారందాస్ వెంకటేశ్వర్లు, లావణ్య దంపతుల పెద్ద కుమార్తె నిహారిక(13) శుక్రవారం రాత్రి కడుపునొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పింది. అదే సమయంలో వాంతులు కూడా కావడంతో వెంటనే మణుగూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం భద్రాచలం తీసుకెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పటికే ఆస్పత్రికి చేరుకోగా నిహారికను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, ఈనెల 17న బుధవారం కుటుంబీకులు, స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోగా.. రెండో రోజునే మృతి చెందడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఇదిలా ఉండగా ఆమె చెల్లి కూడా ఐదేళ్ల క్రితం ఇదే తరహాలో మృతి చెందింది. చదవండి: ఆటో, బొలెరో ఢీ.. ముగ్గురి దుర్మరణం -
ఆటల పోటీలతో ఉద్యమం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: డిమాండ్ల సాధనకు రాజకీయ పార్టీలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త మండలాల కోసం ఉద్యమిస్తున్న ఆయా పార్టీలు, సంఘాలు ధర్నాలు, ర్యాలీలతో లాభం లేదని గ్రహించి వినూత్న పద్ధతిలో ప్రయత్నిస్తున్నాయి. ఇల్లెందు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌తో పాటు కొమరారం, బోడు కేంద్రంగా నూతన మండలాల ఏర్పాటుకోసం వామపక్షాలు, ఇతర పార్టీలు ఏళ్ల ఉద్యమిస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా సాధారణ పద్ధతుల్లోనే సంతకాల సేకరణ, ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు చేపట్టాయి. అయితే ఇందులో రాజకీయ పార్టీల నాయకులు భాగస్వాములు అవుతున్నారు తప్పితే ప్రజల భాగస్వామ్యం ఆశించిన స్థాయిలో లేదని నేతలు గ్రహించారు. దీంతో పార్టీలు.. ప్రజలను కూడా భాగం చేసేందుకు సరికొత్త ఎత్తుగడ కింద ఆటల పోటీలను ఆయుధంగా ఎంచుకున్నాయి. ఈ క్రమంలో పురుషులకు వాలీబాల్ పోటీలు, ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాల స్థాయిలో మహిళలకు కబడ్డీ పోటీలు నిర్వహించాయి. గతంలో కూడా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆటల పోటీలు జరిగినా.. అవి ఏదైనా జాతీయ పండుగలను పురస్కరించుకుని లేదా ఆయా పార్టీలకు చెందిన నేతల స్మారకార్థం జరిగేవి. కానీ తొలిసారిగా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆటల పోటీలు నిర్వహించడం విశేషం. 2016 నుంచి డిమాండ్లు.. 2016 అక్టోబర్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విభజన సందర్భంగా ఇల్లెందు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌తో పాటు కొమరారం మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను రాజకీయ పక్షాలు భుజానికి ఎత్తుకున్నాయి. సుమారు మూడు నెలల పాటు వివిధ రాజకీయ పక్షాలు ఆందోళనలు, నిరసనలు నిర్వహించాయి. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అయితే, ఈ డిమాండ్లపై ప్రభుత్వం సర్వే నిర్వహించింది తప్పితే ఎలాంటి పురోగతి లేదు. ఆ తర్వాత కాలంలో ఏజెన్సీ ప్రాంతమైన టేకులపల్లి మండలాన్ని విభజించి బోడు కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు అంశం కూడా తెరపైకి వచ్చింది. మలి దశలో ఉద్యమం తీరుతెన్నులు ఈ ఏడాది జనవరిలో ఇల్లెందు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం, సంతకాల సేకరణ, ఇతర రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు నెలపాటు ప్రజాపంథా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. మార్చి 4 నుంచి 12 వరకు ఇల్లెందు మండలం మర్రిగూడెం నుంచి ఇల్లెందు వరకు 32 కిలోమీటర్లు సీపీఐ (ఎంఎల్) – న్యూడెమొక్రసీ ఆధ్వర్యాన పాదయాత్ర చేపట్టారు. మార్చి 28, 29వ తేదీల్లో పురుషులకు మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈనెల 1, 2వ తేదీల్లో ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాల స్థాయిలో మహిళలకు కబడ్టీ పోటీలు ఏర్పాటు చేశారు. -
TSRTC: లక్ష దాటిన రాములోరి తలంబ్రాల బుకింగ్‌లు
భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి డిమాండ్ వస్తోంది. ఇప్పటివరకు లక్షకి పైగా మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారు. మొదటి విడతలో 50 వేల మంది భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) తలంబ్రాలను హోండెలివరీ చేస్తోంది. ఆదివారం నుంచే ఈ డెలివరీ ప్రక్రియను ప్రారంభించింది. భక్తుల డిమాండ్ దృష్ట్యా తలంబ్రాల బుకింగ్‌ను ఈ నెల 10 వరకు సంస్థ పొడిగించింది. బుక్ చేసుకున్న భక్తులకు రెండు మూడు రోజుల్లోనే తలంబ్రాలను అందజేయనుంది. భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాల తొలి బుకింగ్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం సజ్జనర్‌కు టీఎస్ఆర్టీసీ బిజినెస్ హెడ్(లాజిస్టిక్స్) పి.సంతోష్ కుమార్ ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి ఊహించని విధంగా స్పందన వస్తోందన్నారు. ఎంతో విశిష్టమైన ఆ తలంబ్రాలను పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారనని పేర్కొన్నారు. ‘గత ఏడాది 88 వేల మంది బుక్ చేసుకుంటే.. ఈ సారి సోమవారం నాటికి రికార్డు స్థాయిలో ఒక లక్షమందికిపైగా భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. మొదటగా 50 వేల మందికి తలంబ్రాలను టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం హోండెలివరీ చేస్తోంది. దేవాదాయ శాఖ సహకారంతో వాటిని భక్తులకు అందజేస్తున్నాం. భక్తుల నుంచి వస్తోన్న వినతుల నేపథ్యంలో తలంబ్రాల బుకింగ్‌ను ఈ నెల 10 వరకు పొడిగించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని సజ్జనార్ సూచించారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించాలన్నారు. తమ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారని తెలిపారు. భక్తులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకుని, ఎంతో విశిష్టమైన తలంబ్రాలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వినోద్ కుమార్, పీవీ మునిశేఖర్, సీటీఎం జీవనప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. చదవండి: పేపర్ లీక్.. టెన్త్ పరీక్షలు వాయిదా?.. పాఠశాల విద్యాశాఖ క్లారిటీ -
రైతు గుండెల్లో తన్నెళ్లిపోయేరా.. ఇల్లెందు రైతన్న పాట నెట్టింట వైరల్
వైరల్: అకాల వర్షాలు, వడగండ్ల వాన.. నష్టాన్ని ఎక్కువగా మిగిల్చేది రైతన్నకే!. తాజా వానలతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఇక తెలంగాణలోని ఓ రైతన్న రోదన ఆకాశన్నంటింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మర్రిగూడెం పంచాయతీలో రామ్మూర్తి అనే రైతు అకాల వర్షంలో దెబ్బతిన్న తన మొక్కజొన్న పంట చూసి ఆవేదనతో... పాట రూపంలో తన బాధను వ్యక్తం చేశారు. అది చూసి.. కష్టకాలంలోనూ మస్త్ పాటను అందించావంటూ అభినందిస్తూనే.. ఆ అన్నకి కలిగిన నష్టంపై అయ్యో పాపం అంటున్నారు నెటిజన్లు. ఓ రైతన్న పరేషాన్.. కష్టాల్లో కూడా మస్త్ పాట#Yellandu, #Bhadradri, #Farmersong #unseasonalrains #TelanganaFarmersong pic.twitter.com/cPyf9XTPrd — lakshminarayana (@plnroyal) March 20, 2023 -
టీఎస్ఆర్టీసీ ఆఫర్.. ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సన్నద్దమవుతోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేయనుంది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో బుధవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. అనంతరం బిజినెస్ హెడ్ (లాజిస్టిక్స్) పి.సంతోష్ కుమార్‌కు రూ.116 చెల్లించి రశీదును ఆయన స్వీకరించారు. తొలి బుకింగ్ చేసుకుని తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు. ‘భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఆ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని గత ఏడాది టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. తమ సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. గత ఏడాది దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను అందజేశాం. తద్వారా రూ.71 లక్షల రాబడి వచ్చింది. గత ఏడాది డిమాండ్ దృష్ట్యా ఈ శ్రీరామ నవమికి భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను కోరుకునే భక్తులకు అందజేయబోతున్నాం. ఈ సారి రాములోరి కల్యాణంతో పాటు 12 ఏళ్లకో సారి నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలి. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించాలన్నారు. తమ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్ కుమార్, మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, సి.టి.ఎం (ఎం అండ్ సి) విజయ్‌కుమార్, సీఎంఈ రఘునాథ రావు, సీఎఫ్ఎం విజయ పుష్ప, నల్లగొండ ఆర్ఎం శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. -
వినయ్‌కి అండగా ఉంటాం: మంత్రి హరీశ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సైన్స్‌ఫేర్ ఈవెంట్లో కెమికల్ మీద పడి గాయపడిన ఆరో తరగతి విద్యార్థి వినయ్‌కి అన్ని విధాలా అండగా ఉంటామని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి టి.హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ‘అయ్యో వినయ్.. ఆదుకునేవారే లేరా?’శీర్షికన శుక్రవారం సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు. వినయ్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెంటనే తన సిబ్బందిని పంపించారు. ఆ తర్వాత బాలుడికి చికిత్స అందిస్తున్న వైద్యులతో మంత్రి స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వినయ్ తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వినయ్ ఆరోగ్యం మెరుగై సాధారణ స్థితికి వచ్చే వరకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చికిత్స ముగిసే వరకు తోడుగా ఉండి, ప్రభుత్వ అంబులెన్స్‌లోనే ఇంటివరకు పంపిస్తామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫిబ్రవరి 28న జరిగిన ప్రమాదంలో వినయ్ గాయపడగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
బీరు బాటిల్ చూస్తే అనుమానించాల్సిన పరిస్థితి.. పక్కా ప్లాన్‌తో బాంబ్!
రోడ్డుపై, అడవుల్లో ఖాళీ బీరు బాటిళ్లను చూస్తే ఇక అనుమానించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే మావోయిస్టులు కొత్త తరహాలో బీర్ బాటిల్ బాంబును అమర్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తమ వద్ద ఉందని చెప్పకనే చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా ఉన్న మావోయిస్టులు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం(కె), భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో తమ కదలికలు ఉన్నాయని చెప్పేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో మావోయిస్టుల దుశ్చర్యలను గట్టిగా తిప్పికొడుతున్నారు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ఏటూరునాగారం: ప్రెషర్ బాంబ్‌లు, కెమెరా ఫ్లాష్ బాంబ్‌లు, బ్యాటరీలు ఇలా అనేక రకాల మందుపాతరలు అమర్చిన మావోయిస్టులు రూటు మార్చారు. కూంబింగ్‌లో పాల్గొనే భద్రతా దళాలు, పోలీసులను ఏమారుస్తూ పేలుడు జరిపి భారీ విధ్వంసం సృష్టించేలా బీరు బాటిల్ బాంబ్ వ్యూహాన్ని అమల్లో పెడుతున్నారు. ప్రెషర్, బకెట్ బాంబులను భద్రతా దళాలు సులువుగా గుర్తిస్తుండటంతో తమ వ్యూహం మారుస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో పేలుడు తీవ్రత పెంచేందుకు మావోయిస్టులు పదునైన ఇనుప ముక్కలను పేలుడు పదార్థాల చుట్టూ ఉంచేవారు. అయితే మెటల్ డిటెక్టర్లు ఉపయోగించినప్పుడు, ఆ బాంబు జాడను భద్రతా దళాలు సులువుగా పసిగడుతున్నట్టు మావోయిస్టులు అనుమానిస్తున్నారు. దీంతో బీరు బాటిల్ బాంబు వ్యూహానికి పదును పెట్టినట్టు తెలుస్తోంది. ఖాళీ బాటిళ్లలో ఐఈడీ మావోయిస్టులు ఖాళీ బీరు బాటిళ్లలో ఐఈడీ తరహా పేలుడు పదార్థాలను కూర్చి విధ్వంసం సృష్టించే వ్యూహంఅమలుకు శ్రీకారం చుట్టారు. తాగి పడేసిన బీరు బాటిల్ అయితే భద్రతా దళాలు అనుమానించకుండా వదిలేస్తాయని, పైగా అందులో అమర్చిన బాంబు పేలినప్పు డు గాజు ముక్కల కారణంగా ప్రమాద తీవ్రత పెరుగుతుందనే అంచనాతో ఈ ప్లాన్ అమలు చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఈ తరహా బాంబులను ఒడిశాలో పేల్చి నట్టు సమాచారం. తాజాగా బీరు బాటిల్లో అమర్చిన బాంబును ములుగు జిల్లాలో పోలీసులు గుర్తించారు. పోలీసులు బయటకు తీసిన బీర్‌బాటిల్ , పేలుడు పదార్థాలు మందుపాతరలు, ప్రెషర్బాంబుల ఘటనలు ►ఈనెల 4న చర్ల మండలం కుర్నపల్లి మార్గంలో ఎర్రబోరు–బోదనెల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై అమర్చిన శక్తిమంతమైన 20 కిలోల మందుపాతరను చర్ల పోలీసులు నిర్వీర్యం చేశారు. ►గత నెల 28న చర్ల మండలంలోని కొండెవాయి సమీపంలోని ప్రధాన రహదారిపై శక్తిమంతమైన మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. ►గత నెల 26న కొండెవాయి అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలను మట్టుబెట్టేందుకు అమర్చిన ప్రెషర్ బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. ►గత నెల14న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పెగడపల్లి వద్ద అమర్చిన మందుపాతరను పేల్చడంతో ఏఎస్ఐ మహ్మద్ అస్లాం తీవ్రంగా గాయపడ్డాడు. ►2022 డిసెంబర్లో ఉంజుపల్లి సమీపంలో పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకొని పెట్టిన ప్రెషర్బాంబు పేలి ఆవు మృతిచెందింది. ►2021 జూలైలో చర్ల శివారు లెనిన్‌కాలనీ సమీపంలో చర్ల యువకుడు ప్రమాదవశాత్తు ప్రెషర్ బాంబును తొక్కడంతో అది పేలింది. కొత్త కోణంలో బాంబు... గతంలో ఏటూరునాగారం ఏజెన్సీ అప్పటి పీపుల్స్‌వార్ నక్సల్స్‌కు ప్రయోగశాలగా ఉండేది. ఇప్పుడు మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్, వాజేడు, వెంకటాపురం(కె) ప్రాంతాలను అనువైనవి గుర్తించి తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త తరహా దాడులకు వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం పామునూరు అటవీ ప్రాంతంలో మందుపాతర అమర్చినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వాటిని వెతుక్కుంటూ వెళ్లిన భద్రత బలగాలకు విద్యుత్ వైర్లు కనిపించాయి. వాటిని చూసుకుంటూ ముందుకెళ్లగా ఖాళీ బీరు బాటిల్ కనిపించింది. ఆ వైర్లు ఆ సీసాలోకి పోయినట్లు గుర్తించిన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌ను పిలిపించి నిర్వీర్యం చేశారు. ఐఈడీ నింపిన సీసాలో భద్రత బలగాలకు గుచ్చుకునేలా ఇనుప బోల్ట్‌లు, రాగి రేకు ముక్కలు, ప్లాస్టిక్ లెడ్, కార్బన్ ముక్కలు, గన్ పౌడర్ ఇతర పేలుడు పదార్థాలను అందులో కూర్చి పెట్టారు. అది పేలితే పెద్ద ప్రమాదం ఉండేదని పోలీసులు చెబుతున్నారు. -
Revanth Reddy: ఏ సెంటర్‌కైనా రెడీ! కాళ్లూ చేతులు ఎలా విరుస్తావో చూస్తా..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ‘ప్రగతి భవన్ పేల్చేయాలి అన్నోళ్ల కాళ్లూ చేతులు విరిచేస్తానంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. నా కాళ్లూ చేతులు ఎలా విరుస్తారో చూస్తా? ఏ సెంటర్‌కు రమ్మంటావో చెప్పు.. అమరవీరుల స్తూపం, మేడారం, అసెంబ్లీ, యాదాద్రి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నువ్వు ఏం చేస్తావో చూస్తా’అంటూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. తాను మాట పడే మనిషిని కాదన్నారు. హాథ్‌సే హాథ్ జోడో యాత్రలో భాగంగా సోమవారం సాయంత్రం మణుగూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ను విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మాట మర్చారని విమర్శించారు. నోట్ల రద్దు సహా అనేక అంశాల్లో మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి ఇప్పుడు మోదీ కంటే నాటి మన్మోహన్సింగ్ పాలనే బాగుందని చెబుతున్నారని, ఇలా ఎటు పడితే అటు మాట్లాడే మనిషి కేసీఆర్ అని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రకటన వెనక్కి పోయినప్పుడు జానారెడ్డి ఆధ్వర్యంలో కోదండరాం నేతృత్వంలో రాజకీయ జేఏసీ ఏర్పాటైందని రేవంత్ గుర్తుచేశారు. అçప్పుడు దండాలు పెట్టి, జెండాలు మోసి ప్రజలంతా ఉద్యమం చేస్తే ఇçప్పుడు ఆ ప్రజలనే కేసీఆర్ ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను చైతన్య పరిచేందుకు గళం విప్పి గజ్జె కట్టాలంటూ కళాకారులను కోరారు. చారిత్రక అవసరం... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని రేవంత్‌రెడ్డి అన్నారు. నాయకులు మోసం చేసినా కార్యకర్తలు పారీ్టకి అండగా నిలవాలని కోరారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పిన మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరను డబుల్, ట్రిపుల్ చేసిందని విమర్శించారు. అక్కడ మోదీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ అని, బీఆర్ ఎస్ దొరల పార్టీ అని ఆరోపించారు. కాంగ్రెస్ ఒక్కటే ప్రజల పార్టీ అని రేవంత్ అన్నా రు. దళితుడైన మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా చేశామని, తెలంగాణలో దళితుడిని సీఎంగా చేయకపోయినా కనీసం పార్టీ అధ్యక్షుడిగా అయినా చేసే దమ్ముందా? అని బీఆర్ఎస్ను ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే రుణమాఫీ: తొమ్మిదేళ్లలో పరిష్కారం కాని పోడు భూముల సమస్య ఈ 9 నెలల్లో పరిష్కారం అవుతుందనే నమ్మకం లేదని రేవంత్ పేర్కొన్నారు. అవసరమైతే కాలనాగునైనా, అనకొండనైనా, కొండ చిలువనైనా కౌగిలించుకుంటాం కానీ దోఖే బాజీ కల్వకుంట్ల కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మబోమని రేవంత్ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని... అప్పుడు రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామన్నారు. పేదలకు ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. బీటీపీఎస్, సింగరేణి, ఆర్టీసీ కారి్మకులు, విద్యుత్ ఉద్యోగుల కష్టాలను తీరుస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రేవంత్ పాదయాత్రకు సీపీఐ నేతల సంఘీభావం... భద్రాద్రి జిల్లా అశ్వాపురంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా సీపీఐ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకొని సంఘీభావం తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ నడుమ పొత్తు కుదురుతుందన్న ప్రచారం నేపథ్యంలో సీపీఐ కార్యకర్తలు రేవంత్ పాదయాత్రలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. -
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి?
భద్రాచలం అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రిలో సిజేరియన్ చేయించుకున్న ఓ మహిళ తీవ్ర రక్తస్రావంతో మృతి చెందడం వివాదాస్పదమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణానికి చెందిన రేష్మ(21)ను ఆదివారం మొదటి కాన్పు కోసం కుటుంబ సభ్యులు మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సాధారణ ప్రసవం చేసేందుకు వీలుకాక పోవడంతో అక్కడి వైద్యులు సిజేరియన్ చేసి డెలివరీ నిర్వహించారు. రేష్మ సుమారు రెండు కేజీలు బరువు ఉన్న మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ సమయంలో, ఆ తర్వాత అధికంగా రక్తస్రావం కావడంతో రేష్మను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో కుటుంబీకులు వెంటనే అక్కడికి తరలించినప్పటికీ రక్తస్రావం అదుపులోకి రాకపోవడంతో ఆమె మృతి చెందింది. భద్రాచలం ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే రేష్మ మృతి చెందిందన్న వాదనలు తొలుత వెల్లువెత్తాయి. అయితే భద్రాచలం డాక్టర్లు మాత్రం ఆస్పత్రికి వచ్చేలోగానే రేష్మ మృతి చెందిందని, తమ నిర్లక్ష్యం లేదని చెబుతున్నారు. మణుగూరులో రేష్మకు ఆపరేషన్ చేస్తున్న సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? రక్తస్రావం కావడంతో పాటు రక్తం తక్కువగా ఉన్న విషయం ముందే తెలిసినప్పటికీ ఆపరేషన్ చేసేశారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సిఉంది. జిల్లావైద్యాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబసభ్యులు కోరుతున్నారు. భద్రాచలం వచ్చేలోపే మృతి చెందింది మణుగూరు ఆస్పత్రి నుంచి భద్రాచలంఆస్పత్రికి వచ్చేలోపే బాలింత ఆరోగ్య పరిస్థితి విషమించింది. స్పృహ కోల్పోయి, అప్పటికే మృతి చెందింది. మా దగ్గర వైద్యులు సకాలంలోనే స్పందించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు పంచనామా నిర్వహించాం. –డాక్టర్ రామకృష్ణ, భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ మా నిర్లక్ష్యం లేదు.. రేష్మకు సిజేరియన్ చేసి కాన్పు జరిపారు. చికిత్స అందించడంతో మా దగ్గర వైద్యుల నిర్లక్ష్యమేమీ లేదు. ఆపరేషన్ తర్వాత బ్లీడింగ్ ఎక్కువ కావడంతో భద్రాచలం ఆస్పత్రికి రిఫర్ చేశాం. –డాక్టర్ విజయ్ కుమార్, మణుగూరు ఆస్పత్రి సూపరింటెండెంట్ -
కేటీపీఎస్ కోల్ ప్లాంట్‌లో ప్రమాదం
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ కోల్ ప్లాంట్‌లో బ్రేకర్లు అమరుస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగి ముగ్గురికి గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కేటీపీఎస్‌లోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడో దశ కోల్ ప్లాంట్‌లో ఎంటీసీ కంట్రోల్ బోర్డ్ వద్ద ఏఈ విజయ్ ఆధ్వర్యాన ఆర్టిజన్లు మల్లికార్జున్, వరదరాజు బ్రేకర్లు అమరుస్తున్నారు. అయితే బ్రేకర్ల కండక్టర్ సరిగా అతుక్కోకుండానే విద్యుత్ ఆన్ చేయడంతో మంటలు చెలరేగాయి. మంటలు బయటకు ఎగిసిపడటం(బాయిలర్ ఫ్లాష్ ఓవర్)తో ఏఈతోపాటు మరో ఇద్దరు కార్మికులకు ముఖం, ఛాతీ, చేతులు కాలి పోయాయి. అప్రమత్తమైన తోటి సిబ్బంది వెంటనే కేటీపీఎస్ ఆస్పత్రికి తీసు కెళ్లగా...ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఈ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...బ్రేకర్ అమరుస్తుండగా కనెక్టర్ల నుంచి మంటలు రావడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపడతామన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎంపీ నామా నాగేశ్వరరావు జెన్కో డైరెక్టర్లతో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలని ఆదేశించారు. -
పోడు పట్టాలు ఇవ్వకుంటే చెట్టుకు కట్టేయండి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఓట్లు అడగడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తే చెట్లకు కట్టేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నారనే భయం సీఎం కేసీఆర్‌కు పట్టుకుందని.. అందుకే ఇప్పుడు 11.5 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు జారీ చేస్తామని మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. ‘హాథ్‌సే హాథ్ జోడో’యాత్రలో భాగంగా శనివారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జగదాంబ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. అధికారం చేపట్టిన తొమ్మిదేళ్లలో పోడు రైతులు, ఆదివాసీలపై దాడులు చేయడం తప్ప పట్టాలు ఇచ్చే విషయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. పోడు భూముల అంశంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడితే.. ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కేసీఆర్ ఆమెపైకి దూసుకొస్తూ రంకెలు వేశారని వ్యాఖ్యానించారు. పోడు సాగుచేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామే తప్ప.. ఫాంహౌజ్ భూములు, బ్యాంకులోని డబ్బులు రాసి ఇవ్వాలని ఏమీ అడగటం లేదని పేర్కొన్నారు. ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలి మాయమాటలు చెప్పడంలో, ప్రజలను మోసం చేయడంలో సీఎం కేసీఆర్‌ను మించిన వారు ఎవరూ లేరని రేవంత్‌రెడ్డి విమర్శించారు. వాల్మీకి బోయ వర్గానికి చెందిన గట్టు భీముడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆశ చూపి, చివరికి ఎగ్గొట్టారని ఆరోపించారు. వాల్మీకి బోయతోపాటు మరికొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. రిజర్వేషన్ల పెంపు, కొత్త కులాల చేర్పు వంటి అంశాలను కేంద్రం మీద నెట్టేస్తూ తప్పు కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సింగరేణిలో అవినీతిపై విచారణ చేస్తాం కాంగ్రెస్ సభలకు వెళ్తున్న వారికి పోడు పట్టాలు ఇవ్వబోమంటూ ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తోందని రేవంత్ ఆరోపించారు. జవహర్‌ఖని గనిని సందర్శించిన రేవంత్‌రెడ్డి కార్మికులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేయిస్తామని.. సింగరేణి సీఎండీ శ్రీధర్, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవితపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అర్హులందరికీ పోడు పట్టాలిస్తాం 2024 జనవరిలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. ఆ వెంటనే అర్హులైన అందరికీ పోడు పట్టాలు జారీ చేస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆహార, వాణిజ్య పంటన్నింటికీ గిట్టుబాటు ధర కల్పిస్తామని, రూ.5 లక్షల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తామని ప్రకటించారు. రూ.ఐదువేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రూ.800 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీలు ఇచ్చారు. -
పనులు వేగిరం.. పరిహారం దూరం!
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు మద్దూరి శ్రీనివాసరావు. చర్ల మండలం కుదునూరు గ్రామపంచాయతీ పరిధిలో 36 గుంటల భూమే ఈయనకు జీవనాధారం. ఈ స్థలం సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతోంది. దీంతో పరిహారంగా రూ.7.20 లక్షలు అందిస్తామని ప్రకటించారు. కానీ నేటికీ ఒక్క పైసా అందలేదు. సదరు భూమి శ్రీనివాసరావు తల్లి పేరు మీద ఉండటం, ఆమె గతేడాది చనిపోవడంతో.. పట్టాపై ఉన్న భూయజమాని లేరనే కారణంతో పరిహారం నిలిపేశారు. ఈయన చీకటి కిశోర్. సీతమ్మసాగర్ కింద ఇతని కుటుంబానికి సంబంధించిన భూమి ముంపునకు గురవుతోంది. దీంతో ఏడాది క్రితమే రూ.3.50 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. కానీ ఆ స్థలం పట్టా కిశోర్ తండ్రి శాంతయ్య పేరిట ఉంది. ఆయన ఇటీవల మరణించారు. శాంతయ్య లేడనే కారణంతో ఆ కుటుంబానికి నేటికీ పరిహారం అందించలేదు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వడంతో పాటు 320 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సీతమ్మ సాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఇందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం, అశ్వాపురం మండలాల మధ్య గోదావరి నదిపై బ్యారేజీ నిర్మిస్తోంది. దీనివల్ల ఇటు దుమ్ముగూడెం, చర్ల, అటు మణుగూరు, అశ్వాపురం మండలాల్లో సుమారు 3,267 ఎకరాలు మంపునకు గురయ్యే అవకాశం ఉందని గుర్తించారు. నిర్వాసితులకు పరిహారం అందించేందుకు రూ.160 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే కోర్టు వివాదాలు, పట్టా పుస్తకం ఎవరి పేరుతో ఉందో ఆ భూ యజమానులు మరణించడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల సుమారు 100 మంది రైతులకు నేటికీ పరిహారం అందలేదు. సమస్యలు పరిష్కరించి ముంపు బాధితులకు పరిహారం అందజేయాల్సిన రెవెన్యూ అధికారులు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ముప్పు తిప్పలు పెడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు పనులు మొదలు కావడంతో భూమి సాగు చేసేందుకు వీలుకాక, మరోవైపు పరిహారం అందక నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆందోళనలకు దిగుతున్నారు. ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా.. ఇటీవల సీతమ్మసాగర్ బ్యారేజీ, ఫ్లడ్‌బ్యాంక్, వరద కాలువ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. పరిహారం చెల్లించిన భూముల్లో జోరుగా కొనసాగుతున్నాయి. భారీ యంత్రాలు తిరిగేందుకు వీలుగా పొలాల్లో తాత్కాలిక రోడ్లు వేస్తున్నారు. ఎక్కడిక్కడ కందకాలు తీశారు. దీంతో చాలా పొలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పరిహారం అందని రైతుల భూములు కూడా ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌ను రైతులు నష్టపోగా ఇప్పుడు రబీ సీజన్లో అదే పరిస్థితి నెలకొంది. దీంతో ముంపు రైతులు తమకు వెంటనే పరిహారం చెల్లించాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే బుధవారం చర్లలో బ్యారేజీ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఆందోళనకు దిగారు. తమ తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు, అలాగే సంబంధిత వారసత్వ ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా నేటికి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయలేదని ముంపు బాధితులు వాపోతున్నారు. పరిహారం అందకపోయినా ఇన్నాళ్లూ భూములు సాగు చేస్తూ జీవించామని, ఇప్పుడు పనులు మొదలు కావడంతో సాగుకు అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఉన్న ఒక్క జీవనాధారం కోల్పోవడంతో కడుపు నింపుకునేందుకు కూలీ పనులకు వెళుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిక్కుతోచనిస్థితిలో కొందరు రైతులు పట్టణాలకు వలస వెళ్తుంటే, ఆసరా కోల్పోయిన వృద్ధులు ఆదుకునే హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. రెండు వారాల్లో నష్ట పరిహారం పెండింగ్‌లో ఉన్న పరిహారం ఫైళ్లు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ముంపు బాధితులకు రెండు వారాల్లో పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – భరణిబాబు, తహసీల్దార్, చర్ల -
భూమి కోల్పోయాననే ఆవేదనతో..
ఇల్లెందురూరల్: ప్రభుత్వ శాఖల సమన్వయలోపం వల్లే తనకు భూ సమస్య ఏర్పడిందని ఓ మాజీ నక్సలైట్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే అక్కడున్న ప్రజలు అతడిపై నీళ్లు చల్లి అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇల్లెందుకు చెందిన కొడెం సమ్మయ్య పీపుల్స్‌వార్‌లో సుదీర్ఘ కాలం పనిచేసి, 2008లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ సమయంలో పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు పునరావాసం కింద 1.20 ఎకరాల భూమినికి అతడికి కేటాయించారు. ఆ భూమిని వైటీసీ నిర్మాణానికి మళ్లీ అధికారులు స్వా ధీనం చేసుకుని, సుభాష్‌నగర్ గురుకులం వెనుక ఇచ్చారు. అయితే ఆ భూమిని ఓ పార్టీకి చెందిన నేత ఆక్రమించుకోవడంతో న్యాయంకోసం సమ్మయ్య కలెక్టర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరాడు. స్థానిక రెవెన్యూ అధికారుల సూచనతో అతడికి కేటాయించిన భూమిలో గుడిసె వేసుకుంటే, సదరు నేత ఫిర్యాదుతో పోలీసులు సమ్మయ్యను అడ్డుకుంటున్నారు. అధికారికపత్రం లేకుండా సమ్మయ్యను భూమి జోలికి వెళ్లొద్దని పోలీసులు చెబుతుండగా..మరోవైపు భూమిహక్కుకు సంబంధించి రెవెన్యూ అధికారులు స్పష్టమైన పత్రాలు ఇవ్వకపోవడంతో వారిపై న్యాయపోరాటం చేసేందుకు అతడికి అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా అక్కడే ఉన్న కార్యాలయ సిబ్బంది, ప్రజలు అతడిపై నీళ్లు చల్లి అడ్డుకున్నారు. కాగా, ఈ ఘటనపై తహసీల్దార్ కృష్ణవేణి స్పందిస్తూ రెండు రోజుల్లో సమ్మయ్యకు భూమి అప్పగింతపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
తెలంగాణకు రూ.3 లక్షల కోట్లు నష్టం.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్..
సాక్షి, కొత్తగూడెం: విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కొత్తగూడెంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. సీఎం మాట్లాడుతూ.. కొత్తగూడెం జిల్లాకు చాలా వచ్చాయని, ఇంకా చాలా వస్తాయని తెలిపారు. ఐక్య పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. 8 ఏళ్ల కిందటి తెలంగాణకు, ఇప్పటి తెలంగాణకు పోలికే లేదన్నారు. ఆనాడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.87 వేలు ఉంటే ఉప్పుడు తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు ఉందని కేసీఆర్ తెలిపారు. ఆనాడు జీఎస్డీపీ రూ. 5లక్షల కోట్లు.. ఇప్పుడు మన జీఎస్డీపీ రూ.11.5 లక్షల కోట్లని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ పథకాన్ని పూర్తి మానవీయ కోణంలో అమలు చేస్తున్నామన్నారు కేంద్ర అసమర్థ, దుర్మార్గ విధానాల వల్ల తెలంగాణ రూ.3లక్షల కోట్లు నష్టపోయిందని ఆరోపించారు. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు చేశారు. హెలికాప్టర్ ద్వారా మహబూబాబాద్ నుంచి కొత్తగూడెంకు వచ్చిన కేసీఆర్ జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకోగా.. పోలీసుల నుంచి గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్లో కలెక్టర్ అనుదీప్‌ను కుర్చీలో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: ఏపీలో ఏ బాధ్యతలు ఇచ్చినా ఓకే: సోమేశ్ కుమార్ -
హంసవాహనంలో రామయ్య జల విహారం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రగిరిపై కొలువైన వైకుంఠ రాముడు గోదావరి నదిలో జలవిహారం చేశారు. హంసవాహనంలో సీతాసమేతుడై జలవిహారం చేస్తున్న రామయ్యను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తర లివచ్చారు. వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం తెప్పోత్సవం నిర్వ హించారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభించి తిరుప్పావై సేవాకాలం, మూలవర్లకు అభిషేకం, వేద పారాయణం, ప్రబంధ పాశుర పఠనం.. తదితర కార్యక్రమాలను ఆలయంలో ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం దర్బారు సేవ అనంతరం ప్రత్యేక పల్లకిలో సీతాసమేత రామచంద్రస్వామిని మేళతాళాల నడుమ గోదావరి తీరానికి తీసుకెళ్లారు. అక్కడ హంసాకృతిలో అలంకరించిన పడవలో సీతారాములను వెంచేపు చేసి, ఆగమ శాస్త్ర పద్ధతి లో షోడశోపచార పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు హంస వాహనంలో స్వామివారి జలవిహారం ప్రారంభమైంది. ఒక్కో పరిక్రమణాని కి ఒక్కో రకమైన హారతి ఇస్తూ కనుల విందుగా వేడుకను నిర్వహించారు. రాత్రి 7:01 గంటలకు ఐదు పరిక్రమణాలతో తెప్పోత్సవాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. కా గా, భూలోక వైకుంఠంగా పేరొందిన భద్రాచలంలో సోమవారం శ్రీసీతారామచంద్రస్వామి భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తారు. ఇందుకోసం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
స్వావలంబనతో సమాజాభివృద్ధికి తోడ్పడండి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: విద్యార్ధులు చదువుపై మనసు లగ్నం చేయాలని, చదువుతో స్వావలంబన సాధించి సమాజ పురోగతికి దోహద పడాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. నేటి విద్యార్థులే భావి భారత పౌరులని, దేశ భవి ష్యత్ విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందని చెప్పా రు. ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు గిరిజన, మారు మూల ప్రాంతాల విద్యార్థుల అవసరాలను తీరు స్తూ మెరుగైన విద్యను అందిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రపతి బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పర్యటించారు. రాజమండ్రి నుంచి హెలికాప్టర్ ద్వారా సారపాకలోని ఐటీసీకి చేరు కున్న ముర్ము.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి భద్రాద్రి రాముడిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థయాత్ర పునరుజ్జీవనం, స్పిరిచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) పథకం ద్వారా రూ.41 కోట్లతో చేపట్టబోతున్న పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఆదివాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ పూజారుల సమ్మేళనంలో పాల్గొన్నారు. అదే వేదిక నుంచి వర్చువల్ పద్ధతిలో ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడులో కొత్తగా నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడారు. ‘ప్రసాద్’తో సౌకర్యాలు మెరుగు ప్రసాద్ పథకం ద్వారా దేవాలయాల్లో సౌకర్యాలు మెరుగవుతుండగా దేశ, విదేశీ యాత్రికులు తీర్థ యాత్రలకు వచ్చే అవకాశాలు పెరుగుతాయని ముర్ము చెప్పారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కేంద్ర పర్యాటక శాఖకు సూచించారు. పారేడు గొట్టు గోత్రం.. ఉదయం 10:53కు రాష్ట్రపతి సారపాక చేరుకు న్నారు. గవర్నర్ తమిళిసై, రాష్ట్ర మంత్రులు సత్య వతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్ ఆమెకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ కాన్వా య్‌లో భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు గోత్రనా మాలు అడగగా ‘నా పేరు ద్రౌపదీ ముర్ము, గోత్ర నామం పారేడు గొట్టు’ అని తెలిపారు. అంతకుముందు రాష్ట్రపతికి సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ, మేళతాళాలు, వేదమంత్రోచ్ఛర ణలతో ఆలయ అర్చకులు, అధికారులు స్వాగ తం పలికారు. రాష్ట్రపతి ముందుగా ఆలయ ప్రదక్షిణ చేశారు. ఆ తర్వాత అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారిని దర్శించుకోగా పండితులు వేదాశీర్వ చనం అందజేశారు. ఐటీసీలో భోజనానంతరం మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో ములుగు జిల్లా రామప్పకు వెళ్లారు. తెలుగు పూర్తిగా నేర్చుకుంటా.. సమ్మేళనంలో ప్రసంగించేందుకు పోడియం వద్దకు వచ్చిన రాష్ట్రపతి.. ‘అందరికీ నమస్కా రం’ అంటూ తెలుగులో అభివాదం చేశారు. ప్రముఖ కవి దాశరథి రాసిన ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అనే కవితా పంక్తులను ప్రస్తావించారు. ‘నేను మాట్లాడుతున్న తెలుగు మీకు కొంచెం కొంచెమే అర్థం అవుతోందని నాకు తెలుస్తోంది’ అంటూ సభికులను ఉద్దేశించి అన్నారు. త్వరలోనే తెలుగు పూర్తిగా నేర్చు కుంటానని చెప్పారు. తెలంగాణలో మొదటి సారి చేస్తున్న పర్యటనలోనే ఆలయాలను సందర్శించే అవకాశం రావడంతో. అక్కడ దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించే భాగ్యం తనకు దక్కిందని రాష్ట్రపతి చెప్పారు. తెలంగాణ ప్రజలకు అంతా మంచే జరగాలని కోరుకుంటానన్నారు. -
నరసింహావతారంలో భద్రాద్రి రాముడు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు సోమవారం నాలుగో రోజుకు చేరాయి. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యస్వామి నరసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం బేడామండపంలో వేద పండితులు దివ్యప్రబంధనం పఠించాక, స్వామిని నరసింహావతారంలో ప్రత్యేకంగా అలంకరించి పల్లకీ సేవ నిర్వహిస్తూ మిథిలా స్టేడియంలోని వేదికపై కొలువు తీర్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాగా, అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య మంగళవారం వామనావతారంలో దర్శనమివ్వనున్నారు. -
టిఫిన్ డబ్బులు అడిగినందుకు దాడి
కొత్తగూడెం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఓ కానిస్టేబుల్, సీఐ దాష్టీకానికి పాల్పడ్డారు. దివ్యాంగుడనే కనికరం కూడా చూపకుండా ఓ యువకుడితోపాటు మరో వ్యక్తిని చితకబాదారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం సూపర్‌బజార్ సెంటర్లోని ఓ టిఫిన్ సెంటర్లో విజయ్ అనే దివ్యాంగుడు, శంకర్‌నాయక్ పని చేస్తున్నారు. త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే నాగేశ్వరరావు నిత్యం అక్కడ టిఫిన్ చేస్తుంటాడు. శుక్రవారం టిఫిన్ చేశాక కానిస్టేబుల్‌ను విజయ్, శంకర్‌నాయక్ డబ్బులు అడగ్గా చెల్లించకుండానే వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 10:30 గంటలకు సీఐతో కలసి పెట్రోలింగ్‌కు వచ్చిన నాగేశ్వరరావు.. సమయం దాటినా ఇంకా టిఫిన్ సెంటర్ ఎందుకు మూసేయలేదంటూ విజయ్, శంకర్‌నాయక్‌లను చితకబాదారు. నాగేశ్వరరావు అప్పుడప్పుడూ వచ్చి మద్యానికి డబ్బు ఇవ్వాలని కూడా అడుగుతుంటాడని బాధితులు ఆరోపించారు. ఈ దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరారు. ఈ ఘటనపై సీఐ అబ్బయ్యను వివరణ కోరగా టిఫిన్ సెంటర్ బంద్ చేయాలని చెప్పామే తప్ప కొట్టలేదన్నారు. -
Singareni Day 2022: అక్షరదీపాలు.. నల్లసూరీళ్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ పారిశ్రామిక అవసరాలు తీరుస్తోన్న సింగరేణి సంస్థ కాలానుగుణంగా మారుతూ వస్తోంది. మానవ వనరులను క్రమంగా తగ్గించుకుంటూ యాంత్రీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కంపెనీలో విద్యార్హతలు కలిగిన కార్మికుల సంఖ్య పెరుగుతూ, నిరక్షరాస్యుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఆధునిక హంగులతో సంస్థ పురోగమిస్తోంది. శుక్రవారం సింగరేణి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఫిట్నెస్ ఉంటే చాలు ఒకప్పుడు బొగ్గు వెలికి తీసేందుకు కార్మికులు భూగర్భంలోకి వెళ్లేవారు. విపరీతమైన వేడి, చాలినంతగా ఉండని గాలి, అడుగు తీసి అడుగు వేస్తే గుచ్చుకునే బొగ్గు పెళ్లలు, విష వాయువుల మధ్య కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేసేవారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో గనుల్లో పని చేయాల్సి ఉండటంతో విద్యార్హతలకు కాకుండా 35 ఏళ్లలోపు వయసు ఉండి, శారీరక దారుఢ్యమే ప్రధాన అర్హతగా గనుల్లో పనులు లభించేవి. తట్టా, చెమ్మాస్ పట్టుకుని బొగ్గు వెలికితీతలో మునిగిపోయేవారు. ఆ తర్వాత కార్మిక సంఘాల ఏర్పాటుతో శ్రమకు తగ్గ వేతనం, వసతి, బోనస్, అలవెన్సుల వంటివి కార్మికులకు లభించాయి. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన 90వ దశకంలో లక్షా ఇరవై వేల మంది కార్మికులు సింగరేణిలో ఉండేవారు. ఇందులో నూటికి తొంభై శాతం మంది కార్మికులకు కనీస విద్యార్హతలు ఉండేవి కావు. రాయడం, చదవడం కూడా తెలిసేది కాదు. అయినప్పటికీ ఇక్కడ పని చేసే కార్మికులు పెద్ద హోదాగల ఉద్యోగుల తరహాలో వేతనాలు పొందుతుండటాన్ని అంతా ఆశ్చర్యంగా చూసేవారు. కాలానుగుణంగా విద్యార్హతలకు పెద్దపీట మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా బొగ్గు గనుల్లో బాస్కెట్ లోడింగ్ (తట్టల్లో బొగ్గును టబ్బుల్లోకి ఎత్తిపోయడం) విధానాన్ని ఎత్తి వేయాలని 2003లో సింగరేణి సంస్థ నిర్ణయించింది. అప్పటి నుంచి మానవ వనరుల వినియోగం తగ్గిపోయి ఆ స్థానంలో యంత్రాల ఉపయోగం పెరిగిపోయింది. గనుల్లో పని చేయాలంటే యంత్రాలను ఆపరేట్ చేయడం, ఉత్పత్తికి అనుగుణంగా మెషినరీని సిద్ధం చేయడం తప్పనిసరిగా మారాయి. ఫలితంగా సాంకేతికంగా ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, బీటెక్.., పరిపాలన విభాగాల్లో ఎంబీఏ, రెగ్యులర్ డిగ్రీలు తప్పనిసరి అర్హతలుగా మారాయి. ఫలితంగా గడిచిన రెండు దశాబ్దాల కాలంలో సింగరేణి కార్మికుల్లో విద్యావంతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నూటికి తొంభైశాతం.. ప్రస్తుతం సింగరేణిలో సుమారు 43 వేలమంది కార్మికులు/ఉద్యోగులు పని చేస్తుండగా ఇందులో నూటికి తొంభైశాతం మంది విద్యావంతులే కావడం విశేషం. వీరిలో యాభైశాతం మంది డిప్లొమా, ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సులు చేసిన వారే ఉన్నారు. ఇదిలా ఉండగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకప్పుడు బొగ్గు బావుల్లో పనులంటే యువత ఎంతో ఆసక్తి చూపించేంది. కానీ ఇప్పటి కార్మికులు భూగర్భ గనుల్లోకి వెళ్లేందుకు నిరాసక్తత చూపిస్తున్నారు. ఓపెన్‌కాస్ట్, ఇతర ఉపరితల పనుల్లోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. భూగర్భ గనుల్లోకి వెళ్లాల్సి వస్తుందనే కారణంతో కొందరు ప్రమోషన్లు సైతం నిరాకరిస్తున్నారు. సింగరేణి డే స్వాతంత్రానికి పూర్వమే నిజాం జమానాలో బ్రిటీషర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. హైదరాబాద్ (దక్కన్) కంపెనీ లిమిటెడ్ పేరుతో 1889లో బొగ్గు తవ్వకాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 1920 డిసెంబర్ 23న కంపెనీ పేరును సింగరేణి కాలరీస్ లిమిటెడ్‌గా మార్చారు. అప్పటి నుంచి ఇదే పేరు మీద బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. కాగా 2002లో అప్పటి సింగరేణి సీఎండీ ఖాజా డిసెంబర్ 23న సింగరేణి డేగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 23న సింగరేణి డేను నిర్వహిస్తున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో ఏరియాలో ఈ వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది సింగరేణి ప్రధాన కార్యాలయం ఉన్న కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో వేడుకలు జరగనున్నాయి. ––––––––––––––––––––––––––––––––––––––––––– సింగరేణి కార్మికుల్లో అక్షరాస్యత ఇలా (2022 డిసెంబర్ 19 నాటికి) –––––––––––––––––––––––––––––––––– నిరక్షరాస్యులు 2,080 పదో తరగతిలోపు 3,950 ఎస్ఎస్సీ 8,587 ఇంటర్మీడియట్ 2,424 ఐటీఐ/డిప్లొమా 5,020 గ్రాడ్యుయేషన్ 5,208 మాస్టర్స్ డిగ్రీ 2,986 విద్యార్హత సరిగా నమోదు చేయని వారు 12,707 ................................................ మొత్తం 42,962 ............................................................ -
గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలకలం
జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఇలా జరిగిందని విద్యార్థినులు అంటుండగా, ఉపాధ్యాయులు మాత్రం కాదని చెబుతున్నారు. విద్యార్థినులకు ఆదివారం చికెన్, సోమవారం ఉదయం కిచిడీ, మధ్యాహ్నం దోసకాయ, సాయంత్రం వంకాయ కూరలతో భోజనం వడ్డించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 29 మంది విద్యార్థినులకు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు కావడంతో జూలూరుపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. మంగళవారం ఉదయం మరో 55 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఇప్పుడు విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగానే ఉందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ పరిస్థితికి ఫుడ్ పాయిజన్, ఇతర అనారోగ్య సమస్యలు కారణం కావొచ్చని చెప్పారు. అయితే, ఉపాధ్యాయులు మాత్రం శని, ఆదివారాలు సెలవులు రావడంతో కొందరు పిల్లలు ఇంటికి వెళ్లిరాగా, మరికొందరికి తల్లిదండ్రులు ఇళ్ల నుంచి భోజనం తీసుకొచ్చి వడ్డించారని చెబుతున్నారు. కాగా, పాఠశాలలోని వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ 46 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుండటంతో పాఠశాల యాజమాన్యం దినసరి కూలీలతో వంటలు చేయిస్తోంది. సరైన రీతిలో తయారు కాని భోజనం ఆరగించడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఐటీడీఏ డీడీ రమాదేవి మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం 525 మంది విద్యార్థినులు ఉన్నారని, కొందరు జ్వరం, దగ్గు, జలుబు వల్ల బాధపడుతుండటంతో ఈ సమస్య ఎదురై ఉంటుందన్నారు. -
సింగరేణి గనిలో కూలిన బండ
సింగరేణి (కొత్తగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ఏరియా పరిధిలోని పీకేకే 5 షాప్ట్ గనిలో శనివారం బండ కూలింది. మొదటి షిప్ట్‌లో 36 డిప్, 121 లెవల్లో సీఎమ్మార్తో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న సమయంలో మూడు మీటర్ల బండ కంటిన్యూస్ మైనర్(సీఎమ్మార్) యంత్రంపై పడింది. ఈ ఘటనలో యంత్రం కొంతమేర దెబ్బతింది. యంత్రంపై మాత్రమే బండ పడటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. సీఎమ్మార్ మరమ్మతు పనులు పూర్తయ్యేందుకు నాలుగు రోజుల సమయం పట్టనుండటంతో అప్పటివరకు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. కాగా, తరచుగా బండ కూలే ఘటనలు పునరావృతం అవుతుండటంతో కార్మి కుల్లో ఆందోళన నెలకొంది. -
Childrens Day Special: బాలోత్సవ్..
ఊహల్లోకి కూడా ప్లే గ్రౌండ్‌ను రానివ్వకుండా చేసిన వీడియో గేమ్స్.. కల్చరల్ యాక్టివిటీ అర్థాన్నే మార్చేసిన రీల్స్.. విచిత్ర వేషధారణకు ఇంపోర్టెడ్ వెర్షన్‌గా పాపులర్ అయిన హాలోవీన్.. పిల్లల ఉత్సాహానికి.. ఉత్సవానికి కేరాఫ్ అనుకుంటున్నాం! స్థానిక ఆటలు, పాటలు.. సృజనను పెంచే సరదాలను మరుగున పడేసుకున్నాం! అలాంటి వాటిని వెలికి తీసి వేదిక కల్పించే ఉత్సాహం ఒకటి ఉంది.. అదే బాలోత్సవ్! పిల్లల దినోత్సవమే దానికి సందర్భం! ఆ వేడుక గురించే ఈ కథనం.. బోనమెత్తిన పెద్దమ్మ తల్లి ఆడిపాడే జానపదం మొదలు సంప్రదాయ కూచిపూడి వరకు పిల్లల ఆటపాటలు చూపే వేదిక బాలోత్సవ్. రుద్రమదేవి మొదలు అల్లూరి వరకు చారిత్రక ప్రముఖులను నేటి తరానికి మరొక్కసారి గుర్తు చేసే సందర్భాన్ని కల్పిస్తుంది. పిల్లలలో నైపుణ్యం వెలికితీసేందుకు, విద్యార్థి దశ నుంచే సమానత్వ స్ఫూర్తిని చాటేందుకు ఓ మహా యజ్ఞంలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా బాలోత్సవ్ జరుగుతూ వస్తోంది. ముప్పై ఏళ్ల కిందట కొత్తగూడెంలో మొదలైన ఈ పిల్లల పండుగ తెలుగు నేలపై నలుదిశలా విస్తరించింది.. విస్తరిస్తోంది. వేదికలు మారుతున్నా, కొత్త నిర్వాహకులు వస్తున్నా బాలోత్సవ్∙స్ఫూర్తి మారలేదు.. జోష్ తగ్గలేదు. కొత్తగూడెంలో మొదలు బొగ్గుగని, థర్మల్ పవర్ స్టేషన్ ఇతర పరిశ్రమలకు చెందిన అధికారులు, ఉద్యోగులు కలసి 1960లో రిక్రియేషన్ కోసం కొత్తగూడెం క్లబ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా క్లబ్ అంటే ఇండోర్ గేమ్స్, పేకాట అని పేరు పడిపోయింది. 1991లో ఈ క్లబ్ కార్యదర్శిగా డాక్టర్ వాసిరెడ్డి రమేశ్‌బాబు ఎన్నికయ్యారు. క్లబ్ అంటే ఉన్న ఓ రకమైన అభిప్రాయాన్ని చెరిపేసి కొత్తగా ఏదైనా చేయాలనే తలంపుతో 1991లో పట్టణ అంతర్ పాఠశాల సాంస్కృతికోత్సవాలకు శ్రీకారం చుట్టారు. పుస్తకాలతో కుస్తీ పడుతున్న పిల్లల్లో సృజనను వెలికి తీసేందుకు దీన్ని చేపట్టారు. కేవలం ఒక రోజు జరిగిన ఈ కార్యక్రమానికి నాలుగు అంశాల్లో పోటీలు నిర్వహించగా.. కొత్తగూడెం టౌన్ నుంచి దాదాపు రెండు వందల మంది దాకా విద్యార్థులు పాల్గొన్నారు.గమ్మత్తేంటంటే అచ్చంగా పిల్లల కోసమే రూపొందిన ఈ కార్యక్రమంలో చిన్నారుల ఆటపాటలు చూసి పెద్దలు సైతం రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను మరిచిపోవడం! పట్టణం నుంచి జాతీయ స్థాయికి చిన్నారుల ఆటపాటలకు ఎంత శక్తి ఉందో ఆ ఒక్కరోజు కార్యక్రమంతో నిర్వాహకులకు అర్థమైంది. అందుకే మరుసటి ఏడాది మండల స్థాయిలో బాలల ఉత్సవాలను నిర్వహించారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ 1994కల్లా జిల్లా స్థాయికి, నూతన సహస్రాబ్దిని పురస్కరించుకుని 2000 నుంచి రాష్ట్ర స్థాయికి ఈ పోటీలు విస్తరించాయి. ఆ తర్వాత 2014 నుంచి అంతర్రాష్ట్ర స్థాయిలో ఈ వేడుకలు మొదలయ్యాయి. ఆ బృహత్తర కార్యక్రమానికి చేయూతనివ్వడానికి సింగరేణి సంస్థతో పాటు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు ముందుకు వచ్చారు. స్థానికులు కూడా తమ వంతు సహకారం అందించారు.. ఆ ఉత్సవాల్లో పాల్గొనే పిల్లలు, తల్లిదండ్రులు, గురువులకు తమ ఇళ్లల్లో ఆశ్రయం ఇస్తూ! పాతికేళ్ల ప్రస్థానం 1991లో నాలుగు అంశాల్లో 200 మందితో మొదలైన వేడుకలు 2016లో కొత్తగూడెం క్లబ్ వేదికగా చివరిసారి ఉత్సవాలు జరిగే నాటికి పద్నాలుగు వందల పాఠశాలల నుంచి ఇరవై రెండువేల మంది ఈ వేడుకల్లో భాగమయ్యే వరకు చేరుకుంది. స్థానికులే కాదు వివిధ రాష్ట్రాల్లోని పిల్లలు సైతం ఎప్పుడెప్పుడు ఈ పోటీల్లో పాలు పంచుకుందామా అన్నట్టుగా ఎదురు చూసే విధంగా బాలోత్సవ్ పేరు తెచ్చుకుంది. మొబైల్, ఇంటర్నెట్ జమానాలోనూ తన ప్రభను కోల్పోలేదు. 2016 తర్వాత వివిధ కారణాలు, కరోనా సంక్షోభం వల్ల కొత్తగూడెం క్లబ్ ఈ బాలోత్సవ్ వేడుకలకు విరామం ఇచ్చింది. అయినప్పటికీ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే అద్భుతమైన ఈవెంట్‌గా అనేక మందికి ఈ బాలోత్సవ్ స్ఫూర్తిగా నిలిచింది. సమతా భావన బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామానికి చెందిన తాళ్లూరి పంచాక్షరయ్య 1950వ దశకం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నిజాం పాలన, స్వాతంత్య్రానంతర అభివృద్ధిని చూశారు.. చూస్తున్నారు. ఎన్ని మార్పులు జరిగినా మనుషుల మధ్య కుల,మత, పేద,ధనిక వర్గాల మధ్య తారతమ్యాలు ఎంతకీ తగ్గకపోవడం ఆయన్ని కలచి వేసింది. అందుకే విద్యార్థి దశలోనే సమానత్వ భావనను పిల్లల్లో పెంపొందించాలని ఆరాటపడ్డారు. ఇదే సమయంలో రాష్ట్ర స్థాయిలోని విద్యార్థులనే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలను సైతం ఆకర్షిస్తోన్న కొత్తగూడెం బాలోత్సవ్ ఆయన దృష్టిలో పడింది. దీంతో భద్రాద్రి బాలోత్సవ్‌కు 2009లో శ్రీకారం చుట్టారు. పట్టణ స్థాయిలో ఈ వేడుకలు నిర్వహించాలని భావించినా జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాల నుంచి ఎంట్రీలు రావడంతో జిల్లా స్థాయి వేడుకలుగానే మారాయి ఇవి. తొలిసారే ఏకంగా 2500 మంది విద్యార్థులు వ్యాస రచన, వక్తృత్వం, కథా రచన, చిత్రలేఖనం, విచిత్ర వేషధారణ, శాస్త్రీయ, లలిత కళలు వంటి వివిధ అంశాల్లో పోటీ పడ్డారు. మరుసటి ఏడాదికే భద్రాద్రి బాలోత్సవ్ కూడా రాష్ట్ర స్థాయి వేడుకల సరసన చేరిపోయింది. నవంబర్ 14 వచ్చిందంటే చాలు ఇటు కొత్తగూడెం అటు భద్రాచలంలో జరిగే బాలోత్సవ్‌లో పాల్గొనేందుకు విద్యార్థులు ఉవ్విళ్లూరేవారు. అలా 2009 నుంచి 2016 వరకు కొత్తగూడెం, భద్రాచలం పట్టణాల్లో భద్రాద్రి బాలోత్సవ్ వేడుకలు ఘనంగా జరుగుతూ వచ్చాయి. ప్రైవేటుకు దీటుగా.. భద్రాద్రి బాలోత్సవ్‌లో వేడుకలకు విద్యార్థులు స్పందిస్తున్న తీరు అనేక మందిని ఆకట్టుకుంటోంది. ఇంటర్నెట్ యుగంలోనూ జానపద పాటలకు విద్యార్థులు ఆడిపాడటం, శాస్త్రీయ నృత్యరీతులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపించడం ప్రేక్షకులను ముచ్చటగొలిపేది. అంతేకాదు చిత్రలేఖనం, సైన్స్‌ఫేర్, క్విజ్ ఇలా అనేక విభాగాల్లో ఏ మాత్రం పరిచయం లేని పిల్లలు, వారి తల్లిదండ్రులు, గురువులు ఒకే చోట కలసిపోయే తీరు వేడుకలకు కొత్త వన్నెలు అద్దాయి. ఈ ఉత్సాహంతో భద్రాద్రి బాలోత్సవ్ వేడుకల్లో కీలక భూమిక పోషించిన బెక్కంటి శ్రీనివాసరావు మరో అడుగు ముందుకు వేశారు. ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులను బాలోత్సవ్ వేదిక మీదకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం అవార్డ్ విన్నింగ్స్ టీచర్స్ అసోసియేషన్ (ఆటా)ను ఏర్పాటు చేశారు. అలా ఉమ్మడి ఏపీలో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డులు పొందిన టీచర్లు తమ పాఠశాల పరిధిలోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిని భద్రాద్రి బాలోత్సవ్‌కు తీసుకురాసాగారు. ఈ క్రమంలో 2018లో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా బెక్కంటి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్, అవార్డ్ విన్నింగ్స్ టీచర్స్ అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో బాలోత్సవ్‌ను నిర్వహించారు. కరోనా సంక్షోభం వచ్చిన 2020 మినహాయిస్తే ప్రతి ఏడాదీ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. 2021లో ఈ వేడుకలను ఆన్లైన్లో జరిపారు. ఈసారి ఆటా బాలోత్సవాలు భద్రాచలంలో నవంబరు 12,13,14 తేదీల్లో జరుగుతున్నాయి. మొత్తం 24 అంశాల్లో 44 విభాగాల్లో పోటీలుంటాయి. 6 నుంచి 16 ఏళ్ల వయసు పిల్లలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. సబ్ కేటగిరీలో 4 నుంచి 6 ఏళ్లు, జూనియర్ కేటగిరీలో 7 నుంచి 10 ఏళ్లు, సీనియర్స్ కేటగిరీలో 11 నుంచి 16 ఏళ్ల పిల్లలు పోటీ పడతారు. ముగింపు రోజైన నవంబరు 14న విజేతలకు బహుమతులు అందిస్తారు. అన్ని కేటగిరీల్లో ప్రవేశం ఉచితం. దేవస్థానం డార్మెటరీల్లో వసతి కల్పిస్తారు. మధ్యాహ్న భోజనం అందిస్తారు. ప్రత్యేకంగా గదులు కావాలి అనుకునేవారు దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న గదులను తక్కువ ధరకే పొందవచ్చు. రామదాసు కీర్తనలపై ఈసారి బాలోత్సవ్‌లో పిల్లల చేత రామదాసు కీర్తనలను ఆడిపాడించనున్నారు. నవంబరు 12వ తేదిన ప్రారంభ వేడుకలకు ముందు కూచిపూడి, భరతనాట్యం, గిరిజన సంప్రదాయ, జానపద కళలను అభినయించే విద్యార్థులంతా బృందంగా భక్తరామదాసు కీర్తనలను ఆలాపించనున్నారు. నర్తించనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా అంతర్జాతీయ స్థాయి కళాకారులైన డాక్టర్ మోహన్, డాక్టర్ రాధామోహన్‌ల చేత నవంబరు 13,14 తేదీల్లో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. గుంటూరు వేదికగా ప్రపంచ స్థాయిలో పిల్లల వేడుకలకు సంబంధించి కొత్తగూడెం బాలోత్సవ్ ఓ బెంచ్‌మార్క్‌ను సృష్టించింది. ఇలాంటి కార్యక్రమం తమ ప్రాంతంలోనూ చేపట్టాలనే ఆలోచనను కలిగించింది ఎంతో మందికి. వారిలో వాసిరెడ్డి విద్యాసాగర్ ఒకరు. 2017 నుంచి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – (నంబూరు గ్రామం, పెదకాకాని మండలం) గుంటూరు వేదికగా బాలల పండుగకు శ్రీకారం చుట్టారు. ఉభయ రాష్ట్రాల్లోని విద్యార్థులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా బయటి దేశాల్లో ఉన్న తెలుగు చిన్నారులనూ భాగం చేస్తూ ‘ప్రపంచ తెలుగు బాలల పండుగ – వీవీఐటీ బాలోత్సవ్ పేరు’తో ఈ వేడుకలను మొదలుపెట్టారు. కరోనాకు ముందు 2019 జరిగిన ఉత్సవంలో ఏకంగా 9,900ల మంది బాలలు భాగస్వాములు అయ్యారు. ఇందులో సగానికి పైగా పిల్లలు తెలంగాణ వారు కావడం మరో విశేషం. కరోనా కారణంగా 2020, 2021లలో వేడుకలను నిర్వహించలేదు. ఈ ఏడాదికి నవంబర్ 12 నుంచి 14 వరకు వీవీఐటీ – గుంటూరు వేదికగా వేడుకలు జరగనున్నాయి. 29 అంశాల్లో 54 విభాగాల్లో పోటీలుంటాయి. గుంటూరు, విజయవాడ బస్ స్టేషన్ల నుంచి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. అదే విధంగా ఈ ఉత్సవంలో పాల్గొనే విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులకు వసతి, భోజన సదుపాయాలనూ అందిస్తున్నారు. ఎన్నారైల పిల్లల పాటలు, నృత్య రూపకాలను ఈ బాలోత్సవ్‌లో భాగం చేస్తున్నారు. అలా పల్లె స్థాయిలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు.. విదేశాల్లో ఉన్న విద్యార్థులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే ప్రయత్నం బాలోత్సవ్‌లో మాత్రమే జరుగుతోంది. కాకినాడలో క్రియా చిల్డ్రన్ ఫెస్టివల్ కాకినాడకు చెందిన ‘క్రియా సొసైటీ’ ఆధ్వర్యంలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో 2002 నుంచి ప్రతిఏడూ పిల్లల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే 2011లో కాకినాడకు చెందిన ఓ ప్రైవేటు స్కూలు విద్యార్థులకు కొత్తగూడెం బాలోత్సవ్ నుంచి ఆహ్వానం అందింది. విద్యార్థులతో పాటు క్రియా సొసైటీ సభ్యులు సైతం కొత్తగూడెం బాలోత్సవ్‌కు వచ్చారు. ఒకే చోట వందలాది పాఠశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, వారి టీచర్లు, తల్లిదండ్రులు ఒకే వేదిక మీద కలవడం.. పిల్లలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం.. పగలు, రాత్రి తేడా లేకుండా ప్రదర్శనలు జరగడం చూసి సంబరపడ్డారు క్రియా సభ్యులు. దీంతో మరు ఏడాది కూడా బాలోత్సవ్ నిర్వాహణ తీరు తెన్నులను పరిశీలించారు. ఆ తర్వాత ఏడాది నుంచి ‘క్రియా చిల్డ్రన్ ఫెస్టివల్’ పేరుతో జేఎన్టీయూ – కాకినాడ క్యాంపస్‌లో పిల్లల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ వంటి పోటీలు మొదలుపెట్టారు. త్రొలిసారిగా 2013లో మూడు వందల పాఠశాలల నుంచి నాలుగు వేల మంది విద్యార్థులు హాజరవగా గతేడాది ఐదు వందల పాఠశాలల నుంచి పదివేల మంది వరకు వచ్చారు. ఈ ఏడాది నవంబరు 19, 20 తేదీల్లో జేఎన్టీయూ కాకినాడ క్యాంపస్‌లో క్రియా చిల్డ్రన్ ఫెస్టివల్ జరగనుంది. విశాఖలో కొత్తగూడెం బాలోత్సవ్ ప్రేరణతోనే వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారిగా 2013లో విశాఖ బాలోత్సవ్‌ను నిర్వహించారు. ఆ తర్వాత 2019లో అచ్చంగా కొత్తగూడెం తరహాలోనే భారీ ఎత్తున ఇటు స్టీల్ ప్లాంట్, ఆంధ్రా యూనివర్సిటీ.. ఇంగ్లిష్ మీడియం పాఠశాల ఆవరణలో విశాఖ బాలోత్సవ్‌ను నిర్వహించారు. రెండు వేదికలకు సంబంధించి సుమారు ఏడు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ తర్వాత అదే ఏడాది గిరిబాలోత్సవ్ పేరుతో అరకులోనూ వేడుకలు నిర్వహించారు. ఈ ఏడాదికి డిసెంబరులో విశాఖ బాలోత్సవ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు నేలపై 2016లో.. కొత్తగూడెం బాలోత్సవ్ రజతోత్సవాలు జరిగాయి. వీటికి విజయవాడ కేంద్రంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే విజ్ఞాన కేంద్రం సభ్యులు హాజరయ్యారు. అదే ఏడాది విజయవాడలో విద్యావేత్తలు, మేధావులు, లాయర్లు, డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. చివరకు 2017న అమరావతి బాలోత్సవ్ పేరుతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. కరోనా సంక్షోభం సంవత్సరం 2020 మినహాయిస్తే ప్రతి ఏడాదీ అమరావతి బాలోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఉత్సవాలు డిసెంబరు 16,17,18 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇతర జిల్లాల్లోని విజ్ఞాన కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ 2018 నుంచి మచిలీపట్నంలో కృష్ణా బాలోత్సవాలు, ఏలూరులో హేలాపురి బాలోత్సవాలు మొదలయ్యాయి. ఇదే తరహాలో నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతిలలో కూడా బాలోత్సవాలకు బీజం పడింది. మంగళగిరి – తాడేపల్లి కార్పొరేషన్లో డిసెంబరు 6,7 తేదీల్లో బాలోత్సవాలు జరగబోతున్నాయి. -టి. కృష్ణగోవింద్, సాక్షి ప్రతినిధి, కొత్తగూడెం సరిహద్దులు చెరిపేస్తూ కొత్తగూడెం క్లబ్ మొదలుపెట్టిన బాలోత్సవ్ ఆ తర్వాత పట్టణస్థాయి పండగగా మారిపోయింది. ఇలాంటి సంబురం ప్రతిజిల్లాలో జరిగితే బాగుండనిపించేది. ఇప్పుడు ఆ కల నెరవేరింది. సరిహద్దులు చెరిపేస్తూ తెలుగువారున్న ప్రాంతాలాకు చేరిపోతోంది. పదుల సంఖ్యలో బాలోత్సవాలు జరుగుతున్నాయి. – వాసిరెడ్డి రమేశ్‌బాబు, (బాలోత్సవ్ కన్వీనర్) ఒత్తిడి నుంచి లాగి.. ఈ పోటీ ప్రపంచంలో పిల్లలను చదువుల ఒత్తిడి నుంచి కొంతైనా బయటకు లాగి వారిలో దాగిన సృజనను వెలికి తీసేందుకే కొత్తగూడెం బాలోత్సవ్ మొదలైంది. అలాంటి మహాత్తర కార్యక్రమానికి కొత్తగూడెం క్లబ్ విరామం ఇవ్వడంతో గుంటూరులో వీవీఐటీ చేపట్టింది. – వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రతిభను ప్రోత్సహించాలి పాఠాలు చెప్పినందుకు మాకు జీతం ఇస్తున్నారు. సిలబస్‌కు మించి విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినందుకే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చిందనేది నా అభిప్రాయం. నాలాంటి ప్రభుత్వ ఉపాధ్యాయలంతా ఒక వేదిక మీదకు వచ్చి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఆటా బాలోత్సవ్‌ను చేపట్టాం. – బెక్కంటి శ్రీనివాస్ ఆ లోటు తీర్చేందుకే బహుమతులు లేకపోయినా పర్వాలేదు కానీ ఆరోగ్యకరమైన పోటీలు నిర్వహిస్తే పిల్లలు చాలా సంతోషిస్తారు. అందుకే 2002 నుంచి పిల్లలకు వివిధ అంశాల్లో పోటీలు పెడుతూ వారిలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ వస్తున్నాం. కొత్తగూడెం బాలోత్సవ్ లోటును తీర్చేందుకే క్రియా చిల్డ్రన్ ఫెస్టివల్‌ను జరుపుతున్నాం. – జగన్నాథరావు (క్రియా సొసైటీ, కాకినాడ) నేను, మా అన్న 2020లో కాకినాడ క్రియా చిల్డ్రన్ ఫెస్టివల్‌కి వెళ్లాం. చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. అక్కడ ఒక అన్న చేసిన ‘ఓరగేమీ’ క్రాఫ్ట్ హంస చాలా నచ్చింది. కొంతమంది మట్టితో ఎడ్ల బండి, ట్రాక్టర్‌లాంటి బొమ్మలు చేశారు. నాకు బాగా నచ్చాయి. స్కూల్లో లేనివెన్నో అక్కడ కనిపించాయి. అవన్నీ స్కూల్లో ఉంటే బాగుండు అనుకున్నాను. మన టాలెంట్‌ని అక్కడ చూపించుకోవచ్చు అనిపించింది. ఈసారి కూడా వెళ్తున్నాం. రన్నింగ్ రేస్, ఓరగేమీ క్రాఫ్ట్‌లో పార్టిసిపేట్ చేస్తా. – పి. రాజ దుహిత్, (ఆరవ తరగతి), హైదరాబాద్ వసతి కల్పించాను కొత్తగూడెంలో బాలోత్సవ్ జరిగేటప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకు అనేక సార్లు వసతి కల్పించాను. రజతోత్సవం తర్వాత బాలోత్సవ్ వేదిక కొత్తగూడెం నుంచి గుంటూరుకు మారింది. మా పాప సాహిత్య.. 2018లో సబ్ జూనియర్ కేటగిరీలో కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది. – పవన్, (కొత్తగూడెం) అప్పుడు విద్యార్థిగా.. ఇప్పుడు గురువుగా 2018లో భద్రాద్రి బాలోత్సవ్ వేడుకల్లో సీనియర్ కేటరిగిలో కూచిపూడి ప్రదర్శన ఇచ్చాను. మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నా శిష్యులు పది మంది సబ్ జూనియర్, జూనియర్ కేటగిరీలో ప్రదర్శనలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. – సాయిలక్ష్మీ (భద్రాచలం) ఎన్నటికీ మరువలేను నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు 2011లో బాలోత్సవ్ వేడుకల గురించి పేపర్లో చూసి హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్లి కూచిపూడి ప్రదర్శన ఇచ్చాను. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, దుబాయ్, రష్యాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాను. బాలోత్సవ్‌ను ఎన్నటికీ మరువలేను. – పీవీకే కుందనిక (హైదరాబాద్) -
నూతన వ్యవస్థ కోసం పార్టీ స్థాపిస్తాం
సింగరేణి(కొత్తగూడెం): రాష్ట్రంలో రాజకీయాలు వ్యాపారంలా మారాయని సోషల్ డెమోక్రటిక్ ఫోరం నాయకులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి వ్యాఖ్యానించారు. ఉద్యమం పేరుతో ప్రజాభిమానాన్ని చూరగొని.. నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరుతో అందలమెక్కిన టీఆర్ఎస్ హయాంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. ఇలాంటి సమాజంలో మార్పు తీసుకురావడమే కాకుండా నూతన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నిస్వార్థపరులు, వీఆర్ఎస్ తీసుకున్న అధికారులు, మేధావులతో కలిసి త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తామని మురళి వెల్లడించారు. గురువారం కొత్తగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీకి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రతీనెల డీఈఓలు, ఎంఈఓలతో సమీక్షిస్తుండగా తెలంగాణలో కనీసం గంటసేపు కూడా సమీక్షించిన నాథులే లేరని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.7,268 కోట్లతో మన ఊరు – మన బడి పథకాన్ని మొదలుపెట్టినా నేటికీ అతీగతీ లేకుండా పోయిందన్నారు. 2014 నుంచి కేంద్రప్రభుత్వం సుమారు రూ.10 లక్షల కోట్ల మేర బడా కంపెనీలు, వ్యాపారుల రుణాలను మాఫీ చేసిందని.. ఇందులో దేశంలోని 10 లక్షల పాఠశాలలకు రూ.కోటి చొప్పున కేటాయించినా అద్భుతమైన ఫలితాలు వచ్చేవని ఆయన అభిప్రాయపడ్డారు. -
భద్రాచలం కిమ్స్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని కిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో సోమవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. అయితే, సకా లంలో అగ్నిమాపక సిబ్బంది, ఆస్పత్రి నిర్వాహకులు స్పందించటంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లోని స్కానింగ్ గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడగా దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో నిర్వా హకులు అగ్నిమాపక సిబ్బందికి సమా చారం ఇవ్వగా వారు చేరుకుని ఆక్సిజన్ మాస్క్‌లతో లోపలికి వెళ్లి ఐసీయూలో ఉన్న ముగ్గురు, చికిత్స పొందుతున్న మరో పది మందిని బయటకు తీసు కొ చ్చారు. ఐసీయూలోని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. మంటలు రాకపోవడంతో ముప్పు తప్పింది. -
Dussehra: కానరాని పాలపిట్ట.. జాడలేని జమ్మిచెట్టు!
భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణవాసులు దసరా ఉత్సవాలు జరుపుకొనే రైటన్ బస్తీ వేదిక దగ్గర ఉన్న చిన్న జమ్మి మొక్క ఇది. ప్రజలంతా పూజ చేసేందుకు ఇదే దిక్కు. పక్కనే ఉన్న పాల్వంచ కనకదుర్గ ఆలయం వద్ద పూజలందుకునే జమ్మి చెట్టు కూడా రేపోమాపో కనుమరుగయ్యేలా ఉంది. ఈ రెండు చోట్ల అనే కాదు. పల్లెపట్నం తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా జమ్మి చెట్ల సంఖ్య తగ్గిపోతోంది. అంతే ప్రాశస్త్యమున్న పాలపిట్టల దర్శనమూ అరుదైపోయింది. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడి పండుగలకు ప్రాధాన్యం పెరిగింది. బతుకమ్మ సంస్కృతి విదేశాలకు కూడా విస్తరించింది. దసరాను ఘనంగా జరుపుకోవడమూ పెరిగింది. కానీ ఆ రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం, పాలపిట్టను దర్శించుకోవడమనే సంప్రదాయం మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు పంట పొలాల్లో, చెరువు గట్ల వెంబడి, రోడ్ల పక్కన విరివిగా కనిపించిన పాలపిట్టలు ఇప్పుడు కానరాకపోవడం, జమ్మి చెట్ల జాడ లేకుండా పోతుండటమే దీనికి కారణం. రకరకాల కారణాలతో.. కాకులు, పిచ్చుకలు, గద్దల తరహాలో మనుషులు సంచరించే చోటే ఎక్కువగా పాలపిట్టలు మనగలుతాయి. అవి పంటలను ఆశించే క్రిమికీటకాలను తిని బతకడమే దీనికి కారణం. సాగులో పురుగుల మందుల వాడకం పెరగడం, పంటల సాగు తీరు మారిపోవడంతో పాలపిట్టలపై ప్రభావం పడింది. మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల వంటి ఆహార పంటలను ఆశించే పురుగులను పాలపిట్టలు తింటాయి. కానీ వాటి స్థానంలో పత్తి, పొగాకు, ఇతర వాణిజ్య పంటల సాగు పెరిగింది. వీటిలో పురుగు మందుల వాడకం ఎక్కువగా ఉండటం, లద్దె పురుగు, గులాబీ పురుగు వంటివి రాత్రివేళ పంటలపై దాడి చేస్తుండటంతో పాలపిట్టలకు ఆహారం కరువైంది. పురుగుమందుల ప్రభావంతో పాలపిట్టల సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తోంది. ఒక సీజన్లో మూడు, నాలుగు గుడ్లు పెట్టే స్థాయి నుంచి క్రమంగా ఒకట్రెండుకే పరిమితమవుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పంట పొలాల వెంట ఉండే చెట్లు, చెరువు గట్ల వెంట ఉండే నల్లతుమ్మ వంటి చెట్లను నరికివేయడం వల్ల పాలపిట్టలకు ఆవాసం కరువైపోతోంది. ఈ కారణాలతో పాలపిట్టల సంఖ్య తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొమ్మల నరికివేతతో పాల్వంచ పెద్దమ్మ ఆలయం వద్ద జమ్మిచెట్టు పరిస్థితి ఇలా... జమ్మి చెట్టుకు చోటేదీ? దసరా పండుగ రోజు తెలంగాణలో ఊరూరా జమ్మిచెట్టుకు పూజ చేస్తారు. ఇప్పుడు ఊళ్లలో జమ్మిచెట్లు కనుమరుగవడంతో.. అడవుల్లో వెతికి జమ్మిచెట్టు కొమ్మలను తెచ్చి తంతును పూర్తిచేస్తున్నారు. హరితహారం కింద, పల్లె ప్రకృతి వనాల్లో భారీగా మొక్కలు నాటుతున్నా ఎక్కడా జమ్మిచెట్టుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పాలపిట్టలు తగ్గిపోతున్నాయి వ్యవసాయంలో పురుగు మందుల వాడకం, పొలాల్లో చెట్ల నరికివేత వంటివాటితో పాలపిట్టలు కనుమరుగవుతున్నాయి. అందుకే ఊళ్లలో పాలపిట్టలు కనిపించడం లేదు. అడవుల్లో మాత్రమే ఉంటున్నాయి. పాలపిట్టల సంరక్షణ, జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాం. – కట్టా దామోదర్‌రెడ్డి, వైల్డ్ లైఫ్ ఎఫ్డీఓ, పాల్వంచ డివిజన్ -
కొత్త వివాదంలో హెల్త్ డైరెక్టర్.. బతుకమ్మ ముందు డీజే టిల్లు పాటకు స్టెప్పులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు గడల శ్రీనివాపరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ డీఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఓ సినిమా పాటకు డ్యాన్స్ చేశారు. డీజే టిల్లు పాటకు బతుకమ్మ ముందు స్టెప్పులేశారు. దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రంగా భావించే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు స్టెప్పులేయడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ సంసృతి,సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు డ్యాన్సు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక శ్రీనివాసరావు డ్యాన్స్ వ్యవమారం తాజాగా చర్చనీయంశంగా మారింది. కాగా హెల్త్ డైరెక్టర్ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకముందు ఓ తండాలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొనడంతో శ్రీనివాసరావు క్షుద్రపూజలు నిర్వహించినట్లు ప్రచారం జరిగింది. చదవండి: హీరో లెవల్లో యువకుడి బైక్ స్టంట్.. ఝలక్ ఇచ్చిన పోలీసులు -
డీజే టిల్లు సాంగ్‌కు స్టెప్పులేసిన హెల్త్ డైరెక్టర్
-
కలలు కల్లలు.. ఏజెంట్ చేతిలో మోసపోయి కటకటాల్లోకి కొత్తగూడెం మహిళ
భద్రాద్రి కొత్తగూడెం: గల్ఫ్ దేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కొందరు ఏజెంట్లు అమయాక మహిళలను మోసం చేస్తున్నారు. తెలంగాణ కొత్తగూడెం జిల్లాకు చెందిన విజయలక్ష్మీ (40) అనే మహిళ కూడా ఇలాగే అమలాపురానికి చెందిన ఓ ఏజెంట్ చేతిలో మోసపోయింది. ఉద్యోగం వస్తుందని నమ్మి గల్ఫ్ దేశం ఒమన్ వెళ్లిన ఆమెను మస్కట్‌లో ఎయిర్‌పోర్టు అధికారులు ఆపారు. ఆమె వీసా నకిలీదని గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం కేరళలోని కొచ్చికి తరలించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఏర్నాకులం పోలీస్ స్టేషన్‌కు రిమాండ్‌కు తరలించారు. ఏజెంట్ చేతిలో ఆమె మోసపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఒమన్ కేసులను వాదించే కోర్టులు ప్రస్తుతం కేరళో మూతపడ్డాయి. దీంతో విజయలక్ష్మీ జైల్లోనే మగ్గుతోంది. ఎవరైనా సాయం చేస్తారని ఎదురు చూస్తోంది. విజయలక్ష్మి భర్త మరణించారు. కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తల్లి పూలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. తన కొడుకు ఉన్నత చదువుల కోసం డబ్బులు సంపాదించి కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతోనే విజయలక్ష్మీ గల్ప్ దేశం వెళ్లాలనుకుంది. కానీ ఏజెంట్‌ను నమ్మి మోసపోయి ఇప్పుడు జైల్లో దుర్భర జీవితం గడుపుతోంది. చదవండి: కోర్టు ముందు బోరున విలపించిన పార్థ చటర్జీ, అర్పిత ముఖర్జీ -
మావోయిస్టు దామోదర్ భార్య అరెస్ట్.. మిగిలిన నలుగురి జాడేది..?
సాక్షి , భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ భార్య, చర్ల ఏరియా కమిటీ సభ్యురాలు మడకం కోసి అలియాస్ రజిత అరెస్టు సందర్భంగా నెలకొన్న ప్రకంపనలు ఇంకా ఆగిపోలేదు. ఆమెతో పాటు భద్రాద్రి జిల్లాలోకి ప్రవేశించిన మిగిలిన దళ సభ్యులు ఎక్కడున్నారు? వారి నెక్ట్స్ టార్గెట్ ఏంటనే అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 24 గంటలు గడిచినా.. ఇటీవల జిల్లాలో మావోయిస్టుల అలికిడి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సానుభూతిపరులను ఏర్పాటు చేసుకుంటూ తమ భావజాలాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పొలిటికల్ టీమ్‌లకు అండగా యాక్షన్ టీమ్‌లు సైతం జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సంచరిస్తున్నట్టు సమాచారం. మావోల కదలికలు పెరగడంతో ఒక్కసారిగా పోలీసులు అలర్టయ్యారు. కూంబింగ్ తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో చర్ల మండలం కూర్నపల్లి, బోదనెల్లి అడవుల్లో రజిత, ధనిలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ ఘటనలో మిగిలిన దళ సభ్యులు పారిపోయారని పోలీసులు చెబుతుండగా అంతకు ముందే పోలీసుల అదుపులో రజిత, ధనిలతో పాటు మరో నలుగురు దళ సభ్యులు ఉన్నారంటూ మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ నలుగురికి సంబంధించి పోలీసులు నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత కూడా మావోయిస్టుల నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో ఆ నలుగురు ఏమయ్యారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాంటాక్ట్ మిస్ అయ్యారా ? రజితతో పాటు సంచరిస్తున్న దళ సభ్యులు పోలీసుల రాకను గమనించి తప్పించుకున్నారని, అయితే వారు ఇంకా తమ కాంటాక్టులను సంప్రదించలేదనే వాదన వినిపిస్తోంది. ఆపద సమయంలో ఎవరైనా మావోయిస్టులు దళం నుంచి విడిపోతే తిరిగి కాంటాక్టులోకి వచ్చే వరకు వారు ఎక్కడ ఉన్నారనేది తెలియదు. అయితే రజిత, ధనిలు పోలీసులకు పట్టుబడిన ఘటనలో తప్పించుకున్న మావోయిస్టులు సేఫ్ ఏరియాలకు చేరుకునే అవకాశం ఎక్కువని తెలుస్తోంది. కూర్నపల్లి, బోదనెల్లి అటవీ ప్రాంతాలు ఛత్తీస్‌గఢ్‌కు అతి సమీపంలో ఉన్నాయి. పైగా అడవి దట్టంగా ఉండటం వానలు కురవడాన్ని మావోయిస్టులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అవకాశాలు ఎక్కువ. అయితే ఇలా తప్పించుకున్న మావోయిస్టులు ఇంకా తమ నాయకత్వంతోని కాంటాక్టులోకి వెళ్లి ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఒకసారి వారు కాంటాక్టులోకి వచ్చిన తర్వాత నలుగురు దళ సభ్యుల గురించి మావోయిస్టు నాయకత్వం ప్రకటన చేయవచ్చని అంచనా. అవి గాయాలేనా ? రజిత ఒంటిపై కమిలిన గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. బుధవారం మధ్యాహ్నం పట్టుడిన మావోయిస్టులను గురువారం వరకు పోలీసులు విచారణ చేశారు. ఈ సందర్భంగా రజితకు ఏమైనా గాయాలు అయ్యాయా అనే సందేహాలు వ్యక్తవుతున్నాయి. దీనిపై భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజ్‌ను వివరణ కోరగా.. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను రిమాండ్‌కు తరలించే వరకు పక్కాగా నిబంధనలు పాటించామని చెప్పారు. విచారణ సందర్భంగా వారికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. మావోయిస్టులే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రజిత, ధనిలను కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు. దీంతో వీరిని భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు. -
గులాబీ బాస్ మదిలో ఏముంది.. ఆ సీనియర్ నేతను పొమ్మనలేక పొగబెడుతున్నారా?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మినహా మిగిలిన నాలుగు నియోజకవర్గాలూ షెడ్యూల్డు తెగలకు రిజర్వు చేసినవే. ఆదివాసులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు కావడంతో వీటిని వారికే రిజర్వు చేశారు. అటవీ నియోజకవర్గాల్లో ఒకప్పుడు వామపక్షాలు బలంగా ఉండేవి. కాలక్రమంలో కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడి కాంగ్రెస్, టీఆర్ఎస్ హవా ఎక్కువైంది. జిల్లా కేంద్రం భద్రాచలం కూడా ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గంగానే కొనసాగుతోంది. చదవండి: కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ.. ఇక్కడి నుంచే కవిత పోటీ చేసే ఛాన్స్? భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థులే 8 సార్లు విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఉన్నా భద్రాచలం రూరల్ ప్రాంతాలు ఏపీలో కలవడంతో సీపీఎం హవా తగ్గిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పోదెం వీరయ్య మళ్ళీ పోటీ చేసేందుకు రెడీ అంటున్నారు. అంతకుముందు మూడు సార్లు విజయం సాధించిన సీపీఎం నేత సున్నం రాజయ్య గత ఎన్నికల్లో ఓటమి చెందారు. అయితే ములుగు ఎమ్మెల్యే సీతక్క కొడుకు గాని కుమార్తె గాని బరిలో నిలబడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య వచ్చే ఎన్నికల్లో పినపాక వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు టికెట్ ఆశిస్తున్నారు. అటు బీజేపీ సైతం భద్రాచలం ఫై ఫోకస్ పెట్టింది. కుంజా సత్యవతిని బరిలో దించాలని కమలం పార్టీ భావిస్తోంది. రెండు పార్టీలు బలంగానే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో కుల రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. జనరల్ సెగ్మెంట్ కావడంతో అభ్యర్థుల గెలుపు ఓటములపై కులాలు కచ్చితంగా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండూ బలంగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో జలగం వెంకట్రావు కారు గుర్తు మీద పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో వనమా వెంకటేశ్వరరావు హస్తం పార్టీకి హ్యాండిచ్చి కారెక్కేశారు. దీంతో కొత్తగూడెంలో టిఆర్ఎస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. చాలాకాలంగా ప్రత్యర్థులుగా ఉన్న వనమా, జలగం ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యా కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ఇదే సమయంలో జలగం వెంకట్రావు పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్నా.. ఆయన మాత్రం ప్రచారాన్ని ఖండిస్తూ సైలెంట్ గా ఉంటున్నారు. అయితే జలగం వెంకట్రావు అధికార పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఈ ఏడాది జనవరిలో పాల్వంచలో ఒక కుటుంబం ఆత్మహత్య ఘటనతో వనమా వెంకటేశ్వరరావు అప్రదిష్టపాలయ్యారు. ఆయన కుమారుడు రాఘవ వల్ల ఎమ్మెల్యే గిరీ పోతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో వేడి చల్లారింది. ఈ ఘటన తర్వాత వనమాకు ప్రాధాన్యం తగ్గి, తిరిగి జలగం వెంకట్రావుకు టిక్కెట్ ఇస్తారనే ఊహాగానాలు సాగాయి. అయితే పార్టీలో అటువంటి మార్పు జరుగుతుందనే సూచనలేమీ కనిపించడంలేదు. సీనియర్ నేతగా ఉన్న జలగంకు పార్టీ ప్రయార్టీ ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు టిక్కెట్వచ్చే అవకాశం లేకపోతే పాత ఇల్లు కాంగ్రెస్‌లో చేరే ఆలోచనలో జలగం ఉన్నట్లు జిల్లా పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇటు గులాబీ బాస్ కూడా జలగం వెంకట్రావును పొమ్మనలేక పొగబెడుతున్నారని చర్చించుకుంటున్నారు. మూడు గ్రూపులుగా విడిపోయి.. కాంగ్రెస్ విషయానికి వస్తే వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం టిక్కెట్ఆశిస్తున్న ముగ్గురు నాయకులు మూడు గ్రూపులుగా విడిపోయారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ, నాగ సీతారాములు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు సైతం మూడు గ్రూపులుగా చీలిపోయి చేస్తున్నారు. బీజేపీ కొత్తగూడెం ఇన్చార్జ్గా కొనేరు చిన్ని కొనసాగుతున్నారు. ఆయన పార్టీ ఇచ్చే అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోవంలేదు. ఫేస్‌వాల్యూ ఉన్న నాయకులు లేకపోవడమే బీజేపీ ఎదుగుదలకు ఆటంకంగా మారిందని చెప్పవచ్చు. కోల్డ్ వార్.. ఎస్టీ నియోజకవర్గమైన పినపాకలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ పార్టీ ఏదైనా అభ్యర్థుల గెలుపు ఓటములపై గిరిజనుల ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అన్ని పార్టీలు పోడు భూములను ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రచార బరిలో దిగుతుంటాయి. ఎన్నికల లోపు పోడు భూముల సమస్యను టిఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరిస్తే ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. లేదంటే ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్‌నేత రేగా కాంతరావు పోటి చేసి గెలుపోందారు. గెలిచిన తర్వాత రేగా కాంతరావు కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి చేరారు. ప్రస్తుతం అసెంబ్లీలో చీఫ్‌విప్‌గా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా రేగా కాంతారావు వ్యవహరిస్తున్నారు. రేగా టీఆర్ఎస్లో చేరడంతో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కోల్డ్ వార్ నడుస్తోంది. రేగా కాంతరావు టీఆర్ఎస్లో చేరడంతో ఇక్కడ కాంగ్రెస్‌కు నాయకుడు లేకుండా పోయారు. దీంతో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య పినపాకలో సైతం తరచుగా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోదెం వీరయ్యను పినపాక నుంచి బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కారు పార్టీలో అసంతృఫ్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఇల్లెందు నియోజకవర్గం వామపక్షాలకు కంచుకోట. సీపీఐ ఎంఎల్ పార్టీ నుంచి గుమ్మడి నర్సయ్య వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. అయితే గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం గెలిచింది. కాని ఇప్పటికీ ఇల్లెందులో వామపక్ష పార్టీల ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ నియోజకవర్గంలో సైతం పోడు భూముల సమస్య తీవ్రంగానే ఉంది. గిరిజనులు, అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. ఇది అధికార పార్టీకి ఇబ్బందికరమని భావిస్తున్నారు. ఇక్కడ హరిప్రియ, కోరం కనకయ్య ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. 2014లో కనకయ్య కాంగ్రెస్తరపున పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి హరిప్రియపై విజయం సాధించారు. గత ఎన్నికల్లో హరిప్రియ కాంగ్రెస్తరపున పోటీ చేయగా..కనకయ్య టీఆర్ఎస్నుంచి బరిలోకి దిగారు. అయితే కాంగ్రెస్అభ్యర్థి హరిప్రియ విజయం సాధించారు. మొత్తం మీద ఎంఎల్‌పార్టీ కంచుకోటలో కాంగ్రెస్పాగా వేసింది. అయితే హరిప్రియ గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్‌పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకే పార్టీలో ఉన్న ప్రత్యర్థుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ కోరం కనకయ్య కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తారనే టాక్నడుస్తోంది. అశ్వారావుపేటలో రసవత్తర పోరు.. అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య రసవత్తర పోరు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీల మధ్యే పోటీ జరగబోతోంది. గత ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన మెచ్చ నాగేశ్వరరావు తర్వాత అందరితో పాటు కారు పార్టీలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి గులాబీ గూటిలో వర్గ పోరు తీవ్రమైంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయితే తాటి వెంకటేశ్వర్లుకు గులాబీ టిక్కెట్ వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో కారు దిగి హస్తం గూటికి చేరిపోయారు. టీఆర్ఎస్కు రాజీనామా చేస్తూ... తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్ మీద హాట్ కామెంట్స్ చేశారు తాటి వెంకటేశ్వర్లు. అయితే గెలిచినా గెలవకపోయినా గ్రూప్‌లు కట్టడంలో ముందుండే కాంగ్రెస్‌లో ఇప్పుడు మరో గ్రూప్ తయారైంది. ముగ్గురు నాయకులు టిక్కెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యనే ప్రధాన పోటీ జరగబోతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న సిటింగ్ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుకు ఈ మధ్యన ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. దశాబ్దాలుగా ఉన్న పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దీని గురించి పట్టించుకోకపోవడంతో ఆదివాసుల్లో గులాబీ పార్టీకి వ్యతిరేకత పెరుగుతోంది. ఒకవైపు పోడు భూముల వివాదం, మరికొన్ని సంఘటనలు అటు ఎమ్మెల్యేకు..ఇటు అధికార పార్టీకి సమస్యగా పరిణమించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ పేరుకు ఉంది గాని.. ప్రజల్లో ఏమాత్రం పలుకుబడి లేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. చదవండి: పాతబస్తీలో బీజేపీ పాగా వేస్తుందా?.. వ్యూహం ఇదేనా? -
భద్రాద్రిలో దారుణం: ప్రేమ పేరుతో ట్రాప్ చేసి.. గర్భవతి అయ్యాక..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు.. యువతిని ట్రాప్ చేశాడు. అతడి మాటలు నమ్మిన సదరు యువతి.. శారీరకంగా దగ్గర కావడంతో గర్భం దాల్చింది. అతడి వల్ల చివరకు ప్రాణాలు విడిచింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. ములకలపల్లి మండలం వీకే రామవరం గ్రామానికి చెందిన యువతితో పుసుగుడెంకు చెందిన భూక్యా నందుకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో, ఆమెను పెళ్లి చేసుకుంటానని నందు ట్రాప్ చేశాడు. ప్రేమ పేరిట ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు గర్భం దాల్చింది. 5 నెలల గర్భవతి కావడంతో అబార్షన్ కావడానికి మాత్రలు ఇచ్చాడు. కానీ, ఆమెకు అబార్షన్ కాకపోవడంతో ఆసుపత్రికి వెళ్లాడు. ఈ క్రమంలో బాధితురాలు, నందు, మరో మహిళ కలిసి.. భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి తన భార్యకు తీవ్ర రక్తస్రావం అవుతుందని చెప్పి అడ్మిట్ చేశాడు. కాగా, వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో ఆమెకు ఫిట్స్ రావడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో, నందుతోపాటు ఆసుపత్రికి వచ్చిన అమ్మాయి అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో బాధితురాలు మృతిచెందింది. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. దీంతో వారు కన్నీటిపర్యంతమయ్యారు. తన బిడ్డను నందు బలితీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. ఆ తర్వాత పెళ్లి.. ఇంతలోనే.. -
వరదొచ్చి నెల.. బతికేదెలా? రూ.10 వేల తక్షణ సాయానికి సాంకేతిక చిక్కులు
తాండ్ర కృష్ణగోవింద్ ఉవ్వెత్తున ఎగిసిన గోదావరి వరద తీరప్రాంతాలను ముంచెత్తింది. ఉగ్ర గోదావరి ధాటికి వేలాది మంది ఇల్లూవాకిలి వదిలి సహాయక శిబిరాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. నెల రోజులు గడిచినా ఇప్పటికీ బాధితుల్లో సగం మంది సొంతింటికి దూరంగానే ఉన్నారు. ఓ వైపు ఆస్తులు కోల్పోయి, మరోవైపు పనుల్లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ తోడ్పాటు, దాతలు అందించే సాయంతోనే ఇంకా బతుకు బండి నెట్టుకొస్తున్నారు. జూలైలోనే వచ్చింది.. సాధారణంగా గోదావరికి ఆగస్టులో వరదలు వస్తుంటాయి. కానీ ఈసారి జూలై ఆరంభంలోనే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగాయి. గత నెల 11న భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరింది. దీంతో పాత రికార్డులు చెరిపేస్తూ జూలైలోనే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను శిబిరాలకు తరలించడం మొదలెట్టారు. ఆ తర్వాత జూలై 16 వరకు గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతూ 71.35 అడుగులకు చేరింది. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే సుమారు 25 వేల కుటుంబాలను శిబిరాలకు తరలించారు. జూలై 17 నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో క్రమంగా బాధితులు ఇళ్లకు చేరుకున్నారు. కానీ వరద విలయంతో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. పక్కా ఇళ్లు సైతం ముగినిపోవడంతో అందులో ఉన్న మంచాలు, బీరువాలు, ఫ్రిడ్జ్, వాషింగ్ మెíషీన్, టీవీలు, పరుపులు, బట్టలు ఇలా సమస్తం పనికి రాకుండా పోయాయి. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో 17 వేలకు పైగా కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. కట్టుబట్టలతోనే మిగిలాయి. డబ్బులకు కటకట వరదలు ముగిసినా వరుసగా వర్షాలు కురుస్తుండటంతో కూలీలకు పనులు దొరకడం లేదు. పాడైన ఇళ్లను మరమ్మతు చేయించుకునేందుకూ డబ్బుల్లేక చాలామంది అలాగే వదిలేస్తున్నారు. వరద సాయంగా ప్రభుత్వం అందించిన రేషన్ బియ్యం, పప్పు, నూనెలతోపాటు దాతలు ఇస్తున్న సరుకులతోనే కుటుంబాలను నెట్టుకొçÜ్తున్నారు. మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే కొనసాగితే ముంపు ప్రాంత ప్రజలకు ఆకలి బాధలు తప్పేలా లేవు. 1986, 1991లో గోదావరికి భీకరంగా వరదలు వచ్చినా.. ఆ రోజుల్లో అభివృద్ధి, ప్రజల జీవనశైలి సాధారణమే కాబట్టి కట్టుబట్టలతో ప్రాణాలు నిలుపుకున్నా ఆస్తినష్టం పెద్దగా లేదు. కానీ తాజా వరదలు ఇళ్లను, అందులోని సామగ్రిని నాశనం చేయడంతో భారీ ఎత్తున నష్టపోయారు. ఎప్పుడూ మోకాళ్లలోతు మించని వరద ఈసారి ఇంటి పైకప్పులను సైతం ముంచే స్థాయిలో రావడం, స్థానికులకు పీడకలగా మారింది. అందని సాయం వరదల్లో నష్టపోయిన వారికి తక్షణ సాయంగా సీఎం కేసీఆర్ రూ.10 వేల చొప్పున ప్రకటించారు. వరద తగ్గుముఖం పట్టగానే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి 17వేలకుపైగా కుటుంబాలను గుర్తించారు. వీరి ఖాతాల్లో ఇటీవల రూ.10 వేలు జమ అవుతున్నాయి. అయితే బా«ధితుల గుర్తింపు సందర్భంగా చేపట్టిన సర్వేలో జరిగిన తప్పులతో ఇప్పటికీ వేలాది మందికి సాయం అందలేదు. దీంతో బా«దితులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నారు. బ్యాంకుల విలీనం కారణంగా ఐఎఫ్ ఎస్సీ కోడ్ మారడంతో చాలామందికి ఆర్థిక సాయం అందలేదు. సత్వరమే చర్యలు తీసు కుని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈయన కొక్కిరేణి సాంబశివరావు. బూర్గంపాడు నివాసి. కూలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతను నిల్చున్న చోట ఓ ఇల్లు ఉండేది. అందులో భార్య, ఇద్దరు పిల్లలతో జీవించేవాడు. జూలైలో వచ్చిన వరదలకు ఇల్లు నామరూపాల్లేకుండా పోవడంతో కుటుంబానికి గూడు కరువైంది. బంధువుల ఇళ్లలో భార్యాపిల్లలను ఉంచాడు. కూలిపోయిన ఇంటిని ఎలా నిర్మించుకో వాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఈమె పేరు ముదిగొండ చంద్రమ్మ. గోదావరి వరదలు ఊరిని చుట్టేసిన సమయంలో ఆమె ఇల్లు నాలుగు రోజులపాటు వరద నీటిలో నానింది. ఇప్పుడు పనికిరాకుండా పోయింది. ఎప్పుడు కూలుతుందో తెలియని ఇంట్లో ఉండలేక కూతురు వద్ద తలదాచుకుంటోంది. 1986, 1991లో వచ్చిన వాటి కన్నా మొన్న వచ్చిన వరదలే చాలా ప్రమాదకరంగా ఉన్నాయని అంటోంది. డబ్బులు రాలేదు వరదల సమయంలో మా ఇల్లు పూర్తిగా మునిగి పాడైపోయింది. రిపేరు చేయించుకుందామంటే డబ్బుల్లేవు. సర్వేలో అ«ధికారులు మా పేరు రాసుకున్నారు. కానీ ఇంకా డబ్బులు రాలేదు. నాలుగు రోజుల నుంచి తహసీల్దార్ ఆఫీసుకు వస్తున్నా. ఎవరూ సరైన వివరాలు చెప్పడం లేదు. – రమణయ్య, భాస్కర్‌నగర్, బూర్గంపాడు మండలం పని మానుకుని వచ్చా.. వరదలకు ఇల్లు కొట్టుకుపోయింది. వర్షాలతో అసలు పనులే దొరకడం లేదు. రెండు రోజుల నుంచే కూలికి పోతున్నా. సీఎం ఇస్తానన్న రూ.ç³ది వేలు మాకు రాలేదు. ఆ డబ్బు వస్తే కష్టకాలంలో కొంత ఆసరా ఉంటది. దాని కోసమే పని వదిలి తహసీల్దార్ ఆఫీసుకు వచ్చాను. –పేట్ల కుమారి, బూర్గంపాడు -
చిన్నారి ఎలెన్‌కు భరోసా
దుమ్ముగూడెం: బోసినవ్వులతో ఆడుకోవాల్సిన పసిపాప జన్యుపరమైన వ్యాధి బారిన పడి రెండేళ్లుగా కొట్టుమిట్టాడుతోంది. చికిత్సకు అవసరమైన అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన ‘నోవార్టిస్’ ఉచితంగా అందజేయడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామానికి చెందిన రాయపూడి ప్రవీణ్ – స్టెల్లా దంపతులు నిరుపేద కుటుంబానికి చెందినవారు. వీరి పాప ఎలెన్‌కు రెండేళ్లు. మెడ భాగం దృఢంగా లేకపోవడంతో కిందకు వాలిపోతుండటాన్ని పాప నాలుగు నెలల వయసున్నప్పుడే తల్లిదండ్రులు గమనించారు. వయసు పెరుగుతున్నా పాప శరీర భాగాల్లో కదలికలు కనిపించకపోవడంతో వైద్యపరీక్షల నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమస్య ఏమిటో తేలలేదు. ఆ తర్వాత చెన్నైలోని వేలూరు మెడికల్ కాలేజీకి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఎలెన్ జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోందని, సత్వరమే వైద్యం చేయించాలని సూచించారు. పాపను రక్షించుకోవాలంటే రూ.16కోట్ల విలువైన జోల్జెన్స్మా ఇంజెక్షన్ చేయించాలని చెప్పారు. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలైన ప్రవీణ్–స్టెల్లా కుప్పకూలి పోయారు. ఈ విషయమై ‘సాక్షి’తో పాటు ఇతర పత్రికలు, చానళ్లలో కథనాలు రాగా, విషయం స్విట్జర్లాండ్‌లోని నోవార్టిస్ సంస్థ దృష్టికి వెళ్లింది. దీంతో సదరు సంస్థ యాక్సెస్ ప్రోగ్రాంలో భాగంగా జూలై నెలలో ఎలెన్‌కు ఉచితంగా ఇంజె క్షన్ ఇచ్చేందుకు ఎంపిక చేసింది. నిర్ణయించిన ప్రకారం.. ఎలెన్‌కు శనివారం సికింద్రాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రిలో ఇంజెక్షన్ వేశారు. పాప ప్రాణానికి ఇబ్బంది లేదని, ఇకనుంచి కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెప్పినట్లు ప్రవీణ్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా, పాపకు నయం కావాలని ప్రార్థనలు చేసిన వారితోపాటు కథనాలు రాసిన మీడియాకూ ప్రవీణ్ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
వేడిజలం వెలుగులీను!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సరికొత్త వెలుగుల సృష్టికి సన్నద్ధమవుతోంది. తొలిసారిగా జియోథర్మల్ పవర్‌ప్లాంట్ స్థాపనకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రోటోటైప్ ప్రయోగాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వేదికగా చేసుకుంది. ఒకటి, రెండు నెలల్లో ఈ ప్రయోగం కొలిక్కి వస్తుందని సింగరేణి భావిస్తోంది. సంప్రదాయ థర్మల్, హైడల్ సిస్టమ్‌లో ఇప్పటికే విద్యుదుత్పత్తి జరుగుతోంది. థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో బొగ్గును మండించి సృష్టించే నీటిఆవిరి టర్బయిన్లను తిప్పడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. జలవిద్యుత్ కేంద్రాల్లో వేగంగా ప్రవహించే నీరు టర్బయిన్లను తిప్పడం ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతుంది. కానీ, జియో థర్మల్‌పవర్ ప్రాజెక్టులో మాత్రం వేడినీరు విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఇంధన వనరుగా మారనుంది. 30 ఏళ్ల కిందటే భూగర్భపొరల్లో జరిగే భౌతిక, రసాయనిక చర్యల కారణంగా అరుదుగా అక్కడక్కడా భూగర్భజలాలు చాలావేడిగా ఉంటాయి. వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని 30 ఏళ్ల క్రితం అధికారులు అంచనా వేసి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ విభాగం మణుగూరు ప్రాంతంలో 1989లో బొగ్గు అన్వేషణ చేపట్టి వేడి భూగర్భజలాలను కనుగొంది. జియో థర్మల్ పద్ధతిలో తేలికగా విద్యుదుత్పత్తి చేయడానికి భూగర్భజలాల ఉష్ణోగ్రత 140 సెల్సియస్ డిగ్రీలకుపైగా ఉండాలి. కానీ, మణుగూరు దగ్గర వెలుగులోకి వచ్చిన వేడి భూగర్భజలాల ఉష్ణోగ్రత 67 సెల్సియస్ డిగ్రీలు మాత్రమే నమోదైంది. దీంతో అప్పటి నుంచి జియో థర్మల్ ప్లాంట్ పనులు ముందుకు సాగలేదు. ఇటీవల జియోథర్మల్ పవర్ టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చాయి. ఫ్లాష్ స్ట్రీమ్ ప్లాంట్లు, బైనరీ సైకిల్ పవర్ ప్లాంట్ల టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్న భూగర్భజలాలకు ఇతర ద్రావకాలను జతచేయడం ద్వారా వేడి ఆవిరిని సృష్టించే వీలుంది. ఈ వేడి ఆవిరి ద్వారా టర్బయిన్లు తిప్పుతూ విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. రెండేళ్ల శ్రమ బైనరీ సైకిల్ ప్లాంట్ ద్వారా జియో థర్మల్‌పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం సింగరేణి సంస్థ రెండేళ్ల క్రితం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో జియో థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ప్రయోగాలు చేయడానికి కేంద్రం రూ.1.72 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో సింగరేణి సంస్థ, సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శ్రీరాం ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రీస్ సంస్థలు సంయుక్తంగా మణుగూరు మండలం పడిగేరు వద్ద పనులు చేపట్టాయి. ఇటలీలో 20వ శతాబ్దంలోనే... ప్రపంచంలో తొలి జియో థర్మల్‌పవర్ ప్లాంట్‌ను 20వ శతాబ్దం ఆరంభంలో ఇటలీలోని టస్కనీలో ప్రారంభించారు. అక్కడ నీటి అడుగు భాగం నుంచి వేడి నీటి ఆవిరి ఉబికి వస్తుండటంతో తొలిసారిగా జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రపంచంలో జియో థర్మల్ ఎనర్జీని ఇరవైకి పైగా దేశాల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అత్యధికంగా ఈ విధానంలో అమెరికాలో విద్యుదుత్పత్తి జరుగుతోంది. తొలిసారిగా లఢక్‌లో.. ఇండియాలో తొలి ప్రాజెక్టును 2021 ఫిబ్రవరిలో లఢక్‌లోని పుగాలో ఓఎన్జీసీ ఈ చేపట్టింది. ఇక తాతాపాని(ఛత్తీస్‌గఢ్), మాణికరన్(హిమాచల్‌ప్రదేశ్), బక్రేశ్వర్(పశ్చిమబెంగాల్), తువా(గుజరాత్), ఉనాయ్(మహారాష్ట్ర), జల్గావ్(మహారాష్ట్ర), రాజ్‌గోర్, ముంగేర్(బిహార్), గోదావరి – ప్రాణహిత లోయ మణుగూరు(తెలంగాణ)లో జియో థర్మల్ పవర్ ప్లాంట్ స్థాపనకు అవకాశాలు ఉన్నాయి. జియో థర్మల్‌పవర్ తయారీ ఇలా ప్రస్తుతం సిద్ధం చేసిన ప్రొటోటైప్ జియో థర్మల్ పవర్‌ప్లాంట్‌లో వేడి భూ గర్భజలాలను ప్రత్యేకంగా తయారు చేసిన ఓ చాంబర్లోకి పంపిస్తారు. ఇందులో ఆర్గానిక్ ర్యాంకైన్ అనే ప్రత్యేకమైన ద్రావకాన్ని ఉంచుతారు. నీటి వేడితో ఈ ఆర్గానిక్ ర్యాంకైన్ అనే పదార్థం ఆవిరిగా మారుతుంది. ఈ ఆవిరిని టర్బయిన్లు ఉండే చాంబర్లోకి పంపిస్తారు. టర్బయిన్లను ఆవిరి తిప్పడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. టర్బయిన్లు తిప్పిన ఆవిరిని తిరిగి కూలింగ్ చాంబర్లోకి పంపిస్తారు. అక్కడ చల్లబడిన ఆర్గానిక్ ర్యాంకైన్ సబ్‌స్టాన్స్‌ను తిరిగి ఉపయోగిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టును ‘క్లోజ్డ్ లూప్ బైనరీ డ్రైజెట్ ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ ప్రాసెస్ టెక్నాలజీ’గా పేర్కొంటున్నారు. ఈ విధానంలో వాతావరణ కాలుష్యం పరిమితంగా ఉంటుంది. బొగ్గును మండించాల్సిన అవసరం లేదు. దీంతో ఖర్చు కూడా తగ్గుతుంది. ర్యాంకైన్ సబ్‌స్టాన్స్‌ను మాత్రమే రీచార్జ్ చేయాల్సి ఉంటుంది. పడిగేరు వద్ద 20 కిలోవాట్స్ సామర్థ్యంతో ప్రస్తు తం ప్రోటోటైప్ ప్రాజెక్టు సిద్ధమైంది. వచ్చే రెండు, మూడు నెలల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రయోగాలు జరగనున్నాయి. -
వరద బాధితులకు ‘రూ. కోటి’ సాయం
భద్రాచలం: మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద ముంపు బాధితులకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం వితరణ అందించారు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో పర్యటించిన ఆయన..15 వేల మంది బాధితులకు రూ.కోటి విలువైన నిత్యావసర సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కేటీఆర్ పిలుపు మేరకు ‘స్మైల్ ఏ గిఫ్ట్’లో భాగంగా ఈ సరుకులు అందించినట్లు చెప్పా రు. ముంపు బాధితులకు టీఆర్ఎస్ ప్రభు త్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. -
గూడు చెదిరింది... గోడు మిగిలింది!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వరద, ఒండ్రు పేరుకుపోయిన ఇళ్లు.. కూలేందుకు సిద్ధంగా ఉన్న మట్టిగోడలు.. నామరూపాల్లేకుండా పోయిన పూరిపాకలు.. మాస్కులు ధరించి సామాన్లు శుభ్రం చేస్తున్న మహిళలు.. పుస్తకాలు ఆరబెట్టుకుంటున్న పిల్లలు.. గోదావరి వరద తాకిడికి గురైన భద్రాచలం, పరిసర మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి. భద్రాచలం పట్టణంలోని పలు కాలనీవాసులు ఇంకా సహాయక కేంద్రాల్లోనే గడుపుతున్నారు. భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న స్లూయిస్ల ద్వారా లీకవుతున్న నీరు శిల్పినగర్, విస్తా కాంప్లెక్స్‌తోపాటు ఆలయ ఉత్తర ద్వారం వైపునకు వస్తోంది. ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేసిన ఐదు మోటార్లకు అదనంగా సింగరేణి నుంచి మోటార్లు తెప్పించారు. ప్రస్తుతం 15 మోటార్లు బిగించి వరదనీటిని తోడి తిరిగి గోదావరిలోకి ఎత్తిపోస్తున్నారు. విద్యుత్ శాఖకు భారీ నష్టం..: ఏడు మండలాల్లో 630కి పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, పర్ణశాల సబ్‌స్టేషన్ వరద నీటిలో చిక్కుకున్నాయి. రూ.16 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. ఇక 143 గ్రామాల్లో 5,620 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. భద్రాచలం– చర్ల దారిలో వారం రోజులుగా రాకపోకలు ఆగిపోయాయి. మూడు రోజులుగా హెలికాప్టర్ ద్వారానే సహాయ శిబిరాలకు నిత్యావసర వస్తువులు తరలిస్తున్నారు. ఒండ్రు, వ్యర్థాల తొలగింపు పనుల్లో 4,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది నిమగ్నమయ్యారు. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో సామాన్లు మోస్తున్న రాజేశ్‌కు భద్రాచలంలోని సుభాష్‌నగర్ కాలనీలో సొంత డాబా ఇల్లు ఉంది. హఠాత్తుగా వరద కమ్ముకొచ్చేయడంతో అప్పటికప్పుడు ఇంట్లోని సామాన్లన్నీ వదిలేసి కట్టుబట్టలతో సహాయక శిబిరానికి కుటుంబంతో కలసి వెళ్లాడు. ఇల్లు నీటమునిగి విలువైన సామగ్రి తడిచి పాడైపోయింది. వరద తగ్గినా మళ్లీ ముంపు తప్పదనే భయం వెంటాడుతుండటంతో సొంత ఇంటికి కాకుండా మరోచోట అద్దె ఇంటికి వెళ్తున్నాడు. ఇక్కడ తడిసిన బియ్యాన్ని చూపిస్తున్న వ్యక్తి పేరు కౌలూరి లక్ష్మణ్. దినసరి కూలీ. వేసవిలో పనులు బాగా దొరకడంతో తిండికి ఇబ్బంది రావొద్దని ఒకేసారి రెండు క్వింటాళ్ల బియ్యం కొనిపెట్టుకు న్నాడు. తర్వాత రెండ్రోజులకే విరుచుకుపడిన వరదల్లో బియ్యం, ఇతర నిత్యవసరాలు తడిసి ముద్దయ్యాయి. పూరిపాక గోడలు నాని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వరదలు తగ్గాక ప్రభుత్వం కొత్త ఇల్లు కట్టించి ఇచ్చే వరకు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక శిబిరంలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. నేలమట్టమైన ఈ గుడిసె వృద్ధుడైన పుల్లయ్యది. పిల్లలకు పెళ్లి చేశాక ఈ పూరి గుడిసెలోనే ఆ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవలి వరదలకు గుడిసెతోపాటు మట్టిగోడలు పడిపోవడంతో దిక్కు తోచని స్థితిలో పునరావాస శిబిరంలోనే ఉంటున్నారు. మళ్లీ గుడిసెను ఏర్పాటు చేసుకొనే స్థోమత ఆయనకు లేదు. వరద సహాయక శిబిరాలు కొనసాగినన్ని రోజులు అదే వారిల్లు. కానీ, వరద తగ్గిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కు తోచనిస్థితిలో ఉన్నారీ పండుటాకులు. పునరావాస శిబిరంలోనే ఉంటాం కేసీఆర్ సార్ చెప్పినట్లు ఆగస్టు 1 వరకు జూనియర్ కళాశాల పునరావాస శిబిరంలోనే ఉంటాం. ఇక్కడ అన్ని వసతులున్నాయి. ఇండ్లకు వెళ్లి ఆ చీకట్లో పాములు, క్రిమి కీటకాలతో భయం భయంగా ఉండటం కంటే ఇక్కడ ఉండటమే నయం. – ఎస్కే యాకూబీ, సుభాష్‌నగర్, భద్రాచలం -
CM KCR: వరదలు విదేశీ కుట్రే.. సీఎం కేసీఆర్ సంచల వ్యాఖ్యలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/ వరంగల్: మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వరదల వెనుక ఇతర దేశాల కుట్రలు దాగి ఉన్నాయంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కడెం ప్రాజెక్టు వద్ద కనీవినీ ఎరుగని వరదను చూశాం. క్లౌడ్ బరస్ట్ కారణంగానే అలా అకస్మాత్తు వరదలు వస్తాయి. ఇతర దేశాల వాళ్లు మన దేశం మీద క్లౌడ్ బరస్ట్ కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కుట్రలు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది’’ అని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన సందర్భంగా కేసీఆర్ ఈ మాటలు అన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని సమాచారం ఉందని.. అందువల్ల గోదావరికి వరద ముప్పు ఇంకా తొలగిపోలేదని, తీర ప్రాంతాల ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి వరద ముంపు బాధితులకు అండగా ఉంటామని.. భవిష్యత్తులో ఏ గ్రామం కూడా వరద ముంపులో ఉండకుండా చర్యలు చేపడతామని ప్రకటించారు. నదికి ఇరువైపులా అవసరమైన చోట కరకట్టలను బలోపేతం చేయడంతోపాటు కొత్త కరకట్టలను నిర్మిస్తామన్నారు. పర్యటన సందర్భంగా కేసీఆర్ గోదావరి వరదను పరిశీలించి.. అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఇంకా వానలు పడతాయి.. వాతావరణ శాఖ అంచనాలు, ప్రైవేట్ వాతావరణ ఏజెన్సీల లెక్కల ప్రకారం ఈనెల 29 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే వాగులు, చెరువులు నిండుకుండల్లా ఉన్నాయని, ఇకపై కురిసే ప్రతీ చినుకు వరదగా మారుతుందని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని వానాకాలం ముగిసేదాకా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు, ఆయా జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. తక్షణ సాయంగా రూ.10 వేలు ముంపు బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని.. రెండు నెలల పాటు బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. భద్రాచలంలో ముంపు కాలనీల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని.. వారి కోసం సింగరేణి సంస్థతో కలిసి రూ.1,000 కోట్లతో ఎత్తయిన ప్రాంతంలో కొత్త ఇళ్లతో కాలనీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ కాలనీ శంకుస్థాపనకు తానే స్వయంగా వస్తానని చెప్పారు. ఆ పర్యటనలో ఆలయం, పట్టణ అభివృద్ధి పనుల విషయాలు మాట్లాడుతాన్నారు. కరకట్టలు బలోపేతం చేస్తాం.. కొత్తవి కట్టిస్తాం భవిష్యత్‌లో భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు ముంపు భయం లేకుండా చర్యలు చేపడతామని.. దీనిపై ఐఐటీ ప్రొఫెసర్లు, సీడబ్ల్యూసీ ఇంజనీర్లు, రాష్ట్రానికి చెందిన నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. భద్రాచలం ప్రాంతంలో గత ఐదు వందల ఏళ్ల వర్షపాతం, వరదల వివరాల ఆధారంగా కొత్త లెవల్స్‌ను నిర్ధారిస్తామని చెప్పారు. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రస్తుత కరకట్టను బలోపేతం చేయడంతోపాటు బూర్గంపాడు వైపు అవసరమైన చోట కరకట్టలు నిర్మిస్తామని వెల్లడించారు. విలీన మండలాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూడా ప్రయత్నిస్తామని. దీనిపై ఏపీ అధికారులతో మాట్లాడుతామని చెప్పారు. వరద తగ్గే వరకు పునరావాస కేంద్రాలు రామన్నగూడెంలో పునరావాస శిబిరాన్ని పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. వరద తగ్గే వరకూ పునరావాస కేంద్రాలు కొనసాగుతాయని చెప్పారు. ‘‘వరదలు వచ్చినప్పుడల్లా రామన్నగూడెంలో నష్టం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ కాలనీలను పరిశీలించాను. ఈ ప్రాంతానికి వరద ముంపు రాకుండా, ఇబ్బంది లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటాం’’ అని ముంపు బాధితులకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. నెలాఖరుదాకా అలర్ట్‌గా ఉండాల్సిందే.. ఏటూరునాగారం ఐటీడీఏలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్.. నెలాఖరు వరకూ భారీ వర్షాలు కొనసాగే నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినా ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులను అభినందించారు. ప్రతిశాఖ అధికారులు మూడు షిఫ్టులుగా పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను దశలవారీగా ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని.. ఇప్పుడు ఎన్ని నిధులు ఖర్చయినా సరే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. వరద పరిస్థితులపై భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేకంగా ఒక బుక్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వరదతో చాలాచోట్ల మిషన్ భగీరథ పైపులు దెబ్బతిన్నాయని.. వాటికి తక్షణమే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏటూరు నాగారం ప్రాంతంలో కరకట్టల పటిష్టత కోసం అవసరమైతే రూ.100 కోట్లు అదనంగా ఇస్తామన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్‌డిపో ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు కోరినందున.. వెంటనే మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం ఏరియల్ సర్వే రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచాలి భారీ వర్షాలు, వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగు జిల్లా కేంద్రంలో ఒక హెలికాప్టర్‌ను, భద్రాచలంలో మరొక హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏజెన్సీ ప్రజలు ఇబ్బందిపడకుండా పాత బ్రిడ్జిలు, కాజ్ వేలు, కల్వర్టులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. కరెంటును కూడా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ నిధులు వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సాయం కింద ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ములుగు జిల్లాకు రూ.2.50 కోట్లు, భద్రాచలానికి రూ.2.30 కోట్లు, భూపాలపల్లి జిల్లా కు రూ.2 కోట్లు, మహబూబాబాద్‌కు రూ.కోటీ 50 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. ఆదివారం భద్రాచలం బ్రిడ్జి వద్ద గోదారమ్మ శాంతించాలని మొక్కుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వరదల వెనుక.. ముంపు ప్రాంతాల పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వరదల వెనుక ఇతర దేశాల కుట్రలు దాగి ఉన్నాయన్నారు. వరదలపై నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ మాట్లాడుతూ ‘‘చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరదను కడెం ప్రాజెక్టు దగ్గర చూశాం. ఏ ఒక్కరోజు కూడా కడెం ప్రాజెక్టు దగ్గర వరద రెండున్నర లక్షల క్యూసెక్కులు దాటలేదు. ఆ ప్రాజెక్టు గరిష్ట విడుదల సామర్థ్యం 2.90 లక్షల క్యూసెక్కులే. కానీ ఈసారి ఐదు లక్షల క్యూసెక్కులకు మించి వరద వచ్చింది. మానవ ప్రయత్నం కాదు కేవలం భగవంతుడి దయవల్లే ఆ ప్రాజెక్టు మనకు దక్కింది. ప్రాజెక్టు వద్ద వరద ఫోటోలు, వీడియోలు చూస్తుంటే.. అంతా నీళ్లుండి మధ్యలో ఓ చిన్న గీతలా డ్యాం కనిపించింది. ఇలా అకస్మాత్తుగా వచ్చే భారీ వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం. ఇతర దేశాల వాళ్లు కావాలని మన దేశం మీద క్లౌడ్ బరస్ట్ కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. గతంలో జమ్మూకశ్మీర్, లెహ్ (లడఖ్), ఉత్తరాఖండ్ దగ్గర ఈ తరహా కుట్రలు జరిపారు. ఇప్పుడు గోదావరి పరీవాహక ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్ కుట్రలు చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది’’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఏటూరునాగారంలోని రామన్నగూడెం వద్ద గోదావరికి సారె సమర్పిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో సత్యవతి రాథోడ్, సీతక్క క్లౌడ్ బరస్ట్ అంటే..? ఏదైనా ఒక ప్రాంతంలో ఉన్నట్టుండి కొంత సమయంలోనే అతిభారీ వర్షం కురిస్తే దానిని ‘క్లౌడ్ బరస్ట్ (కుంభ వృష్టి)’ అని చెప్పవచ్చు. వాతావరణ శాఖ లెక్క ప్రకారమైతే.. ఒక ప్రాంతంలో ఒక్క గంటలోనే పది సెంటీమీటర్లకన్నా ఎక్కువ వాన కురిస్తే క్లౌడ్ బరస్ట్ అంటారు. తేమశాతం అత్యధికంగా ఉన్న మేఘాలు ఒకే చోట కేంద్రీకృతం కావడం లేదా ఢీకొట్టడం వల్ల అప్పటికప్పుడు ఇలా కుంభ వృష్టి నమోదవుతుంది. నీరంతా ఒకేసారి పోటెత్తి.. అకస్మాత్తు వరదలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సీఎం పర్యటన సాగిందిలా.. తొలుత సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం హన్మకొండ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఏటూరునాగారం, మణుగూరు మీదుగా భద్రాచలం చేరుకున్నారు. గోదావరి వంతెనపై కాన్వాయ్ ఆపి వరద ఉధృతిని పరిశీలించారు. గోదావరి మాతకు పసుపు కుంకుమ, కుంకుమలతోపాటు నూతన వస్త్రాలు సమర్పించి పూజ చేశారు. తర్వాత కరకట్ట మీదికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అక్కడి నుంచి పునరావాస శిబిరాలకు చేరుకుని ముంపు బాధితులకు ధైర్యం కల్పించారు. తర్వాత భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్షించి.. హెలికాప్టర్లో ఏటూరునాగారంలోని రామన్నగూడెంకు బయలుదేరారు. ఈ సందర్భంగా గోదావరి వెంట ఏరియల్ సర్వే చేశారు. నదికి ఇరువైపులా వరదలో చిక్కుకున్న గ్రామాల పరిస్థితిని పరిశీలించారు. రామన్నగూడెంలో హెలికాప్టర్ దిగాక కేసీఆర్ నేరుగా ఐటీడీఏ గెస్ట్‌హౌజ్‌కు వెళ్లి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి వరద తాకిడికి గురైన రామన్నగూడెం కరకట్టను పరిశీలించారు. వరద ప్రవాహం తగ్గాలంటూ గోదావరి తల్లికి సారె సమర్పించి పూజ చేశారు. తర్వాత పునరావాస శిబిరానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడి ఏర్పాట్లు, భోజన వసతులపై ఆరా తీశారు. కాగా పర్యటనలో సీఎం వెంట మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వరదలపై సీఎం కేసీఆర్ అనుమానాలు.. కుట్ర కోణం దాగి ఉందా?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఈ స్థాయిలో వరదలు వస్తాయని ఎవరూ ఊహించలేదని.. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతిలో వరదలు సృష్టిస్తున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో కశ్మీర్, లేహ్ వద్ద ఇలాంటి కుట్రలు జరిగినట్లు వార్తలొచ్చాయన్నారు. ఇతర దేశాలు క్లౌడ్ బరస్ట్‌తో ఇలాంటి కుట్రలు చేస్తున్నాయనే చర్చ ఉందన్నారు. గోదావరి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగినట్లు అనుమానం ఉందన్నారు. దీనిపై నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. చదవండి: తగ్గేదేలే.. ఎవరికి వారే.. అటు గవర్నర్.. ఇటు కేసీఆర్ పోటాపోటీగా.. కాగా, వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించారు. భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ముంపు బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సీఎం ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు. భద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం అన్నారు. శాశ్వత ప్రాతిపదికన కాలనీల నిర్మాణం: తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం వాసుల కన్నీళ్లను తుడిచేందుకు సీఎం కేసీఆర్ వారికి శాశ్వత ప్రాతిపదికన నివాసాల కోసం కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. వరద చేరని ఎత్తైన ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను సీఎం ఆదేశించారు. తమకు శాశ్వత ప్రాతిపదికన రిలీఫ్ దొరకుతుండటంతో పునరావాస కేంద్రాల్లోని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. -
వర్షంలోనే సీఎం కేసీఆర్ పర్యటన.. గోదారమ్మకు శాంతి పూజలు
సాక్షి, ములుగు/భద్రాద్రి కొత్తగూడెం: భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద ముంపు పరిస్థితులు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగిన సహాయ కార్యక్రమాలు అందించేందుకు నిన్న వరంగల్ చేరుకున్న సీఎం కేసీఆర్.. ఆదివారం ఉదయం భద్రాచలం పర్యటనకు బయలుదేరారు. వర్షాలు కురుస్తుండటంతో, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లో ఏరియల్ సర్వేను అధికారులు రద్దుచేసిన నేపథ్యంలో బాధిత ప్రజలకు చేరుకోవడానికి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. చదవండి: సీతక్కకు తప్పిన ప్రమాదం ములుగు, ఏటూరు నాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకుంటూ భారీ వర్షంలోనే సీఎం కేసీఆర్ కాన్వాయ్ ప్రయాణం కొనసాగింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షం వరదలు సృష్టించిన బీభత్సాన్ని సీఎం పరిశీలించారు. భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి శాంతి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించిన సీఎం, భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అశ్వాపురంలో వరద బాధితులు ఆందోళన అశ్వాపురంలో వరద బాధితులు ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. వరద బాధితులను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగింది. అశ్వాపురం రహదారిపై వరద బాధితులు బైఠాయించారు. -
మాకు న్యాయం చేయాలి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తీరం వెంట ఉన్న పట్టణాలు, గ్రామాలను గడగడలాడించిన గోదావరి నెమ్మదించింది. అయితే అప్పటికే వరద తీవ్రత ధాటికి తీర ప్రాంత ప్రజలు భారీగా నష్టపోయారు. వరద వెనక్కి మళ్లితే తప్ప నష్టం ఎంతో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. సరైన సమాచారం ఇవ్వకుండా తీరని నష్టం కలిగించిన ప్రభుత్వాధికారులే తమను ఆదుకోవాలంటూ భద్రాచలంలో సుభాష్‌నగర్ కాలనీవాసులు శనివారం పట్టణంలో ఆందోళన నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చే వరకు కదిలేది లేదంటూ కూనవరం రోడ్డులో బైఠాయించారు. వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ జిల్లాకు వస్తుండటంతో తమను ఆదుకుంటారనే ఆశల్లో వరద బాధితులు ఉన్నారు. భద్రాచలం దగ్గర నిర్మించిన కరకట్ట ఈ కాలనీ దగ్గర ముగుస్తుంది. దీంతో వరద తీవ్రత పెరగడంతో కరకట్ట చివర నుంచి నీళ్లు సుభాష్ కాలనీలోకి వచ్చాయి. ముంపు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు గురువారమే ఈ కాలనీవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ సమయంలో వరద 64 అడుగుల ఎత్తుకు రావొచ్చని అంచనా వేశారు. దీంతో ఈ కాలనీ ప్రజలు వరద ఎత్తును దృష్టిలో ఉంచుకుని ఇంట్లోని మంచాలు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఇతర విలువైన సామాన్లను అటక మీద పెట్టడం, తాళ్లతో కట్టి పైకప్పు వరకు చేర్చి కేవలం కట్టుబట్టలతో పునరావాస శిబిరాలకు చేరుకున్నారు. అయితే వరద ఏకంగా 71 అడుగులకు చేరుకోవడంతో సామగ్రి నీట మునిగింది. ఇక్కడ నివసిస్తున్నవారిలో అత్యధికులు రోజువారీ కూలీలే. చనిపోతామంటూ... తమకు న్యాయం చేయాలంటూ సుభాష్‌నగర్ కాలనీవాసులు గంటల తరబడి రోడ్డుపై ధర్నా చేశారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య సైతం వీరి ఆందోళనకు మద్దతుగా నిలిచారు. ‘సర్వం కోల్పోయిన తాము బతడం దండగ’అంటూ తిరిగి వరద నీటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. తమకు న్యాయం చేయకుంటే రాజకీయ నాయకులెవరూ ఓట్లు అడిగేందుకు తమ వాడకు రావొద్దంటూ నినాదాలు చేశారు. సుభాష్‌నగర్ ముంపునకు గురికాకుండా కరకట్ట నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. బురద సమస్య: గోదావరి వరదనీరు వెనక్కి తగ్గగానే ముంపు ప్రాంతాలు ఎదుర్కొనే సమస్యలో బురద తొలగింపు ప్రధానమైనది. ఈ బురద కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్‌తోపాటు పదిహేను మున్సిపాలిటీల నుంచి 195 మంది పారిశుధ్య కార్మికులను భద్రాచలం ఏజెన్సీకి తరలిస్తున్నారు. వీరితో జెట్టింగ్, ఫాగింగ్ మెషీన్లు, బురద తొలగించే యంత్రాలను తీసుకొస్తున్నారు. అంటురోగాలు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. నీళ్లలోనే పంటపొలాలు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 53 అడుగులకు తగ్గితేనే ఏజెన్సీ ప్రాంతాలు ముంపు నుంచి బయటపడతాయి. అయితే శనివారం అర్ధరాత్రి వరకు నీటిమట్టం 60 అడుగులకుపైనే ఉంది. ముఖ్యంగా కిన్నెరసాని, గోదావరి నదులు సంగమ ప్రదేశానికి సమీపాన ఉన్న బూర్గంపాడు పూర్తిగా ముంపునకు గురైంది. ఈ మండలంలో ఏకంగా 7,955 మంది పునరావాస కేంద్రాల్లోనే మగ్గుతున్నారు. వరదనీరు వెనక్కి మళ్లితేనే ఎన్ని ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది, ఎన్ని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయాయి, ఎంత మేర రోడ్లు కొట్టుకుపోయాయి, ఎన్ని కాజ్‌వేలు దెబ్బతిన్నాయనే విషయం తేలుతుంది. -
‘తగ్గేదేలే..’ అంటున్న ఏజెన్సీవాసులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే!’ అంటూ ఫారెస్టు అధికారుల కళ్లు కప్పి ఎర్ర చందనం దుంగలను నీటి ప్రవాహంలో విడిచి, డ్యామ్ దగ్గర సేకరించే సినిమా సీన్‌కు ప్రేక్షకులు సీటీలు కొట్టారు. అయితే స్మగ్లింగ్‌తో సంబంధం లేకుండా గోదావరికి భారీ వరదలు వచ్చినప్పుడు ఏజెన్సీ వాసులు కూడా ‘తగ్గేదేలే..’ అంటూ సాహసాలు చేస్తుంటారు. వర్షానికి నేల కూలిన భారీ చెట్లు, అడవుల్లో ఎప్పుడో పడిపోయి ఎండిపోయిన చెట్లదుంగలు వరదనీటిలో కొట్టుకొస్తుంటాయి. స్మగ్లర్లు దాచిపెట్టిన కలప దుంగలు కూడా అప్పుడప్పుడు ప్రవాహంలో కలుస్తుంటాయి. ఇచ్చంపల్లి దగ్గర ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తర్వాత ఇలాంటి దుంగలు కొట్టుకొస్తాయి. ఆ కలపకోసం ఏజెన్సీవాసులు ప్రాణాలకు తెగించి మరబోట్లపై వెళ్తున్నారు. కొట్టుకొచ్చే దుంగలను పట్టుకుని బోటులో వేయడమో లేదా తాడుకు కట్టో ఒడ్డుకు చేరుస్తారు. వరద సమయంలో చర్ల మొదలు రాజమహేంద్రవరం వరకు ఈ తరహా దృశ్యాలు కనిపిస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో మంగళవారం కలప కోసం, సుమారు 52 అడుగుల ఎత్తున ప్రవహిస్తున్న గోదావరిలో కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ కనిపించారు. టేకు దుంగలు అరుదుగా కొట్టుకొస్తాయని చెబుతున్నారు. -
Telangana Rains: దంచికొడుతున్న వానలు, పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పొలాల్లో నీళ్లు చేరి చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో జలాశయాలన్నీ నిండుకుండలా తలపిస్తున్నాయి. నది పరివాహక ప్రాంతాలు, ప్రాజెక్టుల వద్ద వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేకచోట్ల జనజీవనం స్తంభించింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ సాధారణం కంటే అధిక వర్షాలు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. After #HeavyRains, rescue operations underway in #Bhainsa town. #Telangana CM #KCR instructed officials to be on alert and take quick safety measures in the wake of incessant rains in State#Telanganarains pic.twitter.com/1GUx9BH9DH — Aneri Shah (@tweet_aneri) July 9, 2022 నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిట్యాల గ్రామ సమీపంలో గల గోదావరి మధ్యలో ఉన్న కూర్రులో 9 మంది కౌలు రైతులు, వలస కూలీలు చిక్కుకున్నారు. గోదావరి ఉద్రిక్తంగా ప్రవహిస్తుడటంతో కూలీలు భయందోళనకు గురవుతున్నారు. రోజురోజుకీ గోదావరి మట్టం పెరగడంతో తమను రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. Nature 🐟🌊 At Pocharam Project today ! #Telangana pic.twitter.com/6BNzQjfYcE — Smita Sabharwal (@SmitaSabharwal) July 11, 2022 భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. రాత్రి 12గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అడుగు తగ్గి 52 అడుగులకు చేరింది. అయితే మధ్యాహ్నం నుంచి మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. మాలయం వద్ద ఉన్న పుష్కర ఘాట్, చిన్న ఆలయాలు నీట మునిగాయి. భద్రాచలం నుంచి చర్ల వెళ్లే ప్రధాన రాహదారి పై నుంచి వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జనం ఏదైనా అత్యవసరం అవుతూనే ఇళ్లలో నుంచి బయటికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. Sirnapally Waterfalls 😍👌#Nizamabad District, #Telangana 📸: @Aswan_shan @HarithaHaram#WaterfallsOfTelanganapic.twitter.com/9DJeYCj3sT — Hi Hyderabad (@HiHyderabad) July 11, 2022 వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలన్ని జలకళను సంతరించుకుని చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. వరంగల్‌లో భద్రకకాళి చెరువు పూర్తిస్థాయిలో నిండి మత్తడి దూకుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయిదు చెరువులకు గండిపడగా పలుచోట్ల రోడ్లు ధ్వంసమై పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదలతో రవాణా సౌకర్యం లేని గ్రామాల్లోని గర్భిణీ స్త్రీలను ముందస్తుగా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్య అధికారులు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునారావస కేంద్రాల ఏర్పాటు చేసి సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వర్షం వరదలపై మహబూబాబాద్ లో అధికారులు ప్రజాప్రతినిధులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్షించారు. వర్షం వరదల వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడమే కాకుండా విద్యుత్తు సప్లైకి అంతరాయం ఏర్పడి త్రాగునీటి సమస్యతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్: మహిళకు పురిటి నొప్పులు రావడంతో అతికష్టంగా గిరిజనులు వాగు దాటించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని మల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతోవాగు ఉప్పోంగి ప్రవాహిస్తోంది. పైగా కల్వర్ట్ పై నుంచి నీరు ప్రవాహిస్తోంది. అయినప్పటికీ గిరిజన మహిళలను ఉప్పోంగే వరద ఉదృతిలో వాగులో చేతులు పట్టుకొని మరి గర్బీణీ మహిళను వాగు దాటించారు. వాగు దాటించిన ఆనంతరం 108లో వాహనంలో అసుపత్రికి తరలించారు. జూరాలకు పెరుగుతన్న వరద మహబూబ్‌నగర్: గడచిన నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రియదర్శిన జూరాల ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండంగా అవుట్‌ఫ్లో 12 వేల 225 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.130 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి సామర్ద్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.969 టీఎంసీలుగా ఉంది. కుడి,ఎడమ కాలువలతోపాటు నెట్టెంపాడు ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ కర్ణాటకలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆల్మట్టి,నారాయణపూర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నారాయణపూర్ ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఈ నీళ్లు బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం వరకు జూరాల చేరే అవకాశం ఉందని జూరాల ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. వరద ఉదృతి పెరిగే అవకాశం ఉండటంతో నదీతీరా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నదిలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరిస్తున్నారు. జగిత్యాల: రాయికల్ మండలం మండల కేంద్రంలోని బోర్నపెల్లి గ్రామంలోని గోదావరి నది మధ్యలో తొమ్మిది మంది రైతు కూలీలు చిక్కుకున్నారు. గోదావరి మధ్యలో ఉన్న గుట్ట ప్రాంతంలో చిక్కుకుకున్నారు. వారం రోజుల పాటు వ్యవసాయ పనుల రీత్యా కూలీలు నిత్యావసరాలు తీసుకొని వెళ్లారు. అయితే గుట్ట చుట్టూ మూడు వైపులా గోదావరి పాయలు ఉధృతంగా ప్రవహిస్తోందటంతో వీడియో కాల్స్ ద్వారా స్థానికులు బంధువులకు సమాచారం అందించి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు రంగంలోకి చర్యలు చేపట్టారు. -
సిరుల గ్రాసం.. పచ్చగడ్డి కాదు.. పసిడి పంట!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం: ఒకప్పుడు గ్రామాలు పశువులతో కళకళలాడేవి. వాటి మేత కోసం గ్రామాల్లో బంజరు భూములు ఉండేవి. పొలం గట్లు, అంచుల వెంబడి రైతులు పశుగ్రాసం పెంచేవారు. క్రమేణా బంజరు భూములు సాగునేలలుగా మారాయి. లేదంటే కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. యాంత్రీకరణతో వ్యవసాయంలో పశువుల వినియోగం తగ్గింది. కానీ పాడి పశువుల సంఖ్య పెరిగింది. పాలిచ్చే గేదెలు, జెర్సీ ఆవులను పెంచే రైతుల సంఖ్య గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ పెరుగుతోంది. అందుకు తగ్గట్టు పశుగ్రాసం లభించడం లేదు. అడవులు అధికంగానే ఉన్నా.. రాష్ట్రంలోనే అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ పశుగ్రాసం సమస్య తీవ్రంగానే ఉంది. అడవుల సంరక్షణ పేరుతో అటవీ అధికారులు కట్టుదిట్టం చేయడంతో పశువులకు మేత దొరకడంకష్టమైపోయింది. దీంతో పాడిరైతులు పశుగ్రాసాన్ని మోపుల లెక్కన కొనాల్సి వస్తోంది. ఈ క్రమంలో పశువుల ఆహార కొరతను తీరుస్తూ రైతులకు ఆదాయాన్ని అందించే వనరుగా సూపర్ నేపియర్ రకం గడ్డి వెలుగులోకి వచ్చింది. నేపియర్ గ్రాస్‌తో పెంచుతున్న పశువులు సాగు సులభం.. అచ్చం చెరుకుగడలా కనిపించే ఈ నేపియర్ గడ్డి థాయ్‌లాండ్ నుంచి వచ్చింది. భారత్ పరిస్థితులకు తగ్గట్టుగా హైబ్రిడ్ నేపియర్, సూపర్ నేపియర్, రెడ్ నేపియర్ గడ్డి రకాలు అభివృద్ధి చేశారు. ఇందులో ప్రస్తుతం సూపర్ నేపియర్ రకం సాగు జోరందుకుంది. పశుగ్రాసం కోసం పెంచే జొన్న, దుబ్బ వంటి గడ్డిజాతులు ఒకసారి నాటితే ఒకసారి మాత్రమే దిగుబడి ఇస్తాయి. ఏడాది తర్వాత మళ్లీ పెట్టుబడి పెట్టాల్సిందే. కానీ సూపర్ నేపియర్ గడ్డిజాతి మొక్కలు ఒకసారి నాటితే ఎనిమిదేళ్ల వరకు తిరిగి చూడాల్సిన పనిలేదు. తొలి పంట 90 రోజుల్లో చేతికొస్తుంది. ఒకసారి కోస్తే తిరిగి 45 రోజుల్లో మళ్లీ కోతకొస్తుంది. ఇలా ఎనిమిదేళ్ల పాటు రాబడిని అందిస్తోంది. రైతుల మొగ్గు... పట్టణాలకు సమీపంలో పాడి ఎక్కువగా విస్తరించిన గ్రామాల్లో రైతులు సంప్రదాయ వరి, పత్తి, మిర్చిల కంటే నేపియర్ సాగుకే మొగ్గు చూపుతున్నారు. వరి వేసి నానా కష్టాలు పడితే ఎకరానికి రూ.15 వేలకు మించి ఆదాయం రావట్లేదు. పత్తివేస్తే అన్ని ఖర్చులు పోను ఎకరానికి రూ.30 వేలైనా మిగలడం లేదు. కానీ సూపర్ నేపియర్ స్టెమ్స్ ఒకసారి నాటితే ఎనిమిదేళ్ల వరకు ఢోకాలేదు. ఎకరాకు అన్ని ఖర్చులు పోనూ రూ.70 వేల వరకు మిగులుతున్నాయని రైతులు అంటున్నారు. రెట్టింపు లాభం.. బెంగళూరులో ఉన్నప్పుడు సొంతూరిలో పాడి పరిశ్రమ పెట్టాలనుకున్నా. అప్పుడే సూపర్ నేపియర్ గురించి తెలిసింది. మా ఊళ్లో ఫాంహౌస్ కట్టి దానిలో ఈ గడ్డి పెంచుతున్నా. సాధారణ గడ్డి ఎకరంలో పండిస్తే.. ఐదారు పశువులకే సరిపోతుంది. కానీ నేపియర్ 16 అడుగుల పొడవు పెరగడం వల్ల 10 పశువులకు సరిపోతుంది. పైగా ఇందులో ప్రొటీన్స్ ఎక్కువ. పాల దిగుబడి బాగుంటుంది. – కళ్యాణ్, రైతు, అశ్వాపురం సమయం ఆదా అవుతోంది గతంలో భూమి కౌలుకు తీసుకుని గడ్డి పెంచేవాన్ని. ప్రతీ ఏడాది దుక్కి దున్ని విత్తనాలు చల్లాల్సి వచ్చేది. సూపర్ నేపియర్‌తో ఈ సమస్య లేదు. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. 6 ఏళ్లు పాడి పశువులకు ఆహార కొరత లేదు. ఉదయం ఈ గడ్డి కోసి ఇస్తే చాలు. మిగిలిన సమయంలో ఇతర పను లు చూసుకునే వెసులుబాటు కలుగుతోంది. – బాదం శ్రీనివాసరెడ్డి, రైతు, బూర్గంపాడ -
టీఆర్ఎస్కు ఊరంతా రాజీనామా
అశ్వారావుపేట రూరల్: సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్‌కు చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడమే కాక లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ రామన్నగూడెం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ఐదుగురు వార్డు సభ్యులు సహా గ్రామంలోని 160 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప, గ్రామస్తులు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎంపీపీతో పాటు మరికొందరు నాయకులు పోలీసులను ఉసిగొల్పి తమ పాదయాత్రను అడ్డుకున్నారని వివరించారు. మహిళలపైనా పోలీసులు లాఠీచార్జ్ చేస్తుంటే సొంత పార్టీ వారు అడ్డుకోకపోగా, తరువాత పరామర్శించేందుకు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల వైఖరికి నిరసనగా తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
తల్లీకొడుకుపై టీఆర్ఎస్ కౌన్సిలర్ దాడి
ఇల్లెందు: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ వేరే వార్డులోని రెండు కుటుంబాల మధ్య గొడవలో కలగజేసుకోవడమేకాక తల్లీకొడుకులపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులు ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీ రెండో వార్డులోని సత్యనారాయణపురంలో తల్లీకొడుకులు ఎస్.కె.సోందుబీ, షేక్ ఫకీర్ సాహెబ్ నివసిస్తున్నారు. వీరి ఇంటి పక్కన ఉండే మీరా సాహెబ్ ప్రహరీ నిర్మిస్తుండగా, శనివారం ఉదయం హద్దుల విషయమై సోందూబీ, ఫకీర్ సాహెబ్ ఆ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో రెండు కుటుంబాలమధ్య వాగ్యుద్ధం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని గొడవలకు దిగొద్దని రెండు పక్షాలకు సూచించారు. కాసేపటికి ఒకటో వార్డు కౌన్సిలర్ రవి తన అనుచరులతో అక్కడకు వచ్చి సోందుబీ, ఫకీర్ సాహెబ్‌ను పిలిచి పంచాయితీ పెట్టాడు. కాగా, కౌన్సిలర్ చెప్పినట్లుగా వినడం లేదంటూ తమపై దాడి చేశాడని బాధితులు వాపోయారు. ఏదైనా సమస్య ఉంటే తమ కౌన్సిలర్‌కు చెప్పుకుంటామంటున్నా వినకుండా దాడి చేశాడని తెలిపారు. కౌన్సిలర్ రవితో తమకు ప్రాణ హాని ఉందని అన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్‌నైన తనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమీ కాదని బెదిరించాడని చెప్పారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై చంద్రశేఖర్ సత్యనారాయణపురం వెళ్లి విచారణ చేపట్టారు. -
పేదలకు నిలువ నీడా దక్కట్లేదు: ఆర్ఎస్పీ
ములకలపల్లి: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నామని చెప్పుకునే టీఆర్ఎస్ పాలనలో నిరుపేదలకు నిలువ నీడ కూడా దక్కట్లేదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి, అన్నపురెడ్డి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల దోపిడీ, రాజ్యాధికారం లేక బహుజనులు నష్టపోతున్న తీరును 5 వేల గ్రామాల్లో వివరించేందుకు యాత్ర చేపట్టగా ఇప్పటివరకు 500 గ్రామాల్లో పూర్తయిందని తెలిపారు. ఉచిత పథకాలతో గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. యాత్రలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎర్రా కామేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓట్లు పేదలవి.. కోట్లు పాలకులవి: ఆర్ఎస్పీ
అశ్వారావుపేట రూరల్: పేదల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని, ప్రజలు మాత్రం అక్కడే ఉన్నారని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఆయన చేపట్టిన రాజ్యాధికార యాత్ర ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం, ఆసుపాక, నారాయణపురం, నందిపాడు, ఖమ్మంపాడు, బచ్చువారిగూడెం, దురదపాడు, తిరుమలకుంట గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఏళ్లుగా పేదలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లను ఇంటికి పంపించి, బహుజన రాజ్యం కోసం బీఎస్పీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. మండలంలోని గుమ్మడవల్లి గ్రామం వద్ద 40 ఏళ్ల క్రితం నిర్మించిన పెదవాగు ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నేటికీ నష్ట పరిహారం ఇవ్వకపోవడం పాలకుల అసమర్థతకు నిదర్శమని మండిపడ్డారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీఐజీ కోటేశ్వరరావు, జిల్లా ఇన్చార్జి కృష్ణార్జునరావు పాల్గొన్నారు. -
ఉద్యోగాల భర్తీ ఫైల్‌పైనే తొలి సంతకం: షర్మిల
దమ్మపేట: ప్రజలు ఆశీర్వదించి తమను అధికారంలోకి తీసుకొస్తే భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ఫైల్‌పైనే తొలి సంతకం చేస్తానని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మంగళవారం ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. అప్పారావుపేట గ్రామంలో జరిగిన ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’లో పాల్గొన్న షర్మిల తొలుత ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 2008లో ఓకేసారి 50వేల టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించిన ఘనత వైఎస్ఆర్కి మాత్రమే దక్కిందని గుర్తు చేశారు. రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల సమయంలో ప్రకటించిన కేసీఆర్ ఆ తరువాత విస్మరించారని, పోరాడి సాధించిన తెలంగాణలో ఉపాధి లభించక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆయన చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. తమ పోరాట ఫలితంగా ఇటీవల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ఖాళీలన్నీ భర్తీ చేసే వరకు తమ దీక్షలు కొనసాగుతాయని షర్మిల స్పష్టం చేశారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
దమ్మపేట: అకాల వర్షాలు, ఈదురుగాలులతో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదు కోవాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో కొనసాగింది. యాత్రలో భాగంగా పార్కలగండికి వెళ్లారు. అక్కడ ఆదివారంరాత్రి తీవ్రమైన గాలులు, వర్షం వల్ల నష్టపోయిన అరటి, మామిడి, నిమ్మ పంటలను పరిశీలించారు. రాష్ట్రంలో ఎక్కడ పంట నష్టం జరిగినా పట్టించుకోని సీఎం కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రైతే రాజని మాట్లాడుతున్న పాలకులు వారిని ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం తీసుకురావడ మే లక్ష్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించానని తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తే మెరుగైన సంక్షేమ పాలన తీసుకొస్తానన్నారు. అనంతరం అగ్రిగోల్డ్ బాధితులు షర్మిలను కలసి తమ డిపాజిట్ సొమ్ము ఇప్పించాలని కోరగా, తాను అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్టీపీ నేతలు సోయం వీరభద్రం, పి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఉపాధి ‘వల’
ఇల్లెందు: చెరువులో చేపలు వేటాడితేనే అతని కుటుంబానికి ఉపాధి. కానీ చేపల వేటకు ఉపయోగించే వలే ఆయన ప్రాణం తీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మాణిక్యారం పంచాయతీ పరిధి ఎల్లాపురానికి చెందిన పూనెం రాంబాబు మరికొందరితో కలిసి శుక్రవారం స్థానిక చెరువులో చేపల వేటకు వెళ్లాడు. చేపలను కట్టపైకి చేర్చాక వలను మరో ఒడ్డున ఉన్న సహచరులకు ఇచ్చేందుకు చెరువులో ఈదుతూ బయల్దేరాడు. లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లాక రాంబాబు వద్ద ఉన్న వల అతని కాలి బొటన వేలితోపాటు చేయి, తలకు చుట్టుకుని బిగుసుకుపోయింది. దీంతో ఊపిరాడక నీటిలో మునిగి ప్రాణాలొదిలాడు. ఎంతకూ రాంబాబు రాకపోవడంతో ఆయన వెంట వెళ్లిన వారు శుక్రవారం రాత్రి వరకు వెతికినా ఆచూకీ దొరకలేదు. శనివారం ఉదయం చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులు వంద మంది చెరువులోకి దిగి గాలిం చగా.. లోతట్టు ప్రదేశంలో మృతదేహం లభించింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా అంత్యక్రియలు నిర్వహించారు. -
నిరుద్యోగ తెలంగాణగా మార్చారు: షర్మిల
బూర్గంపాడు: తెలంగాణలో యువకులు డిగ్రీలు, పీజీలు చదివి హమాలీలుగా, ఆటో డ్రైవర్లుగా బతుకు తున్నారని.. మరి కొందరైతే ఆ పని కూడా లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో నిరుద్యోగ నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ నిరుద్యోగ తెలంగాణగా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నత విద్య చదివిన వారు కూడా రూ.5వేలు, రూ.10వేల జీతానికి పని చేస్తు న్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ రుణాల కోసం 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా ఏ ఒక్కరికీ రుణం ఇవ్వలేద న్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో కమీషన్ దండుకోవడం ఒక్కటే కేసీఆర్‌కు తెలిసిన విద్య అని విమర్శిం చారు. ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా ప్రకటించి నిరాహార దీక్షలు చేస్తున్నా మని, అందుకే ప్రభుత్వంలో చలనం వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేత ఏపూరి సోమన్న బృందం ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. -
కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారు: షర్మిల
సాక్షి,భద్రాద్రి(పాల్వంచ): ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేశారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సి పాలిటీ పరిధిలోని కరకవాగు గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన రైతుగోస దీక్షలో ఆమె మాట్లాడారు. కేజీ టు పీజీ ఉచిత విద్య పేరిట విద్యార్థులను, పోడు భూములకు పట్టాలిస్తామని ఆదివాసులను, నిరుద్యోగ భృతి అని యువకులను, డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట పేదలను ఇలా సీఎం కేసీఆర్ మోసం చేయని వర్గమం టూ లేదని విమర్శించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఖమ్మం జిల్లాలో 1.9 లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తే, ఆ తర్వాత ఎవరికీ పట్టాలు ఇచ్చిన దాఖలాలే లేవని తెలి పారు. కొత్తగూడెం ఎమ్మెల్యే, ఆయన కుమారుడి అరాచకాలకు అంతే లేదని షర్మిల ధ్వజమెత్తారు. ఈ దీక్షలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ గడిపెల్లి కవిత, భద్రాద్రి జిల్లా అధ్య క్షుడు నరాల సత్యనారాయణ పాల్గొన్నారు. -
రైతులను అప్పులపాలు చేశారు: షర్మిల
సుజాతనగర్: దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో వ్యవసాయం పండుగలా మారితే, ప్రస్తుత సీఎం కేసీఆర్ హయాంలో రైతులంతా అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో సాగింది. ఈ సందర్భంగా సుజాతనగర్లో ఏర్పాటు చేసిన రైతుగోస ధర్నాలో షర్మిల మాట్లాడారు. రైతులను కోటీశ్వరులను చేశామని సీఎం అంటున్నారని, అంత ధనవంతులైతే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రుణమాఫీ కోసం 36 లక్షల మంది ఎదురుచూస్తున్నారని, గత ఏడేళ్లలో 7 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యాసంగిలో వరి వేయొద్దని చెబితే 17 లక్షల ఎకరాల్లో రైతులు పంట సాగు చేయలేదని, వరి పండించని రైతులకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ముందు చెబితే వరి వేసేవారు కదా?: షర్మిల
ఇల్లెందు: ‘వరి వేస్తే ఉరి.. అన్న సీఎం కేసీఆర్ మాట విని రాష్ట్రంలో 17 లక్షల ఎకరాలను రైతులు బీళ్లుగా వదిలేసి నష్టపోయారు. ధాన్యం కొంటామని ముందే చెబితే రైతులందరూ వరిసాగు చేసేవాళ్లు కదా’అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా బొజ్జాయిగూడెంలో నిర్వహించిన రైతుగోస దీక్షలో షర్మిల మాట్లాడారు వరిసాగు చేయని రైతులకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం అందించాలని, ధాన్యాన్ని తక్కువధరకు అమ్ముకుని మిల్లర్ల చేతిలో మోసపోయిన రైతులకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతులకు విలువ లేకుండా పోయిందని, ఎనిమిదేళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. మూడెకరాల భూపంపిణీ, దళిత సీఎం హామీలతో దళితులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. యాత్రలో వైఎస్సార్టీపీ నాయకులు బానోతు సుజాత, లక్కినేని సుధీర్‌బాబు, పిట్ట రాంరెడ్డి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. కాగా, టేకులపల్లి మండలంలో యాత్ర సందర్భంగా తేనెటీగలు దాడి చేయడంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో షర్మిలకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్య
బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె మహాలక్ష్మి(27) గురువారం తెల్లవారుజామున సారపాకలోని స్వగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోని ముందు గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న మహాలక్ష్మిని ఆమె వ్యక్తిగత సహాయకురాలు గమనించి, ఇరుగుపొరుగు సహకారంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లిన వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి దమ్మపేటకు చేరుకుని అక్కడి నివాసంలో ఉండిపోయారు. వెంకటేశ్వర్లు భార్య రత్నకుమారి గతంలోనే అనారోగ్యంతో మృతి చెందారు. కుమారుడు రవికుమార్ హైదరాబాద్‌లో ఉన్నారు. ఎంబీబీఎస్ పూర్తి.. కరీంనగర్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన మహాలక్ష్మి పీజీ ప్రవేశపరీక్షకు సిద్ధమవుతున్నారు. 15 రోజులుగా మహాలక్ష్మి ముభావంగా ఉంటోందని, పీజీ ప్రవేశపరీక్ష సమీపిస్తున్నందున ఆందోళనకు గురవుతోందని భావించానని తండ్రి వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. స్థలం మారితే మంచిదని బంధు వుల ఇంటికి పంపించానని, రెండు రోజులకు తిరిగొచ్చి మామూలుగానే ఉంటున్నట్టు చెప్పారు. ఇంతలోనే తన కుమార్తె అఘాయిత్యానికి పాల్పడిందని కన్నీరుమున్నీరయ్యారు. కాగా, మానసిక ఒత్తిడితోనే మహాలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
Thati Mahalakshmi: మాజీ ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి బుధవారం ఇంట్లో తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారు జామున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎంతకు గది తలుపులు తెరవకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా మహాలక్ష్మి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే బంధువులు భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్ తెలిపారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తండ్రి తాటి వెంకటేశ్వర్లు హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చి కన్న కూతురు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. మహాలక్ష్మి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పీజీ ప్రిపేర్ అవుతోంది. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: (రైళ్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా!.. ఇకపై ఇట్టే దొరికిపోతారు)