సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ పారిశ్రామిక అవసరాలు తీరుస్తోన్న సింగరేణి సంస్థ కాలానుగుణంగా మారుతూ వస్తోంది. మానవ వనరులను క్రమంగా తగ్గించుకుంటూ యాంత్రీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కంపెనీలో విద్యార్హతలు కలిగిన కార్మికుల సంఖ్య పెరుగుతూ, నిరక్షరాస్యుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఆధునిక హంగులతో సంస్థ పురోగమిస్తోంది. శుక్రవారం సింగరేణి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఫిట్‌నెస్ ఉంటే చాలు ఒకప్పుడు బొగ్గు వెలికి తీసేందుకు కార్మికులు భూగర్భంలోకి వెళ్లేవారు.
విపరీతమైన వేడి, చాలినంతగా ఉండని గాలి, అడుగు తీసి అడుగు వేస్తే గుచ్చుకునే బొగ్గు పెళ్లలు, విష వాయువుల మధ్య కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేసేవారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో గనుల్లో పని చేయాల్సి ఉండటంతో విద్యార్హతలకు కాకుండా 35 ఏళ్లలోపు వయసు ఉండి, శారీరక దారుఢ్యమే ప్రధాన అర్హతగా గనుల్లో పనులు లభించేవి. తట్టా, చెమ్మాస్ పట్టుకుని బొగ్గు వెలికితీతలో మునిగిపోయేవారు. ఆ తర్వాత కార్మిక సంఘాల ఏర్పాటుతో శ్రమకు తగ్గ వేతనం, వసతి, బోనస్, అలవెన్సుల వంటివి కార్మికులకు లభించాయి.
దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన 90వ దశకంలో లక్షా ఇరవై వేల మంది కార్మికులు సింగరేణిలో ఉండేవారు. ఇందులో నూటికి తొంభై శాతం మంది కార్మికులకు కనీస విద్యార్హతలు ఉండేవి కావు. రాయడం, చదవడం కూడా తెలిసేది కాదు. అయినప్పటికీ ఇక్కడ పని చేసే కార్మికులు పెద్ద హోదాగల ఉద్యోగుల తరహాలో వేతనాలు పొందుతుండటాన్ని అంతా ఆశ్చర్యంగా చూసేవారు.
కాలానుగుణంగా విద్యార్హతలకు పెద్దపీట
మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా బొగ్గు గనుల్లో బాస్కెట్ లోడింగ్ (తట్టల్లో బొగ్గును టబ్బుల్లోకి ఎత్తిపోయడం) విధానాన్ని ఎత్తి వేయాలని 2003లో సింగరేణి సంస్థ నిర్ణయించింది. అప్పటి నుంచి మానవ వనరుల వినియోగం తగ్గిపోయి ఆ స్థానంలో యంత్రాల ఉపయోగం పెరిగిపోయింది. గనుల్లో పని చేయాలంటే యంత్రాలను ఆపరేట్ చేయడం, ఉత్పత్తికి అనుగుణంగా మెషినరీని సిద్ధం చేయడం తప్పనిసరిగా మారాయి. ఫలితంగా సాంకేతికంగా ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, బీటెక్.., పరిపాలన విభాగాల్లో ఎంబీఏ, రెగ్యులర్ డిగ్రీలు తప్పనిసరి అర్హతలుగా మారాయి. ఫలితంగా గడిచిన రెండు దశాబ్దాల కాలంలో సింగరేణి కార్మికుల్లో విద్యావంతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
నూటికి తొంభైశాతం..
ప్రస్తుతం సింగరేణిలో సుమారు 43 వేలమంది కార్మికులు/ఉద్యోగులు పని చేస్తుండగా ఇందులో నూటికి తొంభైశాతం మంది విద్యావంతులే కావడం విశేషం. వీరిలో యాభైశాతం మంది డిప్లొమా, ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సులు చేసిన వారే ఉన్నారు. ఇదిలా ఉండగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకప్పుడు బొగ్గు బావుల్లో పనులంటే యువత ఎంతో ఆసక్తి చూపించేంది. కానీ ఇప్పటి కార్మికులు భూగర్భ గనుల్లోకి వెళ్లేందుకు నిరాసక్తత చూపిస్తున్నారు. ఓపెన్‌కాస్ట్, ఇతర ఉపరితల పనుల్లోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. భూగర్భ గనుల్లోకి వెళ్లాల్సి వస్తుందనే కారణంతో కొందరు ప్రమోషన్లు సైతం నిరాకరిస్తున్నారు.
సింగరేణి డే
స్వాతంత్రానికి పూర్వమే నిజాం జమానాలో బ్రిటీషర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. హైదరాబాద్ (దక్కన్) కంపెనీ లిమిటెడ్ పేరుతో 1889లో బొగ్గు తవ్వకాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 1920 డిసెంబర్ 23న కంపెనీ పేరును సింగరేణి కాలరీస్ లిమిటెడ్‌గా మార్చారు. అప్పటి నుంచి ఇదే పేరు మీద బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. కాగా 2002లో అప్పటి సింగరేణి సీఎండీ ఖాజా డిసెంబర్ 23న సింగరేణి డేగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 23న సింగరేణి డేను నిర్వహిస్తున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో ఏరియాలో ఈ వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది సింగరేణి ప్రధాన కార్యాలయం ఉన్న కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో వేడుకలు జరగనున్నాయి.
–––––––––––––––––––––––––––––––––––––––––––
సింగరేణి కార్మికుల్లో అక్షరాస్యత ఇలా (2022 డిసెంబర్ 19 నాటికి)
––––––––––––––––––––––––––––––––––
నిరక్షరాస్యులు 2,080
పదో తరగతిలోపు 3,950
ఎస్‌ఎస్‌సీ 8,587
ఇంటర్మీడియట్ 2,424
ఐటీఐ/డిప్లొమా 5,020
గ్రాడ్యుయేషన్ 5,208
మాస్టర్స్ డిగ్రీ 2,986
విద్యార్హత సరిగా నమోదు చేయని వారు 12,707
................................................
మొత్తం 42,962
............................................................
Comments
Please login to add a commentAdd a comment