
ప్రభుత్వానికి భద్రాద్రి, పెద్దపల్లి కలెక్టర్ల సూచన
ఈ రెండు జిల్లాల్లో పథకంపై అధ్యయనం
కొత్తగూడెం అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదు కోసం ఉపయోగిస్తున్న ఫేస్ రికగ్నిషన్ (ఎఫ్‌ఆర్‌ఎస్) డేటాను మధ్యాహ్న భోజన పథకా నికి కూడా ఉపయోగించాలని భద్రాద్రి కొత్తగూడెం, పెద్దప ల్లి జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలను సరిచేసి, మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అధ్యయనం చేయాలని గత శనివారం ప్రభుత్వం ఆదేశించింది.
దీంతో భద్రాద్రి కొత్తగూడెం, పెద్ద పల్లి జిల్లాల కలెక్టర్లు జితేశ్ వి.పాటిల్, కోయ శ్రీహర్ష రెండు జిల్లాల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు, బిల్లుల చెల్లింపు తదితర అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పథకంలో మార్పుచేర్పులపై రాష్ట్రస్థాయిలో 12 మంది ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో భద్రాద్రి, పెద్దపల్లి కలెక్టర్లు, డీఈఓలతోపాటు కొత్తగూడెం ఎంఈఓ, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉన్నా రు. వీరు మరోమారు అధ్యయనం చేసి సంస్కరణలపై నివేదిక సమర్పించనున్నారు.
బిల్లుల పెండింగే సమస్య..
మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధు లు సమకూరుస్తున్నాయి. వారానికి మూడుసార్లు కోడిగుడ్ల తో పాటు ఆకు, కూరగాయలతో మెనూ అమలు చేస్తున్నా రు. ఇటీవల మెనూలో మార్పులు చేసినా పూర్తిస్థాయిలో అమలు కావటంలేదు. ఈ పథకం బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సకాలంలో బిల్లులు అందక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంలో 54,200 మంది కార్మికులు ఉండగా, భద్రాద్రి జిల్లాలో 2,150 మంది పని చేస్తున్నారు. ఈ జిల్లాలో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించి గతేడాది నవంబర్ నుంచి.. 9, 10 తరగతుల వారివి సెప్టెంబర్ నుంచి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. వీరికి నెలకు రూ.3,000 చొప్పున ఇచ్చే గౌరవ వేతనాలు కూడా అందాల్సి ఉంది.
కలెక్టర్ల నివేదికలోని అంశాలు
⇒ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ సిస్టం ద్వారా నమోదు చేస్తున్నారు. ఇదే డేటాను మధ్యాహ్న భోజన బిల్లులకూ అనుసంధానం చేయాలి. దీనివల్ల రోజువారీగా ఎందరు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతుందో తెలిసిపోతుంది.
⇒ ప్రస్తుతం 1 నుంచి 5 వరకు.. 6 నుంచి 8వ తరగతి వరకు ..9 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించి మూడేసి బిల్లులు రూపొందిస్తున్నారు. అలాగే, కోడి గుడ్లకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వేతన బిల్లు.. ఇలా ఆరు బిల్లులను రూపొందించి ప్రభుత్వానికి పంపుతున్నారు. వీటి ఆధారంగా ఈ–కుబేర్ నుంచి కార్మికులకు బిల్లుల సొమ్ము అందిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడైనా అవాంతరం ఎదురైతే నెలల తరబడి బిల్లులు పేరుకుపోతు న్నాయి. దీంతో కొందరు వంట సిబ్బంది అప్పులు చేసి భోజనాలు వండిపెడుతున్నారు. ఎలాంటి జాప్యం లేకుండా బిల్లుల తయారీ, చెల్లింపునకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను భోజన బిల్లులకు అనుసంధానిస్తే మెరుగైన ఫలితం ఉంటుందని కలెక్టర్లు నివేదికలో సూచించారు.