
ఏటా ఆరోగ్య రంగంపై రూ.500 కోట్ల వ్యయం.. రిఫరల్ ఆస్పత్రులకే రూ.150 కోట్ల చెల్లింపులు
ఇవి తగ్గించేలా రామగుండం, కొత్తగూడెం ఆస్పత్రుల అప్‌గ్రేడ్
హైదరాబాద్‌లో సొంతంగా అత్యాధునిక ఆస్పత్రి నిర్మాణానికి ప్రణాళిక
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సింగరేణి (Singareni) ఇప్పుడు సంస్థ పరిధిలో పనిచేసే వారి ఆరోగ్యంపై కూడా దృష్టి సారించింది. కార్మికులు, ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రైవేట్ ఆస్పత్రులకు నగదు చెల్లించే బదులు.. హైదరాబాద్‌లో సొంతంగానే కార్పొరేట్ స్థాయి ఆస్పత్రిని నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది.
లక్ష కుటుంబాలకు సేవలు..
సింగరేణి సంస్థ పరిధిలో కార్మికుల నుంచి ఎగ్జిక్యూటివ్ కేడర్ వరకు మొత్తంగా 42 వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో 34 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. సింగరేణిలో రిటైర్డ్ అయి హెల్త్ స్కీంలో ఉన్నవారు మరో 30 వేలమంది వరకు ఉన్నారు. మొత్తంగా లక్షకు పైగా కుటుంబాలకు సింగరేణి వైద్యసేవలు అందిస్తోంది. ఇందుకోసం సంస్థ విస్తరించిన ఆరు జిల్లాల పరిధిలో ఆస్పత్రులు ఉన్నాయి. మెరుగైన వైద్యం కోసం రామగుండం, భూపాలపల్లి, మణుగూరు, శ్రీరాంపూర్‌లో రీజనల్ ఆస్పత్రులు, కొత్తగూడెంలో ప్రధాన ఆస్పత్రి ఉంది. వైద్య, ఆరోగ్య విభాగాల కింద ఏటా రూ.500 కోట్ల వరకు సింగరేణి వెచ్చిస్తోంది.
రిఫరల్‌కే రూ.150 కోట్లు..
సాధారణంగా సింగరేణి పర్మనెంట్ ఉద్యోగులు, కార్మికులకు ఆరోగ్య సమస్య ఎదురైతే తొలుత ఆయా ఏరియాల్లో ఉన్న డిస్పెన్సరీలు, ఏరియా ఆస్పత్రులకు వెళతారు. వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాక, అవసరమైతే ఏరియాల నుంచి రామగుండంలోని రీజినల్, కొత్తగూడెం (Kothagudem) ప్రధాన ఆస్పత్రికి రిఫర్ చేస్తారు. ఇక్కడ కూడా నయం కాని అనారోగ్య సమస్యలు ఉన్నా, అత్యవసర, ఆధునిక వైద్యసేవలు అవసరమైనా హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు.
అయితే సింగరేణిలో గత కొన్నేళ్లుగా రిఫరల్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. గడిచిన రెండేళ్లలో ఏకంగా 47,201 మందిని హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. దీంతో రిఫరల్ కార్పొరేట్ ఆస్పత్రులకు చెల్లించే బిల్లు ఏటా సుమారు రూ.150 కోట్లు ఉంటోంది. సింగరేణి రిఫర్ చేస్తున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని, దీనిపై దృష్టి సారించాలని సింగరేణి సీఎండీ బలరామ్ ఇటీవల సంస్థ పరిధిలోని వైద్యులకు సూచించారు.
ఆయా ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపరుస్తూ...
ఆరోగ్య రంగంపై ఖర్చులో దాదాపు 30 శాతం వరకు రిఫరల్ వైద్యసేవల పేరిట కార్పొరేట్ ఆస్పత్రులకే చెల్లించాల్సి రావడంపై సింగరేణి దృష్టి సారించింది. దీంతో రామగుండం ఆస్పత్రిలోని సూపర్ స్పెషాలిటీ విభాగంలో కార్డియో సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. సింగరేణి కార్మికులు ఎక్కువగా ఎదుర్కొనే శ్వాసకోస, కంటిచూపు, కీళ్ల నొప్పులు తదితర విభాగాల్లోనూ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. మలివిడతగా కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.
చదవండి: టోల్ ప్లాజాల్లో చార్జీలు.. ఏ వాహనానికి ఎంత?
హైదరాబాద్‌లోనూ..
బొగ్గుతోపాటు థర్మల్, సోలార్, పంప్డ్ స్టోరేజ్ హైడల్ పవర్ ఉత్పత్తిలో సింగరేణి అడుగు పెడుతోంది. తొలిసారి తెలంగాణ వెలుపల ఒడిశా, రాజస్తాన్‌లో సంస్థ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. మరోవైపు కొత్తగూడెం, రామగుండం (Ramagundam) వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సేవలు అందించే నిపుణుల కొరత ఏర్పడే అవకాశాన్ని సంస్థ పరిగణనలోకి తీసుకుంటోంది. దీంతో ఓ వైపు సంస్థ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం, వైద్యసేవలను అప్‌గ్రేడ్ చేస్తూనే, వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసే వారికి అనుకూలంగా ఉండేలా హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సొంతంగా నిర్మించే దిశగా సింగరేణి ప్రణాళిక సిద్ధం చేస్తోంది.