మిగిలిన ఏరియాల్లోనూ నిర్మాణానికి సన్నాహాలు
ఎకో టూరిజం అభివృద్ధికి సింగరేణి ప్రోత్సాహం
లోతైన క్వారీలు, ఎత్తైన మట్టి దిబ్బలు, రాకాసి బొగ్గు, దుమ్మూ ధూళి.. సింగరేణి గనులు (Singareni Mines) అనగానే ముందుగా గుర్తొచ్చేది ఇవే.. కానీ ఇప్పుడు అందమైన వనాలు, ఔషధ మొక్కలు, సీతాకోక చిలుకల పార్కులకు (Butterfly Park) సింగరేణి పాత గనులు చిరునామాలుగా మారుతున్నాయి. మైనింగ్‌లో జరిగే నష్టాలను ఆయా సంస్థలే పూరించాలని కేంద్ర పర్యావరణ శాఖ తెచ్చిన నిబంధన మేరకు మూసివేసిన గనుల వద్ద సింగరేణి సంస్థ కొన్నాళ్లుగా భారీగా మొక్కలు నాటి అడవులు (Forests) పెంచుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అందమైన ఎకో పార్కులను అభివృద్ధి చేయటం మొదలుపెట్టింది. కొత్తగూడెంలో ఎనిమిది హెక్టార్ల విస్తీర్ణంలో ఎకో పార్క్‌ను ఇప్పటికే సిద్ధం చేసింది. - సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
అందమైన వనాలు
సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో రూ.3 కోట్లతో ఏర్పాటుచేసిన ఎకో పార్క్‌లో బటర్‌ఫ్లై గార్డెన్‌ను ఏర్పాటుచేశారు. ఎడారి, ఔషధ మొక్కలు, తాళ్లవనం (వివిధ దేశాలకు చెందిన తాటి చెట్లు), బోన్సాయ్ వంటి వివిధ దేశాల అరుదైన మొక్కలతో వేర్వేరు థీమ్‌లతో ఈ పార్క్‌ను అభివృద్ధి చేశారు. పార్క్ ప్రాంగణంలోనే సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండు కొలనులు ఉన్నాయి. సందర్శకులు ధ్యానం చేసుకునేందుకు బుద్ధవనం సిద్ధంగా ఉంది.
వీటితోపాటు బర్డ్‌వాచ్ సెంటర్, వ్యూ పాయింట్, టాయిలెట్లు, కెఫటేరియాలు సిద్ధమయ్యాయి. పట్టణానికి దూరంగా నలువైపులా ఎత్తయిన కొండలు, దట్టంగా పరుచుకున్న చెట్ల నడుమ ఆధునిక సౌకర్యాలతో ఈ ఎకో పార్క్‌ను ఏర్పాటుచేశారు. ఇక్కడికి స్టడీ టూర్ల కోసం విద్యార్థులు వస్తున్నారు.
టూరిజం శాఖకు అప్పగించే యోచన
శ్రీరాంపూర్ ఏరియాలో మరో ఎకో పార్క్ (Eco Park) నిర్మా ణం జరుగుతోంది. ఈ రెండింటి తరహాలోనే సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో ఎకో పార్క్‌లను రెండుమూడేళ్లలో ఏర్పాటుచేస్తారు. ఆ తర్వాత భవిష్యత్‌లో మూతపడే ప్రతీ గని వద్ద ఇలాంటి పార్కులు నెలకొల్పుతారు. వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చాక టూరిజం శాఖకు అప్పగించే యోచనలో సింగరేణి ఉంది. ఇప్పుడిప్పుడే ఎకో టూరిజం పుంజుకుంటుండటం,ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉండడంతో సింగరేణి సహకారం పర్యాటకరంగానికి మరిన్ని వన్నెలు అద్దనుంది.
మైనింగ్‌పై అవగాహన కల్పించేలా..
ఎకో పార్క్ పక్కనే ఉన్న గౌతం ఖని ఓపెన్‌కాస్ట్ ఓవర్ బర్డెన్ మట్టి దిబ్బలపై పెంచిన వనంలో సైక్లింగ్ ట్రాక్, నాలుగు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ పాత్‌లను అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని ఎకో అడ్వెంచర్ పార్క్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు. పార్క్ సమీపంలో వెంకటేశ్ ఖని మెగా ఓపెన్‌కాస్ట్ త్వరలో మొదలుకానుంది. దీంతో ఓపెన్‌కాస్ట్ ఉపరితలంపై మరో వ్యూ పాయింట్ (View Point) సిద్ధం చేసి.. ప్రతీరోజు నిర్ణీత సమయంలో గనుల్లో జరిగే బ్లాస్టింగ్‌ను సందర్శకులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా మైనింగ్ ప్రక్రియలో అడవులు, భూమి, జలవనరులకు జరిగే నష్టాలు ఎలా ఉంటాయి? వాటిని భర్తీ చేయడంలో సింగరేణి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: ఇప్పటి రాజోలి.. ఒకప్పుడు అడవి
Comments
Please login to add a commentAdd a comment