12వ శతాబ్దం నాటి వైకుంఠ నారాయణస్వామి ఆలయం
ఆకట్టుకునే అద్భుత కళా శిల్పాలు
తిరుమల శ్రీనివాసుడిని దర్శించినంత ఫలితం
పురాతన ఆలయం, చెక్కు చెదరని శిల్పకళా సౌందర్యం, ఆహ్లాదకరమైన తుంగభద్ర (Tungabhadra) నదీతీరం.. వెరసి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే రాజోలి (Rajoli) వైకుంఠ నారాయణస్వామి నిలయం. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కల్యాణి చాళుక్య రాజు త్రిభువన మల్ల సోమేశ్వరుడు నిర్మించారని ఆధారాలు చెబుతున్నాయి. వైకుంఠ నారాయణస్వామి ఆలయం ముందు భాగంలో గరుత్మంతుని గుడి ఉంది. గుడికి ఎడమ భాగాన ధ్వజపీఠం, ఆ వెనుక బలిపీఠాలు ఉన్నాయి. వైకుంఠంలో వెలసిన శ్రీమన్నారాయణుడే రాజోలిలో కొలువైనట్లు భక్తుల విశ్వాసం. ఇక్కడున్న శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడు. మూడున్నర అడుగుల దివ్య మంగళుడు.
అన్నిచోట్లా దర్శనమిస్తున్నట్టు కాకుండా.. ఇక్కడ చక్ర హస్తంలో గధ, గధ హస్తంలో చక్రం ధరించి ఉంటాడు. ఇలాంటి స్వామివారి దర్శనం ఎక్కడా ప్రాచుర్యంలో లేదు. నారాయణుడికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామి నెలకొన్న పీఠం రెండు అడుగుల ఎత్తు, అడుగున్నర వెడల్పు ఉంది. ఒకటిన్నర ఎత్తు ఉన్న అమ్మవారి విగ్రహాలు అందంగా, కళాత్మకంగా ఉన్నాయి. పక్కగుడిలోని అమ్మవారు కూర్చున్న పీఠం అడుగు కాగా, ఆమె మూర్తి ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉంది. దేవాలయం బయట పురాణ, మాయణ, గవత, వైష్ణవ పురాణగాథలు, జలభూభాగాల్లోని జంతు జాలాలను అద్భుత శిల్ప కళానైపుణ్యం ఉట్టి పడేలా మలిచారు. ఈ శిల్ప కళను చూడాలంటే రెండు కళ్లు చాలవు.
ఇప్పటి రాజోలి.. ఒకప్పుడు అడవి
గజేంద్ర మోక్షం(Gajendra Moksham) ఆధారంగా ఆలయ నిర్మాణం జరిగిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ప్రస్తుతం రాజోలి గ్రామం ఉన్న ప్రదేశమంతా అడవి. దీనికి కొద్ది దూరంలో రాంపాడు అనే గ్రామం ఉండేది. ఈ అడవిలో ఏనుగులు విపరీతంగా సంచరిస్తుండేవి. వేసవి కాలంలో ఏనుగులు తాగునీటికి చాలా ఇబ్బంది ఉండేవి. అక్కడికి కొద్దిదూరంలో అంటే.. ప్రస్తుతం తూర్పు గార్లపాడు గ్రామం దగ్గర దేవమ్మ మడుగు ఉండేది. ఏనుగులు అక్కడికి వెళ్లి దాహం తీర్చుకునేవి.
ఒకరోజు ఏనుగులు దాహం తీర్చుకోవడానికి వెళ్లగా ఆ మందకు పెద్దదిక్కైన ఒక ఏనుగును మడుగులో ఉన్న మొసలి పట్టుకుంది. ఎంతకూ అది వదలకపోవడంతో ఆ ఏనుగు నారాయణుడిని ప్రార్థించిందని.. ఆ మొర విన్న స్వామి వైకుంఠం నుంచి ఏనుగును కాపాడేందుకు వచ్చారని భక్తుల నమ్మకం. శరణు వేడుకున్న వారిని కాపాడాలనే తొందరలో శంఖు, చక్ర, గధ, పద్మధరుడైన మహా విష్ణువు, చక్ర హస్తంలో గధ, గధ హస్తంలో చక్రం ధరించి వచ్చారంటారు. ఆ విషయం అమ్మవార్లు చెప్పాక స్వామివారు గమనించారని.. శరణు కోరిన ఏనుగును చక్రంతో కాపాడారని.. దాని ఆధారంగా ఇక్కడ గుడి నిర్మాణం జరిగిందని స్థానికులు చెబుతారు.
తిరుమల వెంకన్నను దర్శించినంత ఫలితం
అప్పట్లో కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతీయులు, వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలకు వెళ్లారు. వారిని అక్కడివారు ఎక్కడినుంచి వచ్చారని పలకరించగా.. తాము తుంగభద్ర నదీతీరంలోని రాజోలి ప్రాంతం వారిమని సమాధానమిచ్చారు. అందుకు వారు ఆశ్చర్యానికి లోనై.. సాక్షాత్తు వైకుంఠ నారాయణస్వామి కొలువైన ఆ దేవాలయాన్ని వదిలి ఇంత దూరం వచ్చారా? ఇక్కడి శ్రీనివాసుడే అక్కడి వైకుంఠ నారాయణుడని, అది సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి సన్నిధిని.. కలియుగ వైకుంఠమని స్పష్టం చేసినట్టు ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే తుంగభద్ర నదిలో రాంపాటి ఈశ్వరాలయం ఉంది.
శ్రీమదలం పురీక్షేత్ర మహత్మ్యమ్ (స్థల పురాణం)లో ఒక శ్లోకం ఉంది. అందులో ‘తుంగా నారాయణస్సాక్షాత్ భద్రాదేవోమహేశ్వరః ఉభయోసంగమే యత్ర ముక్తిస్త్రత నసంశయః’.. అంటే తుంగ, భద్ర అనే రెండు నదులు పశ్చిమ కనుమల్లో వేర్వేరు చోట్ల ద్వారా ఒకచోట రెండు కలుస్తాయి. ఉంగానది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కాగా భద్రా నది పరమేశ్వరుడిగా చెబుతారు. ఈ నదులు ఎక్కడ ప్రవహిస్తాయో.. అక్కడ స్నానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. అంతటి పవిత్రమైన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది రాజోలి. ఇక్కడ వైకుంఠనారాయణ ఆలయంతో పాటు ఎడమవైపు శ్రీలక్ష్మి ఆలయం, వాయవ్య దిశలో అంజనేయ స్వామి, వేణుగోపాలస్వామి ఆలయం, నవగ్రహాలయం, ఈశ్వరాలయం, భువనేంద్రస్వామి ఆలయం ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది.
ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ వైకుంఠ నారాయణస్వామి ఆలయం నిరాదరణకు గురవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖలో విలీనమైనా.. ఆలయానికి మాన్యాలున్నా అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయాన్ని వెలుగులోకి తెస్తే ముక్కోటి ఏకాదశి రోజు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తిరుపతి దాకా వెళ్లనవసరం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలయం ఒక్క రాజోలికే కాక తెలంగాణకు, దేశానికే తలమానికమని వారు స్పష్టం చేస్తున్నారు.
చదవండి: ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!
ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోకపోయినా.. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఆలయాన్ని అభివృద్ధిలోకి తెచ్చి చరిత్రను కాపాడాలని కోరుతున్నారు. ఇప్పటికే ముక్కోటి ఏకాదశికి జిల్లా నలుమూలలతో పాటు, కర్నూల్ జిల్లా నుంచి భక్తులు వస్తుంటారు. అమావాస్య రోజు, వైకుంఠ ఏకాదశి రోజు స్థానికులు దాతల సహాయంతో వేలాది మంది భక్తులకు అన్నదానం, అల్పాహారం, తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. పుష్కరాల సమయాల్లో తుంగభద్ర నదీ పరీవాహక గ్రామాల్లో ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే ఆలయం మరింత అభివృద్ధిలోకి నోచుకుంటుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక దృష్టి పెట్టాలి
రాజోలిలోని వైకుంఠ నారాయణస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ప్రభుత్వం ఈ ఆలయంపై శ్రద్ధ పెట్టాలి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఇది చాలా మందికి తెలియక ఎన్నో వ్యయ ప్రయాసలతో దూరాన ఉన్న క్షేత్రాలకు వెళ్తున్నారు. ఈ ఆలయం విశిష్టత తెలిసినట్లయితే భక్తులు ఎక్కువగా దర్శించుకుని, ఆలయాభివృద్ధి జరిగే అవకాశముంది.
– సురేశ్, శాంతినగర్
చరిత్ర కలిగిన ఆలయం
గజేంద్ర మోక్షం ఆధారంగా నిర్మించిన వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో ప్రతి ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. చరిత్ర కలిగిన ఈ ఆలయం వివక్షకు గురవుతోంది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఆలయం ప్రాచుర్యంలోకి తీసుకురావాలని స్థానికంగా ఎంతో కృషి చేస్తున్నాం. ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాలు, భజనలు చేస్తూ ఆధ్యాత్మికత భావనను పెంచుతున్నాం. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి.
– అంజి, రాజోలి
Comments
Please login to add a commentAdd a comment