Jogulamba District
-
5 జిల్లాల్లో 43 డిగ్రీల పైనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, జోగుళాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 43.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డిలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలోని 18 మండలాలకు చెందిన 20 గ్రామాల్లో 43 డిగ్రీలు దాటిపోయింది. ఈ జిల్లాలోని మాడుగులపల్లి మండల కేంద్రంతోపాటు మునుగోడు మండలం గూడాపూర్‌లో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దామరచర్ల మండల కేంద్రం, అనుముల మండలం ఇబ్రహీంపేట, కనగల్ మండల కేంద్రం, మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామాల్లో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎండలు తీవ్రం కావడంతో వడదెబ్బ కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన గాదె జయపాల్‌రెడ్డి (55) గురువారం వడదెబ్బకు గురికాగా హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ తండా గ్రామానికి చెందిన ధరావత్ మంచ్యా (55) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీకి చెందిన స్వర్ణలత (45) రెండ్రోజుల క్రితం నిజామాబాద్‌లో పెళ్లికి హాజరైంది. ఎండల తీవ్రతతో అస్వస్థతకు గురైంది. నిర్మల్‌కు వచి్చన తర్వాత గురువారం రాత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన రైతు మర్రిపల్లి ఈరయ్య (70) పొలం పనులకు వెళ్లి ఎండ దెబ్బతగలడంతో గురువారం మృతి చెందాడు. -
Gadwal BRS Meeting: ధరణిపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, జోగులాంబ గద్వాల: ముఖ్యమంత్రి కేసీఆర్ జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని.. అలాగే, జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ పప్రారంభించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, గద్వాల సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గద్వాలలో అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. పాత గద్వాలకు.. నేటి గద్వాలకు ఎంతో తేడా ఉంది. జిల్లా ప్రజలకు జోగులాంబ దీవెనలు ఉండాలి. గద్వాలకు త్వరలో మెడికల్ కాలేజీ రాబోతోంది. ఒక్క మెడికల్ కాలేజీ లేని జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయి. దేశంలోనే అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది. తెలంగాణ అద్భుత ప్రగతి సాధించాం. మరో 5-10 ఏళ్లు ఇలాగే కష్టపడితే మనకు ఎదురుండదు. మానవీయ కోణంలో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రగతిలో మనకన్నా ఎత్తుగా ఉన్న అనే స్టేట్స్ను అధిగమించాం. గతంలో మనం వలస పోయాం. ఇప్పుడు వేరే వాళ్లు ఇక్కడికి వలస వస్తున్నారు. గత పాలకులెవరూ ప్రజలను పట్టించుకోలేదు. రైతుబంధుతో అన్నదాతలకు అండగా నిలిచాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కంటివెలుగు పథకాన్ని తీసుకొచ్చాం. ధరణి తీసేస్తామంటూ కొందరు మాట్లాడుతున్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిసేస్తామంటున్నారు. మూడేళ్లు కష్టపడి ధరణిని తీసుకొచ్చాం. ధరణితోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. ధరణితో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టాం. ధరణి ఉండాలా.. తీసేయాలా.. మీరే చెప్పండి అని ప్రజలను ప్రశ్నించారు. ధరణిని తీసేస్తామంటున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి. తెలంగాణ వస్తే చీకటి అయిపోతుందన్నారు. తెలంగాణలో ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: నిధులు అడిగే దమ్ము లేదు.. అలాంటోడు మంత్రిగా ఉండడం నల్లగొండ దురదృష్టం -
ఈతకు వెళ్లి నలుగురు మృత్యువాత
మానవపాడు/కర్నూలు: కృష్ణానదిలో సరదాగా ఈత కోసం వెళ్లిన వారు.. ప్రమాదవశాత్తు మునిగిపోయి మృత్యువాత పడ్డారు. ఒకరిని కాపాడబోయి మరొకరు చివరికి నలుగురు మృతిచెందిన విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు శివారు మంగంపేటలో చోటుచేసుకుంది. కోదండాపురం ఎస్ఐ వెంకటస్వామి, స్థానికుల కథనం ప్రకారం.. ఇటిక్యాల మండలంలోని వల్లూరుకు చెందిన అన్నదమ్ములు ఇస్మాయిల్, ఇబ్రహింలు బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలు నగరంలోని వీకర్‌సెక్షన్ కాలనీకి వెళ్లి స్థిరపడ్డారు. వేసవిసెలవుల కావడంతో కుటుంబసభ్యులతో కలిసి మానవపాడు మండలంలోని బోరవెల్లిలో బంధువుల ఇంటికి నాలుగు రోజుల క్రితం వచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఈత కోసం మేనత్త కుమారుడైన ఇమాంతో కలిసి ఇస్మాయిల్ కుమారులు సమీర్(18), రియాన్(14), ఇబ్రహిం కూతుళ్లు ఆఫ్రిన్(17), నవసీన్ (13)తో పాటు మరో ఐదుగురు కలిసి ఆటోలో మంగంపేట శివారులో కృష్ణానదికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలో లోతు గమనించకుండా ముందుకు వెళ్లడంతో రియాన్ మునిగిపోగా.. ఆఫ్రిన్, నవసీన్ కాపాడటానికి వెళ్లగా.. ముగ్గురికీ ఈత రాకపోవడంతో గల్లంతయ్యారు. వెంటనే వీరిని కాపాడేందుకు వెళ్లిన సమీర్ సైతం నీటిలో మునిగిపోయాడు. నలుగురు గల్లంతవడంతో ఇమాం కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మత్స్యకారుల సహాయంతో మృతదేహాలను వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. విగతా జీవులుగా పడి ఉన్న పిల్లలను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
ప్రసవం మధ్యలో వెళ్లిపోయిన వైద్యురాలు.. పసికందు మృతి
సాక్షి, గద్వాల: ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి సకాలంలో వైద్యం అందించడంలో వైద్యురాలు నిర్లక్ష్యం కనబరచడంతో పురిటిలోనే శిశువు మృతిచెందింది. ఈ సంఘటన ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. జిల్లాలోని రాజోళి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన ఖలీఫా తొలి ప్రసవం కోసం ఈ నెల 16న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. సాధారణ కాన్పు అయ్యేలా చూస్తామని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో వైద్యురాలు నర్మద, సిబ్బంది ప్రసవం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో వైద్యురాలు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. కాన్పు కాకముందే వెళ్లిపోవడం వల్లే పసికందు మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయమై వైద్యురాలు నర్మద స్పందిస్తూ పాప ఉమ్మనీరు తాగి పరిస్థితి విషమంగా మారడంతో ఆపరేషన్ చేయాలని చెప్పినా కుటుంబ సభ్యులు వినిపించుకోలేదన్నారు. కాన్పు కాకముందే వెళ్లిపోయానన్న ఆరోపణలు అవాస్తవం అన్నారు. తన డ్యూటీ సమయం అయిపోయినప్పటికీ విధులు నిర్వహించానని పేర్కొన్నారు. పసికందు మృతిపై విచారణకు ఆదేశించామని కలెక్టర్ వల్లూరి క్రాంతి ‘సాక్షి’కి తెలిపారు. విచారణలో వైద్యుల తప్పిదం ఉందని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గతంలోనూ సస్పెండ్ డాక్టర్ నర్మద గతంలో ఓసారి ఇలాంటి సంఘటనలో సస్పెండ్ అయినట్లు తెలిసింది. ధరూర్ మండలం జాంపల్లికి చెందిన దీపిక అనే గర్భిణి కాన్పు సమయంలో ఆమె నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందాడు. దీంతో అప్పటి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేసినట్లు సమాచారం. -
కంటిలో నుంచి బియ్యపు గింజలు.. బాలిక నరకయాతన..
-
పేదలపై మరో గుదిబండ.. గోలి.. జేబు ఖాళీ!
సామాన్యులు, మధ్య తరగతి వారిపై మరో పిడుగు పడనుంది. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న వారు.. ఇకపై జ్వరం గోలికి సైతం అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వివిధ రకాల కారణాలతో ఔషధ కంపెనీలు 10.7 శాతం మేర ధరలు పెంచుకునేందుకు ఎన్పీపీఏ అనుమతిచ్చింది. గత నెల నుంచే కొన్నిరకాల మందుల ధరలు పెరగగా.. తాజాగా మిగతా వాటి పెంపునకు చర్యలు చేపడుతున్నారు. ఫలితంగా మందు గోలీల రూపంలో పేదలపై మరో గుదిబండ పడనుంది. అయిజ రూరల్ (జోగులాంబ గద్వాల): నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) తీసుకుంటున్న నిర్ణయంతో ఔషధ మందులు కొనుగోలు చేసేవారి జేబులు ఖాళీ కానున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే మార్కెట్లో ఉన్న మందుల ధరలకు అదనంగా మరో 10.7 శాతం పెరగనున్నాయి. గత నెలలోనే ఆయా కంపెనీలకు ధరలను పెంచుకునే అవకాశం కల్పించడం వల్ల ఇప్పటికే మార్కెట్లో లభించే కొన్ని మందుల ధరలు పెరిగాయి. ఎన్పీపీఏ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మార్కెట్లో లభించే మందుల్లో దాదాపు 800 రకాల ధరలు పెగనున్నాయి. జ్వరం, గుండె వ్యాధులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, అనీమియా వంటి వ్యాధులకు మందులు కొనాలంటే ఇక నుంచి కొనుగోలు దారుడికి భారంగా మారనుంది. సాధారణంగా వాడే మందుల్లో పారాషిటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లో క్యాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనీడజోల్ లాంటి మందులు పెరుగుతున్న వాటి జాబితాలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. సామాన్యులపైనే.. ఫార్మాసూటికల్ కంపెనీలు పెంచుతున్న ధరలు సామాన్యుడికి గుదిబండగా మారనున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో వివిధ రకాల వ్యాధుల బారిన పడినవారు కాకుండా, ప్రధానంగా బీపీ, షుగర్ వ్యాధులు ఉన్న వారు రూ.6 వేలకు పైచిలుకు ఉంటారని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో కూడా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే అధికంగా ఉంటారని చెబుతున్నారు. ఈ రెండు వ్యాధుల బారిన పడిన వారిలో దాదాపు 15 శాతం మంది మాత్రమే ప్రభుత్వం ద్వారా అందే మందులను వాడుతుండగా, మిగిలిన 85 శాతం వ్యాధిగ్రస్తులు ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుగోలు చేసి వాడుతున్నారు. ప్రైవేటు దుకాణాల్లో మందులు వాడుతున్న వారికి నెలకు రూ.2,500 వరకు ఖర్చు అవుతుంది. ఈ రూపేణా చూసుకున్న ఇప్పుడు పెరిగిన మందుల ధరల ప్రకారం వారికి ఏడాదికి రూ.3,210 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అసలే పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరోవైపు పెరిగిన మందుల ధరలు గుదిబండగా మారనున్నాయి. పెరుగుదల ఎందుకు..? కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ గణాంకాల ఆధారంగా 2020 సంవత్సరంతో పోలిస్తే 2021కి గాను మందుల టోకు ధరల సూచి ఇప్పటికే 10.7 శాతానికి పెరిగినట్లు ఎన్పీపీఏ ప్రకటించింది. ఈ నిర్ణయం మేరకు 2019లో మాత్రం ఔషధ కంపెనీలు మందుల ధరలను 2 శాతానికి పెంచుకోగా, అదే 2020 సంవత్సరంలో మాత్రం 0.5 శాతమే పెంచుకునే అవకాశం ఔషధ కంపెనీలకు కల్పించింది. కోవిడ్ అనంతరం మాత్రం మందుల తయారీ కోసం ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడం, ప్యాకింగ్, రవాణా ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఔషధ కంపెనీలకు ధరలు పెంచక తప్పడం లేదనే వాదనలు ఉన్నాయి. పేదలు ఎలా కొనాలి.. మందులు ధరలు ఇలా పెరిగితే సామాన్యులు ఎలా కొనాలి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరిగి పేదవాడు అనేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు మందుల ధరలు పెరిగితే అదే పేదవాడు ఎలా కొని వ్యాధిని నయం చేసుకోవాలి. జ్వరం గోలి కూడా ధర పెరుగుతుంది అంటున్నారు. ఇలా అయితే చాలా కష్టం. – ఆంజనేయులుగౌడ్, గట్టు దశల వారీగా పెంపు.. మందుల తయారికి ఉపయోగించే ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల ఔషధ మందుల ధరలు కూడా పెరగనున్నాయి. ఇప్పటికే కొన్ని మందుల ధరలు నిబంధనల మేరకు పెరిగాయి. ఇంకా మరికొన్ని ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే దశల వారీగా పెరుగుతాయి. – శ్రీకాంత్, డ్రగ్ ఇన్స్పెక్టర్, గద్వాల -
నడిగడ్డ.. నకిలీ లిక్కర్ అడ్డా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఇప్పటికే నకిలీ పత్తివిత్తనాలు, నకిలీకల్లు, రేషన్ రీసైక్లింగ్‌తో అక్రమాలకు అడ్డాగా మారిన నడిగడ్డలో మరో నకిలీ వ్యవహారం బయటపడింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాతపాలెంలో నకిలీ లిక్కర్ తయారీ దందా బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నకిలీ మద్యాన్ని గోవా, కర్ణాటక లిక్కర్ పేరిట చుట్టుపక్కల ప్రాంతాల్లోని బెల్ట్‌షాపులకు సరఫరా చేయడంతోపాటు బ్రాండెడ్ లేబుళ్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రవాణా చేస్తున్నట్లు వెల్లడైంది. ముఠా పట్టుబడిందిలా.. రెండురోజుల క్రితం కర్ణాటక నుంచి స్పిరిట్ (100శాతం ప్యూర్ ఆల్కహాల్) లోడ్‌తో కారు వస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు.. గద్వాల జిల్లా పాతపాలెం వద్ద కాపు కాసి పట్టుకున్నారు. 70 లీటర్ల (2 క్యాన్లు) స్పిరిట్‌ను, వాహనాన్ని నడుపుతున్న పాతపాలెం నివాసి వీరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టు తెలిసింది. దీనితో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఆదివారం పాతపాలెంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న గోపి అనే వ్యక్తి ఇంటిపై దాడులు చేశారు. నకిలీ మద్యం తయారుచేసే యంత్రం, బ్రాండెడ్ మద్యానికి సంబంధించిన నకిలీ లేబుళ్లు, ఫ్లేవర్, 35 లీటర్ల స్పిరిట్ డబ్బా, 50 ఇంపీరియల్ బ్లూ మద్యం సీసాల కాటన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాతో సంబంధమున్న అలంపూర్ మండలం బొంగూరుకు చెందిన లోకేశ్‌గౌడ్, కల్లుకుంట్లకు చెందిన నాగరాజుగౌడ్, సింగవరానికి చెందిన బాబుగౌడ్, మల్దకల్ మండలం మద్దెలబండకు చెందిన ఈరన్నగౌడ్ ఇళ్లలోనూ సోదాలు చేశారు. బాబుగౌడ్ ఇంట్లో 140 లీటర్ల స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ ముఠా కర్ణాటక నుంచి స్పిరిట్ తీసుకొచ్చి నకిలీ మద్యం తయారుచేసి, గద్వాల జిల్లా, పరిసర ప్రాంతాలతోపాటు ఏపీలోని కర్నూల్ జిల్లాలోని బెల్టుషాపులకు విక్రయిస్తున్నట్టు విచారణలో గుర్తించారు. కర్నూల్‌కు చెందిన నారాయణగౌడ్, రాయచూర్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌లకు దందాలో భాగస్వామ్యం ఉన్నట్టు తేల్చారు. 8 మంది అరెస్టు.. నకిలీ మద్యం ముఠా, దాడుల వివరాలను ఎక్సైజ్ ఉప కమిషనర్ దత్తురాజుగౌడ్ సోమవారం వెల్లడించారు. మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేశామని, రాయచూర్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. మొత్తంగా రూ.15 లక్షల విలువైన 210 లీటర్ల స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కీలక ప్రజాప్రతినిధి అండతో..! నకిలీ మద్యం దందాలో.. పాతపాలెంకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి, మరో ప్రభుత్వ ఉద్యోగి సోదరుడు భాగస్వాములుగా ఉన్నారని, ఇన్నాళ్లుగా అక్రమార్కులకు జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల గ్రామదేవతల ఉత్సవాల నేపథ్యంలో సదరు కీలక ప్రజాప్రతినిధితో వ్యవహారం బెడిసికొట్టిందని.. ఈ క్రమంలోనే నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు జరిగాయని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఆ ముఖ్య ప్రజాప్రతినిధి వద్ద గతంలో పనిచేయగా.. అతడి సోదరుడు మద్యం దందాలో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే వారిని ఈ కేసు నుంచి తప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక నుంచి స్పిరిట్.. గుట్టుగా బెల్టుషాపులకు.. గద్వాల నియోజకవర్గంలో కేటీదొడ్డికి కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సరిహద్దుగా ఉంది. అక్కడి నుంచి స్పిరిట్ (100శాతం ప్యూర్ ఆల్కాహాల్) గద్వాల జిల్లాకు సరఫరా అవుతోంది. రాయచూర్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్ ఈ స్పిరిట్ కొనుగోలు, అమ్మకం, రవాణాలో కీలకమని సమాచారం. ఇక గోపి, వీరేశ్, వీరేశ్‌గౌడ్, లోకేశ్ గౌడ్, నాగరాజుగౌడ్ తదితరులు ఆ స్పిరిట్‌ను ఉపయోగించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ.. స్థానికంగా బెల్టుషాపులకు సరఫరా చేస్తుంటారని తెలిసింది. మరోవైపు ఆలంపూర్ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా సరిహద్దుగా ఉండటంతో.. ఆ జిల్లా మీదుగా ఏపీలోకి రవాణా చేస్తున్నారు. కర్నూల్‌కు చెందిన నారాయణగౌడ్ స్థానికంగా, గద్వాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో బెల్ట్‌షాపులకు నకిలీ మద్యం సరఫరాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. వీరంతా కొన్నేళ్లుగా చైన్ పద్ధతిలో మద్యం తయారీ, అమ్మకాలు చేస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. అంతేకాదు.. ఈ ముఠాలో ఐదుగురికి బినామీ పేర్లతో వైన్స్‌షాపుల భాగస్వామ్యం ఉందని, అయినా డబ్బుల కోసం నకిలీ మద్యం దందాకు దిగారని అంటున్నారు. నకిలీ మద్యం తయారీ ఇలా.. కర్ణాటక నుంచి వచ్చిన స్పిరిట్‌ను ఉపయోగించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బ్రాండెడ్ మద్యం వాసన, రంగు వచ్చేలా ఫ్లేవర్లు, నీళ్లు కలుపుతున్నట్టు తేల్చారు. అనుమానం రాకుండా చీప్ లిక్కర్ బాటిళ్లలో నింపి, లేబుళ్లు కూడా అతికించి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. -
జోగులాంబ గద్వాల్లో ఎస్సై వీరంగం.. వీడియో వైరల్
సాక్షి, రాజోళి (జోగులాంబ గద్వాల్): జిల్లాలోని రాజోళిలో ఓ ఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించాడు. కర్నూలుకు చెందిన ఇద్దరు వ్యక్తులపై తోటి సిబ్బందితో కలిసి విచక్షణా రహితంగా దాడి చేయించాడు. లక్ష్మణ్ అనే వ్యక్తి మరో యువకుడితో కలిసి రాజోళిలోని నిర్మానుష్య ప్రదేశంలో పార్టీ చేసుకుంటుండగా ఎస్సై లెనిన్ వారితో దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా యువకుడి తలను ఇన్నోవా కారు అద్దానికేసి బలంగా కొట్టాడు. ఆ తరువాత ఇద్దరు యువకులే మద్యం సేవించి కారు అద్దాలు పగలగొట్టినట్లు ప్రచారం చేయించారు. ఈ ఘటనపై ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ రంగస్వామి, శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు సోమవారం రాజోళి లో విచారణ చేపట్టారు. ఎల్లమ్మ గుడి వద్ద జరిగిన సంఘటన, లక్ష్మణ్‌పై పోలీసులు దాడి చేసేందుకు గల కారణాలను అక్కడి రైతులతో అడిగి తెలుకున్నారు. మద్యం తాగుతున్న సమయంలో తమతో లక్ష్మణ్ గొడవ పెట్టుకున్నాడని వారు పేర్కొన్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వచ్చిన వారితోనూ అతను వాగ్వాదానికి దిగాడన్నారు. ప్రతిఘటించే సమయంలో ఎస్ఐ లెనిన్ దాడి చేశారని తమ విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. వీడియో వైరల్.. ఆదివారం జరిగిన దానికి పోలీసులు చెప్పిన దానికి అంతా సరిపోయిందనుకునేలో గానే సోమవారం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. అందులో లక్ష్మణ్ కిందపడగా ఎస్ఐ లెనిన్ బూటు కాలుతో దాడి చేస్తుండగా.. మరో కానిస్టేబుల్ సహకరించాడు. దీని ఆధారంగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు బాధితుడు లక్ష్మణ్ తరఫున బీసీ కమిషన్, హెచ్‌ఆర్‌సీలను ఆశ్రయించారు. కంగుతిన్న పోలీసులు తమపై దాడికి యత్నించినందుకే కర్నూలుకు చెందిన లక్ష్మణ్‌పై కేసు నమోదు చేశామని, ఈ క్రమంలో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయని ఆదివారం చెప్పిన పోలీసులు, సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో కంగుతిన్నారు. -
జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోళిలో ఓ ఎస్సై అరాచకం
-
Petrol Price: ఎంతకాలం పెంచుతారంటూ కొత్త బైక్‌ను తగులబెట్టాడు
ధరూరు: పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ తన కొత్త బైక్‌ను తగలబెట్టాడు ఓ యువకుడు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రానికి చెందిన రైతు కుర్వ ఆంజనేయులు మూడు నెలల క్రితం కొత్త బైక్‌ను కొనుగోలు చేశాడు. బుధవారం సాయంత్రం గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి వాహనంలో పెట్రోల్ పోయించుకున్నాడు. లీటర్ ఎంత అని బంకులో పనిచేస్తున్న వ్యక్తిని అడగ్గా, రూ.107 అని చెప్పడంతో.. ‘అడిగేవారు లేరా.. ఇంకా ఎన్ని రోజులు పెట్రోలు ధరలు పెంచుకుంటూ పోతారు’అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెట్రోల్‌ను బైక్‌పై పోసి నిప్పంటించి అక్కడే కూర్చున్నాడు. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి వెంటనే మంటలు ఆర్పేశారు. విషయం తెలుసుకున్న రేవులపల్లి పోలీసులు ఆంజనేయులును, కాలిపోయిన బైక్‌ను తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
సొరంగం అనుకుంటే పొరపాటే..
జోగుళాంబ : చారిత్రక నేపథ్యం కలిగిన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో మంగళవారం భూగర్భంలో 12 అడుగుల లోతుతో ధాన్యం భద్రపరుచుకునే గది బయటపడింది. పట్టణంలో ఉబేద్ అనే వ్యక్తి పాడుబడిన ఓ దుకాణం గదిలో గిర్ని మిషన్ ఏర్పాటు చేసుకునేందుకు మేస్త్రీతో గొయ్యి తీయించగా బండ కనిపించింది. మూత తరహాలో ఉన్న ఆ బండను తెరిచి చూడగా.. దాదాపు 5 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతుతో సొరంగంలా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అది సొరంగం కాదని, పూర్వం రోజుల్లో ధాన్యాన్ని భద్రపరిచేందుకు ఏర్పాటు చేసుకున్న గది అని ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి చెప్పారు. -
ఉత్తుత్తిగా నకిలీ విత్తనాల కేసులు నమోదు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నకిలీ పత్తి విత్తనాలకు కేంద్ర బిందువుగా ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలో పోలీస్, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో 15 రోజులుగా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 10,230 కిలోల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకోగా.. 18 మందిపై 15 కేసులు నమోదయ్యాయి. అయితే పట్టుబడుతున్న వారిపై తూతూమంత్రంగా చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇందుకు గద్వాల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 3న గద్వాల శివారులోని రమ్య ఇండస్ట్రీస్‌లో టాస్క్‌ఫోర్స్ నిర్వహించిన తనిఖీల్లో 72 బ్యాగుల (3434.5 కిలోల) నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. దీనిపై ఎం.విజయభాస్కర్‌రెడ్డిపై కేసు నమోదైంది. అసలు మిల్లు యజమానిని వదిలేసి, ఎవరో వ్యక్తిపై కేసు నమోదు కావడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలొచ్చాయి. ఆ మిల్లును లీజుకిచ్చినట్లు పేపర్లు సృష్టించారనే చర్చ జరిగింది. దీంతో గద్వాల రూరల్ పోలీసులు సోమవారం మిల్లు యజమాని, సీడ్ ఆర్గనైజర్, సీడ్మెన్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ భీంనగర్‌కు చెందిన బండ్ల రాజశేఖర్‌రెడ్డి (ఏ–1) ధరూర్ మండలం, బురెడ్డిపల్లికి చెందిన ఎం.విజయభాస్కర్‌రెడ్డి (ఏ–2)పై కేసు నమోదుచేసి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్డి ఎదుట హాజరుపరిచారు. ఆపై రిమాండ్‌కు తరలించారు. అయితే పోలీసులు వారిపై చీటింగ్ కేసు, విత్తన యాక్ట్ కిందే కేసు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ విత్తన తయారీదారులను పీడీ యాక్టు కింద అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించినా గద్వాల పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాక్షి’ నాడే చెప్పింది.. రాష్ట్రంలో కొనసాగుతోన్న నకిలీ విత్తనాల దందాపై ‘సాక్షి’ ప్రధాన సంచికలో కొద్ది రోజుల క్రితం ‘కల్తీ విత్తులతో కొల్లగొడతారు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఎక్కడెక్కడ నకిలీ విత్తనాల దందా జరుగుతోంది?, మాఫియా ఆగడాలు, వారికి అండగా నిలుస్తున్నదెవరు?, నామమాత్రంగా కేసుల నమోదుపై ప్రచురితమైన ఈ కథనం సంచలనం సృష్టించింది. నాటి నుంచి సర్కారు ఆదేశాలతో వ్యవసాయ, పోలీస్‌శాఖల ఆధ్వర్యంలో జిల్లాల్లోని విత్తన దుకాణాలు, గోదాంలు, మిల్లులపై దాడులు నిర్వహిస్తున్నారు. క్వింటాళ్ల కొద్దీ నకిలీ విత్తనాలు పట్టుబడగా, వందల మందిపై కేసులు నమోదయ్యాయి. ‘సాక్షి’ కథనం తర్వాత సీడ్మెన్ అసోసియేషన్ సమావేశమైంది. ఇందులో ప్రస్తుతం కేసు నమోదైన బండ్ల రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ‘నాణ్యమైన సీడ్‌ను పండిస్తూ దేశవ్యాప్తంగా నడిగడ్డకు మంచిపేరును తీసుకొస్తామని.. కొందరు వ్యక్తులు గద్వాల సీడ్‌కు ఉన్న బ్రాండ్‌ను వినియోగించుకుని నకిలీవి ఉత్పత్తి చేస్తున్నారని, వాటితో తమకు సంబంధం లేదని’ తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన మిల్లులోనే నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. చదవండి: కల్తీ విత్తులతో కొల్లగొడతారు -
ఎమ్మార్వో ఆఫీసులో అధికారుల తిట్ల పురాణం
సాక్షి, గద్వాల: ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు కర్తవ్యం మరిచారు. ఒకరికొకరు సమన్వయంతో పనిచేయాల్సిందిపోయి సోయి మరచి వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని తహసిల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో వెలుగు చూసింది. సర్వేయర్ బ్రహ్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ పరస్పరం బండ బూతులతో రచ్చకెక్కారు. అధికారుల తిట్ల పురాణాన్ని పనుల నిమిత్తం వచ్చిన కొందరు వ్యక్తులు వీడియో తీసి బయటపెట్టడంతో.. అది కాస్తా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు ఇలా గొడవపడటంపై జనం మండిపడుతున్నారు. పైఅధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఏసీబీ వలలో డీఎంహెచ్ఓ
గద్వాల న్యూటౌన్: ప్రభుత్వ వైద్యురాలికి పీజీలో సీటులో వచ్చింది. రిలీవ్ చేయమని ఇన్చార్జ్ డీఎంహెచ్ఓను అడిగింది. సాటి ఉద్యోగికి పీజీలో సీటు వచ్చింది కదా అని సంతోషించి రిలీవ్ చేయాల్సింది పోయి ఏకంగా పైసల్ డిమాండ్ చేశారు. వైద్యురాలు మరోసారి వెళ్లి అడిగినా అదే డిమాండ్‌ను ఆమె ముందు ఉంచారు. దీంతో చేసేదిలేక వైద్యురాలు, భర్త సాయంతో ఏసీబీని ఆశ్రయించింది. నెలరోజులుగా ఏసీబీ అధికారులు ఆయనపై దృష్టి సారించారు. బుద్ధిపోనిచ్చుకోని ఆ జిల్లా అధికారి ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో రూ.7వేలు లంచం తీసుకొని రిలీవింగ్ ఆర్డర్ చేతికి ఇస్తుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. కరీంనగర్‌కు చెందిన మంజుల అనే పీహెచ్సీ వైద్యురాలు గత నెల 17న జిల్లాలోని వడ్డేపల్లి పీహెచ్‌సీకి బదిలీపై వచ్చింది. విధుల్లో చేరిన మరుసటి రోజే ఆమెకు కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీలో సీటు వచ్చింది. పీజీలో జాయిన్ అయ్యేందుకు నిబంధనల ప్రకారం తనను రిలీవ్ చేయమని జోగుళాంబ గద్వాల జిల్లా ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ భీమ్‌నాయక్‌ను కోరింది. ఆయన డబ్బు డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె భర్త అశోక్ తెలిపింది. జూన్ 22న ఆయన మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అప్పటినుంచి వారు ఈ కేసుపై దృష్టి సారించి నాలుగుసార్లు గద్వాలకు వచ్చి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ కార్యాల యంలో ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ చాంబర్లో వైద్యురాలు మంజుల నుంచి రూ.7వేలు తీసుకొని రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చాడు. తీసుకున్న డబ్బును తన ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. అదే సమయంలో డీఎస్పీ కృష్ణగౌడ్, మహబూబ్‌నగర్, నల్గొండ ఏసీబీ అధికారులు ప్రవీణ్‌కుమార్, లింగస్వా మి, ఎస్ఐలు రమేష్‌బాబు, వెంకట్రావ్‌లు మరో 10మంది సిబ్బందితో కలిసి రైడ్ చేశారు. కార్యాలయంలో ఉన్న అధికారులందరినీ ఎక్కడివారిని అక్కడే కూర్చోబెట్టారు. నేరుగా డీఎంహెచ్ఓ చాంబర్‌కు వెళ్లి డీఎంహెచ్ఓను తనిఖీ చేశారు. ఆయన ప్యాంట్ జేబులో రూ.7వేలు లభించాయి. ఆ నోట్లను పరిశీలించి లంచం తీసుకున్నట్లు నిర్ధారించారు. లంచం అడిగితే సమాచారం ఇవ్వండి.. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ మీడియాతో మాట్లాడారు. ఏదేని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు లంచం అడిగితే ఏసీబీ 1064కు కాల్ చేయాలన్నారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చిన కొద్దిరోజులకే.. ఇబ్రహీంపట్నంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా ఉన్న భీమ్‌నాయక్ జూన్ 3న ఇన్చార్జ్ డీఎంహెచ్‌ఓగా జిల్లాకు బదిలీపై వచ్చాడు. వచ్చిన కొద్దిరోజులకే ఆయనపై పలు ఫిర్యాదులొచ్చాయి. వివిధ విభాగాల్లో ఉన్న ముగ్గురు ఉద్యోగులను డిప్యూటేషన్‌పై వారు కోరిన పీహెచ్‌సీలకు ఉద్దేశపూర్వకంగా మార్చాడని ఆశాఖ అధికారులే తెలిపారు. అయిజలో రెండు ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి, డబ్బులు డిమాండ్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. తనకు నచ్చిన నలుగురు ఉద్యోగులతో ఓ మాదిరి, మిగిలిన ఉద్యోగులతో మరో మాదిరిగా వ్యవహరించేవారని వైద్యులు తెలిపారు. సదరు నలుగురు ఉద్యోగులే పలు వ్యవహారాలు చక్కబెట్టావారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఏ చర్యలు తీసుకుంటారో తేల్చుకోండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన గర్భిణి జెనీలా (20) పురుటినొప్పులతో బాధపడుతున్నా కరోనా వైరస్‌కు భయపడి వైద్యం అందించని వైద్యులపై ఏ చర్యలు తీసుకోవాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని హైకోర్టు స్పష్టంచేసింది. క్రిమినల్ కేసులు నమోదు చేసి వి చారణ తర్వాత చర్యలు తీసుకోవాలని తాము ఆ దేశాలు జారీ చేయగలమని, అయితే కరోనాకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యుల్లో మనోధైర్యం దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో ఉత్తర్వులు ఇవ్వ డం లేదని తెలిపింది. క్రిమినల్ కేసు నమోదా లేక శాఖాపరంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునేదీ ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. వైద్యం అందకే జెనీలా మరణించిందని, బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ న్యాయవాదులు కరణం కిషోర్‌కుమార్, శ్రీనిత పూజారి దాఖలు చేసిన రెండు ప్రజాహిత వ్యాజ్యాలు గురువారం విచారణకు వచ్చాయి. ప్రభుత్వం అంబులెన్స్‌లను ఏర్పాటు చేసిందని దాఖలు చేసిన కౌంటర్‌తో సంతృప్తికరంగా ఉన్నందున పిల్స్‌పై విచారణను ముగిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
పొంచి ఉంది.. విపత్తి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో ఎందరో రైతులు ఏటా నకిలీ విత్తనాలతో నష్టపోతున్నారు. మరోపక్క ఏటా మాదిరిగానే ఈసారీ రాష్ట్రవ్యాప్తంగా పత్తి నకిలీ విత్తన మాఫియా భారీ దందాకు తెర లేపింది. దళారులు, సీడ్ ఆర్గనైజర్లు, ఏజెంట్లతో కూడిన పటిష్ట నెట్‌వర్క్‌తో నకిలీ విత్తన విక్రయాలు కొనసాగిస్తోంది. ఇలా ప్రతి సీజన్లో నకిలీ విత్తన వ్యాపారం రూ.2 వేల కోట్లకుపైనే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కేవలం ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే రూ.700 కోట్ల వరకు జరుగుతోంది. వానాకాలం సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుండగా.. అధికారులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 200 క్వింటాళ్లు, మంచిర్యాల జిల్లాలో 1,900, ఆదిలాబాద్ జిల్లాలో 141 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. నియంత్రిత సాగు పద్ధతి నకిలీ విత్తన మాఫియాకు వరంగా మారింది. ప్రభుత్వ ఆదేశాలతో ప్రధానంగా పత్తి, వరి (సన్నరకం), కందులు, వేరుశనగ సాగుకు రైతులు ఉద్యుక్తులవుతున్నారు. దీంతో పత్తి, వరి సాగు ఈసారి భారీగా పెరిగే అవకాశం ఉంది. గత వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 21,26,621 హెక్టార్లలో పత్తి, 16,31,151 హెక్టార్లలో వరి వేశారు. ఈసారి పత్తి సుమారు 32 లక్షలు, వరి 25 లక్షల హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా. గత వానాకాలం సీజన్లో రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 2,73,699 హెక్టార్లలో పత్తి సాగైంది. నాగర్‌కర్నూల్‌లో 1,42,192, ఆదిలాబాద్‌లో 1,40,332, సంగారెడ్డిలో 1,40,009, కొమురంభీం ఆసిఫాబాద్ 1,24,884, ఖమ్మం 1,00,370 హెక్టార్లలో సాగైంది. ఈసారి ఆయా జిల్లాల్లో పత్తి సాగు 20 నుంచి 60 శాతానికి పెరుగుతుందని అంచనా. సాధారణంగా ఎకరాకు 900 గ్రాముల చొప్పున పత్తి విత్తనాలు అవసరం. గతేడాది పత్తి సాగు లెక్కలనే తీసుకుంటే.. 53,16,553 కిలోల విత్తనాలు కావాలి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 30 లక్షల కిలోలకు మించి అందుబాటులో లేవు. ఈ లోటునే నకిలీ విత్తన మాఫియా ‘మార్కెట్’గా మలుచుకుంటోంది. నడిగడ్డే అడ్డాగా.. దక్షిణ భారతదేశంలోనే ఉమ్మడి పాలమూరులోని నడిగడ్డ (జోగుళాంబ గద్వాల జిల్లా) నాణ్యమైన కాటన్ సీడ్ ఉత్పత్తికి పెట్టింది పేరు. ఏటా 40వేల ఎకరాల్లో కాటన్ సీడ్ సాగవుతుండగా, రూ. 2వేల కోట్ల టర్నోవర్ ఉంటుంది. 30 వేల రైతు కుటుంబాలు దీన్నే ప్రధాన పంటగా సాగు చేస్తుండగా, మరో 50 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఈ కాటన్ సీడ్ వ్యాపారంలో సీడ్ ఆర్గనైజర్ల వ్యవస్థ కీలకం. వంద మంది వరకు సీడ్ ఆర్గనైజర్లు కాటన్‌సీడ్ ఉత్పత్తి సంబంధిత లావాదేవీల్లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. మరోవైపు నకిలీ సీడ్ మాఫియా సైతం నడిగడ్డేనే అడ్డాగా చేసుకుని నకిలీ దందా సాగిస్తోంది. ఇక్కడ ఏటా రూ.200 కోట్లపైనే ఈ దందా సాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాను తీసుకుంటే ఈ మొత్తం రూ.700కోట్ల వరకు ఉంటుంది. 2006లో గద్వాలకు చెందిన కొందరు సీడ్ ఆర్గనైజర్లు తయారుచేసి విక్రయిస్తున్న నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. వీటి విలువ అప్పట్లోనే సుమారు రూ.15 కోట్లుపైనే. ఇప్పటికీ ఈ వ్యాపారం ఇక్కడ గుట్టుగా సాగుతోంది. అవీ..ఇవీ కలిపి, రంగులద్ది.. కాటన్‌సీడ్ పంటలో ఫలవంతం కాని 5–10 శాతం విత్తనాలు 10–20 లక్షల (450 గ్రాముల పాకెట్లు) క్వింటాళ్లు, కమర్షియల్ సీడ్ పంట ద్వారా పండిన 7 లక్షల క్వింటాళ్ల విత్తనాలను నకిలీ వ్యాపారులు ఎంచుకుంటారు. ఈ రెండు రకాలు పంటసాగుకు యోగ్యం కావు. కమర్షియల్ పంట ద్వారా పండిన విత్తనాలు నూనె తయారీ, పశువుల దాణాగా ఉపయోగపడతాయి. ఈ రెండు రకాలను కలిపి గుర్తుపట్టరాకుండా రంగులద్ది ప్రముఖ కంపెనీల పేర్లను పోలిన పాకెట్లల్లో నింపుతారు. కొందరు సీడ్ ఆర్గనైజర్లు, బడా రైతుల ద్వారా వీటిని రైతులకు అంటగడతారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ఎమ్మిగనూరు, గుంటూరు, కర్ణాటకలోని రాయచూరు, మహారాష్ట్రలోని పుణె, ముంబై ప్రాంతాల్లో ఈ తయారీ కేంద్రాలున్నాయి. కేంద్ర విత్తన చట్టం ప్రకారం కల్తీ విత్తనాల విక్రేతకు కనీసం 6 నెలల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా వి«ధించాలి. డీలర్‌షిప్‌ను పూర్తిగా రద్దుచేయాలి. పీడీ యాక్టు కిందా కేసులు నమోదు చేయవచ్చు. కానీ ఈ చట్టం అమలుకు నోచుకోవట్లేదు. నకిలీ విత్తనం తయారీ ఇలా.. ఫలవంతం కాని విత్తనాలే అక్రమార్కుల చేతిలో ‘నకిలీ’గా మారుతున్నాయి. నడిగడ్డలో ఏటా కాటన్‌సీడ్ సాగు ద్వారా రెండు కోట్ల పాకెట్ల (450 గ్రాముల చొప్పున) దిగుబడి వస్తుంది. ఈ 450 గ్రాముల పాకెట్‌ను కనిష్టంగా రూ.410, గరిష్టంగా రూ.470కి విక్రయిస్తారు. వాస్తవానికి విత్తనానికి జెర్మినేషన్ ప్రక్రియ చేసినపుడు 75శాతంపైగా జెర్మినేషన్ వస్తే ఫలవంతమైన (మొలకెత్తే) విత్తనాలనీ, అంతకంటే తక్కువ వస్తే ఫలవంతం కాని (మొలకెత్తని) విత్తనాలనీ లెక్క. ఇలా దిగుబడైన 2 కోట్ల పాకెట్ల విత్తనాలలో సుమారు 5 శాతం నుంచి 10 శాతం విత్తనాలు జెర్మినేషన్లో 75శాతం కంటే తక్కువగా వస్తాయి. ఇవే నకిలీ విత్తనాలుగా మార్కెట్‌ను ముంచెత్తుతూ, రైతుల్ని ముంచుతున్నాయి. -
సరిహద్దుల్లో అప్రమత్తం
గట్టు (గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలోని కర్ణాటక సరిహద్దుల్లో అధికారులు అప్రమత్తత ప్రకటించారు. సోమవారం మాచర్ల, బల్గెర, ఇందువాసి, బోయలగూడెం గ్రామాల్లో పోలీస్ వలంటీర్లను ఎస్ఐ మంజునాథరెడ్డి ఏర్పాటు చేశారు. వీరి ద్వారా సరిహద్దు గ్రామాల్లో పటిష్ట నిఘాను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. గట్టు మండలానికి ఆనుకుని ఉన్న కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాను ఆనుకుని గట్టు, కేటీదొడ్డి మండలాలు ఉండగా.. గట్టు మండలంలో మాచర్ల, బల్గెర, చమన్‌ఖాన్‌దొడ్డి, ఇందువాసి, బోయలగూడెం గ్రామాలున్నాయి. కర్నూలు రాయచూర్ అంతర్ రాష్ట్ర రహదారి బల్గెర దగ్గర సరిహద్దు చెక్‌పోస్టు కొనసాగుతోంది. దీంతోపాటే ఆయా గ్రామాల్లో గ్రామ పోలీస్ వలంటీర్లను ఎస్ఐ మంజునాథరెడ్డి ఏర్పాటు చేశారు. పోలీస్ వలంటీర్లను సరిహద్దు గ్రామాల్లో ఏర్పాటు చేసి, కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారిపై నిఘా పెంచారు. సరిహద్దు గ్రామాలు కలిగిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటకకు వెళ్లవద్దని, అలాగే కర్ణాటకకు చెందిన వారిని గ్రామాల్లోకి రాకుండా చూసుకోవాలని ఎస్ఐ సూచించారు. బల్గెర చెక్‌పోస్టు దగ్గర వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. అత్యవసరం అయితే తప్ప ఇతర రాష్ట్రాల వారిని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని ఎస్ఐ పేర్కొన్నారు. చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా నారాయణపేట రూరల్: ఇటీవల కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంశాఖ ఆదేశాల మేరకు రాయిచూర్, యాద్గీర్‌లతో నారాయణపేట జిల్లాకు ఉన్న సరిహద్దుల్లో భద్రత పెంచారు. నారాయణపేట మండలం జిలాల్‌పూర్, ఎక్లాస్పూర్, దామరగిద్ద మండలం సజనాపూర్, కాన్కుర్తి, కృష్ణ మండలం గుడేబల్లూర్, టైరోడ్డు, చేగుంట, ఎనికెపల్లి, ఆలంపల్లి, మాగనూర్ మండలం ఉజ్జెలి, బైరంపల్లి, కొత్తపల్లి, మక్తల్ మండలం పస్పుల, దత్తాత్రేయ టెంపుల్ చెక్‌పోస్టుల ద్వారా ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదు. అత్యవసరమైనా ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే చెక్‌పోస్టు దాటేందుకు అనుమతి ఇస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఎస్పీ చేతన ఆయా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి వసతులు, భోజనం, తాగునీరు, మాస్క్‌లు, శానిటైజర్ల ఏర్పాటును పరిశీలించారు. చెక్‌పోస్టుల్లో పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఏ ఒక్కరిని లోపలికి అనుమతించరాదని చెప్పారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ భౌతికదూరం పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. వాహనాల అడ్డగింత.. కృష్ణా (మక్తల్): మండల సరిహద్దులోని కర్ణాటక ప్రాంతంలో కరోనా విజృంభిస్తుండడంతో అక్కడి ప్రజలు ఎవరినీ మన రాష్ట్రంలోకి అనుమతించకుండా అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సోమవారం వాసునగర్ ప్రాంతంలోని సరిహద్దు చెక్‌పోస్టులో అటు నుంచి కాలినడకన వచ్చేవారిని కూడా ఇటువైపు రానివ్వకుండా అడ్డుకున్నారు. కేవలం అత్యవసర పరిస్థితి ఉన్న వారిని మాత్రమే వదులుతున్నారు. ఏదేమైనా ఓ వారం రోజులపాటు ప్రయాణికులు ఈ అంతర్రాష్ట్ర రహదారిపై ప్రయాణించడానికి అనుమతి ఇవ్వడం లేదని రెవెన్యూ, పోలీస్ అధికారులు పేర్కొన్నారు. కర్ణాటకకు వెళ్లొద్దు.. కేటీదొడ్డి (గద్వాల): కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ జిల్లాలో కరోనా వైరస్ విజృభిస్తున్నందన కేటీదొడ్డి మండలానికి చెందిన ప్రజలు అక్కడికి ఎవరూ వెళ్లవద్దని తహసీల్దార్ సుభాష్‌నాయుడు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయిచూర్‌లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున సోమవారమే 40 కేసులు నమోదయ్యాయన్నారు. కాబట్టి రాష్ట్ర సరిహద్దు నందిన్నె, ఇర్కిచేడు, చింతలకుంట, సుల్తాన్పురం వద్ద అధికారులను అప్రమత్తం చేశామని, సరిహద్దు కర్ణాటక ప్రజలు తెలంగాణలోకి ప్రవేశించకుండా ఇక్కడి వారు కర్ణాటకకు వెళ్లకుండా సరిహద్దులో భద్రత పెంచామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ఆ గ్రామంలో గుప్తనిధులు..
గద్వాల క్రైం: ఆ గ్రామంలో గుప్తనిధులు దొరుకుతాయనే ప్రచారం ఉంది. అందులోనూ ఇంటి నిర్మాణాల కోసం గుంతలు తవ్వినా పురాతన నాణేలు బయటపడిన సంఘటనలు కోకొల్లలు. గత పదేళ్ల క్రితం పంచలోహాల విగ్రహాలు లభ్యమయ్యాయి. గద్వాల సంస్థానాధీశులు ఆ గ్రామాన్ని రాజుల రాజధానిగా కార్యకళాపాలు సాగించిన ఊరు. పురావస్తు శాఖ అధికారులు సైతం గ్రామంలో అనుమతి లేకుండా తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక అంతా సవ్యంగా ఉన్న గ్రామంలో మూడు రోజుల క్రితం గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు పూడూరు గ్రామ శివారులోని పురాతన విగ్రహాన్ని తొలగించిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని బక్కమ్మ చెరువు సమీపంలో వెలసిన శివలింగంను గత మూడు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు తొలగించి గుప్తనిధుల కోసం సుమారు ఆరు ఫీట్ల మేర తవ్వకాలు జరిపారు. దీంతో గ్రామస్తులు గద్వాల రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. గత కొన్నేళ్లుగా గ్రామంలోని పురాతన ఆలయాల వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన క్రమంలో విగ్రహాలు, బంగారు, వెండి నాణేలు బయటపడ్డాయన్నారు. స్తబ్ధుగా ఉన్న గ్రామంలో మళ్లీ గుప్తనిధుల కోసం తవ్వకాలు చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది సైతం.. గద్వాల రాజులు పూడూరు గ్రామాన్ని రాజధాని ప్రాంతంగా ఏర్పాటు చేసుకొని పలు ఆలయాలను నిర్మించారు. చోళ్లరాజులు సైతం ఈ ప్రాంతంలో దేవాలయం నిర్మించారు. దీంతో గ్రామంలో నిధులు ఉన్నాయనే తెలుసుకుని పలువురు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. అయితే గ్రామంలోని పురాతన ఆలయాల్లో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలపై నిషేధాజ్ఞలు విధించారు. గ్రామస్తులు సైతం ఇంటి నిర్మాణాలు, వ్యవసాయ పనుల కోసం గుంతలు తవ్విన క్రమంలో పలు విలువైన నాణేలు, పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని రెవెన్యూ అధికారులు పురావస్తు శాఖకు అప్పగించారు. ఈ క్రమంలోనే గతేడాది జూన్‌లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంకుడు గుంత కోసం తవ్వకాలు జరిపిన క్రమంలో 20 పురాతన నాణేలు బయటపడ్డాయి. గ్రామస్తుల సమాచారం మేరకు వాటిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే గుప్తనిధుల కోసం రహస్యంగా పలువురు అంగతకులు తవ్వకాలు జరిపారని గ్రామస్తులు తెలిపారు. కేసు నమోదు.. గ్రామంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్ ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలం వద్దకు చేరుకొని పరిశీలించారు. తవ్వకాలు జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలించారు. గుప్తనిధుల కోసం తవ్విన తవ్వకాలనే అంశాలపై ఆరా తీశారు. గ్రామ సర్పంచ్ శశికళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బైక్‌పై ఏడు నెలల చిన్నారితో.. 670 కిలోమీటర్లు
జోగుళాంబ గద్వాల, నవాబుపేట: మండలంలోని కొత్తపల్లితండాకు చెందిన భార్యాభర్తలు తమ ఏడునెలల చిన్నారితో పూణే నుంచి బైక్‌పై 670 కిలోమీటర్లు, 12 గంటల పాటు ప్రయాణించి గమ్యస్థానం చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన విశాల్, లీలాబాయి పూణెలో టైల్స్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్డౌన్ ఉండటంతో ఇంటికి రావాలని, తల్లిదండ్రులను చూడాలన్న తపనతో పలుమార్లు ప్రయత్నించారు. విఫలం కావటంతో చివరికి బైక్‌పై మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పూణెలోని ఉథార్ నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 10 గంటలకు తండాకు చేరుకున్నారు. ఆరోగ్యంగానే ఉన్నారని, 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని మండల అధికారులు సూచించారు. పాప కోసం : విశాల్ బస్సులో అందరితో కలిసి వస్తే చిన్నారికి ప్రమాదమని భావించి ఎవరూ చెప్పినా వినకుండా ధైర్యం చేసి బైక్‌పై బయలుదేరాం. 4 చోట్ల ఆగి చిన్నారికి పాలు తాగించి మేము తిన్నాం. ఊరికి రావాలన్న తపనతో ఎంత దూరం వచ్చామో తెలియలేదు. ఇక్కడకు వచ్చాక అందరూ మాట్లాడుతుంటే చిన్నారితో ఇంత దూరం బైక్‌పై రావటం నిజంగా సాహసమే అనిపిస్తోంది. -
కడుపులో శిశువు మాయమైందని..
సాక్షి, మానవపాడు (గద్వాల): కడుపులోని శిశువు మాయమైందని మండలంలోని చిన్నపోతులపాడుకు చెందిన ఓ మహిళ ఆదివారం స్థానిక పీహెచ్సీ వద్ద కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మంజుల తాను నిండు గర్భిణినని.. ప్రసవం కోసం శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి మానవపాడు పీహెచ్‌సీకి వస్తుండగా దేవుడు కలలోకి వచ్చి ఇంటికి వెళ్లాలని సూచించటంతో తిరిగి వెళ్లాలని చెబుతోంది. ఆదివారం ఉదయం లేచేసరికి ఎలాంటి గర్భం లేదని, దీంతో తిరిగి ఆస్పతికి వచ్చానని తెలిపింది. పరీక్షించిన వైద్యులు నెల క్రితమే అబార్షన్ అయినట్లు నిర్ధారించారు. ఈ విషయమై వైద్యురాలు దివ్య మాట్లాడుతూ.. ఆ మహిళ చెప్పేది అవాస్తవమని అన్నారు. ఆమెకు మతిస్థిమితం తప్పినట్లుందని మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లి వైద్యుల పర్యవేక్షణలో సైకలాజికల్ ట్రిట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అవసరమైతే స్కానింగ్ తీయించాలని సూచించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ సరిత సెల్ఫోన్లో వైద్యులతో మాట్లాడి మెరుగైన మంజులకు చికిత్స అందించాలని కోరారు. అనంతరం మంజుల తల్లిగారి ఊరైన పెద్దపోతులపాడుకు వెళ్లి ఆమెను పరామర్శించారు. జెడ్పీ చైర్పర్సన్ వెంట నాయకులు చిన్న తిరుపతయ్య, పీఏసీఎస్ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, భాస్కర్ ఉన్నారు. -
కలకలం రేపిన బార్బర్ పాజిటివ్ కేసు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో పరిస్థితి రోజురోజుకు చేయి దాటిపోతోంది. ఆ జిల్లాలో కరాళనృత్యం చేస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. ఈ ప్రాణాంతక వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ప్రతి రోజు పెరుగుతోన్న కేసులతో అధికారులు, ప్రజలే కాదూ రాష్ట్ర ప్రభుత్వమూ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా గురువారం మరో పది పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. దీంతో ఆ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 45కు చేరింది. గురువారం నమోదైన కేసుల్లో మోమిన్మహళ్లకు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. వీరిలో 30 ఏళ్ల మహిళతో పాటు ఆమె తొమ్మిది, పన్నెండేళ్ల కుమారులు ఇద్దరు, ఆరేళ్ల కూతురున్నారు. సదరు మహిళ భర్తకు ఇది వరకే కరోనా పాజిటివ్ రాగా.. ప్రస్తుతం అతను గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ద్వారా వీరికి వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానంతో మూడు రోజుల క్రితమే నిర్ధారణ పరీక్షలు చేయగా వీరికీ పాజిటివ్ అని గురువారం తేలింది. దీంతో ఆ కుటుంబంలో కరోనా బాధితుల సంఖ్య ఐదుకు చేరింది. వైద్యవర్గాల్లో కలవరం.. గద్వాల ఏరియా ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్‌లో విధులు నిర్వర్తిస్తోన్న ల్యాబ్ టెక్నిషియన్‌కూ పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితో కలిసి ఆ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బంది అందరూ ఉలికిపడ్డారు. సదరు ల్యాబ్ టెక్నిషియన్ కరోనా అనుమానితుల గొంతు, ముక్కు నుంచి నమూనాలు సేకరించేవాడు. వారితో ఇతనికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. సదరు టెక్నిషియన్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు అతని కుటుంబ సభ్యులతో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. సహాయకులుగా సేవలందించే సిబ్బందికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఇది వరకే ఆదేశించింది. ఆందోళనలో అధికార యంత్రాంగం రోజు రోజుకు పెరుగుతోన్న పాజిటివ్ కేసులను ఎలా కట్టడి చేయాలో తోచని స్థితిలో జిల్లా యంత్రాంగం కొట్టిమిట్టాడుతోంది. ఇప్పటికే మర్కజ్ లింకుతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోన్న క్రమంలో మరోవైపు కర్నూలులో వైద్య సేవలు పొందిన గద్వాల జిల్లా వాసులకు వైరస్ సోకడం ఆందోళనకు గురి చేస్తోంది. గద్వాలలో పరిస్థితిని అదుపులోకి తేవాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్యారోగ్య ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ మహేందర్‌రెడ్డి గద్వాలకు వచ్చి కలెక్టర్ శృతి ఓఝా, ఇన్చార్జ్ ఎస్పీ అపూర్వరావు, ఇతర జిల్లా అధికారులను దిశానిర్దేశం చేశారు. వారి పర్యటన మరుసటి రోజే ఏకంగా పది కేసులు నమోదు కావడం.. ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశాలుండడంతో వాటిని కట్టడి చేయడం అధికార యంత్రాంగానికి సవాలుగా మారింది. కాగా.. గురువారం 60 మంది నమూనాలకు సంబంధించిన ఫలితాలు రాగా, పది నిర్ధారణ అయ్యాయి. కలకలం రేపిన బార్బర్ పాజిటివ్ కేసు.. గద్వాల రాంనగర్‌కు చెందిన ఓ బార్బర్‌కి పాజిటివ్ వచ్చింది. మర్కజ్ వెళ్లి వచ్చిన వారికి కటింగ్, గడ్డం చేయడంతోనే వారి ద్వారా ఇతనికి వైరస్ సోకినట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత నెల ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వారితో పాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితులు 40 మందికి లాక్డౌన్ కంటే ముందే కటింగ్ చేసినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఇటీవల మర్కజ్ కేసుల సంఖ్య పెరగడంతో వారికి కటింగ్ చేసిన సదరు బార్బర్‌ని గుర్తించిన అధికారులు నాలుగు రోజుల క్రితమే అతడిని క్వారంటైన్‌కు తరలించారు. ఇతనికి కరోనా లక్షణాలు లేకున్నా.. ముందస్తు జాగ్రత్త నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఇతనికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఇతని వద్ద కటింగ్ చేయించుకున్న ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా.. బార్బర్ కుటుంబ సభ్యులనూ అధికారులు ముందస్తు జాగ్రత్తగా జిల్లాకేంద్రంలోని క్వారంటైన్‌కు తరలించారు. -
యువత.. పెడదోవ!
గద్వాల క్రైం: ఏ కుటుంబంలోనైనా వారి మధ్య సంబంధాలు బలంగా ఉంటేనే కుటుంబ వ్యవస్థ పదికాలాలపాటు నిలబడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఆత్మీయ అనురాగాలు, అనుబంధాల మధ్య జీవనం సాగించేవారు.. ప్రస్తుత ఆధునిక యుగంలో ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు చెడుదారులు.. వ్యసనాలకుఅలవాటుపడి తమ విలువైన జీవితాలను చే జేతులా నాశనం చేసుకుంటున్నారు. జోగుళాంబ జిల్లాలోని గద్వాల, గట్టు, కేటీదొడ్డి, మల్దకల్, ధరూరు, అయిజ, ఇటిక్యాల, మానవపాడు, అలంపూర్, రాజోలి, శాంతినగర్ తదితర మండలాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు హత్యలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. కార్తీక్ హత్యతో కలకలం.. గద్వాలకు చెందిన కార్తీక్ హత్య, మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య ఘటనలు ఉమ్మడి జిల్లాలో కలకలం సృష్టించాయి. వివాహిత మొదట కార్తీక్‌తో అనంతరం రవికుమార్ సన్నిహితంగా ఉండడం.. చివరకు కార్తీక్‌ను అడ్డుతొలగించుకునేందుకు మిగతా ఇద్దరు పథకం పన్ని హత్య చేయడం, అనంతరం వివాహిత సైతం బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పలు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. మరికొన్ని ఘటనలు ఇలా.. ♦ 2019 అక్టోబర్ 15న రాజోళి మండలం తాండ్రపాడుకు చెందిన ఓ మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. భర్తకు తెలిస్తే ప్రమాదమని తెలిసి.. మరొకరితో కలిసి భర్తనే హత్య చేయించింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ♦ 2019 మే 7న కర్నూలుకు చెందిన ఇద్దరు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారు. అయితే మహిళకు సంబంధించిన బంధువులు (వడ్డేపల్లి మండలంలోని కొంకల) ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా రాజోళి శివారులో ఇద్దరిని సొంత కుమారుడే తన తల్లితోపాటు మరో వ్యక్తిని అందరూ చూస్తుండగానే వేట కొడవలితో హత్య చేశాడు. ♦ 2019 మార్చిలో కేటీదొడ్డి మండలానికి తిమ్మప్ప, పాతపాలెంకు చెందిన కొలిమి వె ంకటేష్లను వివాహేతర సంబంధం నేపథ్యంలో గు ర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. జల్సాలకు అలవాటుపడి.. ప్రస్తుతం కొందరు యువత ఆకర్షణకు లోనై.. జల్సాలకు, విలాసవంతమైన జీవనం సాగించాలనే దృక్పథంతో మెలుగుతున్నారు. తెలిసీ తెలియని వయస్సులోనే మద్యం, ఇతర అలవాట్లకు బానిసవుతున్నారు. సాంకేతికపరంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో స్నేహమంటూనే తమలోని విషం కక్కుతున్నారు. గంటల తరబడి చాటింగ్, ఫోన్ సంభాషణతో వారికి నచ్చిన కానుకలను ఇవ్వాలనే కుతూహలంతో తప్పటడుగులు వేస్తున్నారు. కట్టడి చేయాల్సిన తల్లిదండ్రులు సైతం పెద్దగా పట్టించుకోకపోవడం వీరికి కలిసొచ్చే అవకాశంగా మారింది. ఇంట్లో పెద్దలతో ఎలా మాట్లాడాలనే విషయాలు కుటుంబ సభ్యులు చెప్పకపోవడం సమస్యగా ఉంది. దీంతో అల్లరి తిరుగుడులు, చెడుస్నేహాలు, నీలి చిత్రాలు, మద్యం, గంజాయి, గుట్కా తదితర వ్యసనాలకు బానిసలై నేరస్థులుగా మారుతున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో మధ్యలో చదువు మానేసి.. జులాయిగా తిరగడం అలవాటు చేసుకుంటున్నారు. జల్సాలకు చోటిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సీరియల్స్ ప్రభావం తీవ్రమే.. ఆత్మీయ అనురాగాల మధ్య ఉండాల్సిన కుటుంబ వ్యవస్థ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యతిరేకత ధోరణి ఉంది. నిత్యం టీవీలలో వచ్చే సీరియల్స్, సినిమాలలో జరుగుతున్న సంఘటనలు మానవాళి వ్యవస్థపై దుష్ప్రభావం చూపిస్తోంది. ఇంటిల్లిపాది చూడాల్సిన సిమాలు, సీరియల్స్ వస్తున్న దాఖలాలు లేవు. తెరపై వస్తున్న దృశ్యాలు మనుషుల మొదడులో నిర్లిప్తమవుతాయి. వినడం కంటే కనిపించే దృశ్యాలే చాలా వరకు హింసాత్మక ఘటనలకు దారితీస్తున్నాయి. మరోవైపు కాలంతో పరుగులు తీస్తున్నామనే ధోరణితో కుటుంబ సభ్యులు ఇంట్లోని అంశాలను మాట్లాడుకోవడం ఎక్కడా లేదు. దీంతో నేడు ఎన్నో కుటుంబాలు సరైన మార్గంలో లేక వ్యవస్థను పాతాళం వైపు తీసుకెళ్తున్నాయి. దీంతో పిల్లలను కుటుంబ సభ్యులు కట్టడి చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో అనుకోని సమస్యలు చుట్టుముడుతున్నాయి. తగు చర్యలు తీసుకుంటాం.. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇక హత్యల విషయంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో జరుగుతున్న హత్యలన్నీ అవగాహన లోపం, క్షణికావేశంలో జరుగుతున్నవే. వీటిపై పోలీస్ శాఖ తరఫున విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. అలాగే నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తాం. హత్య కేసులో ఎవరినీ ఉపేక్షించేది లేదు. – శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ -
అమ్మా.. దయ చూపమ్మా!
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): తాజాగా రాజకీయ నిరుద్యోగుల చూపంతా జోగుళాంబ అమ్మవారి దేవస్థానం పైపు పడింది. ఇటీవల స్థానిక ఎన్నికలలో ఆశపడి బంగపోయిన వారికంతా నామినేటెడ్ పదవులు ఇస్తామని బుజ్జగించడంతో ఇప్పుడు ఆ రాజకీయ నిరుద్యోగులంతా జోగుళాంబ అమ్మవారి దేవస్థానం కమిటీ వైపు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం సహకార ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల పర్వం ముగిసిన అనంతరం దేవస్థానం కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో పడ్డారు నియోజకవర్గ పెద్దలు. ఇదిలా ఉండగా, ఇక నియోజకవర్గ పెద్దలు దేవస్థానం ట్రస్టు బోర్డు విషయంలో ఎలాంటి పావులు కదిపినా చైర్మన్‌గా పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలనేది సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఈ ఏడాది తుంగభద్ర నదికి పుష్కరాలు రానున్న నేపథ్యంలో ఆధ్యాత్మిక చింతన కలిగిన మంచి పేరున్న వ్యక్తినే ఈ పదవిలో కూర్చోబెట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు దేవదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు అక్రమాలకు చెక్ పెట్టేందుకు.. 2018 నవంబర్ 10వ తేదీన తిరుపతిరెడ్డి చైర్మన్‌గా పదవీ విరమణ కాలం ముగిసింది. దీంతో 16 నెలలుగా దేవస్థానానికి మళ్లీ ట్రస్టుబోర్డు నోటిఫికేషన్ వెలువడలేదు. నేటి దాక మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకం చేపట్టలేదు. దీంతో పరిపాల భారమంతా కూడా కేవలం ఆలయ కార్యనిర్వహణ అధికారులపైనే పడింది. ప్రతినిత్యం ప్రముఖుల సందర్శనలతో కిక్కిరిసే ఈ ఆలయాలకు స్థానికంగా అందుబాటులో లేని కార్యనిర్వహణ అ«ధికారులతో పరిపాలన కూడా అస్తవ్యస్తంగా మారింది. పరిపాలన అధికారి స్థానికంగా లేకపోవడంతో ఆలయంలో సిబ్బంది పనితీరులో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆలయాల్లో సమయపాలన పాటించని సిబ్బంది క్రమక్రమంగా అక్రమాలకు కూడా తెరతీశారు. భక్తుల ద్వారా మొక్కుబడుల రూపంలో దేవస్థానానికి వచ్చే బంగారు ఆభరణాలు ఈవో చేతిలో ఉండాల్సి ఉండగా, వాటి బాధ్యత కూడా అక్కడి సిబ్బందే నిర్వహిస్తున్నారు. ఇక ఇటీవల ఆలయంలో భక్తులకు వేలం పాట ద్వారా విక్రయించే చీరలు, భక్తులు అమ్మవారికి సమర్పించే వడిబియ్యంతో వచ్చే చిన్నపాటి బంగారు ముక్కుపుడకలు, మాంగళ్యాలు తదితర వాటిలో కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు రాకపోలేదు. అంతేకాక ఆలయంలో గుర్తింపు పొందిన సిబ్బంది స్థానంగా ‘సేవ’ పేరిట నకిలీ ఉద్యోగులు కూడా అక్కడి కార్యక్రమాలు చక్కబెడుతూ రావడంతో దేవదాయ శాఖలోనే చర్చనీయాంశంగా మారింది. పదవిని దిక్కించుకునేందుకు యత్నాలు.. ఈ ఏడాది నవంబర్‌లో తుంగభద్ర నది పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ రానుండడంతో జోగుళాంబ అమ్మవారి దేవస్థానానికి ట్రస్టుబోర్డు సభ్యులుగా, చైర్మన్‌గా ఎవరిని నియామకం చేయాలనేది తేలనుంది. అయితే దేవస్థానం చైర్మన్ పోటీలో పాత చైర్మన్లు ఇద్దరు గట్టి పోటీలో ఉండగా, నూతనంగా కొత్త వారు కూడా తెరవెనక నుంచి పదవిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. -
తాగినంత మద్యం.. జేబునిండా డబ్బు
గద్వాల: మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని ఓటర్లకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తాగినంత మద్యం పోస్తూ.. ఆడిగినన్ని డబ్బులు ఇస్తున్నారు. ప్రస్తుతం ఓటరు చొప్పున విడదీస్తూ రూ.500 నుంచి రూ.2 వేల ముట్టజెప్పుతూ.. వారి ఓట్లను ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా వార్డుల్లోని ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు, అభ్యర్థులు పడరాని పాట్లుపడుతున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్ల కోసం ఆయా పార్టీల అభ్యర్థులు, ముఖ్య నాయకులు మంతనాలు సాగిస్తూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. రాత్రికి రాత్రే వార్డుల్లో రహస్యంగా పర్యటిస్తూ మద్యం, డబ్బులను విచ్చలవిడిగా ఓటర్లకు అందిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో ఓటర్లు సైతం నాయకులు, కార్యకర్తలను తమ ఇష్టాలకు ఉపయోగించుకుంటున్నారు. తమ ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయంటూ అభ్యర్థులను నమ్మిస్తూ డబ్బులు ఆశిస్తున్నారు. అభ్యర్థులు సైతం అడిగిందే తడవుగా రూ.వేలు ఇచ్చేస్తున్నారు. డబ్బులు, మద్యంతోపాటు కాలనీల్లో యువకులకు అవసరమయ్యే క్రికెట్ కిట్లు, ఇతర వస్తు సామగ్రిని అభ్యర్థుల నుంచి బలవంతంగా అడిగి పుచ్చుకుంటున్నారు. మహిళలకు ఇంటికి వెళ్లి చీరలను అందజేశారు. ఓట్లను ఆశిస్తున్న అభ్యర్థులు సైతం కాదనకుండా అందిస్తున్నారు. పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండటంతో భారీగా ఓటర్లకు మద్యం అందజేసేందుకు.. రహస్యంగా మద్యం నిల్వలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు వారి అనుచరుల ద్వారా డబ్బులు సైతం ఇప్పటికే వార్డుల్లోని బలమైన ఓటర్లుకు, వివిధ సంఘాలకు అందజేశారు. మరి కొంత నగదు అభ్యర్థులకు ఇచ్చి రాత్రివేళల్లో పంచడానికి ప్రణాళిక రూపొందించారు. దాదాపు అన్ని వార్డుల్లో ‘ఓటుకు నోటు’ అనే సంప్రదాయం కొనసాగుతోంది. డబ్బులు, మద్యాన్ని వివిధ పార్టీల అభ్యర్థులు ఎర చూపుతుండటంతో కార్యకర్తల్లో కూడా డబ్బుల సందడి స్పష్టంగా కనిపిస్తోంది. గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లోని 77 వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు, మద్యం, చీరలు పంచడానికి నిమగ్నమయ్యారు. ఇప్పటికే సగానికిపైగా వార్డుల్లో డబ్బులు పంపిణీ చేశారు. ‘మూడు నోట్లు.. ఆరు బాటిళ్లు’ అన్న చందంగా అభ్యర్థులు ఓటర్లను ఆకర్శిస్తున్నారు. ఫోన్లతో ఉక్కిరిబిక్కిరి.. ఇదిలా ఉండగా నాయకుల ఫోన్లు బిజీగా మారాయి. ఒక్కొక్క వార్డు నుంచి చోటామోటా నేతలు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకుల నుంచి వచ్చే ఫోన్లతో అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ‘అన్నా ఇప్పుడే అవతలి పార్టీ వారు వచ్చి ఇక్కడ డబ్బు పంచారు..’ ‘అన్నా ఫలానా వారికి మందు సీసాలు సప్లయ్ చేయాలి..’ అన్న మాటలతో నేతల ఫోన్లు నిర్విరామంగా మోగాయి. ఎప్పటికప్పుడు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తూ గెలుపే లక్ష్యంగా తొక్కాల్సిన దొడ్డి దార్లన్నీ అభ్యర్థులు తొక్కేశారు. -
‘ముస్లింలను టీఆర్ఎస్ సర్కార్ మోసం చేసింది’
సాక్షి, జోగులాంబ గద్వాల: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని.. టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నిస్తారని కేసీఆర్, కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని ఆమె విమర్శించారు. మైనారిటీలకు కేటాయిస్తున్న నిధులను ప్రభుత్వం ఖర్చు చేయలేదని డీకే అరుణ ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే కేసీఆర్ కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఇద్దరికీ సవాలే..! రాజకీయ లబ్ది కోసం బీజేపీపై టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసే దిశలో లేదన్నారు. టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు అందకుండా నిలిపివేస్తామని.. ప్రజలను టీఆర్ఎస్ నాయకులు బెదిరిస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. పింఛన్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవని డీకే అరుణ దుయ్యబట్టారు. మున్సిపాలిటీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని డీకే అరుణ స్పష్టం చేశారు.