సరిహద్దుల్లో అప్రమత్తం | Telangana Police Alert in Jogulamba And Karnataka Borders | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో అప్రమత్తం

Published Tue, May 26 2020 12:52 PM | Last Updated on Tue, May 26 2020 12:52 PM

Telangana Police Alert in Jogulamba And Karnataka Borders - Sakshi

నారాయణపేట జిల్లా జిలాల్‌పూర్‌ చెక్‌పోస్టు పరిశీలిస్తున్న ఎస్పీ చేతన

గట్టు (గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలోని కర్ణాటక సరిహద్దుల్లో అధికారులు అప్రమత్తత ప్రకటించారు. సోమవారం మాచర్ల, బల్గెర, ఇందువాసి, బోయలగూడెం గ్రామాల్లో పోలీస్‌ వలంటీర్లను ఎస్‌ఐ మంజునాథరెడ్డి ఏర్పాటు చేశారు. వీరి ద్వారా సరిహద్దు గ్రామాల్లో పటిష్ట నిఘాను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు. గట్టు మండలానికి ఆనుకుని ఉన్న కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాను ఆనుకుని గట్టు, కేటీదొడ్డి మండలాలు ఉండగా.. గట్టు మండలంలో మాచర్ల, బల్గెర, చమన్‌ఖాన్‌దొడ్డి, ఇందువాసి, బోయలగూడెం గ్రామాలున్నాయి.

కర్నూలు రాయచూర్‌ అంతర్‌ రాష్ట్ర రహదారి బల్గెర దగ్గర సరిహద్దు చెక్‌పోస్టు కొనసాగుతోంది. దీంతోపాటే ఆయా గ్రామాల్లో గ్రామ పోలీస్‌ వలంటీర్లను ఎస్‌ఐ మంజునాథరెడ్డి ఏర్పాటు చేశారు. పోలీస్‌ వలంటీర్లను సరిహద్దు గ్రామాల్లో   ఏర్పాటు చేసి, కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారిపై నిఘా పెంచారు. సరిహద్దు గ్రామాలు కలిగిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో     కర్ణాటకకు వెళ్లవద్దని, అలాగే కర్ణాటకకు చెందిన వారిని గ్రామాల్లోకి రాకుండా చూసుకోవాలని ఎస్‌ఐ సూచించారు. బల్గెర చెక్‌పోస్టు  దగ్గర వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. అత్యవసరం అయితే తప్ప ఇతర రాష్ట్రాల వారిని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని ఎస్‌ఐ పేర్కొన్నారు.

చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా
నారాయణపేట రూరల్‌: ఇటీవల కర్ణాటకలో కరోనా వైరస్‌ వ్యాప్తి పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంశాఖ ఆదేశాల మేరకు రాయిచూర్, యాద్గీర్‌లతో నారాయణపేట జిల్లాకు ఉన్న సరిహద్దుల్లో భద్రత పెంచారు. నారాయణపేట మండలం జిలాల్‌పూర్, ఎక్లాస్‌పూర్, దామరగిద్ద మండలం సజనాపూర్, కాన్‌కుర్తి, కృష్ణ మండలం గుడేబల్లూర్, టైరోడ్డు, చేగుంట, ఎనికెపల్లి, ఆలంపల్లి, మాగనూర్‌ మండలం ఉజ్జెలి, బైరంపల్లి, కొత్తపల్లి, మక్తల్‌ మండలం పస్పుల, దత్తాత్రేయ టెంపుల్‌ చెక్‌పోస్టుల ద్వారా ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదు. అత్యవసరమైనా ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే చెక్‌పోస్టు దాటేందుకు అనుమతి ఇస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఎస్పీ చేతన ఆయా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి వసతులు, భోజనం, తాగునీరు, మాస్క్‌లు, శానిటైజర్ల ఏర్పాటును పరిశీలించారు. చెక్‌పోస్టుల్లో పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఏ ఒక్కరిని లోపలికి అనుమతించరాదని చెప్పారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ భౌతికదూరం పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు.

వాహనాల అడ్డగింత..
కృష్ణా (మక్తల్‌): మండల సరిహద్దులోని కర్ణాటక ప్రాంతంలో కరోనా విజృంభిస్తుండడంతో అక్కడి ప్రజలు ఎవరినీ మన రాష్ట్రంలోకి అనుమతించకుండా అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సోమవారం వాసునగర్‌ ప్రాంతంలోని సరిహద్దు చెక్‌పోస్టులో అటు నుంచి కాలినడకన వచ్చేవారిని కూడా ఇటువైపు రానివ్వకుండా అడ్డుకున్నారు. కేవలం అత్యవసర పరిస్థితి ఉన్న వారిని మాత్రమే వదులుతున్నారు. ఏదేమైనా ఓ వారం రోజులపాటు ప్రయాణికులు ఈ అంతర్రాష్ట్ర రహదారిపై ప్రయాణించడానికి అనుమతి ఇవ్వడం లేదని రెవెన్యూ, పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు.

కర్ణాటకకు వెళ్లొద్దు..
కేటీదొడ్డి (గద్వాల): కర్ణాటక రాష్ట్రం రాయిచూర్‌ జిల్లాలో కరోనా వైరస్‌ విజృభిస్తున్నందన కేటీదొడ్డి మండలానికి చెందిన ప్రజలు అక్కడికి ఎవరూ వెళ్లవద్దని తహసీల్దార్‌ సుభాష్‌నాయుడు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయిచూర్‌లో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున సోమవారమే 40 కేసులు నమోదయ్యాయన్నారు. కాబట్టి రాష్ట్ర సరిహద్దు నందిన్నె, ఇర్కిచేడు, చింతలకుంట, సుల్తాన్‌పురం వద్ద అధికారులను అప్రమత్తం చేశామని, సరిహద్దు కర్ణాటక ప్రజలు తెలంగాణలోకి ప్రవేశించకుండా ఇక్కడి వారు కర్ణాటకకు వెళ్లకుండా సరిహద్దులో భద్రత పెంచామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement