సాక్షి, బెంగళూరు: కరోనా కట్టడిలో భాగంగా విధించిన వీకెండ్ లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కోవిడ్‌పై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన శుక్రవారం కృష్ణా అతిథి గృహంలో అత్యవసర సమావేశం జరిగింది. హోం, ఆరోగ్య, విద్య, జలవనరుల శాఖల మంత్రులు, బీబీఎంపీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్ మీడియాకు వెల్లడించారు.
ఈ నెలారంభం నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. దీనికితోడు వారాంతపు నిర్బంధంతో ఇబ్బందులు పడుతున్నట్లు సామాన్యుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో నిపుణుల సూచన మేరకు వీకెండ్ లాక్‌డౌన్ వెనక్కి తీసుకున్నట్లు మంత్రి ఆర్.అశోక్ వెల్లడించారు. బెంగళూరు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కొనసాగుతాయన్నారు. రాత్రి కర్ఫ్యూ యథావిధిగా ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
చదవండి: (కరోనానే పెద్ద పరీక్ష!)
బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, జాతరలకు అనుమతి లేదన్నారు. పబ్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లలో 50 శాతం సీట్ల సామర్థ్యానికే అనుమతించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు తదితర ప్రాంతాల్లో జనాలు గుంపులు గుంపులుగా ఉండరాదన్నారు. కాగా బెంగళూరులో మరి కొన్ని రోజుల పాటు పాఠశాలలు మూతపడే ఉంటాయని, వచ్చే వారం నిపుణులతో మరోసారి సమావేశమై పాఠశాలల పునఃప్రారంభంపై తుది నిర్ణయం ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment