
జోగులాంబ జిల్లా ఏర్పాటు చేయాలి
సాక్షి, హైదరాబాద్: గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లాను ఏర్పాటు చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. గద్వాల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కొందరు ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ధర్నా చేశారు. కొత్త జిల్లాలకు ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ఎదుట తమ అభిప్రాయాలను వెల్లడించారు. వరంగల్‌లో జనగామను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రతిపాదించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఆదివారం మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధుల నుంచి సబ్‌కమిటీ అభిప్రాయాలను స్వీకరించింది. నల్లగొండను మూడు జిల్లాలుగా విభజించడం పట్ల ఆ జిల్లా నేతలు అభ్యంతరం పెట్టనప్పటికీ, వరంగల్ జిల్లాలోని కొన్ని మండలాలను యాదాద్రి జిల్లాలో కలపవద్దని సూచించారు.
గద్వాలకు లేనిదేంటీ.. వనపర్తిలో ఉన్నదేంటి!
మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల జిల్లా కేంద్రంగా జోగులాంబ జిల్లాను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డీకే అరుణ సబ్‌కమిటీకి విన్నవించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వనపర్తి జిల్లాను ప్రభుత్వం ప్రతిపాదించిందని, గద్వాలలో లేని ప్రత్యేకతలు వనపర్తిలో ఏమున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం తనలక్కీ నంబరు కోసమని రాష్ట్రాన్ని 24 జిల్లాలుగా చేయడం సరికాదని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మొత్తం 17 జిల్లాలు చేస్తే సరిపోతుందని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు.
తక్కువ దూరంలో ఉన్న నాగర్ కర్నూల్, వనపర్తిలను కొత్త జిల్లాలకు కేంద్రాలుగా ప్రతిపాదించడం సరికాదని ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి అన్నారు. కొత్త జిల్లాలు ప్రజలకు సౌలభ్యంగా ఉండాలని, రాజకీయ ప్రయోజనాల కోసం పొరపాట్లు చేస్తే ప్రజలు క్షమించరని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ చెప్పారు. మరోవైపు జనగామను జిల్లా చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య కోరారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అఖిలపక్ష సమావేశం వాయిదా
జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా మంగళవారం జరగాల్సిన అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. సోమవారం అన్ని పార్టీల నేతలు స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనేందుకు తమ నియోజకవర్గాలకు వెళ్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సబ్‌కమిటీతో 17న జరగాల్సిన జిల్లా కలెక్టర్ల భేటీ యథావిధిగా నిర్వహించనున్నారు.