రాష్ట్రంలో భగ్గుమంటున్న ఎండలు
వడదెబ్బకు ఐదుగురు మృతి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, జోగుళాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 43.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డిలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలోని 18 మండలాలకు చెందిన 20 గ్రామాల్లో 43 డిగ్రీలు దాటిపోయింది. ఈ జిల్లాలోని మాడుగులపల్లి మండల కేంద్రంతోపాటు మునుగోడు మండలం గూడాపూర్‌లో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దామరచర్ల మండల కేంద్రం, అనుముల మండలం ఇబ్రహీంపేట, కనగల్ మండల కేంద్రం, మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామాల్లో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎండలు తీవ్రం కావడంతో వడదెబ్బ కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన గాదె జయపాల్‌రెడ్డి (55) గురువారం వడదెబ్బకు గురికాగా హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు.
మహబూబాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ తండా గ్రామానికి చెందిన ధరావత్ మంచ్యా (55) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జీఎన్‌ఆర్ కాలనీకి చెందిన స్వర్ణలత (45) రెండ్రోజుల క్రితం నిజామాబాద్‌లో పెళ్లికి హాజరైంది. ఎండల తీవ్రతతో అస్వస్థతకు గురైంది. నిర్మల్‌కు వచి్చన తర్వాత గురువారం రాత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన రైతు మర్రిపల్లి ఈరయ్య (70) పొలం పనులకు వెళ్లి ఎండ దెబ్బతగలడంతో గురువారం మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment