
ఉరేసుకుని ఆత్మహత్య
రామన్నపేట: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రామన్నపేట మండలం బోగారం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బోగా రం గ్రామానికి చెందిన కూనూరు సుదర్శన్, లక్ష్మి దంపతుల కుమార్తె కూనూరు భార్గవి(22) డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటూ పీజీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది.
భార్గవి తండ్రి సుదర్శన్ పది నెలల క్రితమే చనిపోయాడు. తల్లి లక్ష్మి కుట్టు పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. శనివారం మధ్యాహ్నం తల్లి బయటకు వెళ్లగా.. భార్గవి ఇంట్లో దూలానికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి తల్లికి సమాచారం అందించారు. మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్గవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.