
సాక్షి, నల్గొండ: ఇరవై రెండు దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు నాగార్జున సాగర్‌లోని బుద్ధవనంలో సందడి చేశారు. వారికి జానపద, గిరిజన నృత్య కళాకారులతో సుందరీమణులకు స్వాగతం పలికారు. బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని బుద్ధవనాన్ని అందగత్తెలు సందర్శించారు. బుద్ధ జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. నాగార్జున సాగర్ వాటర్ బ్యాక్ గ్రౌండ్‌లో స్పెషల్ ఫోటో షూట్‌లో కూడా పాల్గొననున్నారు. నాగార్జున సాగర్‌లో సుమారు నాలుగు గంటల పాటు పర్యటించనున్నారు. విందు అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
కాగా, రేపు(మంగళవారం) సాయంత్రం పోటీదారులు చార్మినార్ నుంచి లాడ్‌బజార్ వరకు నడుస్తూ పరిసరాలను వీక్షిస్తారు. షాపింగ్ చేస్తారు. చార్మినార్ చరిత్రను తెలుసుకుంటారు. అనంతరం చౌమొహల్లా ప్యాలెస్‌లో జరిగే స్వాగత విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంప్రదాయ వాద్యకచేరీ కొనసాగుతుంది. విందులో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ధమ్ కీ బిర్యానీ, ఖుర్బానీ కా మీఠా, బగారా బైంగన్, పత్తర్ కీ ఘోష్, పనీర్ టిక్కా, పులావ్, దహీ వడ, పానీపురి, బాదుషా, గులాబ్ జామూన్ లాంటి వంటకాలు రుచి చూపించనున్నారు. ధమ్ కీ బిర్యానీ ఎక్కువ మసాలా ఘాటు లేకుండా తయారు చేయాలని ఆదేశించారు.

ఇక యూరప్, ఆఫ్రికా, ఆమెరికా, కరేబియన్, ఆసియా ఓషియానా ప్రాంతాల సుందరీమణులు సైతం ఉన్నందున వారి స్థానిక వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. పోటీల్లో పొల్గొనే సుందరీమణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని నాలుగు ఫైవ్ స్టార్ హోటళ్లనుంచి మెనూ తెప్పించి పరిశీలించి, ఒక హోటల్‌కు ఆర్డర్ ఇచ్చారు.
ఆసియా వంటకాలలో సుషీ (జపాన్), డిమ్‌సమ్ (చైనా), థాయ్ గ్రీన్ కర్రీ (థాయ్‌లాండ్) వంటివి, యూరోపియన్ వంటకాలైన ఇటాలియన్ పాస్తా, ఫ్రెంచ్ రాటటౌలీ, స్పానిష్ పాయెల్లా, అమెరికా ఖండానికి సంబంధించిన మెక్సికన్ టాకోస్, బ్రెజిలియన్ ఫెయిజోడా, అమెరికన్ బార్బెక్యూ రిబ్స్ లాంటివి, ఆఫ్రికాకు చెందిన ఇథియోపియన్ డోరో వాట్, మొరాకన్ టాగిన్, హమ్ముస్‌తో పాటు మెడిటరేనియన్ ఫలాఫెల్, క్వినోవా సలాడ్ లాంటి వాటిని వడ్డించే వీలుందని సమాచారం. మెనూను మిస్ వరల్డ్ లిమిటెడ్ ప్రతినిధులకు చూపి వారు అనుమతించినవే సిద్ధం చేస్తారని తెలుస్తోంది. మే 26న హైటెక్స్‌లో జరిగే గలా డిన్నర్ సందర్భంగా తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉంటుందని చెబుతున్నారు.