buddha vanam project
-
తెలంగాణకే తలమానికం.. సాగర్ తీరంలో బౌద్ధవనం
సాక్షి, నాగార్జునసాగర్: తెలంగాణకే తలమానికమైన సాగర్ తీరంలో బౌద్ధవనం సిద్ధమైంది. ఈనెల 14వ తేదీన రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. బుద్ధవనం ప్రారంభమైతే సాగర్‌కు పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పర్యాటకశాఖకు ఆదాయం రావడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. 2003లో పనులు ప్రారంభం 2003–04లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు 2011వరకు నత్తనడకన సాగాయి. 2015లో 2559వ బుద్ధజయంతి ఉత్సవాలు నాగార్జునసాగర్‌లో నిర్వహించారు. వాటికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. బుద్ధవనంలో బోధివక్షం నాటారు. దీనిని అభివృద్ధి చేసే బాధ్యతను మల్లేపల్లి లక్ష్మయ్యకు అప్పగించి బుద్ధవనం ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆనాటి నుంచి ఈ ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. మొత్తం రూ.65.14 కోట్లు ఖర్చు చేసి ఐదు సెగ్మెంట్లు పూర్తిచేశారు. మరో మూడింటి సెగ్మెంట్ల పనులు మొదలే కాలేదు. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేందుకు సుమారుగా రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. చదవండి: (కేసీఆర్ మాపై కక్షగట్టారు) బౌద్ధమత సంస్కృతికి ప్రతిబింబం నాగార్జునసాగర్ జలాశయతీరంలో 274.28 ఎకరాల్లో నిర్మితమైన బుద్ధవనం ప్రపంచ బౌద్ధమత సంస్కృతికి ప్రతిబింబం కానుంది. బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు అన్ని అంశాలు ఉట్టిపడేలా ఇక్కడ శిల్పాలను ఏర్పాటు చేశారు. 70 అడుగుల ఎత్తు,140 అడుగుల వెడల్పుతో నిర్మించారు. పైన గుమ్మటం తరహాలో నిర్మాణం ఉంటుంది. ప్రధాన మందిరం లోపలి వైపు నిలబడి పైకి ఆకాశం ప్రతిబింబించేలా ప్రత్యేక తీర్చిదిద్దారు. జాతక పార్కులో జాతక కథల రూపంలో కళ్లకు కట్టేలా పర్యాటకులను ఆకట్టుకునే విధంగా శిల్పాలు ఏర్పాటు చేశారు. ఒకదానినుంచి మరొకటి వరుస క్రమంలో వీటిని పూర్తిగా చూసేందుకు రెండున్నర కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అభివృద్ధికి ముందుకొస్తున్న సంస్థలు బుద్ధవనం అభివృద్ధికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. డీఎక్స్ఎన్ (మలేషియా) ప్లాన్ వారు బుద్ధి ష్ట్ యూనివర్శిటీ నిర్మాణానికి గాను రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. ఫోగౌంగ్షాన్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ వారు బుద్ధి స్ట్ మోనాస్టిక్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు రూ.64.10 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. మహా బోధి సొసైటీ(బెంగళూరు) వారు మోనస్టరీమాంక్స్ సెట్టింగ్‌కు రూ.20.49 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. లోటస్ నిక్కో హోటల్స్ (న్యూఢిల్లీ) వారు హోటల్స్ ఏర్పాటుకు రూ.42 కోట్లు పెట్టబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. -
బుద్ధవనం..గర్వకారణం
సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద బుద్ధవనం ప్రాజెక్టు నాగార్జునసాగర్‌లో ఏర్పాటు చేయడం గర్వకారణమని రాష్ట్ర పురావస్తు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న బౌద్ధసంగీతి –2019 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 274 ఎకరాల్లో బుద్ధవనం నిర్మించడం చారిత్రాత్మకమైన నిర్ణయమని తెలిపారు. మన రాష్ట్రంలోని చారిత్రక సంపద పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. బౌద్ధమతానికి సంబంధించి దేశంలోనే తొలి సదస్సును ౖహైదరాబాద్‌లో నిర్వహించడం ఎంతో అదృష్టమన్నారు. రాష్ట్రంలో కోటిలింగాల, ఫణిగిరి, పార్శిగాన్, ధూళికంట, గాజులబండ, తిరుమలగిరి, నేలకొండపల్లి, ఏలేశ్వరం లాంటి ప్రాంతాల్లో బౌద్ధుల చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయన్నారు.బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బౌద్ధచరిత్ర చాలా గొప్పదన్నారు. శివనాగిరెడ్డి రచించిన తెలంగాణ బుద్ధిజం అనే పుస్తకాన్ని మంత్రి శ్రీనివాసగౌడ్ ఆవిష్కరించారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) చైర్మన్ భూపతిరెడ్డి, టీఎస్‌టీడీసీ ఎండీ డి.మనోహర్, 17 దేశాలకు చెందిన పురావస్తు శాఖ పరిశోధకులు, పురావస్తు శాఖ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికతకు ప్రాధాన్యమివ్వాలి బుద్ధిజాన్ని కూడా ఇతర మతాలలాగే చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బౌద్ధాన్ని కేవలం టూరిజం కోణంలోనే చూస్తున్నాయి. అలాకాకుండా కాకుండా ఆధ్యాత్మికతకు కూడా ప్రాధాన్యమిచ్చేలా చర్యలు చేపడితే బుద్దుడి ఆలోచనలు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది. – సద్దారకిత బంతేజ్, బౌద్ధ సన్యాసి -
మైమరిపించేలా.. మహాస్తూపం
సాక్షి, హైదరాబాద్: ఆ ప్రాంతానికి వెళ్తే బుద్ధుడి జీవితచక్రం కళ్లముందు కదలాడుతుంది.. ఆ మహనీయుని బోధనలు అడుగడుగునా ప్రేరణ కల్పించేలా వివిధ రూపాల్లో కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది ప్రధాన బౌద్ధ స్థూపాలు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు ఆ ప్రాంతం దేశంలోనే ప్రధాన బౌద్ధపర్యాటక ప్రాంతంగా మారబోతోంది. అంతర్జాతీయ పర్యాటకులనూ ఆకట్టుకునే రీతిలో రూపుదిద్దుకుంటోంది. అదే నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం. 249 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ఈ నిర్మాణాల పరంపరలో కీలకమైన మహాస్తూపం ప్రత్యేక తరహాలో సిద్ధమవుతోంది. నంద్యాలలో చెక్కిన శిల్పాలు ఇటీవలే బుద్ధవనం చేరుకున్నాయి. వాటిని ప్రతిష్టించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకాశ గుమ్మటం... ఆకర్షణీయం.. మహాస్తూపాన్ని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 70 అడుగుల ఎత్తు, 140 అడుగుల వెడల్పుతో దీన్ని నిర్మించారు. పైన గుమ్మటం తరహాలో నిర్మాణం ఉంటుంది. అదే ప్రధాన మందిరం. లోపలి వైపు నిలబడి పైకి చూస్తే ఆకాశం కనిపిస్తుంది. పైకప్పునకు ఆకాశం ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. దాని చుట్టూ 16 వరసల్లో గులాబీ పూరేకుల తరహాలో తీర్చిదిద్దా రు. ఈ ఏర్పాటు సిమెంటుతో కాకుండా అల్యూమినియం ఫ్యాబ్రికేషన్‌తో ఏర్పాటు చేయటం విశేషం. అందులోనే నాలుగు దిక్కులా ఒక్కోటి 9 అడుగుల ఎత్తులో ఉండే నాలుగు బుద్ధుడి భారీ రాతి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ధర్మచక్ర ప్రవర్ధన ముద్రలో ఇవి ఉంటాయి. వీటి మధ్య ఒక్కోటి మూడు అడుగుల ఎత్తుతో మరో 4 విగ్రహాలుం టాయి. అవి ధ్యాన ముద్ర, భూస్పర్శ ముద్ర, అభయముద్ర, వర్ణముద్రల్లో ఉంటాయి. వీటి ప్రతిష్ట పూర్తయితే ప్రధాన నిర్మాణం పూర్తయినట్టే. ప్రధాన ద్వారం వద్ద అష్టమంగళ చిహ్నాలు, బుద్ధుడి జాతకచిహ్నాలను రాతితో చేయించిన 104 ప్యానెల్స్‌పై చెక్కించి ఏర్పాటు చేయించారు. మధ్య 17 అడుగులతో ధర్మచక్ర స్తంభం ఠీవిగా నిలబడి ఆకట్టుకుంటోంది. ఇక బుద్ధచరిత్ర వనంలో బుద్ధుడి జీవితగాథలోని ప్రధానఘట్టాలు ప్రతి బింబించేలా 10 కాంస్యవిగ్రహాలు ఏర్పాటు చేయించారు. బుద్ధుడి జాతక కథలను తెలిపే 40 రాతి ఫలకాలను ఏర్పాటు చేశారు. శ్రీలంక ప్రభుత్వం ప్రత్యేకంగా 27 అడుగుల ఎత్తుతో ఔకాన బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయించింది. మన దేశంలోని ప్రధాన 5 బౌద్ధ స్తూపాలు, వివిధ దేశాల్లోని ప్రధాన 8 స్తూపాల సూక్ష్మ నమూనాలతో మినియేచర్ పార్కును ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ భక్తులతోపాటు సాధారణ పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ బుద్ధవనాన్ని సిద్ధం చేస్తున్నామని ఆ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. -
'ప్రముఖ బౌద్ధ కేంద్రంగా నాగార్జున సాగర్'
నాగార్జునసాగర్ (నల్లగొండ) ఆసియాఖండంలోనే ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా నాగార్జునసాగర్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రూ.34 కోట్లతో శ్రీపర్వతారామంలో బౌద్ధవనం ప్రాజెక్టు పనులు చేపట్టారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి మరో రూ. 25కోట్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడంలో ఆలస్యమవుతోందన్నారు. యాదగిరిగుట్టకు రోప్‌వే నిర్మించే విషయాన్ని సీఎంతో చర్చించాల్సి ఉందన్నారు. మల్లెపల్లి వద్ద గల టూరిజం హోటల్‌ను రూ.30లక్షలతో ఆధునికీకరించనున్నట్లు తెలిపారు.