బుద్ధవనం వ్యూ
సాక్షి, నాగార్జునసాగర్: తెలంగాణకే తలమానికమైన సాగర్ తీరంలో బౌద్ధవనం సిద్ధమైంది. ఈనెల 14వ తేదీన రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. బుద్ధవనం ప్రారంభమైతే సాగర్‌కు పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పర్యాటకశాఖకు ఆదాయం రావడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి.
2003లో పనులు ప్రారంభం
2003–04లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు 2011వరకు నత్తనడకన సాగాయి. 2015లో 2559వ బుద్ధజయంతి ఉత్సవాలు నాగార్జునసాగర్‌లో నిర్వహించారు. వాటికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. బుద్ధవనంలో బోధివక్షం నాటారు. దీనిని అభివృద్ధి చేసే బాధ్యతను మల్లేపల్లి లక్ష్మయ్యకు అప్పగించి బుద్ధవనం ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆనాటి నుంచి ఈ ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. మొత్తం రూ.65.14 కోట్లు ఖర్చు చేసి ఐదు సెగ్మెంట్లు పూర్తిచేశారు. మరో మూడింటి సెగ్మెంట్ల పనులు మొదలే కాలేదు. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేందుకు సుమారుగా రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
చదవండి: (కేసీఆర్ మాపై కక్షగట్టారు)
బౌద్ధమత సంస్కృతికి ప్రతిబింబం
నాగార్జునసాగర్ జలాశయతీరంలో 274.28 ఎకరాల్లో నిర్మితమైన బుద్ధవనం ప్రపంచ బౌద్ధమత సంస్కృతికి ప్రతిబింబం కానుంది. బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు అన్ని అంశాలు ఉట్టిపడేలా ఇక్కడ శిల్పాలను ఏర్పాటు చేశారు. 70 అడుగుల ఎత్తు,140 అడుగుల వెడల్పుతో నిర్మించారు. పైన గుమ్మటం తరహాలో నిర్మాణం ఉంటుంది. ప్రధాన మందిరం లోపలి వైపు నిలబడి పైకి ఆకాశం ప్రతిబింబించేలా ప్రత్యేక తీర్చిదిద్దారు. జాతక పార్కులో జాతక కథల రూపంలో కళ్లకు కట్టేలా పర్యాటకులను ఆకట్టుకునే విధంగా శిల్పాలు ఏర్పాటు చేశారు. ఒకదానినుంచి మరొకటి వరుస క్రమంలో వీటిని పూర్తిగా చూసేందుకు రెండున్నర కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది.
అభివృద్ధికి ముందుకొస్తున్న సంస్థలు
బుద్ధవనం అభివృద్ధికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. డీఎక్స్‌ఎన్ (మలేషియా) ప్లాన్ వారు బుద్ధి ష్ట్ యూనివర్శిటీ నిర్మాణానికి గాను రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. ఫోగౌంగ్‌షాన్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ వారు బుద్ధి స్ట్ మోనాస్టిక్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు రూ.64.10 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. మహా బోధి సొసైటీ(బెంగళూరు) వారు మోనస్టరీమాంక్స్ సెట్టింగ్‌కు రూ.20.49 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. లోటస్ నిక్కో హోటల్స్ (న్యూఢిల్లీ) వారు హోటల్స్ ఏర్పాటుకు రూ.42 కోట్లు పెట్టబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment