నల్లగొండ టూటౌన్: మున్సిపల్ పట్టణాల్లో అనుమతులు తీసుకోకుండా లే అవుట్లు చేసిన ప్లాట్లను పక్షం రోజుల్లోగా క్రమబద్ధీకరించుకోవాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి పత్రాలు సమర్పించడంతో పాటు అపరాధ రుసుం చెల్లించిన వారి ప్లాట్లను మాత్రమే క్రమబద్ధీకరించాలని.. లేదంటే దరఖాస్తులను తిరస్కరించాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. ఎల్‌ఆర్‌ఎస్ కింద 2016 డిసెంబర్‌లో దరఖాస్తులు స్వీకరించారు. కానీ వివిధ కారణాల రీత్యా ఆ దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్లు చేసి విక్రయించిన స్థలాల్లో నివాసాలు నిర్మించుకోవాలంటే మున్సిపల్ కార్యాలయం నుంచి అనుమతి ఇవ్వకూడదు.
కానీ ఇలాంటి వాటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ (ల్యాండ్ క్రమబద్ధీకరణ స్కీం) తీసుకువచ్చింది. మున్సిపాలిటీలకు అపరాధ రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకునే విధంగా వీలు కల్పించారు. దాంతో నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలు, దేవరకొండ నగరపంచాయతీలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుతో పాటు రూ.10 వేలు చెల్లించారు. కానీ ఆ తర్వాత వాటిని క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు పరిశీలించి ఎలాంటి అభ్యంతరం లేదని తేలిన తర్వాత పూర్తి రుసుం దరఖాస్తు దారులు చెల్లించాల్సి ఉంది. ధరఖాస్తులు చేసుకున్న వారిలో ఇంటి నిర్మాణం చేయదల్చిన వారు మాత్రమే రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకున్నారు. మిగతా వారు దరఖాస్తులను అలాగే వదిలేయడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది. నల్లగొండలో 2068, మిర్యాలగూడలో 990, దేవరకొండలో 64 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
రుసుం చెల్లించకుంటే..
కొంత మందికి క్రమబద్ధీకరణపై పూర్తి అవగాహన లేనట్టు తెలుస్తోంది. రూ. 10 వేలతోనే క్రమబద్ధీకరణ అవుతుందని ధరఖాస్తులు చేసుకున్నవారు ఉన్నారు. కానీ స్థలం చూసిన తరువాత అపరాధ రుసుం నిర్ణయించడంతో డబ్బులు చెల్లించలేక మరికొంత మంది వెనకడుగు వేశారు. మరి కొంత మంది పూర్తి పత్రాలు సమర్పించలేదు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం ధరఖాస్తు చేసుకున్న వారు మరో 15 రోజుల్లో రుసుం చెల్లించకుంటే వాటిని తిరస్కరించేందుకు మున్సిపల్ యంత్రాంగం సన్నద్ధం అవుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎల్‌ఆర్‌ఎస్ ను పక్షం రోజుల్లో పరిశీలించి వచ్చే నెలాఖరులోగా క్రమబద్ధీకకరణకు సంబంధించి పూర్తి పత్రాలకు ధరఖాస్తుదారులకు అందజేయనున్నారు.
ఇక్కడి వాటికి మోక్షం లేదు ...
మున్సిపల్ పట్టణాల్లో పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం గ్రీన్‌బెల్ట్, పారిశ్రామికవాడ ప్రాంతాల నుంచి తమ స్థలాలు క్రమబద్ధీకరించాలని పలువురు ధరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీటిని క్రమబద్ధీకరించకూడదు. మున్సిపల్‌టౌన్ ప్లానింగ్ అధికారులు అటువంటి వాటిని పరిశీలించి వాటిని తిరస్కరించకుండా అలాగే పెండింగ్‌లో పెట్టారు. ఇలాంటి ధరఖాస్తులు నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
అనుమతి లేనివి వందల సంఖ్యలో ...
మున్సిపాలిటీ కార్యాలయాల నుంచి అనుమతులు లేని లే అవుట్లలో చాలా మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇలాంటి స్థలాలు వందల సంఖ్యలో ఉన్నా సంబంధిత యజమానులు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోలేదు. కొంత మంది ఇంటి నిర్మాణ సమయంలో అనుమతి తీసుకోవచ్చని, మరి కొందరు తమవి అనుమతి తీసుకున్న స్థలాలే అని అనుకుంటున్నారు. రియల్ వ్యాపారులు వెంచర్లలో రోడ్లు వేసి విక్రయించడంతో అనుమతి తీసుకున్న అమాయక ప్రజలు భావించి క్రమబద్ధీకరణకు ధరఖాస్తులు చేసుకోలేదనే చెప్పవచ్చు. ఇలాంటి స్థలాల్లో ఇక ముందు ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపల్ కార్యాలయం నుంచి అనుమతి రాదు.
నల్గొండ
మొత్తం దరఖాస్తులు 3768
పెండింగ్ దరఖాస్తులు 2068
రుసుం చెల్లించినవి 1700
మిర్యాలగూడ
మొత్తం దరఖాస్తులు 1570
తిరస్కరించినవి 40
పెండింగ్ దరఖాస్తులు 990
రుసుం చెల్లించినవి 540
దేవరకొండ
మొత్తం దరఖాస్తులు 258
రుసుం చెల్లించినవి 194
పెండింగ్ దరఖాస్తులు 64
Comments
Please login to add a commentAdd a comment