lrs applications
-
రెవెన్యూను సరిచేస్తా
సాక్షి, హైదరాబాద్: ‘ఆసామి సరిగా లేకపోతే ఏం జరుగుతుందో గత ప్రభుత్వ హయాంలో అదే జరిగింది. దొరికినోడికి దొరికినంత తరహాలో ఆగమాగం చేశారు. ఈ పరిస్థితిని మార్చకపోతే ప్రభుత్వ ఆస్తులు, భూములు అన్యాక్రాంతమైపోతాయి. అలాకాకుండా వాటిని కాపాడడం మా బాధ్యత. నేను మంత్రిగా ఉన్నప్పుడే రెవెన్యూ వ్యవస్థను సరిచేస్తా. ఇందుకోసం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తా..’అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పారదర్శకత కోసమే ప్రక్షాళన: ‘కర్ణాటకలో పారదర్శక రిజిస్ట్రేషన్ల ప్రయత్నం మొదలుపెట్టి 12 ఏళ్లు అవుతోంది. అక్కడ ఇప్పటికీ ఆ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది. తెలంగాణలోనూ దీనికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ వ్యవస్థను అన్ని రకాలుగా ప్రక్షాళన చేస్తున్నాం. రాష్ట్రంలో డిసెంబర్ నుంచి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం 1.2 శాతం పెరిగినా మా అంచనాలకు తగినట్టు మాత్రం రాలేదు. ఈ మూడు నెలలు ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నాం. మొత్తం 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో 4.5 లక్షల వరకు పరిష్కరించాం. మిగిలిన దరఖాస్తుల పరిష్కారం కోసం త్వరలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. జాగ్రత్తగా ముందుకెళ్తుండటంతో ఈ విషయంలో కొంత జాప్యం జరుగుతోంది.జీవో 59 (ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి) దరఖాస్తుల విషయంలోనూ త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. భూముల విలువల సవరణ ప్రక్రియ అమలు చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. గ్రామ రెవెన్యూ అధికారుల నియామక ప్రక్రియ త్వరలో చేపడతాం. వీఆర్వో, వీఆర్ఏలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన 1,365 మందిని నేరుగా రెవెన్యూలోకి తీసుకుంటాం. మిగిలిన వీఆర్వోలు, వీఆర్ఏల్లో ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి పరీక్ష పెడతాం. ఈ పరీక్ష అనంతరం ఇంకా పోస్టులు మిగిలిపోతే టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది సర్వేయర్ల నియామక ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 81 లక్షల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియ 85 శాతం పూర్తయింది..’అని పొంగులేటి తెలిపారు. కొత్త పాస్ పుస్తకాలుండవు ‘కొత్త రెవెన్యూ చట్టం వస్తున్నందున రైతులకు కొత్త పాస్ పుస్తకాలు వస్తాయనడం సరికాదు. కొత్తగా అవసరమైన వారికి మాత్రమే కొత్త పుస్తకాలు వస్తాయి. సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని జిల్లా కలెక్టర్ చెప్పినప్పుడు లోతుగా విచారణ చేయాలని చెప్పానే తప్ప 2వేల ఎకరాల వరకు అక్రమాలు జరిగాయని నేను కూడా ఊహించలేదు. ధరణి పోర్టల్ నిర్వహణను ఈనెల ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఎన్ఐసీ చూస్తోంది..’అని మంత్రి వెల్లడించారు. సియోల్ బాంబులు స్టార్టయ్యాయి: తప్పు చేసిన వారు తప్పించుకోలేరు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్‌లో తాను చెప్పిన పొలిటికల్ బాంబులు ఇప్పుడు పేలడం మొదలయ్యాయని పొంగులేటి వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. తప్పు ఎప్పటికైనా బయటపడుతుందని, అయితే తప్పొప్పులు తేల్చేది కోర్టులని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని అన్నారు. ఫార్ములా ఈ రేసు విషయంలో తప్పు చేయకుంటే కేటీఆర్‌కు భయమెందుకని, కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గ్రీన్కో ఇచ్చిన ఎన్నికల బాండ్లు మాత్రమే కాదని, ఈ కేసులో బయటపడాల్సినవి చాలానే ఉన్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. విదేశీ కంపెనీకి వెళ్లిన డబ్బులు ఎవరి ఖాతాకి వెళ్లాయో తేలాలని అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో ధనిక పార్టీగా బీఆర్ఎస్ ఎలా అయిందని, జాతీయ పార్టీలకు కూడా లేని నిధులు ఆ పార్టీకి ఎక్కడివని ప్రశ్నించారు. -
అసంపూర్తిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ల క్రమబదీ్ధకరణ) దరఖాస్తుల్లో అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయనివారు 75శాతం మంది దాకా ఉన్నారు. అధికారులు దరఖాస్తులు పరిశీలించే క్రమంలో ఈ విషయం వెలుగుచూసింది. 2020 ఆగస్టు 26కు ముందు ఉన్న అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరించుకునేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చి ంది. రూ.1,000 ఫీజుగా చెల్లించి దరఖాస్తు చేసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి.అయితే వివిధ కారణాల వల్ల ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అప్పట్లో అర్ధాంతరంగా నిలిచిపోయింది. కాగా గత డిసెంబర్లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం 2020 నాటి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన చేయడంతో జనవరి నుంచి దరఖాస్తుల పరిశీలన మొదలైంది. అరకొరగానే అప్లోడ్ దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్కు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్పట్లో అప్లోడ్ చేయలేదు. మొత్తంగా 75 శాతం అసంపూర్తి దరఖాస్తులే అందజేశారు. ప్లాట్ల రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లు, లే అవుట్ కాపీలు, ఇతర పత్రాలు అప్లోడ్ చేయకుండా వచ్చి న దరఖాస్తులను పక్కనబెడుతూ అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రారంభించారు. ఇప్పటి వరకు 4,28,832 దరఖాస్తులను పరిశీలించగా, వాటిలో కేవలం 60,213 దరఖాస్తులు మాత్రమే ఆమోదించినట్టు పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు. తద్వారా రూ.96.60 కోట్లు ఫీజు రూపంలో వసూలైనట్టు చెప్పారు. పరిశీలించిన దరఖాస్తుల్లో 75 శాతం పూర్తిస్థాయి డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల వాటిని ఆమోదించడం లేదని దరఖాస్తుదారులకు చెప్పారు. షార్ట్‌ఫాల్స్ వివరాలను కూడా దరఖాస్తుదారులకు తెలియజేశారు.మరోసారి అవకాశం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడానికి పురపాలకశాఖ మరో చాన్స్ ఇచ్చి ంది. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయడానికి, మున్సిపాలిటీ/కార్పొరేషన్/నగరాభివృద్ధి సంస్థల నుంచి అధికారిక షార్ట్ ఫాల్స్ లెటర్ కోసం వేచిచూడకుండా పూర్తిస్థాయి డాక్యుమెంట్లను ఎల్ఆర్ఎస్ పోర్టల్‌లో అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సేల్‌డీడ్, ఈసీ, మార్కెట్ వ్యాల్యూ సర్టీ ఫికెట్, లేఅవుట్ కాపీ వంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవచ్చు. దరఖాస్తుదారులు తమ మొబైల్ నంబర్, చిరునామా లేదా ఇతర దరఖాస్తు వివరాలను మొబైల్ నంబర్ ఓటీపీని వినియోగించుకొని ఈ పోర్టల్ ద్వారా సవరించుకోవచ్చునని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు.ఇందుకోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్‌్కలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఏవైనా సందేహాలుంటే తీర్చుకోవడానికి లేదా వివరాల కోసం ఈ హెల్ప్‌డెస్క్‌లను సందర్శించవచ్చునని తెలిపారు. -
ఎన్నికలవేళ ఎల్ఆర్ఎస్ అమలుపై ఉత్కంఠ!
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎల్ఆర్ఎస్పై నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2020 నుంచి పెండింగులో ఉన్న భూక్రమబద్ధీకరణను మార్చి 31లోగా అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే ఆదేశించారు. ఓ పక్క ప్రభుత్వ గడువు ముంచుకొస్తుంది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ అమలవుతుందా? లేదా? అని ప్రజల్లో చర్చలు మొదలవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ త్వరలో విడుదల చేయనుందని తెలుస్తుంది. ఒకసారి నోటిఫికేషన్ వచ్చాక పథకాన్ని అమలు చేయడంపై పలు సందేహాలు వస్తున్నాయి. సుమారు 25.44 లక్షల దరఖాస్తులను అధికారులు పరిష్కరించాల్సి ఉంది. వీటిపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వ్యాజ్యాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేపట్టి.. ప్రభుత్వామోదం కోసం పత్రాలను సైతం పంపినట్లు తెలిసింది. రెండు దశల్లోనే తనిఖీ ప్రక్రియ.. ఎల్ఆర్ఎస్ కోసం పెట్టిన దరఖాస్తులను తనిఖీ చేసేందుకు ముందుగా మూడు దశలను ఖరారు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించటం ఒకటి. అర్హమైనదా.. కాదా.. నిర్ధారించి నోటీసులు జారీ చేయటం రెండో దశ, అర్హమైన వాటికి మూడో దశలో దరఖాస్తులను ఆమోదించడం. అయితే మార్గదర్శకాల రూపకల్పనకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు తక్కువగా ఉండటంతో దరఖాస్తుల తనిఖీ ప్రక్రియను రెండు దశల్లోనే పూర్తి చేయాలని నిశ్చయించారు. ఇదీ చదవండి: మొత్తం కేంద్రానికే.. రాష్ట్రాలు గగ్గోలు! క్షేత్రస్థాయి తనిఖీ పూర్తి చేసి అర్హమైనదా? కాదా? అన్న నోటీసులతో పాటు చెల్లించాల్సిన మొత్తం వివరాలతో నోటీసు జారీ ప్రక్రియ అంతటినీ ఒకే దశలో పూర్తి చేయాలని ప్రతిపాదించారు. అర్హత పొందిన దరఖాస్తుదారులు నిర్ధారిత మొత్తాన్ని చెల్లించిన మీదట ఆమోదించే ప్రక్రియను రెండో దశలో పూర్తి చేయాలని నిర్ణయించారు. -
ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణపై ప్రభుత్వం కీలక ప్రకటన
రాష్ట్రంలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది గత మూడున్నరేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. 2024 మార్చి 31లోపు దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లేఅవుట్లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరనుంది. నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 20 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విషయమై రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ విధానం ఏమిటన్నది ఇప్పటివరకు సందిగ్ధంగా ఉంది. తాజా ప్రకటనతో దరఖాస్తుదారులకు ఊరట లభించినట్లయింది. బడ్జెట్ సమయంలోనే వివరాల సేకరణ రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పెండింగుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎల్ఆర్ఎస్పై స్పష్టతనిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ పథకాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తే ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు సైతం ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. అనధికారిక అంచనాల ప్రకారం అందిన దరఖాస్తులను క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇదీ చదవండి: 2024లో హైదరాబాద్‌లో పూర్తికానున్న ఇళ్లు ఎన్నంటే.. మూడు దశల్లో పరిశీలన దరఖాస్తుల పరిశీలనకు న్యాయస్థానాల నుంచి అప్పట్లో అనుమతి లభించడంతో గతంలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తిచేశారు. ఆ ప్రక్రియను మూడు దశల్లో చేపట్టారు. తొలిదశలో దరఖాస్తుల పరిశీలన రెండో దశలో ఆయా స్థలాలు క్రమబద్ధీకరణకు అర్హమైనవా? కాదా? అని గుర్తించడం.. అర్హతలు ఉన్నట్లు భావిస్తే సిఫార్సు చేయడం.. మూడో దశలో సంబంధిత అధికారి నిబంధనల మేరకు ఫీజు చెల్లించాలంటూ నోటీసుల జారీకి అనుమతించడం. ఈ మేరకు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేశారు. 2020లో కేవలం రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. కానీ నోటీసులు అందుకున్నవారు అయోమయంలో ఉన్నారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఉపశమనం కలిగినట్లయింది. క్రమబద్ధీకరణ ఛార్జీలు ఇలా.. చదరపు గజం రూ. 3,000 కంటే తక్కువ ఉన్న సబ్-రిజిస్ట్రార్ విలువ 20 శాతం ఉంటుంది. రూ. 3,001 -రూ. 5,000 మధ్య 30 శాతం రూ. 5,001 -రూ. 10,000 మధ్య 40 శాతం రూ. 10,001 -రూ. 20,000 50 శాతం రూ. 20,001 -రూ. 30,000 మధ్య 60 శాతం రూ. 30,001 -రూ. 50,000 మధ్య 80 శాతం చదరపు గజం సబ్-రిజిస్ట్రార్ విలువ రూ. 50,000 పైన 100 శాతం ఉంటుంది. పై ఛార్జీలకు అదనంగా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణలో నాలా(వ్యవసాయ భూమిని వ్యవసాయేతర వినియోగానికి మార్చడానికి) రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఆమోదం పొందని లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం అందుబాటులో లేనట్లైతే ఆగస్టు 26 నాటికి ఉన్న ధరకు బదులుగా, ప్లాట్ రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న ప్లాట్ విలువలో 14 శాతం చొప్పున ప్రో-రేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు పాటించాల్సిన నిబంధనలు రోడ్డు వెడల్పు కనీసం తొమ్మిది మీటర్లు ఉండాలి. బలహీన వర్గాలకు చెందిన వారి లేఅవుట్లు లేదా 100 చదరపు మీటర్ల కంటే తక్కువ ఉన్న ప్లాట్ల్లో రహదారి వెడల్పు ఆరు మీటర్లు ఉండవచ్చు. అవసరమైన రహదారి వెడల్పు అందుబాటులో లేకపోతే రెండు వైపులా సమానంగా వెడల్పు చేయడానికి అవసరమైన భూమి ఉండాలి. ల్యాండ్ సీలింగ్ చట్టాలు, భూ వివాదాలు లేదా టైటిల్, సరిహద్దు వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఉంటే లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేయబడవు. అసైన్డ్ భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆమోదంలేని లేఅవుట్లో క్రమబద్ధీకరణకు కొంతమంది ప్లాట్ హోల్డర్లు ఆసక్తి చూపినా కాంపిటెంట్ అథారిటీ ఆమోదించిన లేఅవుట్ నమూనానే పరిగణిస్తారు. దరఖాస్తుదారులు సేల్ డీడ్/ టైటిల్ డీడ్ కాపీలను మాత్రమే అందించాలి. విక్రయ ఒప్పందం లేదా లీగల్ నోటరీ పరిగణించరు. నీటి వనరులకు సంబంధించిన చెరువు, కుంట, షికం భూముల్లోని లేఅవుట్లను క్రమబద్ధీకరించరు. నీటి వనరులు ఉన్న ప్రాంతాన్ని గ్రీన్ బఫర్ జోన్‌గా నిర్ణయిస్తారు. 10 హెక్టార్లు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోని లేఅవుట్లు నదీ ప్రవాహం/ సరస్సుల సరిహద్దు నుంచి 30 మీటర్లు ఉండాలి. కాలువ సరిహద్దుల నుంచి 9 మీటర్లు ఉండాలి. 'నాలా' లేదా మురికినీటి కాలువ నుంచి రెండు మీటర్లు ఉండాలి. -
ఎల్ఆర్ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చడీచప్పుడు లేకుండా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అనుమతుల్లేని లేఅవుట్లు, వెంచర్ల క్రమబద్ధీకరణను ఇప్పటికే ప్రారంభించిన మున్సిపల్ శాఖ..గప్‌చుప్‌గా తన పని తాను చేసుకుపోతోంది. క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించాలంటూ డెవలపర్లకు నోటీసులు పంపుతోంది. ఈ నోటీసులు అందుకున్న డెవలపర్లు భూముల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద ఫీజు చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌కు వీలుగా సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో జరుగుతుండగా, త్వరలోనే రాష్ట్రమంతా విస్తరింపజేస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 2020లో ఎల్ఆర్ఎస్ కింద రూ.10 వేల దరఖాస్తు ఫీజు చెల్లించినవారికే అవకాశం కల్పిస్తున్నారు. అయితే కోర్టు కేసుల దృష్ట్యా ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు విడుదల చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాణ సమయంలో డెవలప్మెంట్ చార్జీలు ప్రభుత్వ లెక్కల ప్రకారం హెచ్ఎండీఏ పరిధిలో 1,337 లేఅవుట్లు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ లేఅవుట్లలో మొత్తం 1.32 లక్షల ప్లాట్లు ఉండగా, 40,389 ప్లాట్లు అమ్ముడుపోలేదు. ఈ ప్లాట్లను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు వస్తాయని డెవలపర్లు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే దరఖాస్తు చేసుకున్న వాటిలో 688 లేఅవుట్లు ఎల్ఆర్ఎస్కు అర్హమైనవిగా మున్సిపల్ యంత్రాంగం గుర్తించింది. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలోనూ 304 లేఅవుట్లకు గాను 140 లేఅవుట్లను అర్హమైనవిగా గుర్తించింది. ఫీజు చెల్లించి అమ్ముడుపోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతి పొందాల్సిందిగా ఆయా లేఅవుట్ల డెవలపర్లకు నోటీసులిచ్చింది. ఈ నోటీసులు అందుకున్నవారు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే వారికి ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఇస్తోంది. ఈ సర్టిఫికెట్లో ఫలానా సర్వే నంబర్లో చేసిన ఫలానా వెంచర్లో ఫలానా నంబర్ నుంచి ఫలానా నంబర్ వరకు ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చెల్లించారని, ప్రస్తుతానికి ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవచ్చని, ఆయా ప్లాట్లలో నిర్మాణాలకు వెళ్లినప్పుడు మిగిలిన డెవలప్మెంట్ చార్జీలు చెల్లించాలని పేర్కొంటోంది. ఈ సర్టిఫికెట్లు ఉన్న లేఅవుట్లలోని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలోనే ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది. వారం, పదిరోజుల్లో మోక్షం! ప్రభుత్వ వర్గాలు మాత్రం ఏం చేస్తే ఏమవుతుందోనన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు వేచి ఉండాలని, తీర్పు ఎలా వస్తుందో చూసి అప్పుడు ఏం చేయాలన్నది నిర్ణయిద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కొందరు చెపుతుండగా, వారం నుంచి పదిరోజుల్లోపు వ్యక్తిగత ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు కూడా మోక్షం కలుగుతుందని, ఏదోరకంగా ప్రభుత్వం ఉపశమనం కలిగిస్తుందని మరికొందరు అధికారులు చెపుతుండడం గమనార్హం. లక్షల దరఖాస్తులను ఏం చేద్దాం? వెంచర్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణతో హైదరాబాద్ నగర శివార్లతో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లోని చాలా వరకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగిపోతాయి. అయితే వ్యక్తిగతంగా ఎల్ఆర్ఎస్ కోసం లక్షల్లో దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితేంటన్నది అటు మున్సిపల్, ఇటు రిజిస్ట్రేషన్ వర్గాలకు అంతు పట్టడం లేదు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై సుప్రీం, హైకోర్టులో కేసులు నడుస్తుండటంతో వ్యక్తిగత దరఖాస్తుల జోలికి వెళితే ఏం జరుగుతుందనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఇదే విషయమై అటు మున్సిపల్, ఇటు రిజిస్ట్రేషన్ల శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ గత రెండు నెలలుగా చర్చిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్లాట్ల క్రమబద్ధీకరణను ఎలా చేయాలన్న దానిపై కొన్ని ప్రణాళికలు కూడా రూపొందించినట్టు సమాచారం. ఇదీ చదవండి: మాంద్యం ముప్పు ఎవరికి? -
125 గజాల వరకు ఉచితం... ఆపై పైకం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను 125 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనున్నారు. అందు కోసం గత నెల 21 నుంచి మీ–సేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. మార్చి 31తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఆయితే అధికారులు ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం.. పేదలకు క్రమబద్ధీకరణ జీఓ పై సరైన సమాచారం లేకపోవడంతో దరఖాస్తులు చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. జవహర్‌నగర్ కార్పొరేషన్లో ప్రత్యేక సమావేశం జీఓ.58, 59 దరఖాస్తు అవగాహన కోసం మేయర్ మేకల కావ్య అధ్యక్షతన కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం కీసర ఆర్డీవో రవి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జవహర్‌నగర్‌లో కార్పొరేషన్, రెవెన్యూ సంయుక్తంగా చేయాల్సిన పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాప్రా తహసీల్దార్ అనిత, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. కేవలం వీరికే వర్తిస్తుంది.. 2014 జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. 2014 డిసెంబర్ 30న ప్రభుత్వం జారీ చేసిన 58, 59 జీఓల్లోని నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణకు మరోమారు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గత నెల 14వ తేదీన కొత్త జీఓ జారీ చేసింది. 250 గజాలు దాటితే మార్కెట్ విలువ చెల్లించాల్సిందే.. ప్రభుత్వం తాజాగా తెచ్చిన జీఓ ప్రకారం 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. 250 గజాల వరకు ప్రభుత్వం నిర్ధారించిన మార్కెట్ విలువలో 50శాతం, 250 నుంచి 300 చదరపు గజాలు దాటితే 75శాతం, 500 నుంచి 1000 గజాల్లో నిర్మాణాలు చేసుకుంటే 100 శాతం మార్కెట్ విలువ చెల్లించాలి. ఈసారైనా ముందుకొచ్చేనా? జవహర్‌నగర్ కార్పొరేషన్లో దాదాపు 2 లక్షల మంది పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నారు. 2014 క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించినా చాలా మంది ముందుకు రాలేదు. ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా వివరాలు లేకపోవడంతో మౌలిక సదుపాయాలు కల్పించడం అధికారులకు ఇబ్బందిగా మారింది. (క్లిక్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తప్పని నిరాశ) అడ్డదారుల్లో వెళ్తే క్రిమినల్ కేసులు: ఆర్డీవో జీఓ.58, 59 దరఖాస్తుల కోసం అడ్డదారుల్లో వెళ్లి నకిలీ ధ్రువపత్రాలు అందజేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కీసర ఆర్డీవో రవి హెచ్చరించారు. గ్రామపంచాయితీ పేరున గతంలో తీసుకున్నట్లు బిల్లులు తీసుకువస్తే వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లక్రమబద్ధీకరణ కోసం కొన్ని చోట్ల 2014 సంవత్సారానికి ముందు తేదీలలో నకిలీ ధ్రువపత్రాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అలాంటి వాటిని గుర్తించి వాటిపై దర్యాప్తు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జవహర్‌గనర్‌లో గతంలో జీఓ.58 ప్రకారం 5,546, జీఓ 59 ప్రకారం 1,666 మంది దరఖాస్తులు చేసుకున్నారని వీటికి సంబంధించి మరో 10 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. ఈనెల 31 వరకు మీ–సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుకు కావాల్సినవి.. ► 2014 జూన్ 2వ తేదీకి ముందున్న నిర్మాణాలను మాత్రమే క్రమబద్ధీకరణ చేస్తారు. ► ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసిన వారు మీ సేవా కేంద్రాల ద్వారా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ► రూ. వెయ్యి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ►ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలి. ► ఆధార్‌కార్డు, రిజిస్టర్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను రసీదు, విద్యుత్, నీటి బిల్లులు దరఖాస్తులతో సమర్పించాలి. ► ఎంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారన్న వివరాలు తెలియజేయాలి. ► గతంలో అధికారులు ఏదైనా నోటీస్ జారీ చేస్తే అది కూడా జత చేయాలి. ► కోర్టు కేసులు ఉంటే వివరాలు తెలియజేయాలి. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తప్పని నిరాశ
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడకు చెందిన కృష్ణమూర్తి తన 200 చదరపు గజాల స్థలంలో భవన నిర్మాణం కోసం మున్సిపల్ అధికారులను సంప్రదించాడు. రెండేళ్ల క్రితం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. నిబంధనల మేరకు అప్పటి మార్కెట్ ధర ప్రకారమే భవన నిర్మాణ ఫీజు నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ.. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న రసీదు తన దగ్గర లేకపోవడంతో అధికారులు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చెల్లించాలని సూచించారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరుకు చెందిన ఓ మహిళ తన 150 గజాల స్థలం కోసం 2020లోనే ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుంది. ఇందుకు సంబంధించిన రసీదు లేకపోవడంతో ‘ఎల్ఆర్ఎస్ తెలంగాణ’ వెబ్సైట్ నుంచి పొందేందుకు ప్రయత్నించింది. ఆమెకు సదరు వెబ్సైట్ నుంచి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో చేసేదేమీలేక ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.1.12 లక్షలు చెల్లించారు. సాక్షి, హైదరాబాద్: టీఎస్ బీ పాస్‌లో దరఖాస్తు చేసుకొనే వారికి సైతం ఎల్ఆర్ఎస్ రసీదులు లేకపోవడంతో పెద్ద మొత్తంలో భారం పడుతోంది. గతంలో రూ.1000 చెల్లించి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు పొందాలంటే 14 శాతం ఎల్ఆర్ఎస్ ఫీజుతో పాటు అప్పటి మార్కెట్ ధర ప్రకారం భవన నిర్మాణ రుసుమును చెల్లించే వెసులుబాటు ఉంది. కానీ చాలా మంది తమ వద్ద అప్పటి రసీదు లేకపోవడం, వాటిని వెబ్సైట్ నుంచే పొందే అవకాశం కూడా లేకపోవడంతో ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం అదనంగా చెల్లించాల్సివస్తోంది. స్తంభించిన సేవలు.. ► ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని రెండేళ్లుగా ఎదురు చూసిన ఎంతో మంది భవన నిర్మాణ అనుమతులను పొందేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నప్పటికీ ఫీజులు మాత్రం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 2020 నాటి మార్కెట్ ధర ప్రకారం చెల్లించే వెసులుబాటు ఉంది. ఈ మేరకు స్థలాల విస్తీర్ణం ప్రకారం రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు కూడా తగ్గింపు ఉండే అవకాశం ఉంది. కానీ చాలా మంది దరఖాస్తుదారులు తమ వద్ద అప్పటి ఎల్ఆర్ఎస్ రసీదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ► నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆన్లైన్లో వివరాలు లభించకపోవడంతో 14 శాతం ఎల్ఆర్ఎస్ రుసుముతో పాటు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారమే భవన నిర్మాణ అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. రసీదు లేని వాళ్లు ఎల్ఆర్ఎస్ తెలంగాణ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం ఉంది. కానీ కొంతకాలంగా ఆ వెబ్సైట్ సేవలు స్తంభించాయి. ► దరఖాస్తుదారులు ఆన్లైన్లో మొబైల్ నంబర్ నమోదు చేసిన తర్వాత ఫోన్‌కు ఓటీపీ (వన్‌టైమ్ పాస్వర్డ్) రావడం లేదు. ఒక్క తుర్కయంజాల్లోనే 45 వేల మందికిపైగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఒక్కో మున్సిపాలిటీ నుంచి ఇలా వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ► ఇప్పటికే రెండేళ్లు గడిచిపోవడం, ఎల్ఆర్ఎస్పై సందిగ్ధం నెలకొనడంతో చాలా మంది రసీదులు కోల్పోయారు. ప్రస్తుతం ఇళ్లు కట్టుకొనేందుకు ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. కానీ రసీదు మాత్రం లభించడం లేదు. స్తంభించిన ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ సేవలను తిరిగి ఎప్పటి వరకు పునరుద్ధరిస్తారనే అంశంపై ఎలాంటి స్పష్టత లేకుండాపోయింది. (క్లిక్: హైదరాబాద్‌లో ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు.. మెయింటెనెన్స్ లేకుంటే ముప్పే!?) వెల్లువలా దరఖాస్తులు.. కోవిడ్ ఉద్ధృతి తీవ్రత సమయంలో ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో తెలంగాణవ్యాప్తంగా వెల్లువలా వచ్చాయి. మొదటి రోజే 10 వేల మంది దరఖాస్తు చేసుకోగా చివరి రోజుకు 1,81,847 మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో మున్సిపాలిటీల నుంచే సుమారు 74 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీల నుంచి మరో 63 వేలకు పై గా అందాయి. మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి మరో 43,511 దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో ప్రభుత్వా నికి రూ.18.50 కోట్ల ఆదాయం లభించింది. (క్లిక్: దేశంలోనే తొలిసారిగా 5జీ డేటా కాల్ అభివృద్ధి) -
Telangana: ఎల్ఆర్ఎస్కు ఓకే.. కీలక మార్గదర్శకాలు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారుల నిరీక్షణ త్వరలో ఫలించనుంది. లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)–2020 కింద వచ్చిన దరఖాస్తులకు మోక్షం కల్పించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు దశలు ఇలా.. తొలి దశలో గ్రామపంచాయతీ/ మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వచ్చిన దరఖాస్తులను... గ్రామం/ సర్వే నంబర్ /ప్రాంతం / కాలనీల వారీగా వేర్వేరు క్లస్టర్లుగా విభజించి, స్థల పరిశీలన కోసం సిద్ధంగా ఉంచాలని సూచించారు. రెండో దశలో.. రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, స్థానిక టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులు/ డీటీసీపీఓలతో జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేసిన బృందాలు ప్రతి క్లస్టర్‌ను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. తనిఖీల సందర్భంగా పరిశీలించిన అంశాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఈ బృందాలను కోరారు. ఎల్ఆర్ఎస్ నిబంధనల ప్రకారం దరఖాస్తు ఉందా ? లేదా ? అని పరిశీలించి ఇదే అంశాన్ని జిల్లా కలెక్టర్, స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు నివేదించాలని సూచించారు. ఈ మేరకు తక్షణమే బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. 15 రోజుల్లోగా ఈ ప్రక్రియలను పూర్తి చేసి ఎల్ఆర్ఎల్ దరఖాస్తుల పురోగతి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్లు సమర్పిస్తే, తదుపరి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెక్ లిస్ట్ మేరకు నిర్ణయం తీసుకోవాలి దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా ? లేదా ? అన్న అంశాన్ని గుర్తించడానికి పురపాలక శాఖ చెక్ లిస్ట్ రూపొందించి విడుదల చేసింది. లేఅవుట్, ప్లాట్ తనిఖీకి వెళ్ళినప్పుడు అధికారుల బృందం ఈ చెక్ లిస్ట్ ఆధారంగా పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సైట్ ఇన్స్పెక్షన్ ముగిసిన తర్వాత ఎల్ఆర్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న/ క్రమబద్ధీకరణకు అర్హత లేని దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించనుంది. క్రమబద్ధీకరణకు అర్హత గల దరఖాస్తుల పరిష్కారానికి పురపాలక శాఖ మళ్ళీ కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. అర్హత గల దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన అదనపు సమాచారాన్ని, సంబంధిత శాఖల నుంచి కావాల్సిన ఎన్ఓసీలు సమర్పించడానికి దరఖాస్తుదారులకు నెల రోజులు గడువు ఇచ్చే అవకాశం ఉంది. అన్ని రకాలుగా అర్హమైన దరఖాస్తుల విషయంలో చెల్లించాల్సిన క్రమబద్ధీకరణ ఫీజులను దరఖాస్తుదారులకు ఆన్లైన్ ద్వారా నోటిఫై చేయడంతో పాటు చెల్లింపునకు తగినంత సమయం కూడా ప్రభుత్వం ఇవ్వనుందని అధికారవర్గాలు తెలిపాయి. మొత్తం 25 లక్షల దరఖాస్తులు.. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు గతేడాది ఆగస్టులో ఎల్ఆర్ఎస్–2020 పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా, రికార్డు స్థాయిలో 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తాజాగా ఈ దరఖాస్తుల పరిష్కారానికి పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దరఖాస్తుల క్లస్టరింగ్ (గ్రూపులుగా విభజించడం), సైట్ ఇన్స్పెక్షన్ (స్థల తనిఖీ) అనే రెండు ప్రక్రియలను వచ్చే 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు (మెమో) జారీ చేశారు. -
జోరందుకున్న ఎల్ఆర్‘ఎస్’
సాక్షి, హైదరాబాద్: లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులు జోరందుకున్నాయి. ప్లాట్ల యజమానుల నుంచి అనూహ్య స్పందన రావడంతో దరఖాస్తుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 5,15,591 దరఖాస్తులు రాగా.. గ్రామ పంచాయతీల పరిధిలో 1,94,996, మున్సిపాలిటీల పరిధిలో 2,09,895, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 1,10,700 దరఖాస్తులు ఉన్నాయి. దరఖాస్తు రుసుం రూపంలోనే ప్రభుత్వానికి రూ.52.37 కోట్ల ఆదాయం వచ్చింది. నగర, పట్టణాల శివార్లలోని గ్రామాల్లో వెలిసిన అక్రమ వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన యజ మానులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకుం టున్నారు. దీంతో గ్రామ పంచాయతీల పరిధిలో సైతం పట్టణాలకు దీటుగా అప్లికేషన్లు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెడుతూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అక్రమ, అనధికార లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ప్రధానంగా వ్యక్తిగత ప్లాట్ల యజమానులు భారీగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుం టున్నారు. ప్లాట్ల యజమానుల నుంచే 4 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, లే–అవుట్ల క్రమబద్ధీకరణకు వేలల్లోనే దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు అక్టోబర్ 15తో ముగియనుంది. ఆలోగా మరో 5 లక్షలకు పైనే దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరిస్తే క్రమబద్ధీకరణ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్లకుపైనే ఆదాయం వచ్చే అవకాశముంది. -
పల్లె స్పందించలే!
సాక్షి, హైదరాబాద్ : సర్కారు భారీగా ఆశలు పెట్టుకున్న అక్రమ, అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. దర ఖాస్తుల సమర్పణకు గడువు సమీపిస్తున్నా గ్రామ పంచాయతీల్లో వీటి సంఖ్య లక్ష కూడా దాటలేదు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయ తీల్లో ఎల్ఆర్ఎస్ అర్జీలు పది లక్షలు దాటుతా యని అంచనా వేసిన పంచాయతీరాజ్ శాఖ.. తాజా పరిణామాలతో అప్రమత్తమైంది. అనధి కార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ అనివార్య మని ప్రచారం చేస్తూ... దరఖాస్తు చేసుకోక పోతే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోకతప్పదని హెచ్చరికలు జారీ చేస్తూ అవగాహన కల్పి స్తోంది. ఈ క్రమంలోనే స్థల యజమానులు దరఖాస్తులు చేసుకునేలా కింది స్థాయి సిబ్బం దిని పురమాయిస్తోంది. గ్రామాల వారీగా అక్రమ లేఅవుట్ల జాబితా, స్థలాల వివరాలను సేకరించిన పంచాయతీ కార్యదర్శులు.. స్థల యజమానులకు ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించడంలో తలమునకలయ్యారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్లు చేసి మరీ.. స్థలాలను రెగ్యులరైజ్ చేసుకోమంటూ అభ్యర్థిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబరు 15వ తేదీ వరకు గడువుంది. ఇప్పటివరకు 94,886 దరఖాస్తులు! స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 26వ తేదీలోపు రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాలకు క్రమబద్ధీకరణ వర్తిస్తుందని ప్రకటించింది. అంతేగాకుండా అదే రోజు నుంచి ఎల్ఆర్ఎస్ లేని స్థలాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జీఓ 131 జారీ చేసిన సర్కారు.. ఇకపై స్థలాల క్రయవిక్రయాలకు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి అని, క్రమబద్ధీకరించుకోకపోతే భవన నిర్మాణ అనుమతులు కూడా రావని స్పష్టం చేసింది. ఈ మెలికతో ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వస్తాయని అంచనా వేసింది. ఇప్పటివరకు నగర పాలక సంస్థ, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోనే ఎల్ఆర్ఎస్ స్కీమ్‌ను వర్తింపజేసిన ప్రభుత్వం.. తొలిసారిగా గ్రామ పంచాయతీల పరిధిలోని అక్రమ, అనధికార లేఅవుట్లలో కొనుగోలు చేసిన స్థలాలకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖజానాకు కాసుల వర్షం కురుస్తుందని అంచనా వేసినా.. ప్రస్తుతం దాఖలైన దరఖాస్తుల సంఖ్యను పరిశీలిస్తే ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని ఆర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటి వరకు గ్రామ పంచాయతీల్లో 94,886 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి జిల్లాలు, మండలాల పునర్విభజనతో గ్రామీణ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగం పుంజుకుంది. మారుమూల ప్రాంతాల్లోనూ అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పది లక్షలు దాటుతాయని పంచాయతీరాజ్ శాఖ అంచనా వేసింది. కాగా, దరఖాస్తుల స్వీకరణతో ప్రభుత్వానికి రూ.10.03 కోట్ల ఆదాయం లభించింది. ప్లాట్ ఓనర్ అయితే రూ.1,000, లేఅవుట్ యజమానికైతే రూ.10 వేలను ప్రాసెసింగ్ ఫీజుగా నిర్దేశించడంతో ఈమేరకు రాబడి సమకూరింది. ఇందులో ప్లాట్లకు సంబంధించి రూ.9.74 కోట్లు, లేఅవుట్లకుగాను రూ.28.80 లక్షల ఆదాయం వచ్చింది. కాగా, ఈ రెండింటిలో 517 లక్షల చదరపు గజాల స్థలం క్రమబద్దీకరణకుగాను స్థల యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. రంగారెడ్డి టాప్..ఆసిఫాబాద్ లాస్ట్ రాష్ట్ర రాజధాని పరిసర జిల్లాల్లో అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు వెలిసినట్లు తాజాగా ఆయా జిల్లాల్లో నమోదైన దరఖాస్తుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. జిల్లా కేంద్రాలు, నగర. పురపాలక సంస్థల శివార్లలోనే అనధికార లేఅవుట్లు అత్యధిక స్థాయిలు పుట్టుకొచ్చాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా రంగారెడ్డి 24,178 వచ్చాయి. ద్వితీయ, తృతీయ స్థానాల్లో యాదాద్రి 15,467, సంగారెడ్డి 14,356 జిల్లాలున్నాయి. ఆ తర్వాత మేడ్చల్ 13,755 దరఖాస్తులు నమోదయ్యాయి. అతితక్కువగా దరఖాస్తులు వచ్చినవాటిలో ఆసిఫాబాద్ జిల్లా 145, మహబూబాబాద్ 157, జగిత్యాల 232, నారాయణపేట 272, ములుగు 286 ఉన్నాయి. -
మేమిస్తామంటే మీరొద్దంటారా!
ఘట్కేసర్ మండలం అన్నోజిగూడ గ్రామానికి చెందిన విక్రమ్ తన 180 గజాల ప్లాట్ క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని పత్రాలను సరిచూసిన హెచ్ఎండీఏ సిబ్బంది ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు చెల్లించాలని విక్రమ్‌కు అక్టోబర్ నెలాఖరులో సంక్షిప్త సమాచారం పంపించారు. అయితే అప్పటికే సమయం మించిపోవడం, అక్టోబర్ 31 అర్ధరాత్రి నుంచి ఆన్లైన్ చెల్లింపులు నిలిపివేయడంతో ఫీజు చెల్లించలేదు. శంకర్‌పల్లికి చెందిన అరుణ్‌రెడ్డి తన 150 గజాల ప్లాట్ క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని పత్రాలు సరిచూసిన అధికారులు ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు చెల్లించాలని ఎస్సెమ్మెస్ పంపించారు. అక్టోబర్‌లోనే ఆ ఫీజు చెల్లించాల్సి ఉండగా చెల్లించలేకపోయాడు. ఆ మొత్తం చెల్లిద్దామని హెచ్ఎండీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తీసుకోవడం లేదు. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాలయం చుట్టూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు చక్కర్లు కొడుతున్నారు. ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు చెల్లిస్తామని తార్నాకలోని కేంద్ర కార్యాలయం చుట్టూ ఆరు నెలలుగా తిరుగుతున్నా అధికారులు తీసుకోవడం లేదు. ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకోగా అన్ని పత్రాలు సరిగానే ఉన్నాయని ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు చెల్లించాలని దరఖాస్తుదారులకు ఎస్సెమ్మెస్‌లు పంపించిన అధికారులు... ఇప్పుడు ఫీజు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. గతంలోనే ఈ ఫీజు చెల్లించాల్సిన 10వేల మందికి తోడు అక్టోబర్ నెలాఖరులో ఎస్సెమ్మెస్‌లు అందుకున్న మరో 5వేల మంది దరఖాస్తుదారులు ఆ మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ 15వేల మంది ఫీజు చెల్లిస్తే హెచ్ఎండీఏకు రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనార్హం. అయితే గతేడాది అక్టోబర్ 31 వరకు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ ప్రక్రియ ముగియడంతో ఆన్లైన్, బ్యాంకు చెల్లింపులను నిలిపేశారు. దీంతో దరఖాస్తుదారులకు తిప్పలు తప్పడం లేదు. చెల్లింపులు నిలిపివేసిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే దరఖాస్తుదారులు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఫీజులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగానికి ఇప్పటికే లేఖ రాశామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గడువు పొడిగిస్తే మేలు.. హెచ్ఎండీఏ పరిధిలోని అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు 2015 నవంబర్‌లో ప్రభుత్వం అవకాశం కల్పించింది. మళ్లీ 2016 డిసెంబర్లో 20శాతం అధిక రుసుంతో మరోసారి అవకాశం ఇచ్చింది. ఇలా పాతవి, కొత్తవి కలిపి 1,75,612కు చేరుకున్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ టైటిల్ స్క్రూటిని, టెక్నికల్ స్క్రూటిని పూర్తయిన తర్వాత సక్రమమని తేలాక క్లియరెన్స్ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటూ దరఖాస్తుదారులకు ఎస్సెమ్మెస్‌లు పంపించారు. అది చెల్లించగానే ఫైనల్ ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. ఇలా హెచ్ఎండీఏకు లక్షా 75వేలకు పైగా దరఖాస్తులు వస్తే 1,02,500 దరఖాస్తులకు ఆమోదముద్ర వేశారు. దాదాపు 9,000 దరఖాస్తులు ఎన్వోసీల రూపంలో పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 63,500 దరఖాస్తులను ఓపెన్ స్పేస్, రిక్రియేషనల్, వాటర్ బాడీ, మ్యాన్‌ఫ్యాక్చరింగ్, సెంట్రల్ స్క్వేర్, ట్రాన్స్‌పొర్టేషన్, బయో కన్జర్వేషన్, ఫారెస్ట్ జోన్, మాస్టర్ ప్లాన్ రోడ్డు, ఓపెన్ స్పేస్ ఆఫ్ లేఅవుట్, నది, వాగు, నాలా బఫర్‌జోన్‌లోని ప్లాట్లు, శిఖంలోని ప్లాట్లు తదితర కారణాలతో తిరస్కరించారు. అయితే ఎల్ఆర్ఎస్ క్లియర్ అయిన ఫీజు సమాచారం అందుకున్న 1,02,500 దరఖాస్తుల్లో దాదాపు 15,000 మంది ఫీజు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు పొడిగిస్తే హెచ్ఎండీకు దాదాపు రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు రూపంలో రూ.వెయ్యి కోట్లు హెచ్ఎండీఏ ఖజానాకు వచ్చిన విషయం విదితమే. అయితే ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అనుమతి రావాలని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. మరోవైపు సొంతిల్లు కట్టుకునేందుకు చేతికి అందివచ్చిన అవకాశం కోసం ఇంకెన్నాళ్లు నిరీక్షించాలని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారిస్తే దరఖాస్తుదారులకు కష్టాలు తప్పనున్నాయి. -
పరిష్కారమయ్యేనా..?
కరీంనగర్ కార్పొరేషన్: స్థలాల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారం బద్దకిస్తోంది. దరఖాస్తులు పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పించినా దరఖాస్తుదారుల నుంచి స్పందన కనిపించడం లేదు. 2016 నవంబర్‌లో స్థలాల క్రమబద్ధీకరణ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. రూ.10 వేల డీడీలను చెల్లించి 4368 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం 6 నెలల గడువు విధించింది. అయినప్పటికీ పరిష్కారం కాకపోవడంతో పలుమార్లు గడువును పొడిగిస్తూ సుమారు రెండేళ్ల కాలం ఎదురుచూసింది. చివరిగా మరో అక్టోబర్ 30 వరకు గడువును పొడిగించింది. రెండేళ్ల కాలంలో కేవలం 56 శాతం మాత్రమే దరఖాస్తులు పరిష్కారానికి నోచుకున్నాయి. అక్టోబర్ 31 వరకు గడువు ఉండగా దరఖాస్తుదారుల నుంచి పెద్దగా స్పందన కనబడుటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు చివరిసారిగా ఇచ్చిన గడువును దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకుంటే బల్దియాల కాసుల పంట పండనుంది. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ద్వారా రూ.30.26 కోట్ల ఆదాయం రాగా, మొత్తం దరఖాస్తులు పరిష్కారమైతే మరో రూ.20 కోట్ల వరకు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. అయితే గడువు ఎన్నిసార్లు పొడిగించినా దరఖాస్తుదారుల్లో ఉత్సాహం కనబడడం లేదు. దరఖాస్తు చేసుకునేందుకు చూపించిన ఉత్సాహం పరిష్కరించుకోవడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. అయితే చివరిసారిగా పెంచిన గడువుతో మొత్తం దరఖాస్తులు పరిష్కారం అవుతాయనే ఆశాభావం అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. దరఖాస్తులన్నీ పరిష్కారానికి నోచుకుంటే బల్దియాకు కాసులపంట పండనుంది. స్పందన అంతంతే.. కరీంనగర్ నగరపాలక సంస్థలో స్థలాల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారానికి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. పలుమార్లు గడువు పొడిగించడంతోపాటు రెండు పర్యాయాలు బల్దియాలో ఎల్ఆర్ఎస్ మేళాను ఏర్పాటు చేశారు. ప్రతి దరఖాస్తుదారుడికి మూడు సార్లు నోటీసులు పంపించారు. అయినప్పటికీ దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గడువులోపు మొత్తం దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం అనుమానంగానే మారింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకుంటే వీఎల్టీ కట్టాల్సి వస్తుండడంతో కొంత మంది దరఖాస్తుల పరిష్కారానికి రావడం లేదు. మరికొంత మంది దరఖాస్తుల పరిష్కారానికి ఫీజులు చెల్లించినప్పటికీ సరైన పత్రాలు సమర్పించకపోవడంతో దరఖాస్తులను అధికారులు పరిష్కరించడంలేదు. పరిష్కారంలోనూ ఇబ్బందులే.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి ఫీజులు చెల్లించుకునే వరకే హడావిడి చేసిన అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చే విషయంలో మాత్రం జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్లాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు ఆ దిశగా వేగం పెంచడం లేదు. వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటుండడంతో దరఖాస్తుదారులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొందరైతే ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ కోసం వేచి చూడలేక ఎలాంటి అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణాలను చేపడుతున్నారు. ఇలా ఆలస్యం అక్రమాలకు తావిస్తుందనే ప్రచారం జరుగుతోంది. దరఖాస్తుదారులను చైతన్యపరుస్తాం నగరపాలక సంస్థ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి దరఖాస్తుదారులకు మరోసారి నోటీసులు జారీ చేస్తాం. దరఖాస్తులు పరిష్కరించుకునే విధంగా చైతన్యపర్చి పరిష్కరించుకునే విధంగా చర్యలు చేపడ్తాం. – రవీందర్‌సింగ్, నగర మేయర్ -
ఎల్ఆర్ఎస్ కిరికిరి
సాక్షి, హైదరాబాద్: శ్రీకాంత్ 20 ఏళ్లుగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ దాచుకున్న డబ్బులతో హయత్‌నగర్‌లో ఒక ఓపెన్ ప్లాట్ తీసుకున్నాడు. అనధికారిక భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో ‘ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్’ కోసం హెచ్ఎండీఏకు ఆన్లైన్లో దరఖాస్తు చేశాడు. ఇందుకు రూ.10 వేలు ఇనిషియల్ పేమెంట్ చెల్లించాడు. అయితే టైటిల్ క్లియర్ అంతా బాగున్నా టెక్నికల్ స్క్రూటినీలో ఆ ప్లాట్ ఇండస్ట్రియల్ జోన్లో ఉందంటూ అధికారులు క్లియరెన్స్‌కు అంగీకరించలేదు. అలాగే మణికొండలో వాటర్ బాడీస్ కింద ప్లాట్ ఉందంటూ రాజేందర్‌రెడ్డి దరఖాస్తును కూడా తిరస్కరించారు. ఇలా హెచ్ఎండీఏకు వచ్చిన లక్షా 75 వేల దరఖాస్తుల్లో 63,500 దరఖాస్తులను ఓపెన్ స్పేస్, రిక్రియేషనల్, వాటర్ బాడీ, మానుఫ్యాక్చరింగ్, సెంట్రల్ స్క్వేర్, ట్రాన్స్‌పోర్టేషన్, బయో కన్సర్వేషన్, ఫారెస్ట్ జోన్, మాస్టర్ ప్లాన్ రోడ్డు, ఓపెన్ స్పేస్ ఆఫ్ లే అవుట్, బఫర్‌జోన్ వంటి కారణాలతో తిరస్కరించారు. అయితే ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్‌లో ఇప్పడు ఈ తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులు తాము కట్టిన ఫీజును వెనక్కి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇనిషియల్ పేమెంట్‌గా చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలంటూ తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయానికి పోటెత్తుతున్నారు. జీఓ 151లో ఫీజు వెనక్కి ఇచ్చే ప్రస్తావన లేదని అధికారులు చెబుతుండడంతో ఖంగుతింటున్నారు. ఎంతో చమటోడ్చి కొన్న ప్లాట్ క్రమబద్ధీకరించరని తేలడంతో ఆర్థికంగా చితికిపోయామని, తాము కష్టించి కట్టించిన ఫీజును వెనక్కి ఇవ్వాలంటూ వారు మొరపెట్టుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోలేని స్థితిలో అధికారులు ఉన్నారు. వారికి కట్టామన్నట్టుగానే.. మావి ఇచ్చేయండి రూ.10 వేలు కట్టకున్నా లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్న ప్రజలకు చివరి సమయంలో ప్రభుత్వం అవకాశమిచ్చినట్టుగానే.. తాము ఎల్ఆర్ఎస్ కోసం అప్లయ్ చేసుకునే సమయంలో చెల్లించిన మొత్తం ఫీజు వెనక్కి ఇచ్చే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని హెచ్ఎండీఏలో ఎల్ఆర్ఎస్ తిరస్కరణకు గురైనవారు అభ్యర్థిస్తున్నారు. ‘పైసాపైసా కూడబెట్టి శివారు ప్రాంతాల్లో కొనుగోలు చేసిన ప్లాట్లు క్రమబద్ధీకరణ కావడం కష్టమని తేలడంతో ఇప్పటికే సగం చితికిపోయాం. ఈ ప్లాట్‌కు ఎల్ఆర్ఎస్ కోసం ప్రారంభ సమయం(ఇనీషియల్ పేమెంట్)లో చెల్లించిన ఫీజు కూడా ప్రభుత్వానికే వెళుతుందంటూ అధికారులు చెబుతున్న మాటలతో గుండె బరువెక్కుతోంది. అసలే ప్లాట్ విషయంలో మోసపోయాం. ఈ ఫీజు కూడా తిరిగి ఇవ్వకపోతే ఎలా’ అంటూ బాధితులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. కొందరైతే ఏకంగా ‘మా పైసలు తిరిగి ఇప్పించండి’ అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్న సందర్భాలు ఉన్నాయి. చిరుజీవుల ఆశలు అడియాసలు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం వచ్చి నగరంలో ఉంటున్నారు. దినసరి కూలీలతో పాటు వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల వరకు అహర్నిశలు శ్రమించి శివారు ప్రాంతాల్లో చాలా మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. కొందరు తమ పిల్లల పెళ్లిళ్లకు ఉపయోగపడతాయని, మరికొందరు భవిష్యత్‌లో ఇల్లు కట్టుకోవాలని ఆశించారు. ఇలా గ్రామ పంచాయతీ లే అవుట్లలోని ప్లాట్లు తీసుకున్నారు. ఎంతో వ్యయప్రయాసలతో కొన్న ఈ ప్లాట్‌ను లే అవుట్ రెగ్యులేషన్ (ఎల్ఆర్ఎస్) కింద క్రమబద్ధీకరించుకుంటే క్రయవిక్రయాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని భావించి వేలాది మంది ప్రారంభ ఫీజు «రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేశారు. అయితే ఇప్పుడు వివిధ కారణాలతో హెచ్ఎండీఏ అధికారులు తిరస్కరించారు. ‘ఏళ్ల క్రితం కొనుగోలు చేసినప్పుడు ఆ ప్లాట్లు బాగానే ఉన్నాయి. అయితే మాస్టర్ ప్లాన్‌లో ఆయా ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు, కుంటలు, నాలాలు, ఇండస్ట్రీయల్ జోన్లో ఉన్నవంటూ ఇప్పుడు అధికారులు చెబుతున్నారు. కొత్త మాస్టర్ ప్లాన్ తప్పుల వల్ల ప్లాట్ మీద పెట్టిన డబ్బులు పోతున్నాయి. అవి అమ్మినా తీసుకునేందుకు ఎవరూ రావడం లేదు. పోనీ మేం దరఖాస్తు చేసిన సమయంలో చెల్లించిన రూ.10వేలు కూడా హెచ్ఎండీఏ ఇచ్చేది లేదంటోంది. జీఓ 151లో ఆ ప్రస్తావన లేదంటున్నారు’ అని హెచ్ఎండీఏకు వచ్చిన ఎల్ఆర్ఎస్ బాధితులు రాజేందర్ రెడ్డి వాపోయాడు. ఫీజు తిరిగి ఇవ్వాలని జీఓలో లేదని, ప్రారంభ ఫీజు రూ.10 వేలు కంటే అధికంగా చెల్లిస్తే ఆ మొత్తం మాత్రం తిరిగి ఇస్తామన్నారు. జీఓ 151లో ఏముంది.. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకునే సమయంలో పూర్తిస్థాయి ఫీజు చెల్లించవచ్చు. లేదంటే ప్రారంభ ఫీజు రూ.10వేలు చెల్లించవచ్చు. లేదంటే దీంతో పాటు మరో పది శాతం డబ్బు కూడా చెల్లించవచ్చని ప్రభుత్వం ప్రస్తావించింది. కానీ తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు తిరిగి ఆ 10 వేలు తిరిగి చెల్లించాలని ఎక్కడా ప్రస్తావించడలేదు. హెచ్ఎండీఏకు వచ్చిన లక్షా75 వేల దరఖాస్తుల్లో లక్షా2,500 దరఖాస్తులను ఆమోదించారు. దాదాపు 9 వేల దరఖాస్తులు ఎన్ఓసీల రూపంలో పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 63,500 వివిధ కారణాలతో తిరస్కరించారు. -
తిరస్కరణ సరే.. ఫీజు సంగతేంటీ..?
సాక్షి, హైదరాబాద్ నాదర్గుల్లో మాస్టర్ ప్లాన్ రోడ్డు కింద ప్లాట్ ఉందంటూ విజయ్ పెట్టుకున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. హయత్‌నగర్‌లో ఇండస్ట్రియల్ జోన్ కింద ప్లాట్ ఉందంటూ వెంకట్ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. ..ఇలా అనేక కారణాలతో భారీ సంఖ్యలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను హెచ్ఎండీఏ అధికారులు తిరస్కరించారు. ఎల్ఆర్ఎస్ కోసం దాదాపు లక్షా 75 వేల దరఖాస్తులు రాగా.. అందులో 98 వేల దరఖాస్తులను క్లియర్ చేయగా, మరో 77 వేల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అయితే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను తిరస్కరించడం వరకు బాగానే ఉన్నా.. దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రారంభ చెల్లింపు(ఇనీషియల్ పేమెంట్) కింద ఒక్కో దరఖాస్తుదారుడు చెల్లించిన రూ.పది వేలను తిరిగి వెనక్కి ఇచ్చేది లేదని అధికారులు చెపుతుండటం దరఖాస్తుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. భవిష్యత్ అవసరాల కోసం ఎంతో కష్టపడి ప్లాట్ కొనుగోలు చేశామని, ఇప్పుడూ ఆ ప్లాట్ మాస్టర్‌ప్లాన్ రోడ్డులో పోతుందంటూ తిరస్కరించారని, అయితే కట్టిన ప్రారంభ ఫీజు రూ.పది వేలను వెనక్కి ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డబ్బులు తిరిగి ఇచ్చేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 77 వేల దరఖాస్తుల తిరస్కరణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం వచ్చి నగరంలో ఉంటున్నారు. దినసరి కూలీ దగ్గరి నుంచి వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల వరకు అహర్నిశలు శ్రమించి సొంతింటి కలను నిజం చేసుకునేందుకు శివారు ప్రాంతాల్లో చాలా మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. కొందరు పిల్లల పెళ్లిళ్లకు ఉపయోగపడతాయని, మరికొందరు భవిష్యత్‌లో ఇల్లు కట్టుకుని ఉందామని.. ఇలా అనేక ఆశలతో గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లు తీసుకున్నారు. పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన ఈ ప్లాట్లను ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకుంటే క్రయవిక్రయాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని భావించి వేలాది మంది ప్రారంభ ఫీజుగా «రూ.పది వేలు చెల్లించి దరఖాస్తు చేశారు. అయితే ఇప్పుడు అవే ప్లాట్లు మాస్టర్ ప్లాన్ రోడ్డులో ఉన్నాయని, శిఖం, నాలా, చెరువులో వస్తున్నాయనే కారణాలతో దాదాపు 77 వేలకుపైగా దరఖాస్తులను హెచ్ఎండీఏ తిరస్కరించింది. ‘ఏళ్ల క్రితం కొనుగోలు చేసినప్పుడు ఆ ప్లాట్లు బాగానే ఉన్నాయి. అయితే మాస్టర్ ప్లాన్‌లో ఆయా ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు, కుంటలు, నాలాలు, ఇండస్ట్రీయల్ జోన్లో ఉన్నాయంటూ ఇప్పుడూ అధికారులు సమాధానాలు చెబుతున్నారు. జీవోలో లేదంటున్న అధికారులు.. ‘‘మేము కొనుగోలు చేసినప్పుడూ ఇవేమీ లేవు. కొత్తగా తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్ తప్పుల తడకగా ఉండటం వల్ల ప్లాట్ మీద పెట్టిన డబ్బులు పోతున్నాయి. వాటిని అమ్మినా తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పోనీ మేము దరఖాస్తు సమయంలో చెల్లించిన రూ.పది వేలు అయినా ఇవ్వాలని కోరినా హెచ్ఎండీఏ అధికారులు కుదరదని చెపుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే.. జీవో 151లో ఆ ప్రస్తావన ఎక్కడా లేదని తిరిగిపంపుతున్నారు’అని హెచ్ఎండీఏకు వచ్చిన ఓ దరఖాస్తుదారుడు వాపోయాడు. లక్షా 75 వేల మందికిపైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు సమయంలో ప్రారంభ ఫీజుగా రూ.పది వేలు చెల్లించారు. వీరిలో 98 వేల మందికి ఎల్ఆర్ఎస్ క్లియర్ అయి ఫీజుల ఎస్ఎంఎస్ వస్తే.. ప్రారంభ ఫీజు రూ.పది వేలను మినహాయించి మిగతా ఫీజును చెల్లించారు. తిరస్కరణకు గురైన 77 వేల మందికి ప్రారంభ ఫీజును తిరిగి ఇచ్చేదే లేదని, జీవో 151లో ఆ ప్రస్తావన లేదని అధికారులు చెబుతున్నారు. అయితే దరఖాస్తు సమయంలో రూ.పది వేలకు మించి ఎక్కువ మొత్తం చెల్లించినవారివి తిరస్కరిస్తే ఆ పది వేలు మినహాయించి మిగతా డబ్బును చెల్లిస్తున్నామని అంటున్నారు. అయితే ఎల్ఆర్ఎస్ క్లియర్ అయిన వారికి ప్రారంభ ఫీజును మినహాయించి మిగతా ఫీజును చెల్లించమన్నట్టుగానే, తిరస్కరణకు గురైన వారికి ప్రారంభ ఫీజును తిరిగి చెల్లించాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు. జీవో 151లో ఏముందంటే.. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో పూర్తి ఫీజు చెల్లించవచ్చు. లేదంటే ప్రారంభ ఫీజు రూ.పది వేలు చెల్లించవచ్చు. లేదంటే దీంతో పాటు మరో పది శాతం డబ్బులు చెల్లించవచ్చని జీవో నంబర్ 151లో ప్రభుత్వం పేర్కొంది. కానీ తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు తిరిగి ఆ రూ.పది వేలు చెల్లించాలని ఎక్కడా ప్రస్తావించలేదని హెచ్ఎండీఏ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
గడువు రోజులే..!
నల్లగొండ టూటౌన్: మున్సిపల్ పట్టణాల్లో అనుమతులు తీసుకోకుండా లే అవుట్లు చేసిన ప్లాట్లను పక్షం రోజుల్లోగా క్రమబద్ధీకరించుకోవాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి పత్రాలు సమర్పించడంతో పాటు అపరాధ రుసుం చెల్లించిన వారి ప్లాట్లను మాత్రమే క్రమబద్ధీకరించాలని.. లేదంటే దరఖాస్తులను తిరస్కరించాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. ఎల్ఆర్ఎస్ కింద 2016 డిసెంబర్లో దరఖాస్తులు స్వీకరించారు. కానీ వివిధ కారణాల రీత్యా ఆ దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్లు చేసి విక్రయించిన స్థలాల్లో నివాసాలు నిర్మించుకోవాలంటే మున్సిపల్ కార్యాలయం నుంచి అనుమతి ఇవ్వకూడదు. కానీ ఇలాంటి వాటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ క్రమబద్ధీకరణ స్కీం) తీసుకువచ్చింది. మున్సిపాలిటీలకు అపరాధ రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకునే విధంగా వీలు కల్పించారు. దాంతో నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలు, దేవరకొండ నగరపంచాయతీలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుతో పాటు రూ.10 వేలు చెల్లించారు. కానీ ఆ తర్వాత వాటిని క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు పరిశీలించి ఎలాంటి అభ్యంతరం లేదని తేలిన తర్వాత పూర్తి రుసుం దరఖాస్తు దారులు చెల్లించాల్సి ఉంది. ధరఖాస్తులు చేసుకున్న వారిలో ఇంటి నిర్మాణం చేయదల్చిన వారు మాత్రమే రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకున్నారు. మిగతా వారు దరఖాస్తులను అలాగే వదిలేయడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది. నల్లగొండలో 2068, మిర్యాలగూడలో 990, దేవరకొండలో 64 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రుసుం చెల్లించకుంటే.. కొంత మందికి క్రమబద్ధీకరణపై పూర్తి అవగాహన లేనట్టు తెలుస్తోంది. రూ. 10 వేలతోనే క్రమబద్ధీకరణ అవుతుందని ధరఖాస్తులు చేసుకున్నవారు ఉన్నారు. కానీ స్థలం చూసిన తరువాత అపరాధ రుసుం నిర్ణయించడంతో డబ్బులు చెల్లించలేక మరికొంత మంది వెనకడుగు వేశారు. మరి కొంత మంది పూర్తి పత్రాలు సమర్పించలేదు. ఎల్ఆర్ఎస్ కోసం ధరఖాస్తు చేసుకున్న వారు మరో 15 రోజుల్లో రుసుం చెల్లించకుంటే వాటిని తిరస్కరించేందుకు మున్సిపల్ యంత్రాంగం సన్నద్ధం అవుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎల్ఆర్ఎస్ ను పక్షం రోజుల్లో పరిశీలించి వచ్చే నెలాఖరులోగా క్రమబద్ధీకకరణకు సంబంధించి పూర్తి పత్రాలకు ధరఖాస్తుదారులకు అందజేయనున్నారు. ఇక్కడి వాటికి మోక్షం లేదు ... మున్సిపల్ పట్టణాల్లో పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం గ్రీన్‌బెల్ట్, పారిశ్రామికవాడ ప్రాంతాల నుంచి తమ స్థలాలు క్రమబద్ధీకరించాలని పలువురు ధరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీటిని క్రమబద్ధీకరించకూడదు. మున్సిపల్టౌన్ ప్లానింగ్ అధికారులు అటువంటి వాటిని పరిశీలించి వాటిని తిరస్కరించకుండా అలాగే పెండింగ్‌లో పెట్టారు. ఇలాంటి ధరఖాస్తులు నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతి లేనివి వందల సంఖ్యలో ... మున్సిపాలిటీ కార్యాలయాల నుంచి అనుమతులు లేని లే అవుట్లలో చాలా మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇలాంటి స్థలాలు వందల సంఖ్యలో ఉన్నా సంబంధిత యజమానులు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోలేదు. కొంత మంది ఇంటి నిర్మాణ సమయంలో అనుమతి తీసుకోవచ్చని, మరి కొందరు తమవి అనుమతి తీసుకున్న స్థలాలే అని అనుకుంటున్నారు. రియల్ వ్యాపారులు వెంచర్లలో రోడ్లు వేసి విక్రయించడంతో అనుమతి తీసుకున్న అమాయక ప్రజలు భావించి క్రమబద్ధీకరణకు ధరఖాస్తులు చేసుకోలేదనే చెప్పవచ్చు. ఇలాంటి స్థలాల్లో ఇక ముందు ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపల్ కార్యాలయం నుంచి అనుమతి రాదు. నల్గొండ మొత్తం దరఖాస్తులు 3768 పెండింగ్ దరఖాస్తులు 2068 రుసుం చెల్లించినవి 1700 మిర్యాలగూడ మొత్తం దరఖాస్తులు 1570 తిరస్కరించినవి 40 పెండింగ్ దరఖాస్తులు 990 రుసుం చెల్లించినవి 540 దేవరకొండ మొత్తం దరఖాస్తులు 258 రుసుం చెల్లించినవి 194 పెండింగ్ దరఖాస్తులు 64 -
వచ్చే నెల 28లోగా పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: లే అవుట్ రెగ్యులేషన్ పథకం (ఎల్ఆర్ఎస్) కింద వచ్చిన దరఖాస్తులన్నింటినీ వచ్చే నెల 28వ తేదీలోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు గడువు విధించింది. ఆ తర్వాత మళ్లీ గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్త ర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేయాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కుడా, డీటీసీపీతోపాటు రాష్ట్రం లోని అన్ని పురపాలక సంస్థల కమిషనర్లను ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో జరుగుతున్న జాప్యం కారణంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అపరిష్కృతంగా ఉండటంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. దరఖాస్తుల పరిశీలన, తనిఖీలకు అధికారులు చాలా సమయాన్ని తీసుకుంటుండడం, అసంపూర్తి దరఖాస్తుల పరిష్కారానికి కావాల్సిన సమాచారాన్ని ఒకేసారి కోరకపోవడం, భూ యాజమాన్య హక్కుల నిర్ధారణ కోసం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు నిర్దేశిత గడువును పాటించకపోవడంతో జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ ఆదేశాలను అమలు చేయాలని కోరింది. ♦ పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, తనిఖీలను వచ్చే 15 రోజుల్లో పూర్తి చేయాలి. ♦ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ల్యాండ్ విభాగం అధికారులు తమ వద్దకు దర ఖాస్తులు వచ్చిన 10 రోజుల్లో భూ యాజమాన్య హక్కుల నిర్ధారణ ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తుదారుల నుంచి అదనపు సమాచారం అవసరమైతే ఈ గడువులోపే తెప్పించుకుని పరిష్కరించాలి. ♦అనర్హులైన దరఖాస్తుదారులకు తిరస్కృతి లేఖలు, ఫీజులను తెలిపే లేఖలను ఫిబ్రవరి 2లోగా జారీ చేయాలి. దరఖాస్తుదారులు మిగులు ఫీజుల చెల్లింపు, లేదా అదనపు సమాచారం అందించేందుకు 15 రోజుల సమయం కేటాయించాలి. ♦బ్యాలెన్స్ ఫీజులు/ డాక్యుమెంట్లను అందించిన వారి దరఖాస్తులను ఫిబ్రవరి 28 లోగా ఆమోదించాలి. 15 రోజుల్లో బ్యాలెన్స్ ఫీజు/డాక్యుమెంట్లు అందించ ని వారి దరఖాస్తులను తిరస్కరించాలి. -
‘క్రమబద్ధీకరణ’ అర్జీలకు మోక్షం!
త్వరలోనే నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో 6726 బీపీఎస్, 5165 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఇక దరఖాస్తుల స్వీకరణ లేనట్లే! సాక్షి, హైదరాబాద్: అక్రమ భవన నిర్మాణాలు, లే ఔట్ల క్రమబద్ధీకరణ పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలగనుంది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కని పిస్తోంది. అలాగే ఇక క్రమబద్ధీకరణ కోసం కొత్తగా దరఖాస్తులు స్వీకరించరాదని భావిస్తోంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఉడాలను మినహాయిస్తే.. తెలంగాణలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వద్ద పెండింగ్‌లో ఉన్న 6,726 బీపీఎస్ దరఖాస్తులు, 5,165 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో వాటిపై నిర్ణయం తీసుకోవాలంటూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సీఎం కార్యాలయాన్ని కోరింది. భవన నిర్మాణంలో ప్లాన్ ఉల్లంఘనలు, అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను రెగ్యులైరె జ్ చేసేందుకు అక్రమ భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీపీఎస్) ప్రవేశపెట్టుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2007 డిసెంబర్ 31న జీవో నెం.901 జారీ చేసింది. అప్పుడు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉంచిన 6,726 దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే 2008లోనూ అసమగ్ర వివరాలు, ఇతర కారణాలతో 5,165 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. ఎల్ఆర్ఎస్ ద్వారా పురపాలక సంస్థలకు రూ.112.57 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పెండింగ్ దరఖాస్తులపై సీఎం పేషీ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది. -
ఇంకా తేలని లెక్క !
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో క్రమబద్ధీకరణకు సంబంధించి లెక్కా పత్రం లేక అయోమయం నెలకొంది. ఎల్ఆర్ఎస్ కింద 65,669, బీపీఎస్ కింద 8676 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 7,656 ఎల్ఆర్ఎస్, 382 బీపీఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సిబ్బంది అధికారుల దృష్టికి తెచ్చారు. వాస్తవానికి బీపీఎస్ దరఖాస్తులు 520, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు సుమారు 10వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అనుమతి కోరుతూ లేఖ రాయాలని నిర్ణయించారు. అందులో భాగంగా అధికారులు ఇప్పుడు ఆగమేఘాలపై ఆ వివరాలను తెప్పించేం దుకు 4 జోనల్ కార్యాలయాలపై ఒత్తిడి పెంచారు. ఈ నెల 11లోగా ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల వివరాలు కేంద్ర కార్యాలయానికి పంపాలని హుకుం జారీ చేశారు. ఆ తర్వాత నాలుగు రోజుల్లో ఆయా వివరాలను స్థిరీకరించి ఈ నెల 15 తర్వాత ప్రభుత్వానికి నివేదించాలని కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్లానింగ్ విభాగం అధికారులకు గడువు నిర్దేశించారు. దీంతో ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల లెక్క తేల్చే పనిలో ప్లానింగ్ విభాగం సిబ్బంది బిజీ అయ్యారు. ప్రధానంగా ఘట్కేసర్, మేడ్చల్ జోనల్ కార్యాలయాల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు అధికంగా రావాల్సి ఉందని సమాచారం. గడువు ముగిసినా... నిర్ణీత గడువులోగా అపరాధ రుసుం చెల్లించిన వారికి సైతం అధికారులు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2008లో మొదలైన ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ప్రక్రియ 2013 మే 31వరకు పలు దఫాలుగా గడువు పెంపుతో కొనసాగింది. బీపీఎస్ కథ ముగియగా... ఎల్ఆర్ఎస్ గడువు ముగిసినప్పటికీ దరఖాస్తుల పరిశీలన, ఉత్తర్వుల జారీకి 2013 నవంబర్ 30వరకు అవకాశమిచ్చారు. గడువు ముగిసే చివరి రోజున హడావుడి చేసిన అధికారులు సుమారు 200లకు పైగా దరఖాస్తులను పరిష్కరించినా వీటికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను ఇవ్వలేకపోయారు. ఫీజు చెల్లించిన వారికి కూడా క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అందని పరిస్థితి ఏర్పడింది. ఆలాగే బీపీఎస్‌కు సంబంధించి వివాదం నేటికీ ఓ కొలిక్కి రాలేదు. గడువులోగా అపరాధ రుసుంతో చెల్లించినప్పటికీ అధికారులు, సిబ్బంది నిర్లిప్త వైఖరి వల్ల బీపీఎస్ దరఖాస్తుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. ఆదిలోనే నిర్లక్ష్యం ... ఆరంభంలో ఎల్ఆర్ఎస్/బీపీఎస్ దరఖాస్తుల వివరాలను కంప్యూటరీకరించక పోవడంతో ఇప్పుడు లెక్కలు తేలని దయనీయ పరిస్థితి ఏర్పడింది. కొందరు అక్రమార్కులు తమ బండారం బయటపడకుండా ఏ వివరాలనూ కంప్యూటరీకరించకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో అక్రమార్కుల జేబులు నిండాయే తప్ప హెచ్ఎండీఏ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడింది. క్రమబద్ధీకరణ ముసుగులో నియమ నిబంధనలకు తిలోదకాలిచ్చి భారీగా దండుకొన్న కొందరు అక్రమార్కులు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చేసేందుకు ఏకంగా ఫైళ్లనే తగులబెట్టిన సంఘటన శంకర్పల్లి జోనల్ కార్యాలయంలో చోటు చేసుకొంది. దీనిపై నిజా నిజాలు నిగ్గు తేల్చేం దుకు విచారణ చేపట్టిన సిబిసిఐడీ కూడా జాప్యం చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.