వ్యవస్థను చక్కదిద్దేందుకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తా
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్
మీడియాతో మంత్రి పొంగులేటి ఇష్టాగోష్టి
సాక్షి, హైదరాబాద్: ‘ఆసామి సరిగా లేకపోతే ఏం జరుగుతుందో గత ప్రభుత్వ హయాంలో అదే జరిగింది. దొరికినోడికి దొరికినంత తరహాలో ఆగమాగం చేశారు. ఈ పరిస్థితిని మార్చకపోతే ప్రభుత్వ ఆస్తులు, భూములు అన్యాక్రాంతమైపోతాయి. అలాకాకుండా వాటిని కాపాడడం మా బాధ్యత. నేను మంత్రిగా ఉన్నప్పుడే రెవెన్యూ వ్యవస్థను సరిచేస్తా. ఇందుకోసం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తా..’అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
పారదర్శకత కోసమే ప్రక్షాళన: ‘కర్ణాటకలో పారదర్శక రిజిస్ట్రేషన్ల ప్రయత్నం మొదలుపెట్టి 12 ఏళ్లు అవుతోంది. అక్కడ ఇప్పటికీ ఆ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది. తెలంగాణలోనూ దీనికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ వ్యవస్థను అన్ని రకాలుగా ప్రక్షాళన చేస్తున్నాం. రాష్ట్రంలో డిసెంబర్ నుంచి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం 1.2 శాతం పెరిగినా మా అంచనాలకు తగినట్టు మాత్రం రాలేదు. ఈ మూడు నెలలు ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నాం. మొత్తం 25 లక్షల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల్లో 4.5 లక్షల వరకు పరిష్కరించాం. మిగిలిన దరఖాస్తుల పరిష్కారం కోసం త్వరలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. జాగ్రత్తగా ముందుకెళ్తుండటంతో ఈ విషయంలో కొంత జాప్యం జరుగుతోంది.
జీవో 59 (ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి) దరఖాస్తుల విషయంలోనూ త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. భూముల విలువల సవరణ ప్రక్రియ అమలు చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. గ్రామ రెవెన్యూ అధికారుల నియామక ప్రక్రియ త్వరలో చేపడతాం. వీఆర్వో, వీఆర్‌ఏలుగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వచ్చిన 1,365 మందిని నేరుగా రెవెన్యూలోకి తీసుకుంటాం. మిగిలిన వీఆర్వోలు, వీఆర్‌ఏల్లో ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి పరీక్ష పెడతాం. ఈ పరీక్ష అనంతరం ఇంకా పోస్టులు మిగిలిపోతే టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది సర్వేయర్ల నియామక ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 81 లక్షల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియ 85 శాతం పూర్తయింది..’అని పొంగులేటి తెలిపారు.
కొత్త పాస్ పుస్తకాలుండవు
‘కొత్త రెవెన్యూ చట్టం వస్తున్నందున రైతులకు కొత్త పాస్ పుస్తకాలు వస్తాయనడం సరికాదు. కొత్తగా అవసరమైన వారికి మాత్రమే కొత్త పుస్తకాలు వస్తాయి. సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని జిల్లా కలెక్టర్ చెప్పినప్పుడు లోతుగా విచారణ చేయాలని చెప్పానే తప్ప 2వేల ఎకరాల వరకు అక్రమాలు జరిగాయని నేను కూడా ఊహించలేదు. ధరణి పోర్టల్ నిర్వహణను ఈనెల ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఎన్‌ఐసీ చూస్తోంది..’అని మంత్రి వెల్లడించారు.
సియోల్ బాంబులు స్టార్టయ్యాయి: తప్పు చేసిన వారు తప్పించుకోలేరు
దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్‌లో తాను చెప్పిన పొలిటికల్ బాంబులు ఇప్పుడు పేలడం మొదలయ్యాయని పొంగులేటి వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. తప్పు ఎప్పటికైనా బయటపడుతుందని, అయితే తప్పొప్పులు తేల్చేది కోర్టులని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని అన్నారు. ఫార్ములా ఈ రేసు విషయంలో తప్పు చేయకుంటే కేటీఆర్‌కు భయమెందుకని, కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గ్రీన్‌కో ఇచ్చిన ఎన్నికల బాండ్లు మాత్రమే కాదని, ఈ కేసులో బయటపడాల్సినవి చాలానే ఉన్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. విదేశీ కంపెనీకి వెళ్లిన డబ్బులు ఎవరి ఖాతాకి వెళ్లాయో తేలాలని అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో ధనిక పార్టీగా బీఆర్‌ఎస్ ఎలా అయిందని, జాతీయ పార్టీలకు కూడా లేని నిధులు ఆ పార్టీకి ఎక్కడివని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment