సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చడీచప్పుడు లేకుండా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అనుమతుల్లేని లేఅవుట్లు, వెంచర్ల క్రమబద్ధీకరణను ఇప్పటికే ప్రారంభించిన మున్సిపల్ శాఖ..గప్‌చుప్‌గా తన పని తాను చేసుకుపోతోంది. క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించాలంటూ డెవలపర్లకు నోటీసులు పంపుతోంది. ఈ నోటీసులు అందుకున్న డెవలపర్లు భూముల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద ఫీజు చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌కు వీలుగా సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో జరుగుతుండగా, త్వరలోనే రాష్ట్రమంతా విస్తరింపజేస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 2020లో ఎల్‌ఆర్‌ఎస్ కింద రూ.10 వేల దరఖాస్తు ఫీజు చెల్లించినవారికే అవకాశం కల్పిస్తున్నారు. అయితే కోర్టు కేసుల దృష్ట్యా ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు విడుదల చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది.
నిర్మాణ సమయంలో డెవలప్‌మెంట్ చార్జీలు
ప్రభుత్వ లెక్కల ప్రకారం హెచ్‌ఎండీఏ పరిధిలో 1,337 లేఅవుట్లు ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ లేఅవుట్లలో మొత్తం 1.32 లక్షల ప్లాట్లు ఉండగా, 40,389 ప్లాట్లు అమ్ముడుపోలేదు. ఈ ప్లాట్లను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు వస్తాయని డెవలపర్లు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే దరఖాస్తు చేసుకున్న వాటిలో 688 లేఅవుట్లు ఎల్‌ఆర్‌ఎస్‌కు అర్హమైనవిగా మున్సిపల్ యంత్రాంగం గుర్తించింది. అదేవిధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ 304 లేఅవుట్లకు గాను 140 లేఅవుట్లను అర్హమైనవిగా గుర్తించింది. ఫీజు చెల్లించి అమ్ముడుపోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతి పొందాల్సిందిగా ఆయా లేఅవుట్ల డెవలపర్లకు నోటీసులిచ్చింది. ఈ నోటీసులు అందుకున్నవారు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లిస్తే వారికి ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఇస్తోంది. ఈ సర్టిఫికెట్‌లో ఫలానా సర్వే నంబర్‌లో చేసిన ఫలానా వెంచర్‌లో ఫలానా నంబర్ నుంచి ఫలానా నంబర్ వరకు ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించారని, ప్రస్తుతానికి ఈ ప్లాట్లను
రిజిస్ట్రేషన్ చేయవచ్చని, ఆయా ప్లాట్లలో నిర్మాణాలకు వెళ్లినప్పుడు మిగిలిన డెవలప్‌మెంట్ చార్జీలు చెల్లించాలని పేర్కొంటోంది. ఈ సర్టిఫికెట్లు ఉన్న లేఅవుట్లలోని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలోనే ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది.
వారం, పదిరోజుల్లో మోక్షం!
ప్రభుత్వ వర్గాలు మాత్రం ఏం చేస్తే ఏమవుతుందోనన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు వేచి ఉండాలని, తీర్పు ఎలా వస్తుందో చూసి అప్పుడు ఏం చేయాలన్నది నిర్ణయిద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కొందరు చెపుతుండగా, వారం నుంచి పదిరోజుల్లోపు వ్యక్తిగత ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు కూడా మోక్షం కలుగుతుందని, ఏదోరకంగా ప్రభుత్వం ఉపశమనం కలిగిస్తుందని మరికొందరు అధికారులు చెపుతుండడం గమనార్హం.
లక్షల దరఖాస్తులను ఏం చేద్దాం?
వెంచర్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణతో హైదరాబాద్ నగర శివార్లతో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లోని చాలా వరకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగిపోతాయి. అయితే వ్యక్తిగతంగా ఎల్‌ఆర్‌ఎస్ కోసం లక్షల్లో దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితేంటన్నది అటు మున్సిపల్, ఇటు రిజిస్ట్రేషన్ వర్గాలకు అంతు పట్టడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌లపై సుప్రీం, హైకోర్టులో కేసులు నడుస్తుండటంతో వ్యక్తిగత దరఖాస్తుల జోలికి వెళితే ఏం జరుగుతుందనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఇదే విషయమై అటు మున్సిపల్, ఇటు రిజిస్ట్రేషన్ల శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ గత రెండు నెలలుగా చర్చిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్లాట్ల క్రమబద్ధీకరణను ఎలా చేయాలన్న దానిపై కొన్ని ప్రణాళికలు కూడా రూపొందించినట్టు సమాచారం.
ఇదీ చదవండి: మాంద్యం ముప్పు ఎవరికి?
Comments
Please login to add a commentAdd a comment