
కోస్గి: ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పిస్తూ అమలుచేస్తున్న ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) గందరగోళంగా మారింది. 336 గజాల ప్లాటుకు ఏకంగా రూ.104 కోట్ల ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు విధించటంతో సదరు ప్లాటు యజమాని బిక్కమొహం వేశాడు. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం భోగారం (Bogaram) గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి తన ప్లాటు క్రమబద్ధీకరణ (Land Regularisation) కోసం గతంలో రూ.1,000 ఫీజు చెల్లించి వివరాలు నమోదు చేసుకున్నాడు.
గురువారం తన ప్లాటుకు సంబంధించిన ఫీజు వివరాలు తెలుసుకునేందుకు కోస్గిలోని ఓ ఆన్‌లైన్ కేంద్రానికి వెళ్లాడు. అయితే 336.9 గజాల ప్లాటుకు రూ.104,35,19,683 ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించాలని ఆన్‌లైన్‌లో చూపడంతో అవాక్కయ్యాడు. ఆన్‌లైన్‌లో చూపిన వివరాల మేరకు 336.9 గజాల ప్లాటుకు సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన మార్కెట్ విలువ (Market Value) రూ. 2,21,22,016 కుగాను రెగ్యులరైజ్ చార్జీలు రూ.1,12,676,14 ఉండగా.. 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీ రూ.104.34 కోట్లు చూపించారు. ఈ విషయంపై ఎంపీడీఓ శ్రీధర్‌ను వివరణ కోరగా.. సదరు ప్లాటు యజమాని వివరాలు సేకరించి జిల్లా అధికారులకు పంపించినట్లు తెలిపారు.
ఆ ప్లాటుకు తగ్గిన ఎల్‌ఆర్‌ఎస్ రుసుము!
జడ్చర్ల: జడ్చర్లలోని ఓ ప్లాటుకు ఎల్‌ఆర్‌ఎస్ రుసుము రూ.27.33 కోట్లుగా నిర్ణయించటంపై గురువారం మీడియాలో వచ్చిన కథనాలపై మున్సిపల్ అధికారులు స్పందించారు. సంబంధిత దరఖాస్తును మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి పరిశీలించి సరిచేశారు. కిష్టారెడ్డి నగర్‌లోని సర్వే నంబర్ 108లో కె.ఝాన్సీకి చెందిన 200 చదరపు గజాల ప్లాటుకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు (LRS Fee) ఏకంగా రూ.27,33,42,785గా నిర్ణయించిన విషయం విదితమే. ఈ విషయాన్ని మీడియా వెలుగులోకి తేవటంతో అధికారులు తప్పును సరిదిద్దారు. ఆ ప్లాటుకు రూ.30,034లను ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుగా నిర్ణయించారు. అలాగే తప్పుగా చూపిన ప్లాటు విస్తీర్ణాన్ని కూడా సరిచేశారు.
హైదరాబాద్‌లో స్పందన అంతంతే..
జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నవారు 1,07,865 మంది కాగా.. వీరిలో ఇప్పటి వరకు కేవలం 5,505 మంది మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీని వినియోగించుకున్నారు. తద్వారా జీహెచ్‌ఎంసీకి రూ.69.62 కోట్లు సమకూరాయి. మొత్తం దరఖాస్తుదారుల్లో 58,523 మందికి ఆటోమేటిక్‌గా ఫీజు లెటర్స్ జారీ కాగా, వారిలో కేవలం 5,505 మంది మాత్రమే 25 శాతం ఫీజు రాయితీని వినియోగించుకున్నారు. వీరిలో 40 మందికి ప్రొసీడింగ్స్ జారీ అయినట్లు సమాచారం. మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తుందని, మిగతా వారు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్‌ఎంసీ సూచించింది.
చదవండి: సజ్జనార్‌కు మరో కీలక బాధ్యత?