విషయం తెలియడంతో బయటకు రప్పించిన పోలీసులు
నారాయణపేట జిల్లా రెనివట్లలో ఘటన
మద్దూరు: ఓ స్వామీజీ ఐదురోజులు సమాధికి ప్రయత్నించగా.. విషయం తెలుసుకున్న పోలీసులు నిలువరించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెనివట్లలో ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రెనివట్ల గ్రామానికి చెందిన సత్యానందస్వామి అలియాస్ హనుమంతు కొద్దిరోజులుగా వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడిగా చెలామణి అవుతున్నాడు.
ఈయన భార్య ఏడాది క్రితం పొలంలో ఎద్దు పొడవడంతో మృతిచెందింది. దీంతో ఆమెకు పొలంలోనే సమాధి కట్టించి పూజిస్తున్నాడు.అక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కొంతమందిని శిష్యులుగా చేసుకున్నాడు. శుక్రవారం అమావాస్య రోజున ‘తాను ఐదు రోజులు సమాధిలోకి వెళతానని.. బయట అఖండభజనలు చేయాలని’ భక్తులకు చెప్పి సమాధిలోకి వెళ్లాడు.
ఆదివారం ఉదయం విషయం పోలీసులకు తెలియడంతో డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో అక్కడకు చేరుకొని సమాధిలో ఉన్న స్వామీజీని బయటకు రప్పించారు. అనంతరం డాక్టర్ స్వామీజీకి వైద్య పరీక్షలు చేయగా, ఆర్యోగం నిలకడగా ఉంది. కొన్నేళ్ల క్రితం స్వగృహంలోనే ఒక అమావాస్య రోజు హనుమంతు మౌనదీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే కర్ణాటక చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు వస్తుండటంతో సొంత పొలంలోనే జీవ సమాధి కోసం ఒక ఆలయం నిర్మించినట్టు గ్రామస్తులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment