రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఉత్సాహంగా పాల్గొన్న బాలసదన్, రిహాబిలిటేషన్ సెంటర్ల బాలలు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పులకింత చిన్నారులకు బహుమతులు అందించిన ఉన్నతాధికారులు
సంగారెడ్డి/నారాయణపేట రూరల్/నిజామాబాద్ నాగారం/కామారెడ్డి: వసంతకాలంలో పువ్వులను.. పసి మోముల్లోని నవ్వులను ఎంత చూసినా తనివి తీరదు. పసి బిడ్డల ముఖాల్లోని నవ్వులు స్వచ్ఛతకే కాదు.. కొన్నిసార్లు సహజ స్థితిగతులకూ అద్దంపడతాయి. తల్లిదండ్రుల సంరక్షణ ఉంటేనే పిల్లలు తమ బాల్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలరు. కానీ, ఎంతో మంది బాలలు తమకు తెలియకుండానే అనాథాశ్రమాల్లో, రిహాబిలిటేషన్ సెంటర్లలో మగ్గిపోతున్నారు. అలాంటి బాలల ముఖాల్లో చిరునవ్వులు పూయించాలని ‘సాక్షి’ మీడియా సంకలి్పంచింది. బాలల దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. పలువురు ప్రముఖులు కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు అందించి బాలలను ఉత్సాహపరిచారు.
నిజామాబాద్‌లో ‘సాక్షి లిటిల్ స్టార్స్’..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతీనగర్‌లో ఉన్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్‌స్ట్రక్షన్స్‌లో ‘సాక్షి లిటిల్‌స్టార్స్’కార్యక్రమం ఘనంగా జరిగింది. సాక్షి మీడియా, అగ్గు భోజన్న నారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ముఖ్య అథితిగా హాజరై సాక్షి మీడియా ప్రత్యేకంగా బాలల దినోత్సవం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. వేడుకల్లో చిన్నారుల దేశభక్తి గేయాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్శనగా నిలిచాయి. వేడుకల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, జిల్లా సంక్షేమాధికారి షేక్ రసూల్‌బీ, అగ్గు భోజన్న నారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అగ్గు భోజన్న, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలసదనంలో సాక్షి మీడియా, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధుశర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను తమ జీవిత లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో కేక్ కట్ చేయించారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటలు, పాటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్, జిల్లా పరిషత్ సీఈవో, ఇన్‌చార్జ్ డీడబ్ల్యూవో చందర్‌నాయక్, మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలసదనం అధికారులు, ఉద్యోగులు, సాక్షి విలేకరులు పాల్గొన్నారు.
నారాయణపేటలో..
నారాయణపేటలోని బాలసదన్‌లో సాక్షి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ సిక్తా పటా్నయక్ పాల్గొన్నారు. చిన్నారులు గులాబీ పువ్వులతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. బాలసదన్‌లోని పిల్లలతో ఆమె సరదాగా గడిపారు. క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందించడంతో పాటు, నృత్యాలు చేసి అలరించిన చిన్నారులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, మైనారిటీ శాఖ అధికారి రషీద్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు యాదయ్య, కమలమ్మ, డీసీపీఓ తిరుపతయ్య, చి్రల్డన్ హోం ఇన్‌చార్జ్ నిహారిక, సాక్షి సిబ్బంది ఆనంద్, రాజేష్ పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
‘సాక్షి’మీడియా గ్రూపు, సహారా సొసైటీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని సహారా ప్రైమరీ రిహాబిలిటేషన్ సెంటర్‌లో గురువారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరై చిన్నారులతో ఉల్లాసంగా గడిపారు. వివిధ రకాల ఆటల పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న సహారా సెంటర్‌ను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment