ఆ ఓటే కాటేస్తది!  | CM KCR Fires On Congress At Nizamabad Medak Public Meeting | Sakshi
Sakshi News home page

ఆ ఓటే కాటేస్తది! 

Published Thu, Nov 16 2023 4:14 AM | Last Updated on Thu, Nov 16 2023 4:14 AM

CM KCR Fires On Congress At Nizamabad Medak Public Meeting - Sakshi

బుధవారం ఎల్లారెడ్డిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్‌ నాయకులు రాహుల్, రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని అంటున్నారు. అలా చేస్తే రైతులు అరేబియా సముద్రానికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటుంది. ధరణి తొలగిస్తే దళారీ వ్యవస్థ రాజ్యమేలుతుంది. రైతులను నంజుకుతింటారు.అది మనకు అవసరమా? 3 గంటల కరెంటు అని పీసీసీ అధ్యక్షుడు చెప్తున్నాడు. పది హెచ్‌పీ మోటార్లు పెట్టాలంటడు. పది హెచ్‌పీ మోటార్లంటే.. 30 లక్షల బోర్లకు రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాలె. వాళ్లకు ఏమన్న తెలుస్తుందా? కాంగ్రెస్‌ నాయకులు మన వేళ్లతో మన కళ్లనే పొడుచుకునేలా చేస్తున్నారు.     
– కేసీఆర్‌

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/ సాక్షి, కామారెడ్డి/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉన్న తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపి 55 ఏళ్లు గోసపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ వస్తోందని, నమ్మి మోసపోతే గోసపడతామని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాజకీయం అంటే సినిమా మ్యాట్నీ షో కాదని, ఎవరో చెప్పారని కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆ ఓటే కాటేస్తుందని హెచ్చరించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే దళారులు రాజ్యమేలుతారన్నారు.

ఓటు వేసే ముందు ఎవరు ఏం చేశారో ఆలోచన చేయాలని, తెలంగాణ రాకముందు ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉన్నదీ గమనించాలని కోరారు. అభ్యర్థులు, వాళ్ల వెనుక ఉన్న పార్టీల చరిత్రను చూసి నిర్ణయం తీసుకోవాలని, దుర్మార్గపు కాంగ్రెస్‌ను మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్, నిజామాబాద్‌ అర్బన్, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, మెదక్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. చరిత్ర మీ కళ్ల ముందే ఉంది. పార్టీ మీముందే పుట్టింది. మీ ముందే పెరిగింది. అదే కాంగ్రెస్‌ ఉన్న తెలంగాణను ఊడగొట్టింది. 55 ఏళ్లు గోస పెట్టింది. సాగునీరు, తాగునీరు, కరెంట్‌ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. రైతుల ఆత్మహత్యలతో గందరగోళ పరిస్థితులు ఉండేవి. అలాంటి కాంగ్రెస్‌ పార్టీ కొత్త రూపంతో వస్తోంది. సంపద పెంచకుండా సర్వనాశనం చేసి మళ్లీ వస్తోంది. దానికి ఓటేసి మోసపోతే గోసపడతాం. దుర్మార్గపు కాంగ్రెస్‌ను మట్టి కరిపించాలి. రాజకీయం అంటే సినిమా మ్యాట్నీ షోకాదు.. ఎవరో చెప్పారని ఓటేస్తే ఆ ఓటే కాటేస్తది. 

కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే! 
వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది. రాష్ట్రంలో ఎంపీ సీట్లన్నీ గెలిస్తే ఢిల్లీలో తడాఖా చూపించొచ్చు. పాలనా సంస్కరణల్లో భాగంగా తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. నవోదయ విద్యాలయాల కోసం ప్రధాని మోదీకి అనేకసార్లు లేఖలు రాశాం. కానీ ఇప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం 157 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. వివిధ పథకాల ద్వారా తెలంగాణకు రూ.25వేల కోట్లు రావాల్సి ఉన్నా ఇవ్వకుండా అడ్డుపుల్లలు వేస్తోంది. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. 

పోరాటాలతోనే రాష్ట్రం వచ్చింది 
యాభై ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్‌ పాలనలో ఎంతో గోసపడ్డాం. మనను తీసుకుపోయి ఆంధ్రలో కలిపి బాధపెట్టారు. తెలంగాణ రాకముందు రైతుల ఆకలి చావులు, నేతన్న ఆత్మహత్యలు, బతుకుదెరువు కోసం వలసలతో పల్లెల పరిస్థితి దారుణంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌)ను చీల్చేందుకూ కాంగ్రెస్‌ ప్రయత్నించింది.

అయినా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చింది. గత పదేళ్లుగా రా ష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఎలాంటి మతకలహాలు లేవు. నిజాం హయాంలో కట్టిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు కాంగ్రెస్‌ హయాంలో ఏవిధంగా తయారైందో ప్రజలకు తెలుసు. మా ప్రభుత్వం వచ్చాక నిజాంసాగర్‌ను పునరుద్ధరించాం. దీనికి కాళేశ్వరం నీటిని అందించేందుకు లింక్‌ ఏర్పాటు చేశాం. 

బీడీ కార్మీకులందరికీ పింఛన్‌ 
రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నం. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చుకున్నం. చెరువులను బాగు చేసుకున్నం. తలసరి ఆదాయంలో నంబర్‌ వన్‌గా నిలిచినం. రైతుబంధును రూ.10 వేల నుంచి ఏడాదికి కొంత పెంచుకుంటూ రూ.16 వేలు చేసుకుందాం. బీడీ టేకేదార్లకు, బీడీ కార్మీకులకు ఉన్న 2014 ఏడాది కటాఫ్‌ను తొలగించి పీఎఫ్‌ ఉన్న ప్రతిఒక్కరికీ పింఛన్‌ అందిస్తాం. వారితోపాటు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కిడ్నీ బాధితుల పింఛన్లు రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచుకుందాం..’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement