
నా కూతురు ఎవడితోనో వెళ్లిపోయింది. ఎవడో చెబితే తిరిగొచ్చింది. మళ్లీ ఎవడి కోసమో ఇంట్లోంచి వెళ్లిపోయింది. మా గురించి ఆలోచించని కూతురి గురించి మేమెందుకు ఆలోచించాలి.. అంటూ పోలీసుల ఎదుట భావోద్వేగంతో ఓ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ప్రాణంగా పెంచుకున్న కూతురిని పరువు పేరిట పొట్టన పెట్టుకుంటాడని కన్నతల్లి సహా ఎవరూ ఊహించలేకపోయారు.
బీహార్ సమస్తిపూర్(Samastipur)లో పరువు హత్య ఘటన చోటు చేసుకుంది. తక్కువ కులం వాడితో తన కూతురు వెళ్లిపోయి.. తిరిగొచ్చిందని ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమెను కడతేర్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కన్నీరు పెట్టసాగాడు. మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఇంట్లోని బాత్రూం నుంచి ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాక్షి(20) అనే యువతి కాలేజీ చదివే ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు ఉండేది కూడా ఆమె ఉండే కాలనీలోనే. ఆమె తండ్రి ముకేష్ కుమార్ సింగ్(Mukesh Singh Kumar) రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అతనిది పరాయి కులమంటూ ఆ ప్రేమను ఆ తండ్రి అంగీకరించలేదు. దీంతో.. మార్చి 4వ తేదీన ఆమె ఆ యువకుడితో ఢిల్లీకి వెళ్లిపోయింది. అక్కడ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయసాగింది.
ఈలోపు యువకుడి బంధువు ఒకరు వాళ్లను ఒప్పించి వెనక్కి పంపించారు. వారం కిందట ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది. సాక్షి తిరిగి రావడంతో ఈ కథ సుఖాంతమైందని బంధువులంతా అనుకున్నారు. కానీ, ఇంట్లోంచి వెళ్లిపోవడమే కాకుండా.. నలుగురికి తెలిసేలా కూతురు చేసిన రీల్స్‌పై ఆ తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు.
అయితే ఏప్రిల్ 7వ తేదీ నుంచి సాక్షి(Sakshi) మళ్లీ కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లి కంగారుపడిపోయింది. కూతురు మళ్లీ ఇంట్లోంచి వెళ్లిపోయిందటూ తండ్రి ముకేష్ సింగ్ భార్య సహా అందరినీ నమ్మించే ప్రయత్నిం చేశాడు. ఈ క్రమంలో సాక్షి తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముకేష్‌ను పోలీసులు విచారించగా.. ఎమోషనల్ డ్రామాలు ఆడాడు. ఈలోపు.. ముకేష్ బాత్రూం నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులతో నిజం ఒప్పుకున్న నిందితుడు.. తానే కూతురిని కడతేర్చినట్లు అంగీకరించాడు. కూతురిని చంపాక.. ఆ యువకుడిని కూడా చంపేందుకు ముకేష్ ప్రయత్నించాడని, కానీ సమయానికి ఆ యువకుడు ఊరిలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే అదనపు కట్నం కోసం..