
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
బెగుసరాయ్: యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని కర్కశంగా గుడ్డివాడిగా మార్చిన దారుణ ఘటన బిహార్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. బెగుసరాయ్ జిల్లా పిప్రా చౌక్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని డీఎస్పీ బీకే సింగ్ తెలిపారు.
సమశక్తిపూర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి తెఘ్రా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బరౌనీ గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఫ్రిబవరి 6న ఆమెను తీసుకుని పారిపోయాడు. తన భార్యను డ్రైవర్ కిడ్నాప్ చేశాడని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 16న తెఘ్రాకు తిరిగి వచ్చి స్థానిక కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత భర్తతో కలిసి ఆమె ఇంటికి వెళ్లిపోయింది. డ్రైవర్‌తో వెళ్లిపోయిన ఆమె ఎందుకు తిరిగొచ్చిందనేది వెల్లడికాలేదు.
శుక్రవారం సాయంత్రం డ్రైవర్‌కు ఆమె మరిది ఫోన్ చేశాడు. తన వదిన తమ వద్ద ఉండేందుకు ఇష్టపడటం లేదని, తెఘ్రా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆమెను తీసుకెళ్లాలని చెప్పాడు. నిజమని నమ్మి బయలుదేరిన డ్రైవర్‌ను దారి మధ్యలోనే దాదాపు 20 మంది అడ్డగించారు. రోడ్డున పక్కనున్న హోటల్‌లోకి తీసుకెళ్లి బాగా కొట్టారు. తర్వాత సిరంజీతో అతడి కళ్లలోకి యాసిడ్‌ను ఇంజెక్ట్ చేశారు. అతడిని హనుమాన్ చౌక్ సమీపంలో పడేసి పారిపోయారు. దారినపోయే వ్యక్తి చూసి అతడిని బెగుసరాయ్ ఆస్పత్రిలో చేర్చాడని, బాధితుడి చూపుపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారని డీఎస్పీ సింగ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment