![Afzal Gunj Robbery Gang Case Updates](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/2323.jpg.webp?itok=W6_6qoPo)
బీదర్, అఫ్జల్‌గంజ్ కాల్పులు వీరి పనే
ఇరువురిదీ బీహార్‌లోని వైశాలీ జిల్లానే
రూ.5 లక్షల రివార్డు ప్రకటించిన కర్ణాటక
2023 నుంచి యూపీ పోలీసులకూ వాంటెడ్
సాక్షి, హైదరాబాద్: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు బీహార్‌లోని వైశాలీ జిల్లా, ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్‌గా తేలింది. వీరిపై కర్ణాటక పోలీసులు రూ.5 లక్షల రివార్డు సైతం ప్రకటించారు. ఈ మేరకు లుక్ ఔట్ నోటీసులు రూపొందించి దేశ వ్యాప్తంగా అన్ని నగరాలకు పంపారు. ఈ గ్యాంగ్‌లో మొత్తం నలుగురు ఉండే వారని, 2023లో ఉత్తరప్రదేశ్‌లో ఇదే తరహా నేరానికి పాల్పడినట్లు బీదర్ అధికారులు చెబుతున్నారు.
మీర్జాపూర్‌లోనూ ఓ గార్డు హత్య
ఈ గ్యాంగ్ బైక్‌లపై తిరుగుతూ, పట్టణ శివార్లలో రెక్కీ చేసి, ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్‌గా చేసుకుంటోంది. అలోక్ కుమార్ నేతృత్వంలో సాగే ఈ ముఠాలో అమన్, చందన్ కుమార్, రాజీవ్ సాహ్ని సభ్యులుగా ఉండేవారు. వీళ్లు 2023 సెపె్టంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో పంజా విసిరారు. రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్లి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనంపై దాడి చేసి కాల్పులు జరిపారు. పట్టపగలు, నడిరోడ్డుపై సెక్యూరిటీ గార్డు జై సింగ్‌ను హత్య చేసి రూ.40 లక్షలు ఉన్న ట్రంకు పెట్టెతో ఉడాయించారు. ఈ కేసు కొలిక్కి తీసుకురావడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రత్యేకంగా ఓ స్పెషల్ టాస్‌్కఫోర్స్ (ఎస్టీఎఫ్) ఏర్పాటు చేసింది. అప్పట్లో ఈ గ్యాంగ్‌లో ఒక్కొక్కరిపై రూ.లక్ష చొప్పున రివార్డు ప్రకటించింది.
ఎస్టీఎఫ్‌కు ఇద్దరు మాత్రమే చిక్కారు
ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, 30 మంది సిబ్బందితో ఏర్పాటైన ఈ ఎస్టీఎఫ్ దాదాపు ఏడాది పాటు దేశ వ్యాప్తంగా గాలించింది. ఎట్టకేలకు గత ఏడాదిసెపె్టంబర్‌లో చందన్ కుమార్‌ను ముంబైలో, రాజీవ్ సాహ్నిని వైశాలీలో పట్టుకుంది. అప్పట్లో అమన్, అలోక్‌లు వైశాలీ జిల్లాలోని మహిసౌర్ జనధన్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం వేట ము మ్మరం చేయగా... ఇరువురూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఆపై బీహార్‌లోనూ ఈ ద్వయం పలు నేరాలు చేసినట్లు తేలింది. చివరకు గత నెల 16న బీదర్‌లో పంజా విసిరింది. ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ ఉద్యోగి గిరి వెంకటేష్‌ను చంపి, శివకుమార్‌ను గాయపరిచి రూ.83 లక్షలతో ఉడాయించారు. నగరంలో షెల్టర్ తీసుకున్న అమన్, అలోక్ నగదుతో తిరిగి ఇక్కడికే వచ్చి నేరానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉంచారు.
రివార్డు ప్రకటించిన కర్ణాటక పోలీసులు
అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేట్ బస్సులో రాయ్‌పూర్ వెళ్లేందుకు అమిత్‌కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. అక్కడ జరిగిన పరిణామాలతో మేనేజర్ జహంగీర్‌పై కాల్పులు జరపడం, పారిపోవడం జరిగిపోయాయి. ఈ హత్యాయత్నం ఘటనపై అఫ్జల్‌గంజ్ ఠాణాలోనూ కేసు నమోదైంది. ఈ దోపిడీ దొంగలు నగరం నుంచి కడప, నెల్లూరు మీదుగా చెన్నై వరకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆపై వీరి కదలికలు కనిపెట్టడం కష్టసాధ్యంగా మారింది.
దీంతో వీరిపై కర్ణాటక పోలీసులు రూ.5 లక్షల చొప్పున రివార్డు ప్రకటించారు. ఈ మేరకు జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుల్లో దుండగుల ఫొటోలను జత చేశారు. వీరికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు కలబురిగి డీఐజీ (9480800030) లేదా బీదర్ ఎస్పీ (9480803401) లేదా బీదర్ డీఎస్పీలకు (9480803420) సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. సమాచారం ఇచి్చన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment