కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్‌గాంధీపై బీహార్‌లో ఓ కేసు నమోదు అయ్యింది. ఓ పాలవ్యాపారి తనకు రూ.250 నష్టం వాటిల్లిందని, అందుకే రాహుల్ తాజాగా చేసిన వ్యాఖ్యలే కారణమని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) తాజాగా ఢిల్లీ కోటా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఆరెస్సెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆయన మాటలతో దిగ్భ్రాంతికి లోనైన ముకేష్ కుమార్ చౌదరి అనే వ్యక్తి.. తన చేతిలో ఉన్న పాలబకెట్‌ను వదిలేశాడట. దీంతో పాలన్నీ నేలపాలై.. అతనికి నష్టం వాటిల్లిందట!.
ఈ షాక్ నుంచి తేరుకుని అతను నేరుగా సమస్తిపూర్(Samastipur) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాహుల్‌గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాహుల్ మాటలతో నేను షాక్‌కి లోనయ్యా. నా చేతిలో ఉన్న బకెట్‌ను వదిలేశా. లీటర్ పాలు రూ.50.. మొత్తం రూ.250 నష్టం కలిగింది. రాహుల్ అలా మాట్లాడతారని అనుకోలేదు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు ఆయనపై కేసు పెడుతున్నట్లు చెప్పాడతను. దీంతో ఈసారి షాక్ తినడం పోలీసుల వంతు అయ్యింది. చేసేదిలేక.. బీఎన్‌ఎస్‌లో పలు సెక్షన్ల ప్రకారం రాహుల్‌పై కేసు నమోదు చేశారు.
జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న ప్రతీ సంస్థలను బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS)లు స్వాధీనం చేసుకున్నాయి. కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తోపాటు దేశంతో పోరాడాల్సి వస్తోంది’’ అని అన్నారు. అయితే..
‘దేశంతో పోరాటం’ అని వ్యాఖ్యపై దేశం నలుమూలల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడగా.. ఆయన దేశంలోని వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ సమర్థించింది.
ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే అసోం(Assam) రాజధాని గౌహతిలో మోంజిత్ చెటియా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రాహుల్ గాంధీ రేకిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు ఆయన పాల్పడినట్లు అందులో ఆరోపించారు. దీంతో పలు సెక్షన్ల కింద పాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment