milk business
-
అతని జీవితం ఎందరికో ఆదర్శం - రూ. 3 నుంచి రూ. 800 కోట్లు అధిపతిగా..
'శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస' అవుతుంది అనేది లోకోక్తి. ఆ మాటను నిజం చేసాడు రెడ్ కౌ డైరీ ఓనర్ 'నారాయణ్ మజుందార్'. ఇంతకీ అతడు ఏం చేసాడు? ఎలా సక్సెస్ అయ్యాడు.. అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. 1975లో ఒక పేదరైతు కుమారుడు 17 ఏళ్ల వయసులో నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NDRI) బయట పాలు అమ్మి కొంత డబ్బు సంపాదించాడు. అతని చదువు కోసం పలు అమ్మడం పార్ట్‌టైమ్ ఉద్యోగం ప్రారంభించి, ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. బెంగాల్‌లోని నదియా జిల్లాలో జన్మించిన నారాయణ్ మజుందార్ తన గ్రామంలోనే పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత 'ఎన్డిఆర్ఐ'లో చదువుకోడానికి వెళ్ళాడు. అప్పట్లో అతడు తీసుకున్న కోర్సుకి అయ్యే ఖర్చు రూ. 250. ఇది అప్పట్లో ఎక్కువ మొత్తం అనే చెప్పాలి. తన చదువు కోసం ఏదైనా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుని ఉదయం 5 నుంచి 7 గంటల వరకు పాలు అమ్మేవాడు. అంతే కాకుండా అతనికి స్కాలర్‌షిప్‌గా రూ.100, అతని తండ్రి నెలకు రూ. 100 అందేవి. (ఇదీ చదవండి: 2023 Skoda Kodiaq: కొత్త రూల్స్‌తో విడుదలైన లేటెస్ట్ కారు - పూర్తి వివరాలు) కాలేజీ విద్య పూర్తయ్యేనాటికి ఆ కుటుంభం వ్యవసాయ భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ తరువాత నారాయణ్ కోల్‌కతాలోని క్వాలిటీ ఐస్‌క్రీమ్‌లో డైరీ కెమిస్ట్‌గా ఉద్యోగం ప్రారభించారు. అప్పుడు అతని నెల జీతం సుమార్చు రూ. 600. తన ఉద్యోగం ఉదయం 4 నుంచి రాత్రియే 11 వరకు ఉండేది. అక్కడ ఉద్యోగం వదిలేసి సిలిగురి (హిమాలయన్ కోఆపరేటివ్)లో చేరాడు. ఆ తరువాత మదర్ డెయిరీలో మేనేజర్‌గా ఉన్న 'డాక్టర్ జగ్జీత్ పుంజార్థ్'ను కలిశారు. ఈ పరిచయం అతని జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. 1981లో మదర్ డెయిరీలో చేరి 1955లో హౌరాలోని ఒక కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేశాడు. (ఇదీ చదవండి: భారత్‌లో చీప్ అండ్ బెస్ట్ స్కూటర్లు - రోజువారీ ప్రయాణానికి మంచి ఆప్షన్..!) నారాయణ్ మజుందార్ 1999లో రూ.10 లక్షల పెట్టుబడితో చిల్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు. ఆ తరువాత ఏడాది పాల ట్యాంకర్ కొనుగోలు చేసి తన భార్య భాగస్వామ్యంతో ఒక సంస్థను స్థాపించాడు. 2003లో రెడ్ కౌ డైరీని తయారు చేశాడు. ఎప్పటికప్పుడు వ్యాపారంలో ఎదుగుతూనే ఉన్నాడు. 2007లో కోల్‌కతా డెయిరీతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుని, పాలీ పౌచ్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం వారికి మూడు ఉత్పత్తి కర్మాగారాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన కంపెనీలో 1000 మంది పనిచేస్తున్నారు. అంతే కాకుండా బెంగాల్‌లోని 12 జిల్లాల్లో సుమారు 3 లక్షల మందికి పైగా రైతులతో సత్సంబంధాలు పెట్టుకున్నారు. నారాయణ్ మజుందార్ కంపెనీ ఇప్పుడు ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. వీరికి 35 మిల్క్ చిల్లింగ్ ప్లాంట్లతో పాటు 400 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. మొత్తం మీద సైకిల్ మీద పార్ట్‌టైమ్ ఉద్యోగిగా ప్రారంభించి ఈ రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. తాతలు, తండ్రులు సంపాదనతోనే బ్రతికేయాలనుకునే వారికి 'నారాయణ్ మజుందార్' గొప్ప ఆదర్శం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు!
సాధారణంగా వయసు మీద పడే కొద్దీ విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారు. వృద్ధాప్యం కారణంగా ఆ వయసులో వచ్చే మోకాళ్లు, నడుము నొప్పులు వారిని తెగ ఇబ్బంది పెడుతంటాయి. ఇక్కడి వరకు అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఓ బామ్మ మాత్రం తాను కాస్త డిఫెరెంట్ అంటోంది. 65 ఏళ్లు దాటిన కూడా వ్యాపారం చేస్తూ ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తోంది. యుక్త వయస్కురాలు చేసినట్లు అన్ని పనులు చేస్తోంది. అసలు ఈ బామ్మ ఎవరు..? ఆ వ్యాపారం ఏంటో అనే వివరాలను తెలుసుకుందాం. ఆ ఆలోచనే.. లక్షల సంపాదనగా మారింది గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా నబానా గ్రామంలో నవాల్బీన్ దల్సంభాయ్ చౌదరి (65). ఈ బామ్మ పెద్దగా చదువుకోలేదు. వయసులో ఉన్నప్పుడు గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాం. కానీ, వయసు అయ్యే కొద్దీ కూలి పని కష్టంగా మారింది. ఇక ఏం పనులు చేసుకోగలం అని ఆలోచించగా ఓ ఐడియా తట్టింది. అదే పాడి పరిశ్రమ పెట్టాలన్న నిర్ణయానికి పునాది వేసింది. అలా 15 ఏళ్ల క్రితం 15 గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించింది దల్సంభాయ్. కాల క్రమేణా ఆ 15 గేదెలు కాస్తా 250కి పైగా విస్తరించాయి. ప్రస్తుతం రోజూ 11 వందల లీటర్ల పాలను సరఫరా చేస్తోంది. దీని ద్వారా ప్రతి నెలా ఆమె 11 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రతి 15 రోజులకు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. నవాల్బీన్ ఏడాదికి 25 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఆమె నడుపుతున్న డెయిరీలో 10 మంది పనిచేస్తున్నారు. వారి నెల జీతం రూ. లక్షన్నర. మహిళా సాధికారతకు నవాల్బీన్ మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. 60 ఏళ్ల వయసులో కూడా పాల వ్యాపారం విజయవంతంగా సాగిస్తున్న ఈ బామ్మను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చదవండి: సిబిల్ స్కోరు గురించి ఈ విషయాలు తెలియక.. తిప్పలు పడుతున్న ప్రజలు! -
నువ్వు తోపు సామీ.. పాలు అమ్మేందుకు అన్ని లక్షల బైకా భయ్యా!
సోషల్ మీడియా అనగానే ఎన్నో స్పెషల్, ఫన్నీ వీడియోలు దర్శనమిస్తుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే అబ్బా ఏముంది అని అనుకుంటాము. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్యర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఏమైందంటే.. ప్రతీరోజు మనం చూస్తూనే ఉంటాం కదా.. పాలు అమ్మే వాళ్లు ఏదో ఒక చిన్న బైక్ లేదా సైకిల్‌పై వచ్చి పాలు పోసి వెళ్తుంటారు. దాదాపు చాలా మంది చిన్న బైకులనే ఉపయోగించి పాలు అమ్ముతుంటారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం పాలు అమ్మేందుకు ఏకంగా లక్షలు విలువచేసే హార్లే డేవిడ్సన్ బైక్‌ను ఉపయోగించాడు. ఆ బైక్‌కు రెండు వైపులా పాల క్యాన్లను తగిలించుకుని పాలు పోసేందుకు వీధుల్లోకి వెళ్లి వారికి పాలను అందిస్తున్నాడు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. అమిత్ బదనా అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్టు చేయగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. పాలు అమ్మేందుకు రూ.11 లక్షలకు పైనే విలువ చేసే బైక్‌ను వాడుతున్నావా అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశాడు. View this post on Instagram A post shared by Amit Bhadana (@amit_bhadana_3000) -
అతనో డివిజన్ కార్పొరేటర్.. అయినా ఆ వృత్తిని వదలలేదు!
అతడో డివిజన్‌కు కార్పొరేటర్. ఓ వైపు కార్పొరేటర్‌గా డివిజన్ ప్రజలకు సేవ చేస్తూనే తాను నమ్ముకున్న వృత్తి అయిన పాడిలో రాణిస్తున్నాడు. జవహర్‌నగర్ కార్పొరేషన్26వ డివిజన్ కార్పొరేటర్ బాబు అంటే ఎవరూ గుర్తుపట్టరు. కానీ పాల బాబు అంటే జవహర్‌నగర్‌లో అందరూ గుర్తుపడతారు. కార్పొరేటర్ కంటే పాడి వృత్తే తనకు గుర్తింపు ఇచ్చిందని గర్వంగా చెప్పుకుంటాడు పానుగంటి బాబు అలియాస్ పాల బాబు. అలా తన వృత్తియె ఇంటి పేరుగా మారిందని చెబుతాడు. సాక్షి,జవహర్‌నగర్(హైదరాబాద్): వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బాబు ఇంటర్మీడియట్ వరకు చదివాడు. పాడిపై దృష్టి సారించి లోకల్ గేదేలతో పాల వ్యాపారం చేశాడు. మరింత పాల ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో ముర్రా జాతి గేదేలను తీసుకురావాలని సంకల్పించాడు. హర్యానా ప్రాంతంలోని రోతక్ నుంచి, విజయవాడ నుంచి ముర్రాజాతి గేదెలను, మహారాష్ట్రలోని షిర్టీ ప్రాంతంలో లభించే హెచ్ఎఫ్ బ్రీడ్‌కు చెందిన ఆవులను తీసుకొచ్చి పెంచుతున్నాడు. పశువుల కోసం సొంతంగా గడ్డిపెంపకం.. గెదెలు, ఆవుల సంరక్షణకు రూ.4.20లక్షలు వెచ్చి ంచి 70 పశువులు ఉండేలా షెడ్డులను ఏర్పాటు చేశాడు. ఈ పశువులకు ఉదయం, సాయంత్రం శుభ్రం చేయడమే కాకుండా షెడ్డును కూడా శుభ్రపరుస్తాడు. అలాగే ఉందయం ఒకపూట పచ్చిగడ్డి, రెండు పూటల వరిగడ్డి అందజేస్తాడు. అందుకోసం ఆయన 4ఎకరాల్లో ప్రత్యేకంగా పలు రకాల గడ్డిని పండిస్తున్నాడు. గేదెలకు ఇన్సూరెన్స్... ప్రస్తుతం అతడి వద్ద ముర్రా జాతికి చెందిన గేదెలు 54, జర్సీ ఆవులు (హెచ్‌ఎఫ్‌బీడ్) 10 ఉన్నాయి. ఇవి ప్రతి రోజు 350 లీటర్ల పాలను ఇస్తున్నాయి. పాల బాబు వీటికి ఇన్సూరెన్స్ కూడా చేయించడం విశేషం. ఆదాయంలో కొంత సమాజ సేవకు.. పానుగంటి బాబు కార్పొరేటర్ అయిన తర్వాత సమాజ సేవవైపు దృష్టి పెట్టారు. తనకు వచ్చిన ఆదాయంలో కొంత డబ్బును పేదలను ఆదుకోవడానికి ఉపయోగిస్తున్నారు. తన తండ్రి పానుగంటి బాలయ్య పేరుతో అంత్యక్రియల వాహనాన్ని కార్పొరేషన్‌కు అందజేశారు. కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి పేదలకు నిత్యావసరాలను అందజేశారు. తాజాగా వృద్ధాప్య పింఛన్‌దారులకు ‘బాలయ్య భోజనం’పేరుతో ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చదవండి: Hyderabad: బోర్డ్ తిప్పేసిన ఐటీ సంస్థ.. రోడ్డున పడ్డ 800 మంది ఉద్యోగులు -
పాలు అమ్మడానికి హెలికాప్టర్ కొనేశాడు
ముంబై : పాలు అమ్మడానికి వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఆటోలు లేదా ట్రక్కులు, లేదా మోటార్ సైకిల్ మీదనో వెళ్తుంటారు. కానీ మహారాష్ట్రలోని భివాండికి చెందిన ఓ రైతు మాత్రం ఏకంగా హెలికాప్టర్‌నే కొనేశాడు. ఇందుకోసం ఏకంగా 30 కోట్లు ఖర్చు చేశాడు. వివరాల ప్రకారం..జనార్దన్ భోయిర్ అనే రైతు ఈ మధ్యే పాల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన బిజినెస్‌ను విస్తరించుకునేందుకు పంజాబ్, హర్యానా, రాజస్తాన్, గుజరాత్‌లోని పలు ప్రాంతాలకు తరచూ వెళ్లాల్సి వచ్చేది. అయితే ఆయన వెళ్లే ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ సదుపాయం లేకపోవడంతో రైళ్లు, బస్సుల్లో వెళ్తుండేవాడు. దీంతో సమయం ఎక్కువగా వృధా అవుతుండటంతో స్నేహితుడి సలహా మేరకు ఓ హెలికాప్టర్‌ను కొనుగోలు చేశాడు. ఇప్పటికే హెలికాప్టర్‌ను తన గ్రామానికి తీసుకొచ్చి ట్రయల్స్ వేశారట. 2.5 ఎకరాల స్థలంలో హెలికాఫ్టర్ కోసం ప్రొటెక్టివ్ వాల్‌ను నిర్మించాడు. మార్చి 15న హెలికాప్టర్‌ను జనార్థన్ ఇంటికి డెలీవరీ చేస్తామని అధికారులు తెలిపారు. వ్యవసాయం, డైరీ బిజినెస్‌లతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసే జనార్థన్‌కు దాదాపు రూ 100 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు సమాచారం. ఇటీవల మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వృద్ధురాలు తన పొలానికి వెళ్లేందుకు హెలికాప్టర్ కొనుగోలు చేసేందుకు లోన్ ఇప్పించాలని రాష్ష్ర్టపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే. చదవండి : (వైరల్ : 'హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించండి') (అరుదైన దృశ్యం: పాముకు నీరు తాగించాడు..) -
మహిళ రికార్డు.. ఏడాదిలో కోటి సంపాదన
సాక్షి, న్యూఢిల్లీ : సాధించాలనే తపన ఉంటే, ఎన్ని అవరోధాలు ఎదురైనా లక్ష్యం సిద్ధిస్తుందనే మాటను నిజం చేసి చూపించింది గుజరాత్‌కు చెందిన 62 ఏళ్ల ఓ మహిళ. క్షీర విప్లవాన్ని సాధించడం అనేది మాటల్లోనే కాదు, చేతల్లోనూ ఆమె చేసి చూపిస్తోంది. గుజరాత్లో బనస్కాంత జిల్లాలోని నాగానా గ్రామానికి చెందిన నిరక్షరాస్యురాలు అయిన చౌదరి నవల్‌బెన్ దల్సంగ్‌బాయ్(62) ఏడాదిలో రూ. 1కోటి 10లక్షల విలువైన పాలను విక్రయించడం ద్వారా గుజరాత్లో కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ మహిళ వద్ద 80 గేదెలు, 45 ఆవులు ఉన్నాయి. వీటితో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కలిపి సుమారు వెయ్యి లీటర్ల పాలను ఆమె విక్రయిస్తోంది. రెండేళ్లలో నవల్‌బెన్‌కు బనస్కాంత జిల్లాలో 2 లక్ష్మి అవార్డులు, 3 ఉత్తమ పశుపాలక్ అవార్డులు లభించాయి. గాంధీనగర్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డులను అందుకున్నారు. నవల్‌బెన్ డెయిరీలో 11 మంది పని చేస్తున్నారు. క్షీర విప్లవానికి తోడ్పడుతున్న ఈ మహిళకు నలుగురు కుమారులు ఉన్నారు. -
బతుకు చూపిన ‘పాడి’
వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసింది. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక అన్నదాతలు మానసికంగా నలిగిపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్ట లేకపోయింది. పంట సాగు తప్ప మరో పని చేతకాని రైతన్నలు ప్రత్యామ్నాయ రంగాలపై దృష్టి సారించారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉండే పాడిపోషణ వైపు ఆసక్తి పెంచుకున్న అన్నదాత... ఆర్థికంగా బలపడుతూ వచ్చాడు. తనతో పాటు మరికొన్ని కుటుంబాలకు బతుకు చూపుతున్నాడు. - లేపాక్షి (హిందూపురం) లేపాక్షి మండలం కంచిసముద్రం పంచాయతీ పరిధిలోని కె.బసవనపల్లి రైతులు పాడిపరిశ్రమలో రాణిస్తున్నారు. 76 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో ప్రతి కుటుంబానికి మూడు, నాలుగు పాడి ఆవులు ఉన్నాయి. ఈ ఒక్క గ్రామం నుంచే ప్రతి రోజూ ఉదయం 400 లీటర్లు, సాయంత్రం మరో 450 లీటర్ల పాలు డెయిరీలకు చేరుతోంది. ప్రభుత్వ ప్రోత్సహం లేకున్నా.. కె.బసవనపల్లిలోని 90 శాతం మంది పాడి పరిశ్రమనే జీవనాధారంగా చేసుకున్నారు. ప్రత్యేక శ్రద్ధతో మేలుజాతి పాడి ఆవులను కొనుగోలు చేసి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లో ఉంచుతున్నారు. తరచూ వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయిస్తుంటారు. పోషకాహారమైన దాణాతో పాటు పచ్చిగడ్డిని అందజేస్తున్నారు. పాడి ఆవుల పెంపకం చేపట్టిన తర్వాతనే గ్రామంలోని రైతులు ఆర్థికంగా బలపడుతూ వచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏ మాత్రం ఆశించకుండా స్వయం కృషితో అనూహ్యమైని విజయాలను ఇక్కడి రైతులు సొంతం చేసుకుంటున్నారు. పితికిన పాలను అలాగే డెయిరీలకు తరలిస్తుంటారు. అంతేకాక ఆ పాలలో ఎల్ఆర్, ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాలను పరిశీలించేందుకు రైతులు సొంతంగా ఓ ఎనలైజర్నే ఏర్పాటు చేసుకున్నారు. పాడి ఆవులే ఉపాధి మా ఇంటిలో ఉన్న ఐదుగురుమూ పాడి పోషణపై ఆధారపడి ఉన్నాం. తొమ్మిది ఆవులు, మూడు లేగదూడలు ఉన్నాయి. వాటి బాగోగులు చూడడం, స్నానాలు చేయించడం రోజూ వారి పనిగా పెట్టుకున్నాం. తరచూ వైద్య పరీక్షలు చేయిస్తుంటాం. తొమ్మిది ఆవుల నుంచి రోజూ 140 లీటర్ల పాలు సేకరిస్తున్నాం. దీని ద్వారా రోజూ రూ. 3వేలు ఆదాయం వస్తే అందులో నుంచి పశుగ్రాసం, దాణా కోసం రూ. 1,500 పోతోంది. – అశ్వత్థప్ప, బసవనపల్లి పశుగ్రాసం కొరతగా ఉంది నా వద్ద రెండు పాడి ఆవులు, రెండు లేగదూడలు ఉన్నాయి. ప్రతి రోజూ పది లీటర్ల పాలను డెయిరీకి అందజేస్తున్నాను. పితికిన పాలను అలాగే తీసుకెళుతుంటాను. పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్య లేకుంటే ఇంకా మంచి ఆదాయం ఉంటుంది. – శ్రీనివాసులు, బసవనపల్లి -
కరువు ఓడించింది...పాడి గెలిపించింది
కుర్లపల్లి(కనగానపల్లి): వరుస కరువులు కర్షక కుటుంబాలను ఛిద్రం చేశాయి. అ యినా మనో స్థైర్యం కోల్పోని రైతులు ప్రత్యామ్నాయంగా పాడిని ఎంచుకున్నారు. క్షీరవిప్లవం సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని కుర్లపల్లి గ్రామానికి చెంది న రైతు రామిరెడ్డి కుమారులు ఆదినారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డిలకు 20 ఎకరాల పొలం ఉంది.గత ఐదు సంవత్సరాలుగా సక్రమంగా వర్షాలు రాక మెట్ట భూమిలో పంటలు చేతికందలేదు. దీంతో తరి పొలంలో లక్షల రూపాయలు వ్యయం చేసి 20 బోర్లు వేయించా రు. వర్షాలు రాక వాటిలో కూడా నీరు అడుగంటింది. ఈ పరిస్థితుల్లో వారి దృష్టి పాడి రంగంపై పడింది. మొదట నాలుగు పాడి ఆ వులను (జెర్సీ జాతి) కొనుగోలు చేసి పోషణ ప్రారంభించారు. కొంత ఆదాయం రావడంతో తిరిగి మరో ఎనిమిది పాడి అవులను కొనుగోలు చేశారు. ఒక బోరుబావిలో అరకొరకగా వస్తున్న నీటితో ఎకరం పొలంలో పశుగ్రాసం పెంచారు. ప్రస్తుతం వారి వద్ద ఉన్న 10 పాడి ఆవుల ద్వారా రోజుకు 80 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నారు. లీటరు 20 రూపాయల ప్రకారం ప్రైవేటు డెయిరీలకు విక్రయిస్తున్నారు. రోజుకు రూ. 1600, నెలకు రూ.50 వేలు ఆదాయం అందుతోంది. పశువుల దాణా, వట్టిగడ్డి, వైద్యం, మందులకు నెలకు రూ. 20 వేల దాకా ఖర్చు అవుతుందని, ఇవి పోనూ నెలకు రూ. 30 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు. ప్రభుత్వం డెయిరీలు ఏర్పాటుచేసి పాలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తే నెలకు మరో రూ. 10 వేల ఆదాయం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పంటలు పండక తీవ్రంగా నష్టపోయాం వర్షాభావంతో నాలుగు సంవత్సరాల నుంచి పంటలు పండక తీవ్రంగా నష్టపోయాం. అప్పులు చేసి 20 బోర్లు వేయించినా నీరు పడలేదు. దీంతో వేరుశనగ, దోశ, కాయగూరల పంటలు చేతికందక నష్టపోయాం. మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయాన్ని వదలేసి పాడి ఆవులను పోషించుకుంటూ ఆదాయాన్ని గడిస్తున్నాం.గడ్డి కొరత లేకపోలే మరింత ఆదాయం పొందవచ్చు. -బి.ఆదినారాయణరెడ్డి, యువరైతు, కుర్లపల్లి గ్రామం, కనగానపల్లి మండలం, అనంతపురం జిల్లా.