పాల వ్యాపారంతో ఏడాదికి రూ.3 కోట్లు సంపాదన: రేణు విజయ గాథ | Haryana Woman Earns Rs 3 Crore Annually Indigenous Breeds Modern Techniques National Award | Sakshi
Sakshi News home page

పాల వ్యాపారంతో ఏడాదికి రూ.3 కోట్లు సంపాదన: రేణు విజయ గాథ

Published Sat, Nov 30 2024 11:34 AM | Last Updated on Sat, Nov 30 2024 12:06 PM

Haryana Woman Earns Rs 3 Crore Annually Indigenous Breeds Modern Techniques National Award

‘రేణు’వు కాదు పాల సంద్రమే!  రేణు విజయ గాథ

కొన్ని విజయాలను వ్యక్తిగత విజయాలుగా మాత్రమే పరిగణించలేము.రేణు సంగ్వాన్‌ సాధించిన విజయం అలాంటిదే.సంప్రదాయ విధానాలకు, ఆధునిక సాంకేతికత జోడిస్తే సాధించగల విజయం అది. పెద్దగా చదువుకోకపోయినా కష్టాన్ని నమ్ముకుంటే అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అని నిరూపించిన విజయం అది.

హరియాణా రాష్టప్రాం ఝుజ్జర్‌ జిల్లాలోని ఖర్మన్‌ గ్రామానికి చెందిన రేణు సంగ్వాన్‌ డిసెంబర్‌ 3న న్యూదిల్లీలో ‘కృషి జాగరణ్‌ మిలియనీర్‌ ఫార్మర్‌ ఆఫ్‌ ఇండియా’ అవార్డ్‌ అందుకోనుంది. పాడి పరిశ్రమకు ఆమె చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ఈ  ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి ఎంపికైంది రేణు సంగ్వాన్‌...

తొమ్మిది దేశవాళీ ఆవులతో రేణు పాడిపరిశ్రమ  ప్రయాణం పారంభం అయింది. ఇప్పుడు ఆమె ‘గోకుల్‌ ఫామ్‌ శ్రీకృష్ణ’ 280కి పైగా ఆవులకు నిలయంగా, సుస్థిర పాడి పరిశ్రమ అంటే ఇలా ఉండాలి అని చెప్పుకునేంతటి ఘన విజయం సాధించింది. మూడు కోట్ల టర్నోవర్‌తో దేశంలోని అత్యుత్తమమైన ఫామ్‌లలో ఒకటిగా పరిగణించబడుతోంది.

సాహివాల్, గిర్, థార్పర్కర్‌లాంటి స్వదేశీ ఆవు జాతులపై ఆధారపడడం రేణు విజయంలో కీలక అంశం. ఈ జాతులు ఔషధ గుణాలు కలిగిన పాలను ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందాయి. అంతేకాదు...హైబ్రిడ్‌ జాతులతో పోల్చితే వాటి ఆలనాపాలనకు అయ్యే ఖర్చు చాలా తక్కువ.

‘ఈ ఆవులు స్థానిక వాతావరణానికి బాగా సరిపోతాయి. వాటి పాలు అధిక పోషక విలువలు కలిగి ఉంటాయి. ఇవి హైబ్రిడ్‌ జాతుల కంటే భిన్నమైనవి. స్వదేశీ ఆవులను  ప్రోత్సహించడం ద్వారా రైతులు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు’ అంటుంది రేణు.

‘గోకుల్‌ ఫామ్‌ శ్రీకృష్ణ’ తయారు చేస్తున్న నెయ్యికి మన దేశంలోనే కాకుండా పప్రాపంచవ్యాప్తంగా 24 దేశాల్లో డిమాండ్‌ ఉంది. ఈ ఫామ్‌ విజయానికి ఆధునిక పద్ధతులు అవలంబించడం కూడా ఒక కారణం. కుమారుడు వినయ్‌తో కలిసి ఫామ్‌లో ఆటోమేటిక్‌ మిల్కింగ్‌ యంత్రాలు, అధునాతన క్లీనింగ్‌ యంత్రాలు  ఏర్పాటు చేసింది రేణు. (భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!)

‘గోకుల్‌ ఫామ్‌ శ్రీకృష్ణ’ దేశీయ ఎద్దుల వీర్యాన్ని ఉత్పత్తి చేసి విక్రయిస్తుంది.‘దేశవ్యాప్తంగా రైతులు స్వదేశీ ఆవులను దత్తత తీసుకొని, వాటి ఉత్పాదకతను పెంచడానికి ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉపయోగించాలి. కేవలం పాలపైనే కాకుండా నాణ్యమైన పాల ఉత్పత్తుల ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవచ్చు’ అంటుంది రేణు.

సవాళ్లు లేకుండా ఏ విజయం సాధ్యం కాదు.
రేణు పప్రాయాణం మొదలు పెట్టినప్పుడు అది నల్లేరుపై నడకలా కొనసాగలేదు. వనరుల కొరతతో సహా రకరకాల అడ్డంకులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆవులు ఆరోగ్యంగా ఉండేలా, వ్యాధుల బారి నుంచి వాటిని రక్షించడం కూడా పెద్ద సవాలుగా మారింది. పాడిపరిశ్రమలో వ్యాక్సినేషన్, పరిశుభప్రాత ఎంతో కీలకం’ అంటున్న రేణు ఆవులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించడం నుంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా ఎంతో సమయాన్ని వెచ్చించింది. ఆవులకు అధిక నాణ్యత గల పశుగ్రాసాన్ని అందించడంపై దృష్టి పెట్టేది. కఠోర శ్రమ, అంకితభావం, సృజనాత్మకతతో దేశవ్యాప్తంగా రైతులు, మహిళలకు ఆదర్శంగా నిలిచిన రేణు సంగ్వాన్‌ పప్రాతిష్ఠాత్మకమైన జాతీయ గోపాల్‌ రత్న పురస్కార్‌–2024’ అందుకుంది.

విజయం అంటే మైలురాళ్లను చేరుకోవడం, వ్యక్తిగత సంతోషం మాత్రమే కాదు. కలలు కనడానికి, వాటిని సాధించడానికి ఇతరులను ప్రేరేపించడం. – రేణు సంగ్వాన్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement