
పాఠశాలలో విద్యాభ్యాసం పొందుతున్న సమయంలో ఓ చెఫ్ వీడియోకు, అతని డ్రెస్ కోడ్‌కు ఆకర్షితురాలైన ఆ విద్యార్థిని చెఫ్‌గా మారాలని సంకల్పించుకుంది. అంతటితో ఆగకుండా ఆ దిశగా అడుగులు వేస్తూ మాస్టర్ చెఫ్‌గా పలువురి మన్ననలు పొందుతోంది. అనేక వంటల పోటీల్లో పతకాలను సొంతం చేసుకుంటూ తనదైన ముద్ర వేసుకుని బేకరీ విభాగంలో రాణిస్తోంది. ఆమే మేడ్చల్‌కు చెందిన మహిళా చెఫ్ (Woman Chef) దివ్యసారిక. తాను చెఫ్‌గా మారి స్థిరపడడం సరికాదని భావించి పాకశాస్త్ర ప్రావీణ్యంతో అద్యాపకురాలిగా తనలాంటి ఎంతో మందిని చెఫ్స్‌గా మలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా (Guntur District) ప్రత్తిపాడు మండలం కొత్త మల్లయ్యపాలేనికి చెందిన దివ్యసారిక (Divya Sarika) ఇంటర్ వరకూ అక్కడే చదువుకుంది. గుంటూరులోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఓ కార్యక్రమంలో భాగంగా పాఠశాల యాజమాన్యం పలు రంగాల్లో ప్రావీణ్యం పొందిన వారి వీడియోలను ప్రదర్శించింది. అందులో భాగంగా ఆ్రస్టేలియాకు చెందిన ఫేమస్ చెఫ్ థామస్ వీడియో, అతని యూనీఫాంకు ఆకర్షితురాలైంది దివ్యసారిక. అప్పుడే చెఫ్‌గా మారాలని నిర్ణయించుకుంది.
మొదట ఇంట్లో వంటలు చేయడం ప్రారంభించింది. ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్‌మెంట్ చేయాలనే ఆలోచనను తండ్రి శివారెడ్డి, కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తనకు ఇష్టమైన రంగంలో వెళ్తానంటూ పట్టుబట్టి హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ మూడేళ్ల పాటు బ్యాచిలర్ ఆఫ్ కలినరీ ఆర్ట్స్ కోర్సు పూర్తిచేసింది. చివరి సంవత్సరంలో హోటల్ హెచ్‌ఐసీసీలో అప్రెంటీస్‌లో చేరి అనంతరం అక్కడే చెఫ్‌గా చేరింది. తదనంతరం నోవోటెల్‌లో రెండున్నరేళ్ల పాటు చెఫ్‌గా చేసింది.
72 పోటీల్లో.. 94 పతకాలు..
బేకరీ విభాగంలో చెఫ్‌గా రాణిస్తున్న దివ్యసారిక ఇప్పటి వరకూ అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో 72 పోటీల్లో పాల్గొంది. మొదట విద్యార్థి దశలో 2013లో ఆంధ్రా కలినరీ చెఫ్ పోటీల్లో పాల్గొనేందుకు రూ.42 వేలు ఖర్చు చేసి పొటీలో పాల్గొంది.

నిర్భయ గర్ల్‌చైల్డ్, మథర్ థీమ్‌తో చెఫ్‌గా తనదైన ముద్రతో మొదటి గొల్డ్‌మెడల్ సాధించింది. దీంతో పతకం రుచి చూసిన చెఫ్ దివ్య అంతర్జాతీయ స్థాయిలో మలేషియా, మారీషియస్, మాల్దీవులు వంటి దేశాలతో పాటు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పోటీల్లో పాల్గొని 4 గొల్డ్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించింది. 32 గోల్డ్ మెడల్స్, 21 సిల్వర్, 41 బ్రాంజ్ మెడల్స్‌తో పాటు నగదు పురస్కారాలు, అవార్డులు, ప్రశంసా పత్రాలు సొంతం చేసుకున్నట్లు దివ్యసారిక తెలిపింది.
లక్షల జీతం వదిలి..
మహిళా చెఫ్‌గా రాణిస్తున్న దివ్య ప్రముఖ హోటళ్లలో, విదేశాల్లో చెఫ్‌గా విధులు నిర్వహిస్తే రూ.లక్షల్లో వేతనం పొందే అవకాశం ఉన్నా.. తాను నేర్చుకున్నది నలుగురికీ బోధించాలనే ఉద్దేశంతో హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తుంది. గతంలో తెలంగాణ టూరిజంలో ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. ఇప్పటి వరకూ 300 మంది విద్యార్థులను చెఫ్‌లుగా తీర్చిదిద్దానని, వారిలో కొందరు విదేశాల్లో చెఫ్స్‌గా స్థిరపడ్డారని తెలిపారు.
రుచికరమైన ఆహారం అందించేందుకు..
చెఫ్స్‌గా మహిళలు రాణించాలనేదే నా కోరిక.. నా ప్రేరణతో మరికొందరు ఈ రంగంలో స్థిరపడాలి. ప్రజలకు నాణ్యామైన రుచికరమైన ఆహారం అందించేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. నా ద్వారా ఈ రంగంలో స్థిరపడిన వారు చిరకాలం నన్ను గుర్తుంచుకుంటారు.. అదే నాకు ఆనందాన్నిస్తుంది.