హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్‌గా దూసుకుపోతున్న అరుణ
భర్త నేర్పిన విద్యే... నాకు బతుకు నేర్పింది- అరుణ
ఏ పని అయితేనేం.. గౌరవంగా బతకాలి.. ఒకళ్ల మీద ఆధారపడకుండా బతకాలి.. ఇదీ హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న అరుణ అంతరంగం. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం.
ఆటోడ్రైవర్‌గా పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది.. తాను చేస్తున్న పని పట్ల ఈ నిబద్ధతే ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపింది. బిజీ బిజీ నగరంలో, ట్రాఫిక్ కష్టాలను ఈదుతూ కుటుంబ బాధ్యతలను మోస్తోంది. బిడ్డల్ని ప్రాణానికి ప్రాణంగా సాదుకుంటోంది.
ఏడడుగులు నడిచి, కడదాకా తోడు ఉంటానని బాస చేసిన భర్త అనారోగ్యంతో తనకు దూరమైతే... కుంగిపోలేదు. ఆ కష్టాన్ని దిగమింగుకుంది. ఆడది అంటే అబల కాదు.. ఆడపులిలా బతకాలి అన్న భర్త మాటలే ఆమెకు వేద మంత్రాలయ్యాయి. ఆయన నేర్పించిన విద్యతోనే బతుకు దెరువు వెతుక్కుంది. కష్టాలు, కన్నీళ్లు ఎన్నొచ్చినా.. వెరవ లేదు. చివరికి తోటి డ్రైవర్ల నుంచి వేధింపులొచ్చినా బెదరలేదు. అన్నల్లా ఆదరించిన మరికొంతమంది ఆటో కార్మికులు, కుటుంబం మద్దతుతో నెగ్గుకొస్తోంది. నేను నేటి మహిళను అంటోంది.
సాధారణంగా మగవాళ్లకే పరిమితమని భావించే మోటార్ ఫీల్డ్‌లో సత్తా చాటుకుంటోంది అరుణ. హైదరాబాద్ రోడ్లపై రివ్వున దూసుకు పోతుంది. బాధలొచ్చాయని భయపడకుండా తనలాగా ధైర్యంగా బతకాలని తోటి మహిళలందరికీ పిలుపునిస్తోంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలందరికీ శుభాకాంక్షలు అందిస్తోంది సాక్షి. డాట్ కామ్.
Comments
Please login to add a commentAdd a comment