
కుటుంబం అనే బండిలో అందరిలా ఆమె ప్యాసింజర్ సీట్‌లో కూర్చోవాలనుకోలేదు. పరిస్థితుల ప్రభావంతో.. తన బతుకు బండికి తానే సారథిగా మారింది. ‘ఇలాంటి పనులు మగాళ్లే చేయాలమ్మా..’ అని తోటి మహిళలే సూటిపోటి మాటలు అంటున్నా.. మగవాళ్లు వంకర చూపులు చూస్తున్నా.. ఆమె మాత్రం తన గమ్యం వైపు దూసుకుపోతోంది. అందుకే ఆ డ్రైవర్ గాథ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.
ఆమె పేరు నీలమ్(Neelam). ఢిల్లీలో బిజీ రోడ్లపై ఆటో డ్రైవర్‌గా కనిపిస్తోంది. నిత్యం మెట్రోలో వెళ్లే ఓ ఉద్యోగిణి.. ఎందుకనో ఆ ఆటో ఎక్కాల్సి వచ్చింది. ‘‘ఆటోను నడిపేది ఓ మహిళనా?’’ అని తొలుత ఆమె కూడా అందరిలా ఆశ్చర్యపోయింది. ఈ పనినే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందని నీలమ్‌ను కుతూహలంతో అడిగిందామె. అక్కడి నుంచి జీవితం ఒకసారి నీలమ్ ఎదుట గిర్రున తిరిగింది.
అందరిలాగే పెళ్లై కోటి ఆశలతో అత్తింటి అడుగు మోపిందామె. కానీ, ఆ ఇంట అడుగడుగునా ఆమెకు వేధింపులే (Domestic Violence) ఎదురయ్యాయి. చివరకు.. కట్టుకున్నవాడు కూడా ఆ వేధింపులను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఓపిక ఉన్నంతకాలం భరించిన ఆమె.. అది నశించడంతో చంటి బిడ్డతో సహా బయటకు వచ్చేసింది.
బయటకు వచ్చాక కష్టాలు స్వాగతం పలికాయి. చేయడానికి ఆమెకు ఏ పని దొరకలేదు. సొంతంగా ఏదైనా చేయాలని అనుకున్నా.. పుట్టింటి వాళ్ల ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. అందుకనే.. ఇలా ఆటో నడుపుతున్నట్లు నవ్వుతూ చెప్పిందామె.

కానీ, ఆ మహిళా ఆటో డ్రైవర్(Woman Auto Driver) పెదాలపై నవ్వు కంటే ఆమె గొంతులో దిగమింగుకుంటున్న బాధ, కళ్లలో కూతురికి బంగారు భవిష్యత్తు అందించాలని పడుతున్న ఆరాటం రెండూ కనిపించాయి. అందుకే నీలమ్ కథను ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమాజంలో మార్పును స్వాగతించేవాళ్లెందరో నీలమ్ నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment