Inspiring
-
డెలివరీ తర్వాత వీల్‌చైర్‌కు పరిమితం.. జీవితాంతం ఇంజక్షన్స్..!
ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో మెరిసి మంచి పేరు తెచ్చుకుంది షాలిని పాసీ. ఈ రియాలిటీ షోతో ఆమె పేరు దశదిశల మారుమోగిపోయింది. ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న చేదు రోజులను గుర్తు చేసుకుంది. ప్రసవానంతరం వెన్నెముక గాయం బారినపడి స్పర్శ కోల్పోయిన క్లిష్ట పరిస్థితులు గురించి వెల్లడించింది. ఇక జీవితంలో తాను నృత్యం చేయలేదని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా జీవితం తలకిందులైనట్లు అనిపించిందంటూ భావోద్వేగంగా మాట్లాడింది. అంతేగాదు ఆ పరిస్థితులను ఎలా అధిగమించి మాములు స్థితికి రాగలిగిందో కూడా వివరించింది. షాలిని పాసి(Shalini Passi) 20 ఏళ్ల వయసులో తన కొడుకు రాబిన్‌కి జన్మనిచ్చింది. ఆ తర్వాత ఊహించని విధంగా వెనుముక గాయం కారణంగా వెన్ను నుంచి కాళ్ల వరకు స్పర్శ(sensation) కోల్పోయింది. ఇక ఆమె జీవితంలో నడవడం, నృత్యం(dance) చేయడం అస్సలు సాధ్యం కాదని తేల్చి చెప్పారు వైద్యులు (Doctors). దీంతో ఒక్కసారిగా కళ్లముందు జీవితం చీకటిమయం అయ్యినట్లు అనిపించింది. ఇంతేనా తన పరిస్థితి అని తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.జీవితాంతం వెన్నెముక ఇంజెక్షన్లు చేయించుకోవాల్సిందేనని వైద్యులు చెప్పడంతో బాధతో తల్లడిల్లిపోయింది. నిజానినికి షాలినికి హిల్స్ వేసుకోవడం, డ్యాన్స్ చేయడం మహా ఇష్టం. అయితే ఇక్కడ షాలిని దిగులుతో కూర్చొండిపోలేదు. ఎలాగైనా ఆ బాధను అధిగమించాలని సంకల్పించుకుంది. ఈ సమస్యకు ప్రత్యామ్నాయ చికిత్సలను ఎంచుకుంది. యోగా, ఆయుర్వేదం వంటి వాటితో కండరాలను బలోపేతం చేసుకునేలా శిక్షణ తీసుకుంది. అలా ఆమె వెనుముక సమస్యను జయించింది. ఇప్పటికీ తాను ఆయుర్వేద వైద్యుడి దగ్గరకే వెళ్తానని అంటోంది షాలిని. ఆయన తనకు ఎలాంటి మందులు ఇవ్వకుండానే నయం చేశారని చెబుతోంది. అలాగే చెకప్ కోసం ప్రతి ఐదు నెలలకొకసారి ఆ వైద్యుడిని కలుస్తానని అంటోంది. తాను ఇలా పూర్తి స్థాయిలో కోలుకోవడం చూసి తన వైద్య బృందం ఆశ్యర్యపోయినట్లు చెప్పుకొచ్చారు షాలిని. నిజంగా ఇది అద్భుతం. నడవగలగడం, నృత్యం చేయడం చూస్తుంటే నమ్మలేకపోతున్నామని వైద్యులే ఆశ్చర్యపోయారని షాలిని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే తన కొడుకుతో గల అనుబంధం గురించి కూడా చెప్పుకొచ్చింది. తన కొడుకుకి అక్కలా, స్నేహితురాలిలా ఉంటానని, అందువల్లే తన కొడుకు తనతో అన్ని ఫ్రీగా షేర్ చేసుకుంటాడని చెప్పుకొచ్చారు షాలిని. ఎంత పెద్ద సమస్య అయినా ధైర్యంతో ఫేస్చేస్తే తోకముడిచి తీరుతుందని షాలిని అనుభవం చెబుతోంది కదూ..!.(చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!) -
తాత్వికత: ఎంతో చిన్నది జీవితం
ఓ గురువు అటవీ ప్రాంతంలోని మారుమూల ఉన్న చిన్నచిన్న గ్రామాలకు వెళ్ళి సత్సంగం చేయాలని బయలుదేరాడు. ఆయనతోపాటు శిష్యబృందం కూడా బయలుదేరింది. కొండలు, గుట్టలు, సెలయేర్లు దాటి వెళ్తూ ఉన్నారు. దారిలో ఓ శిష్యుడు, గురువుని ‘ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఎలా?’’ అని అడిగాడు. ‘‘మానవ శరీరం దేవుడిచ్చిన ఒకే ఒక అవకాశం. మరలా రమ్మంటే రాదు. అందుకని దాని విలువ తెలుసుకుని క్షణం క్షణం ఆనందంగా జీవించాలి!’’ అన్నాడు.‘‘అదెలా?’’ అని అడిగాడు శిష్యుడు.ఇంతలో దూరంగా కొందరు మహిళలు పొయ్యిపైన నీళ్ళు కాగిస్తూ కనిపించారు గురువుకి. శిష్యుడిని అక్కడే కొద్దిసేపు ఆగమని చె΄్పాడు. ఆ కట్టెలు కాలే వాసన పీల్చి కాలుతున్నదేదో చెప్పమన్నాడు.వాసన పీల్చిన శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ‘తను గమనించింది వాస్తవమా కాదా’ అని ఒకటికి రెండుసార్లు సరి చూసుకున్నాడు. తను చూస్తున్నది ముమ్మాటికీ నిజమేనని అర్థమయ్యింది.‘‘అక్కడ కాలుతున్నది చందనం కట్టెలు. అయ్యో, ఎందుకలా చేస్తున్నారు. ఎంతో విలువైన చందనం కొయ్యలను వంటచెరుకుగా వాడటమేమిటి?’’ అని మనసులో అనుకున్నాడు.‘భర్తలకు తెలియకుండా వారు పొరపాటుగా అలా చేస్తున్నారేమోనని’ అనుమానమేసింది. జాగ్రత్తగా గమనించిన అతడికి మరింత ఆశ్చర్యం కలిగింది. అది ఏమిటంటే ఆ మహిళలకు కొద్ది దూరంలోనే వారి భర్తలు చందనం కొయ్యలను కత్తితో నరికి పొయ్యిలో పెట్టడానికి అనువుగా కట్టెలు చీల్చుతున్నారు.అదే విషయాన్ని శిష్యుడు బాధగా ‘బంగారంలాంటి చందనాన్ని మంటపాలు చేయడం’ గురించి గురువుకు చెప్పాడు. దానికి గురువు నవ్వి ‘‘చందనం కొయ్యల విలువ, వాటి ప్రత్యేకత వారికి తెలియదు. అందుకే వాటిని పొయ్యిలోపెట్టి తగులబెట్టేస్తున్నారు. వారి కళ్ళకు అవి మామూలు కట్టెల్లాగే అగుపిస్తున్నాయి. నీకు వాటి విలువ తెలుసు కాబట్టే ఆశ్చర్యపోతున్నావు. వారు చేస్తున్నది తప్పని చెబుతున్నావు. వారికి వాటి విలువ తెలిసేంత వరకు వారు చేస్తున్నది సరైనదేనని అనుకుంటారు. మనిషి కూడా అంతే. జీవితం విలువ తెలుసుకోక లేనిపోని పట్టింపులు, అహం, అసూయాద్వేషాలు, కోపం, ప్రతీకారం, ప్రపంచాన్ని మార్చాలనే ప్రయత్నం... ఇలాంటి వాటితో ఎంతోకాలం వృథా చేస్తున్నాడు. జీవితం విలువైనదన్న ఎరుక ఉంటే చాలు, ఆనందం మన వెంటే ఉంటుంది’’ అని వివరించాడు.జీవితం చాలా చిన్నదనీ, ప్రతిక్షణం ప్రకృతి ప్రసాదమని, అది తెలుసుకోక΄ోతే అసలైన ఆనందాన్ని కోల్పోతామని గ్రహించిన శిష్యబృందం ముందుకు నడిచింది. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
రతన్ టాటాకు స్ఫూర్తి ఎవరో తెలుసా..!
రతన్ టాటా మన దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త. పారిశ్రామిక విజయాలలోనే కాదు, వదాన్యతలోనూ ఆయన ఎందరికో స్ఫూర్తి ప్రదాత. అంతటి రతన్ టాటాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందనే నానుడి రతన్ టాటా విషయంలోనూ నిజమే! చిన్ననాటి నుంచి రతన్ టాటాకు స్ఫూర్తి ఆయన నాయనమ్మే! రతన్ టాటా నాయనమ్మ నవాజ్‌బాయి టాటా సన్స్ కంపెనీకి మొదటి మహిళా డైరెక్టర్. టాటా ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా కూడా ఆమె సేవలందించారు.రతన్ టాటాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన తల్లిదండ్రులు విడాకులు పొంది విడిపోయారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో రతన్ టాటా, ఆయన తమ్ముడు జిమ్మీ టాటాల బాధ్యతను నాయనమ్మ నవాజ్‌బాయి చేపట్టారు. వారిద్దరినీ అల్లారుముద్దుగా పెంచారు. సాటి మనుషులతో మెలగాల్సిన తీరును, జీవితంలో పాటించాల్సిన విలువలను నేర్పించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన నాయనమ్మే తనకు స్ఫూర్తి ప్రదాత అని, తాను సాధించిన విజయాల ఘనత ఆమెకే చెందుతుందని రతన్ టాటా ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. నాయనమ్మ పెంపకంలో పెరగకపోయి ఉంటే, తాను ఇంతటివాణ్ణి కాగలిగేవాణ్ణి కాదని రతన్ టాటా తరచుగా చెబుతుండేవారు. ఇక్కడ చదువు పూర్తయ్యాక ఉన్నతవిద్య కోసం రతన్ టాటా అమెరికా వెళ్లారు. కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లాస్ ఏంజెలిస్‌లోని ఒక ఆర్కిటెక్చర్ సంస్థలో ఉద్యోగంలో చేరారు. అక్కడే స్థిరపడిపోవాలనుకున్న దశలో నాయనమ్మ నవాజ్‌బాయి అనారోగ్యానికి లోనయ్యారు. స్వదేశానికి తిరిగి వచ్చేయమని ఆమె కోరడంతో రతన్ టాటా అమెరికా జీవితానికి స్వస్తిచెప్పి, బాంబేకు వచ్చేసి, టాటా సంస్థల బాధ్యతల్లో పాలుపంచుకోవడం మొదలుపెట్టారు. (చదవండి: నాలుగుసార్లు ప్రేమలో పడినా..!) -
తనొక అద్భుతం: ఆమె ఆత్మవిశ్వాసం ముందు విధి చిన్నబోయింది (ఫొటోలు)
-
కమలా హ్యారీస్ స్ఫూర్తిదాయక నాయకురాలు: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ పార్టీ నాయకురాలు, అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి కమలా హ్యారీస్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పౌర హక్కులకు మద్దతుపలికే స్ఫూర్తిదాయక నాయకురాలని అన్నారు. టెక్సాస్‌లోని ఆస్టిన్లోని లిండాల్ బి. జాన్సన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీలో ప్రసంగించిన ఆయన తనకు పాలనలో కమలా హ్యారీస్ అద్భుత భాగస్వామ్యం అందించారని పేర్కొన్నారు.కమలా హ్యారీస్ పౌర హక్కుల విషయంలో తన గొంతును సమర్థవంతంగా వినిపిస్తూ, స్ఫూర్తిదాయక నాయకురాలుగా కొనసాగుతున్నారన్నారు. అమెరికా వైఖరిలో అందరూ సమానులే అని, తాము ఈ ఆలోచనకు ఎప్పుడూ దూరంగా వెళ్లలేదన్నారు. ఇప్పుడు కమలా కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తారని భావిస్తున్నానన్నారు. 81 ఏళ్ల జో బైడెన్ తాను ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదేసమయంలో ఆయన కమలా హ్యారీస్‌కు(59)కు తన మద్దతును ప్రకటించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా కమలా హ్యారీస్‌కు మద్దతు పలికారు. -
లాపతా లేడీస్: సిమ్లా టూ బాలీవుడ్, ఎవరీ యాపిల్ బ్యూటీ (ఫొటోలు)
-
పది రూపాయలతో ప్రారంభం..
మనం ఒక్కరమే బాగుంటే సరిపోదు... మనతో ΄పాటు మన చుట్టూ ఉన్నవారూ బాగుండాలి అనే ఆలోచన ఇండోర్‌వాసి కుక్కు ద్వివేదినిది. ఆపదలో ఉన్నవారికి చిన్న సాయమైనా చేయాలి అనే ఆశయంతో బ్యాంకు ఉద్యోగం చేస్తూ, కుటుంబ నిర్వహణను చూస్తూనే పేదలకు కావల్సిన మందులను ఉచితంగా పంపిణీ చేయాలనుకుంది. అందుకోసం 400 మంది సహోద్యోగుల జీతంలో ఒక్కొక్కరి నుంచి పదేసి రూపాయలను సేకరించి, ఆ మొత్తంతో ఉచిత మందుల పంపిణీని మొదలుపెట్టింది. ΄పాతికేళ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బ్యాంకు ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకొని గ్రామాలు తిరుగుతూ ఉచిత విద్య, వైద్యసేవలను అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ‘‘నా బాల్యం అందమైన జ్ఞాపకాలతో గడిచింది. మా నాన్న డాక్టర్. నలుగురికి సాయం చేసే స్వభావం కావడంతో ఆయన సాయం కోసం, వైద్యం కోసం ఇంటికి ఎప్పుడూ అనేకమంది వస్తూ ఉండేవారు. వారి కోసం అమ్మ ప్రతిరోజూ వంట చేసి ఉంచేది. అది చూస్తూ పెరగడం వల్ల కాబోలు చిన్నప్పటి నుంచి ఎవరైనా సాయం అడిగితే కాదనే గుణం నాకు లేదు. ఇలా ఉచితంగా చేసే సాయాలను సామాజిక సేవ అంటారని కూడా తెలియకుండానే పదిమందికీ చేతనైన సాయం చేసేదాన్ని. జీవించడానికి తక్కువ వస్తువులు చాలు డిగ్రీ పూర్తవుతూనే తొలి ప్రయత్నంలోనే బ్యాంకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరినప్పటినుంచి ఇతరులకు నా అంతట నేనే సాయం చేయగలిగే అవకాశం వచ్చిందని సంతోషించాను.పెళ్లయ్యాక నా భర్త మద్దతు లభించింది. నా భర్త కూడా బ్యాంకు ఉద్యోగి. ఇద్దరి సం΄ాదన ఉన్నా మా ఇంట్లో తక్కువ వస్తువుల వినియోగం ఉండేది. నిరాడంబరంగా జీవించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మా ఇంటి పరిసరాల్లోని అమ్మాయిల చదువుకు సాయం చేసేదాన్ని. పేదలకు అందని వైద్యం ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే నా కూతురు తీవ్ర అనారోగ్యానికి గురైంది. నా కుమార్తెకు చికిత్స జరుగుతున్నప్పుడు వైద్యం ఎంత ఖరీదైనదో తెలుసుకున్నాను. అంతటి ఖర్చు మేం ఎలాగో భరించగలిగాం. కానీ, రెండు పూటలా తిండికే నోచుకోని వారి సంగతేంటి? వారికి చికిత్స అవసరమైతే ఏం చేస్తారు? ఈ విషయం పదే పదే ఆలోచించేదాన్ని. ఒంటరిగా చేయడంలో పెద్ద సాయాన్ని అందివ్వలేనని గ్రహించాను. దీంతో నా సహోద్యోగుల సాయం తీసుకోవాలనుకున్నాను. పది రూపాయలతో ప్రారంభం మా బ్యాంకు యూనియన్ లీడర్‌కు ఈ విషయాన్ని చెప్పిన. ‘మా అందరికీ మంచి జీతం ఉంది. పేద ప్రజల కోసం ఏదైనా సహాయం చేయాలి’ అని వివరించాను. దాదాపు ముప్పై ఏళ్ల క్రితం ఆలోచన ఇది. ప్రతి ఉద్యోగీ, తన జీతం నుంచి పది రూ΄ాయలను ‘సేవ’ కోసం కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు. అలా నెలకు నాలుగు వేల రూ΄ాయలు జమ అయ్యేవి. ΄పాతిక వేలు జమ కాగానే మా యూనియన్ లీడర్ ‘ఏం చేయాలో చెప్పమ’ని అడిగారు. హఠాత్పరిణామాలు బ్యాంకు నిధులే కాకుండా విరాళం పేరుతో సాయం చేయడానికి కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. పదేళ్ల ΄ాటు ఈ విధమైన సేవాకార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నా భర్త హఠాత్తుగా చనిపోయాడు. దీంతో నేను చాలా రోజులు డిస్టర్బ్ అయ్యాను. ఆ రోజుల్లో మా సహోద్యోగులు కూడా మరింత సాయం అందించడానికి ముందుకు వచ్చారు. దీంతో రిలీఫ్ సొసైటీగా పేరు మార్చాం. ఎందుకంటే ఇందులో బయటి వ్యక్తులు చేరడం మొదలుపెట్టారు. రూ΄ాయ నుంచి లక్షల రూ΄ాయల విలువైన మందులు వస్తున్నాయి. పేదలకోసం ΄పాఠశాల జబ్బులు వచ్చి, చికిత్సలో ఉన్న రోగులకు మందులు ఇవ్వడం ద్వారా సాయం చేస్తున్నాం. కానీ, జబ్బులు రాకుండా అవగాహన కల్పించాలంటే చదువు ఉండాలనుకున్నాం. సరైన చదువు ఉంటే ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోగలరు. ఈ ఆలోచనతో సైన్యంలో వైద్య సేవలు అందించే మా స్నేహితురాలు డాక్టర్ అనురాధతో కలిసి గిరిజన పిల్లలకు చదువులు చెప్పడం ప్రారంభించడం. ఇండోర్‌కు మూడు గంటల ప్రయాణం దూరంలో ఉన్న ఖర్గోన్లో సంస్థకు ధర్మకర్తగా ఉంటూ అనురాధతో ΄పాటు కలిసి కార్యక్రమాలు నిర్వహించేదాన్ని. అక్కడే 12 ఎకరాల్లో ΄పాఠశాల , హాస్టల్ కూడా నిర్మించాం. నా స్నేహితురాలి హఠాన్మరణంతో నేను బ్యాంకు ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకొని స్కూల్ బాధ్యతలు చూసుకోవడానికి వచ్చేశాను. మొదట ఎనిమిది, పది మంది పిల్లలతో పారంభించిన స్కూల్లో ఇప్పుడు 200 మంది పిల్లలు చదువుతున్నారు. వీరిలో 35 మంది వికలాంగులు. ఇప్పటికీ గ్రామంలో బాల్య వివాహాలు చేస్తుంటారు. దీంతో వారు చదువులు మానేసి వ్యవసాయం చేస్తుంటారు. పెద్దలకు అవగాహన కల్పించి, పిల్లలను స్కూల్‌కు తీసుకురావడం పెద్ద యుద్ధమే అవుతుంటుంది’ అంటూ తాము చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు ద్వివేదిని. -
Dhruvi Panchal: వన్స్‌మోర్ వంటలు
అహ్మదాబాద్‌లోని ఒక హెల్త్‌కేర్ కంపెనీలో మంచి జీతంతో పనిచేస్తున్న ధృవీ పాంచల్‌కు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. ఆ పాషన్ తనను ఎక్కడిదాకా తీసుకెళ్లిందంటే వీధి పక్కన ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేసేంత వరకు! అలా అని ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదకొండు వరకు ఫుడ్ స్టాల్ నడుపుతోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన పాంచల్ వీడియో వైరల్ అయింది. ‘చక్కగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకమ్మా ఈ కష్టం’ అన్న వాళ్లు అతి కొద్దిమంది అయితే... ‘ఈ వీడియో మమ్మల్ని ఎంతో ఇన్స్పైరింగ్ చేసింది’ అన్నవాళ్లు ఎక్కువ. -
పద్మజ కుమారి పర్మార్.. ఈమె గురించి ఎప్పుడైనా విన్నారా?
ఎంతోమంది రాజులు రాజ్యాలను పాలించారు.. మట్టిలో కలిసిపోయారు. రాచరిక వ్యవస్థ మొత్తం అంతరించిపోయినప్పటికీ.. కొంతమంది పేర్లు మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి కారణం వారు చేసిన సేవలే. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు ఉదయపూర్ మేవార్ వంశానికి చెందిన యువరాణి 'పద్మజ కుమారి పర్మార్' (Padmaja Kumari Parmar). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె చేసిన సేవలేంటి? నికర ఆస్తుల విలువ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉదయపూర్ వంశానికి చెందినవారిలో పద్మజ కుమారి పర్మార్ తనదైన ముద్ర వేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. రాజ వంశానికి చెందిన పద్మజ దాతృత్వం నేడు ఖండాంతరాలలో విస్తరించింది. 1969లో తన తాత జ్ఞాపకార్థం మహారాణా ఆఫ్ మేవార్ చారిటబుల్ ఫౌండేషన్‌ను స్థాపించింది. దీని ద్వారా మహిళల విముక్తి & విద్యను ప్రోత్సహించింది. హెచ్ఆర్హెచ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్.. పద్మజ కుమారి పర్మార్ తన పూర్వీకుల అడుగుజాడల్లోనే HRH గ్రూప్ ఆఫ్ హోటళ్లతో ముందుకు సాగుతోంది. హెచ్ఆర్హెచ్ గ్రూప్‌కు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పద్మజ తన అనుభవాలతో వీటిని ప్రపంచ స్థాయికి తీసుకువెళుతున్నారు. పద్మజ కుమారి పర్మార్ ప్రిన్స్టన్ యూనివర్సిటీలోని MS చద్దా సెంటర్ ఫర్ గ్లోబల్ ఇండియా & హార్వర్డ్ మెడికల్ స్కూల్లోని గ్లోబల్ హెల్త్ అండ్ సర్వీస్ అడ్వైజరీ కౌన్సిల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో సలహా బోర్డులలో పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: ఐటీ కంపెనీలకు గండమేనా! టెకీల పరిస్థితేంటి? పద్మజకు డాక్టర్ కుష్ పర్మార్‌తో వివాహం జరిగిన తరువాత బోస్టన్‌కు మకాం మార్చింది. ఆ తరువాత ఉదయపూర్‌లోని తన పూర్వీకుల ఇంటికి, యునైటెడ్ స్టేట్స్లో ఆమె కొత్త జీవితానికి మధ్య వారధిగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఈమె హెచ్ఆర్హెచ్ గ్రూప్ వ్యాపార ఉనికిని విస్తరిస్తోంది. ఇదీ చదవండి: ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ! అదరగొడుతున్న బ్లింకిట్.. పద్మజ కుమారి పర్మార్ దాతృత్వ స్ఫూర్తితో అలఖ్ నయన్ మందిర్ ట్రస్టీగా, సేవా మందిర్ వంటి సంస్థల ద్వారా మహిళలను ఉద్ధరించడంలో పాత్ర పోషిస్తోంది. రూ. 50కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి మహారాణిగా ఉన్న ఈమె ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈమె తన వంశం కోసం మాత్రమే కాకుండా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి కృషి చేస్తోంది. -
చెత్తబండి నడుపుతుంది.. అమెరికా వెళ్లొచ్చింది.. జయలక్ష్మి ఒక స్పూర్థి
మూసారాంబాగ్ సమీపంలోని సలీం నగర్లో తెల్లవారుజామున ‘చెత్తబండొచ్చిందమ్మా’ అని అరుస్తూ కనిపిస్తుంది జయలక్ష్మి. డిగ్రీ చదువుతూ తల్లి నడిపే చెత్తబండిలో సాయం చేస్తుంది జయలక్ష్మి. ‘ఎదగాలనుకుంటే చెత్త నుంచి కూడా ఎదగొచ్చు’ అంటుందా అమ్మాయి. తాను నివాసం ఉండే మురికివాడ పిల్లల కోసం ట్యూషన్లు చెబుతూ, వాలంటీర్‌గా పని చేస్తూ,ప్రతిష్ఠాత్మక ‘గాంధీ – కింగ్ స్కాలర్లీ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్’లో భాగంగా జూన్‌లో అమెరికా వెళ్లి వచ్చింది జయలక్ష్మి. చిన్న చితకా సవాళ్లకే డీలా పడుతున్న యూత్‌కు జయలక్ష్మి ఇచ్చే స్ఫూర్తి చాలానే ఉంది. యునైటెడ్ స్టేట్స్– ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (యు.ఎస్.ఐ.ఇ.ఎఫ్) వారి ‘గాంధీ– కింగ్ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్’ స్కాలర్షిప్ పొంది, అమెరికా వెళ్లి రెండు వారాల పాటు మార్టిన్ లూధర్ కింగ్ మార్గంలో అహింసా పద్ధతితో ప్రజా ఉద్యమాలు ఎలా నిర్వహించాలో అధ్యయం చేసి రావడానికి దరఖాస్తులు కోరినప్పుడు మన దేశవ్యాప్తంగా 4 వేల అప్లికేషన్లు వచ్చాయి. వారిలో కేవలం 10 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఆ పది మందిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఉన్నారు. వారిలో ఒకరు అరిపిన జయలక్ష్మి. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ సమీపంలో అతి పెద్ద మురికివాడ– సింగరేణి కాలనీలో ఉంటూ, చెత్త బండి లాగుతూ చదువుకుంటున్న ఈ అమ్మాయి ఇలా అమెరికా వరకూ చేరుకోవడం సామాన్యం కాదు. పోరాడే తత్వం, సాధించాలనే పట్టుదల ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. జయలక్ష్మిలోని అసాధారణమైన చొరవ, తపన ఆమెను ఇలా ముందుకు నడుపుతున్నాయి. Dear Aripina Jayalakshmi @j_aripina Congratulations to you for This Changemaker Award you Received in Delhi!💐 Telangana Bidda we are proud of you!!🌹@KTRTRS @trspartyonline #JaiTelangana pic.twitter.com/lTZhxJ6E8n — (A*R) (@iNTeLHyd) July 11, 2022 ముగ్గుపిండి అమ్మే దళిత కుటుంబం అరిపిన జయలక్ష్మిది రాయలసీమ ప్రాంతానికి చెందిన దళిత కుటుంబం. తండ్రి రామ్మోహన్, తల్లి హుసేనమ్మ చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని హైదరాబాద్ వలస వచ్చారు. వీరి ఇళ్లల్లో ముగ్గుపిండి అమ్ముకుని తరాలుగా జీవనం సాగిస్తున్నారు. అయితే జయలక్ష్మి తల్లిదండ్రులు చెత్తబండి నడపడాన్ని ఉపాధి చేసుకున్నారు. ‘అమ్మ ఒక బండి, నాన్న ఒక బండి నడుపుతారు. కాలనీ వాళ్లు నెలకు ఇంతని ఇచ్చే డబ్బులే మాకు జీవనాధారం. గవర్నమెంట్ నుంచి ఏమీ జీతం రాదు. చెత్త తీయడం చాలా కష్టమైన పని. నాన్న తానొక్కడే చెత్త తీయగలిగినా అమ్మకు కష్టమని నేను ఏడో క్లాస్ నుంచి ఇవాళ్టి వరకూ ఆమెకు తోడు వెళుతూనే ఉన్నాను. చెత్త సేకరించడం, తడిచెత్త పొడిచెత్త వేరు చేయడం, డంపింగ్ యార్డ్‌లో పడేయడం అన్నీ చేస్తాను. ఇది చాలా దారుణమైన పని అని కొందరు అంటారు. కాని నా మటుకు నాకు ఇది అన్నం పెట్టే వృత్తి. నేను దానిని గౌరవిస్తాను. మా ఇంట్లో నేను కాకుండా అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. అందరూ మంచిగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడాలని మా అమ్మ తపన. అంతవరకు ఈ పని చేయకతప్పదు’ అంటుంది జయలక్ష్మి. Since this young lady from a Hyderabad slum community told me in a class of peers aged 13 who aspired for worthy professions as nurses, teachers & police how she WOULD one day be an IAS officer (turning many heads) I have followed her achievements in awe. Every wish @j_aripina! https://t.co/V1X47W2i1t — Dr Andrew Fleming 🇬🇧 🏴 (@Andrew007Uk) August 23, 2023 ఎన్.జి.ఓ దృష్టిలో పడి జయలక్ష్మి చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేది. కాలనీలోని సమస్యలపై మాట్లాడేది. స్కూల్లో ఒకసారి ఇలాగే మాట్లాడితే ‘మాంట్‌ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్’ అనే ఎన్.జి.ఓ దృష్టిలో పడింది. పేదవర్గాల కోసం పని చేసే ఆ సంస్థ జయలక్ష్మిని తన కార్యకలాపాల్లో భాగం చేస్తూ ప్రోత్సహించింది. ‘స్లమ్స్‌లో ఉండే పిల్లల వికాసం కోసం నేను పని చేశాను. హైదరాబాద్‌లో 56 స్లమ్స్ ఉంటే వాటిలో 21 చోట్ల అంగన్వాడీ కేంద్రాలు లేవు. మేమందరం మహిళా సంక్షేమ శాఖ దగ్గరకు వెళ్లి మాట్లాడి వాటిని సాధించాం’ అంటుంది జయలక్ష్మి. ఇంగ్లిష్ మీడియంలో చదవాలనుకుని తన వాడ నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్న జయలక్ష్మి తన వాడలోని పిల్లలకు సాయంత్రాలు ట్యూషన్ చెప్తూ వారి చదువుకు మేలు చేస్తోంది. ‘కోవిడ్ సమయంలో మా కాలనీలో నేను కార్యకర్తగా పని చేశాను. కోవిడ్ రాకుండా చాలా వరకు సక్సెస్ అయ్యాను’ అంది. ఐ.ఏ.ఎస్ కావాలని ‘యువతకు నాయకత్వ లక్షణాలు ఉండాలి. హక్కుల కోసం పోరాడాలి. అమెరికాలో శాంతియుత పోరాటాల విజయగాథలను అధ్యయనం చేయగలగడం నా అదృష్టం. ఒక యువ ప్రతినిధిగా పోరాడుతూనే ప్రజల సేవ కోసం ఐ.ఏ.ఎస్ సాధించాలనుకుంటున్నాను. అందుకు కావలసిన సహాయం పొందగలననే అనుకుంటున్నాను. నాకు ఎంతమంచి పేరున్నా చెత్త అమ్మాయి అనే పిలుస్తారు కొందరు. వారి చేత ఉత్తమ అమ్మాయి అనిపించుకునేందుకు, లక్ష్యం లేని వారి బుర్రలే చెత్త అని నిరూపించేందుకు మరింత కష్టపడతాను’ అంది జయలక్ష్మి. – సాక్షి ఫీచర్స్ డెస్క్ In 5 years in Hyderabad this young lady is one of the most inspiring people I met. She turned every head in the room in 2018 when at an event she announced her intention to be an IAS Officer. I pray she succeeds - she is a true #changemaker full of only kindness & good intent. https://t.co/5khoCxNjjj — Dr Andrew Fleming 🇬🇧 🏴 (@Andrew007Uk) December 11, 2022 -
చెత్త ఏరుకునే స్థాయి నుంచి హోటల్లో చెఫ్ వరకు..
తల్లిదండ్రులు చనిపోయారు.బంధువులు దూరం జరిగారు. తనకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా కన్నీళ్లు, కష్టాలు మాత్రం కచ్చితంగా ఉండేవి. అయినా సరే ఆ చిన్నారి ఎప్పుడూ నిరాశపడలేదు. చెత్త ఏరుకునే స్థాయి నుంచి దిల్లీలోని ప్రముఖ హోటల్లో చెఫ్ వరకు ఎదిగి, కష్టాల చీకటిని ఛేదిస్తూ రెయిన్బోగా వెలిగి ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది లిలిమా ఖాన్... దిల్లీ వసంత్‌కుంజ్‌లోని లె క్యాంటిన్ రెస్టారెంట్లో లిలిమాఖాన్ చెఫ్‌గా పనిచేస్తోంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథగా మారింది. కడుపు నింపుకోవడం కోసం చెత్త ఏరింది. ఇటుకలు మోసింది. ఇండ్లలో పనిచేసింది... ఒకటా రెండా... పొట్టనింపుకోవడానికి ఎన్నెన్నో పనులు చేసింది. డబ్బులు లేని సమయంలో ఆకలి తట్టుకోలేక చెత్తబుట్టల్లో నుంచి మెతుకులు ఏరుకుని తిన్న సందర్భాలూ ఉన్నాయి. ఆకలి తీర్చుకోవడం ఒక ఒక పనైతే పోకిరీలు, రౌడీల నుంచి తనను తాను రక్షించుకోవడం మరో పెద్ద పనిగా మారింది. కష్టాల కత్తుల వంతెనపై నడుస్తున్న ఖాన్‌కు ‘కిల్కరి రెయిన్బో హోమ్’ రూపంలో దివ్యమైన దారి దొరికింది.‘ఇక్కడ నాకు ఆహారం, ప్రేమతో పాటు ఎన్నో దొరికాయి. అందులో చదువు ఒకటి’ అంటుంది ఖాన్. కుటుంబంలేని తనకు ‘రెయిన్బో’ అనే స్వచ్ఛందసంస్థ పెద్ద కుటుంబమై ప్రేమను పంచింది. ‘రెయిన్బో’లో ఖాన్‌కు ఇష్టమైన ప్రదేశం... వంటగది. వంటచేస్తున్న వాళ్లకు చిన్న చిన్న పనులలో సహాయపడేది. చదువు పూర్తయిన తరువాత ‘రెయిన్బో’ సహాయంతో ఖాన్ కుకింగ్‌లో అప్రెంటిస్‌షిప్ చేసింది. శిక్షణ పూర్తయిన తరువాత దిల్లీలోని ఇటాలియన్ రెస్టారెంట్లో స్టాఫ్ కుక్‌గా ఖాన్‌కు అవకాశం వచ్చింది. ఆ తరువాత లె క్యాంటీన్లో చేరింది.‘ఇంత పెద్ద హోటల్లో నేను పనిచేయగలనా అని మొదట్లో భయపడ్డాను. కొన్ని రోజులకు ఆ భయం దూరమైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ అంటుంది ఖాన్. ‘స్త్రీలకు ప్రోత్సాహకరంగా ఉండని ఇండస్ట్రీని ఎందుకు ఎంచుకున్నారు’ అనేది ఖాన్‌కు తరచుగా ఎదురయ్యే ప్రశ్న. ‘చెఫ్ జూలియాకు ఇండస్ట్రీలో పెద్ద పేరు ఉంది. ఆమె నాకు ఆదర్శం. ప్రతిభ ఉంటే జెండర్ అనేది అడ్డంకి కాదు’ అంటుంది ఖాన్. ఒకరోజు హోటల్‌కు తనను కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది. ‘ఈ అమ్మాయికి నాతో పనేమిటి’ అనుకుంది మనసులో. ఆ అమ్మాయి మాత్రం మనసు విప్పి మాట్లాడింది. ‘పరీక్షలో ఫెయిల్ అయిన నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేవి. ఆ సమయంలో మీ గురించి చదివాను. నా సమస్య చాలా చిన్నదిగా అనిపించింది. ఎన్నో కష్టాలను తట్టుకొని మీరు సక్సెస్ అయ్యారు. మీ స్ఫూర్తితో నేను కూడా విజయం సాధించాలకుంటున్నాను’ అని చెప్పింది. ‘కష్టాలలో నలిగినా వెనకడుగు వేయకుండా సాధించిన విజయాలు మనకు మాత్రమే పరిమితం కావు. అవి పదిమందికీ స్ఫూర్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తాయి అని నేను విన్న మాట ఆ సమయంలో గుర్తుకు వచ్చింది’ అంటుంది లిలిమాఖాన్. -
సంపదకు మించిన స్ఫూర్తి.. బిజినెస్‌లో స్ఫూర్తివంతమైన తండ్రీకొడుకులు
ప్రపంచంలో అద్భుతమైన బంధం తండ్రీకొడులది. తండ్రి పిల్లలకు అన్నీ ఇస్తాడు. చాలా మంది తండ్రులు జీవితాంతం కష్టపడి ఆస్తులు సంపాదించి పిల్లలకు ఇస్తారు. కానీ కొంత మంది సంపదకు అంతకు మించిన స్ఫూర్తిని వారసత్వంగా అందిస్తారు. పిల్లలు కూడా ఆ స్ఫూర్తిని కొనసాగిస్తానే ఆ తండ్రుల పేరు శాశ్వతంగా నిలబడుతుంది. ఏటా జూన్ నెలలో మూడో ఆదివారం ఫాదర్స్ డేగా జరుపుకొంటున్నాం. ఎంతో మంది విజయవంతమైన బిజినెస్మెన్ వేలు, లక్షల కోట్ల సంపదను సృష్టించి వారసులకు అందించారు. కానీ కొంతమందే సంపదతోపాటు అంతకుమించిన స్ఫూర్తిని వారసులకు పంచారు. అటువంటి కొందరు బిజినెస్‌మన్ ఫాదర్స్ గురించి తెలుసుకుందాం.. జమ్సెట్జీ టాటా భారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్‌పూర్‌లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం జలపాతం శక్తిని ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్‌లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. ఈ సమయంలో టెక్స్టైల్ మిల్లుల పొగలతో ముంబై నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పశ్చిమ కనుమలలో మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు డోరాబ్, రతన్ టాటాలు తదనంతరం బొంబాయి నగరానికి సరసమైన, స్వచ్ఛమైన విద్యుత్తు అందించేందుకు పునాది వేసినట్లు టాటా గ్రూప్ వారి వెబ్సైట్లో పేర్కొంది. అప్పటి నుంచి రతన్ టాటా తండ్రి స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన పేరును ఉన్నత స్థాయిలో నిలిపారు. ధీరూభాయ్ అంబానీ అంబానీ అనే పేరు దాదాపు ప్రతి భారతీయుడికి సుపరిచితమే. ధీరూభాయ్ అంబానీ అని కూడా పిలిచే ధీరజ్‌లాల్ హరిచంద్ అంబానీ.. రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్‌ను స్థాపించారు. నిరాడంబరమైన సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆయన స్థాపించిన వ్యాపారం భారతదేశం అత్యంత గుర్తించదగిన, విజయవంతమైన బ్రాండ్లలో ఒకటిగా మారింది. ధీరూభాయ్ అంబానీ తర్వాత ఆయన ఇద్దరు కుమారులు ముఖేష్, అనిల్ అంబానీలు వారసత్వం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద కొడుకుగా ముఖేష్ అంబానీ తండ్రి స్ఫూర్తివంతమైన వారసత్వాన్ని కొనసాగించడంలో విశేషంగా కృషి చేస్తున్నారు. నేడు అదే చర్యను ఆకాష్ అంబానీ చేతుల మీదుగా అంబానీ మూడవ తరం అమలు చేస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫారమ్‌లు, గ్రూప్‌లోని ఇతర కంపెనీల వృద్ధి, విజయానికి ఆయన చేసిన కృషి, నాయకత్వ నైపుణ్యాలు, వ్యూహాత్మక దృష్టికి నిదర్శనం. సజ్జన్ జిందాల్ సజ్జన్ జిందాల్ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. ఇది భారీ మల్టీ బిలియన్ల వ్యాపార సంస్థ. సజ్జన్ జిందాల్ కుమారుడు పార్త్ జిందాల్ తండ్రి అడుగుజాడలను అనుసరిస్తూ ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. తనకు అందించిన దానికంటే మించి సాధించారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ యాజమాన్యంలో ఉన్న బెంగళూరు ఎఫ్సీకి సీఈవో అయ్యారు. ఉక్కు, ఇంధనం, మౌలిక సదుపాయాల వంటి రంగాలలో తిరుగులేని సంస్థగా ఉన్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ను మరింత వైవిధ్యభరితంగా తీర్చిదిద్దేందుకు తండ్రీ కొడుకులు పెద్ద కలలు కన్నారు. ఈ డైనమిక్ తండ్రీ కొడుకుల వ్యాపార విజయ గాథలు నిజంగా ఆదర్శవంతమైనవి. లాలా కేదార్నాథ్ అగర్వాల్ లాలా కేదార్నాథ్ అగర్వాల్ 1947లో దేశ విభజన తర్వాత బికనీర్ నుంచి జీవనోపాధి కోసం ఢిల్లీకి వెళ్లారు. చాందినీ చౌక్‌లో ట్రాలీలో సంప్రదాయ స్వీట్లు, సావరీస్ అమ్మడం ప్రారంభించారు. ఆయన కృషికి అదృష్టం తోడైంది. తక్కువ కాలంలోనే అదే ప్రాంతంలో 'బికనేర్ నమ్కీన్ భండార్' పేరుతో చిన్నపాటి దుకాణాన్ని ప్రారంభించి నంకీన్లు, చిరుతిళ్లు విక్రయించారు. కాలక్రమేణా అది 'బికనీర్‌వాలా'గా గుర్తింపు పొందింది. బికనేరి భుజియా, ఇతర ప్రామాణికమైన భారతీయ చిరుతిళ్ల వ్యాపారంలో ప్రసిద్ధి చెందింది. 1965లో వ్యాపారంలోకి అడుగుపెట్టిన లాలా కుమారుడు శ్యామ్ సుందర్ అగర్వాల్ బికనీర్‌వాలాను ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించారు. ప్యాకేజ్డ్ ఫుడ్ బ్రాండ్ బికానోను ప్రారంభించారు. బికనీర్‌వాలా వారసత్వాన్ని కొనసాగిస్తూ మూడో తరం వ్యాపారవేత్త మనీష్ అగర్వాల్ 2000లో వ్యాపారంలో చేరారు. బికానో ఇప్పుడు వివిధ రకాల నామ్కీన్లు, కుకీలు, స్వీట్లు, పాపడ్, సిరప్లు, సమోసా వంటి పిండి పదార్థాలను విక్రయిస్తోంది. -
74 ఏళ్ల వయసులో రియల్ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ..
Oldest Real Estate Agent: వయసు శరీరానికే కానీ ఉత్సాహానికి కాదు.. వృద్ధాప్యం దేహానికే కానీ నిరంతరం పనిచేసే తత్వానికి కాదు.. అని నిరూపిస్తున్నారు ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ముంబైలోని ములుండ్ మైక్రో-మార్కెట్ ప్రాంతానికి చెందిన ఎస్ఎం మాల్డే. ఓల్డెస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. మే 20న మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారేరా) నిర్వహించిన యోగ్యత పరీక్షలో 74 ఏళ్ల వయసులో ఉత్తీర్ణులయ్యారు. 75 శాతం మార్కులు సాధించారు. మాల్డే నాలుగు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ వయసులో పరీక్ష ఎందుకు? ఈ వయసులో మాల్డే పరీక్ష ఎందుకు రాశారో మనీ కంట్రోల్ వార్తా సంస్థకు తెలియజేశారు. తాను పరీక్ష రాయడానికి కారణాలు కేవలం రెండే రెండు. ఒకటి ఈ పరీక్ష ఉత్తీర్ణులైనవారికి అధీకృత రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా గుర్తిస్తుంది. రెండోది మరికొన్ని ఏళ్లపాటు రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేయాలనేది. తాను ఇన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న తనకు అధీకృత గుర్తింపు లేదని, ఈ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాక ఇప్పుడు తనకు గుర్తింపు లభిస్తుందని మాల్డే చెబుతున్నారు. మహారేరా మొదటి బ్యాచ్ పరీక్షకు మాల్డే హాజరయ్యారు. దీని ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. అప్పుడు కొంత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తాను కోలుకుని మళ్లీ తన వృత్తిలోకి వచ్చేశానని, మంచి ఇల్లు కొనాలనుకునేవారికి మంచి సలహాలు, సూచనల ద్వారా సహాయం అందిస్తుంటానని మాల్డే పేర్కొన్నారు. తనకు వ్యాపారం అన్నది ప్రాధాన్యం కాదని, కొనుగోలుదారులకు సరైన గైడెన్స్ ఇవ్వాలన్నది తన ప్రథమ సంకల్పమని వివరించారు. అందుకు తనకు ముంబై ప్రాంతంలో మంచి పేరు ఉందని చెప్పారు. చిన్న గది నుంచి ప్రీమియం అపార్ట్మెంట్ వరకు.. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వృత్తిలో తన ప్రయాణం గురించి మాల్డే మాట్లాడుతూ.. తాను ఒక చిన్న గదిలో నివసించానని, ఈ రోజు ములుండ్ ప్రాంతంలో ప్రీమియం అపార్ట్మెంట్లో ఉంటున్నానని గర్వంగా చెప్పారు. 750 చదరపు అడుగుల కార్పెట్‌తో కూడిన 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ అది. తనకు గుర్తింపుతోపాటు అన్ని ఇచ్చిన తన వృత్తికి ధన్యవాదాలు చెబుతున్నారు. కాగా మాల్డే కుమార్తె యూకేలో ఉంటున్నారు. తన 40 ఏళ్ల రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కెరీర్లో మాల్డే ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో 20,000కుపైగా లావాదేవీలు చేసుంటారు. ఇప్పటికీ నెలలో కనీసం మూడు లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్నారాయన. వీటిలో ఒకటి తన కోసం, మరొకటి తన ఉద్యోగుల ఖర్చుల కోసం, మిగిలినది తన ఆఫీస్ నిర్వహణ ఖర్చుల కోసమని మాల్డే వివరించారు. కాగా మహారేరా మే 20 న నిర్వహించిన యోగ్యత పరీక్షకు హాజరైనవారిలో 95 శాతం ఉత్తీర్ణులయ్యారని మే 30న ప్రకటించింది. మొదటి బ్యాచ్ పరీక్షకు 423 మంది హాజరుకాగా 405 మంది ఉత్తీర్ణులయ్యారు. గృహ కొనుగోలుదారులు, డెవలపర్ల మధ్య వారిధిగా వ్యవహరించే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఈ పరీక్ష తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. ఆ రాష్ట్రంలో దాదాపు 39,000 మంది మహారేరా నమోదిత రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తమ రిజిస్ట్రేషన్‌ను వీరు పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఇదీ చదవండి ➦ పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు.. -
తెలుగు రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమన్! ఎవరీ మహిమా?
హైదరాబాద్‌కు చెందిన మహిమా దాట్ల, ఆమె కుటుంబం రూ.8,700 కోట్ల సంపదతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నులుగా అవతరించారు. ఇంతకీ ఎవరీమె? వారి కుటుంబం చేస్తున్న వ్యాపారం ఏంటి? ఏ సంస్థకు వారు అధినేతలు? వంటి విషయాలు తెలుసుకుందాం... ఇదీ చదవండి: Prerna Jhunjhunwala: రూ. 330 కోట్ల యాప్.. ఈమె స్టార్టప్ పిల్లల కోసమే.. స్ఫూర్తిదాయకమైన యువ వ్యాపారవేత్త మహిమా దాట్ల ఐఐఎఫ్ఎల్ (IIFL) వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అత్యంత సంపన్న మహిళగా అవతరించారు. మహిమా దాట్ల, ఆమె కుటుంబ నికర విలువ రూ. 8,700 కోట్లుగా అంచనా. ఏపీ, తెలంగాణలోని సంపన్నుల జాబితాలో ఆమె 10వ స్థానంలో నిలిచారు. ఐఐఎఫ్ఎల్ 2021 వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో ఆమె నెట్‌వర్త్ రూ. 7,700 కోట్లు ఉండగా 2022లో ఆమె సంపద విలువ రూ. 1,000 కోట్లు పెరిగింది. ఫార్మా రంగంలో తిరుగులేని నాయకత్వం హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం బయోలాజికల్-ఈ లిమిటెడ్ (Biological E Ltd)కి మహిమా దాట్ల ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్. వారి కుటుంబంలో మూడవ తరం వ్యాపారవేత్త. వ్యాక్సిన్ వ్యాపారంలో ఆమె తనదైన ముద్రను చూపించారు. కరోనా మహమ్మారి సమయంలో Corbevax కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా మహిమా నాయకత్వంలోని బయోలాజికల్-ఈ సంస్థ అప్పట్లో వార్తలో నిలిచింది. ఆమె కుటుంబం 1948లో ఫార్మా వ్యాపారాన్ని స్థాపించింది. హెపారిన్ ఔషధాన్ని భారతదేశానికి తీసుకువచ్చింది వీరి సంస్థే. అయితే లండన్‌లో వెబ్‌స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసిన మహిమా కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. తండ్రి మరణంతో.. 2013లో ఆమె తండ్రి విజయ్ కుమార్ దాట్ల మరణించడంతో ఆమె కంపెనీ పగ్గాలు చేపట్టారు. మహిమా దాట్ల ఆధ్వర్యంలో బయోలాజికల్-ఈ తన వ్యాక్సిన్లను 100 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా చేస్తోంది. గత దశాబ్దంలో 200 కోట్లకు పైగా డోస్‌లను అందించింది. దీని పోర్ట్‌ఫోలియోలో మీజిల్స్, టెటానస్, రుబెల్లా వంటి వ్యాధుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రీక్వాలిఫైడ్ వ్యాక్సిన్లు ఏడు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా టెటానస్ వ్యాక్సిన్ల తయారీలో అతిపెద్ద సంస్థ. ఇలాంటి స్పూర్తివంతమైన పారిశ్రామిక వేత్తల విజయగాథలు, ఆసక్తికరమైన కథనాల కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది..
ఆయనొక పాథాలజిస్ట్.. ముంబైలో చిన్న ల్యాబ్‌ను నడిపేవాడు.. విదేశాల నుంచి అతని కూతురొచ్చింది. ఆ చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల మల్టీ చెయిన్ సంస్థగా తీర్చిదిద్దింది. ఆమె ఎవరు.. తండ్రి కలను ఎలా సాకారం చేసింది.. తెలుసుకోండి.. అమీరా షా.. మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా అనేక డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నాయి. విదేశాల్లో చదివిన అమీరా షా ఫైనాన్స్ ప్రొఫెషనల్. గోల్డ్‌మ్యాన్ సాచ్స్‌లో పని చేసేది. అందులో సంతృప్తి లేక వ్యాపారవేత్తగా మారాలని నిర్ణయించుకుంది. తన వ్యాపార పరిజ్ఞానాన్ని తండ్రి వైద్య ప్రావీణ్యంతో మిళితం చేసి, రూ. 6478 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న అతిపెద్ద డయాగ్నస్టిక్ సంస్థను సృష్టించింది. వైద్య కుటుంబం అమీరా షా ముంబైలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఆమె యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఆస్టిన్ నుంచి ఫైనాన్స్ డిగ్రీ అందుకున్నారు. ఆమె వైద్యుల కుటుంబానికి చెందిన వారు. తండ్రి పాథాలజిస్ట్ డాక్టర్ సుశీల్ షా. తల్లి గైనకాలజిస్ట్ డాక్టర్ దురు షా. సోదరి జన్యు శాస్త్రవేత్త. కంపెనీని విజయవంతంగా ప్రారంభించిన అనంతరం కూడా ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఓనర్-ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేశారు. 21 ఏళ్లకే స్టార్టప్ అమీరా షా ఒక పాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను గోల్డ్‌మన్ సాక్స్‌లో పనిచేస్తున్నప్పటికీ ఆ ఉద్యోగం తనకు సంతృప్తిని ఇవ్వలేదని, అంత పెద్ద ఆర్థిక సేవల సంస్థలో పనిచేస్తున్నా ఆ ఉద్యోగాన్ని ఎప్పుడూ ఆస్వాదించలేదని చెప్పారు. దీంతో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి కేవలం ఐదుగురు వ్యక్తులతో స్టార్టప్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఆమె వయసు కేవలం 21 ఏళ్లు. ఇలా లాభం లేదు ఇంకా మరింత ప్రభావం చూపాలన్న తండ్రి సలహా మేరకు ఆమె భారత్‌కు తిరిగివచ్చారు. అలా దేశానికి తిరిగిన వచ్చిన ఆమె తన తండ్రి నడుపుతున్న ల్యాబ్‌లో సమస్యలను గుర్తించింది. ఆ లాబ్ చాలా సాదాసీదాగా ఉంది. కంప్యూటర్లు కూడా లేవు. కానీ తన ల్యాబ్‌ను అతిపెద్ద డయాగ్నోస్టిక్స్ చైన్‌ను రూపొందించాలన్నది ఆయన కల. కానీ ఎలాగో తనకు తెలియదు. తండ్రి కలను సాకారం చేసే భారీ ఆపరేషన్‌ను మొదలు పెట్టింది అమీషా. మొదటగా ల్యాబ్‌ను ఆధునికీకరించి అన్ని వసతులు, హంగులతో తీర్చిదిద్దింది. ల్యాబ్‌లో పేషంట్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించింది. వివిధ విభాగాలను సృష్టించి ల్యాబ్ నిర్వహణను మెరుగ్గా మార్చేసింది. తండ్రి సహకారంతో ఆ కంపెనీకి సీఈఓ అయింది. ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. కిందిస్థాయి నుంచి.. ఆమె ఈ సంస్థను కింది స్థాయి నుంచి ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఆమే స్వయంగా కస్టమర్ కేర్ కౌంటర్లో రోగులకు సేవలందించింది. రోజువారీ సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం ప్రారంభించింది. ల్యాబ్ పేరును డాక్టర్ సుశీల్ షా లాబొరేటరీ నుంచి మెట్రోపాలిస్గా మార్చారు. తర్వాత ఇతర డయాగ్నోస్టిక్ సెంటర్లతో భాగస్వామ్యం చేయడం ప్రారంభించారు. వారి మొదటి టై అప్ చెన్నైలో డాక్టర్ శ్రీనివాసన్ అనే పాథాలజిస్ట్‌తో జరిగింది. అనతి కాలంలోనే వారి డయాగ్నోస్టిక్ సంస్థ అభివృద్ధి బాట పట్టింది. 2006 సంవత్సరంలో వారికి బయటి నుంచి నిధులు వచ్చాయి. వ్యాపారంలో సంపాదించిన డబ్బును అలాగే పెట్టుబడి పెట్టారు. 2002లో వారికి ఒకే ఒక ల్యాబ్ ఉండేది. దీని ఆదాయం అప్పట్లో రూ.7 కోట్లు. 2023లో వారి ఆదాయం రూ.1148 కోట్లు. మార్చి త్రైమాసికంలోనే వారి నికర లాభం రూ.33 కోట్లు. నేడు వారి మెట్రోపాలిస్ సంస్థకు 1500 పైగా సేకరణ కేంద్రాలు, 125 పైగా ల్యాబ్‌లు ఉన్నాయి. ఇవి ఏడు దేశాల్లో పనిచేస్తున్నాయి. ఇలాంటి స్పూర్తివంతమైన పారిశ్రామిక వేత్తల విజయగాథలు, ఆసక్తికరమైన కథనాల కోసం సాక్షి బిజినెస్ పేజీని చూడిండి -
అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్..
రూ.9 వేల కోట్ల నెట్‌వర్త్‌తో దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరు కోచౌసెఫ్ చిట్టిలపిల్లి. రూ. 1 లక్షతో చిన్న కంపెనీని ప్రారంభించిన ఆయన రూ. 11వేల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్‌తో వి-గార్డ్ ఇండస్ట్రీస్, దాదాపు రూ. 2,500 కోట్లతో వండర్లా హాలిడేస్ వంటి కంపెనీలను స్థాపించి అభివృద్ధి చేశారు. వ్యాపారపరంగా ఇంత ఎత్తుకు ఎదిగిన కోచౌసెఫ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది దశాబ్దం ఆయన క్రితం చేసిన నిస్వార్థ చర్య. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన కోచౌసెఫ్ 61 ఏళ్ల వయసులో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది తన కిడ్నీని దానం చేయడం. అది కూడా అపరిచితుడైన ఒక పేద ట్రక్కు డ్రైవర్‌కు. ఇందుకు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. వైద్యులు వారించినా లెక్క చేయలేదు. తాను ఇలా చేసింది.. శరీరం ఫిట్‌గా ఉంటే కిడ్నీలో ఒకదానిని దానం చేసినా ఫర్వాలేదని చాటి చెప్పడానికేనని తర్వాత ఓ ప్రముఖ దినపత్రికతో తెలిపారు. ఎవరీ కోచౌస్ఫ్ కోచౌసెఫ్ చిట్టిలపిల్లి? కేరళలోని త్రిస్సూర్ శివారులో 1950లో జన్మించారు కోచౌసెఫ్ చిట్టిలపిల్లి. స్థానిక చర్చి పాఠశాలలో చదువుకున్నారు. తరువాత త్రిసూర్‌లోని సెయింట్ థామస్ కళాశాల నుంచి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1973లో తిరువనంతపురంలోని ఎలక్ట్రానిక్స్ కంపెనీలో వోల్టేజ్ స్టెబిలైజర్లు, ఎమర్జెన్సీ ల్యాంప్‌లను తయారు చేయడం ప్రారంభించారు. మూడేళ్లపాటు అక్కడ సూపర్వైజర్గా పనిచేసిన కోచౌసెఫ్ ఉద్యోగం వదిలేసి రూ. 1 లక్ష మూలధనంతో 1977లో వి-గార్డ్ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. కేవలం ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన వి-గార్డ్ నేడు దేశంలోనే అతిపెద్ద స్టెబిలైజర్ బ్రాండ్. తన వ్యాపారాన్ని విస్తృతం చేస్తూ కోచౌసెఫ్ 2000 సంవత్సరంలో కేరళలో మొట్టమొదటి వాటర్ థీమ్ పార్క్‌ను ప్రారంభించారు. అలాగే బెంగళూరులో వండర్లా పార్కును ఏర్పాటు చేసింది కూడా ఈయనే. ఇక సేవా కార్యక్రమాల విషయానికి వస్తే.. కె. చిట్టిలపిల్లి ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వెయ్యి నిరుపేద కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇచ్చారు. స్ట్రే డాగ్ ఫ్రీ ఉద్యమానికి అధ్యక్షత వహించారు. అత్యధిక పన్ను చెల్లింపుదారులలో ఒకరిగా భారత ప్రభుత్వం నుంచి రాష్ట్రీయ సమ్మాన్ అవార్డుతో సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. ప్రాక్టికల్ విజ్డమ్ సిరీస్, తన ఆత్మకథ ‘ఒర్‌మక్కిలివాథిల్’తో సహా పలు పుస్తకాలను రచించారు. కోచౌసెఫ్ సతీమణి పేరు షీలా. వీరికి అరుణ్, మిథున్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు వి-గార్డ్, వండర్లా వ్యాపారాలను చూసుకుంటున్నారు. -
వైకల్యాన్ని జయించి అద్భుతాలు సృష్టిస్తున్న రూపాదేవి
-
భయాన్ని పోగొట్టి.. ఆడుతూ.. పాడుతూ.. లెక్కలు
మ్యాథ్స్ అంటే స్టూడెంట్స్‌కు ఎప్పుడూ భయమే. వారిలో భయాన్ని పోగొట్టి ఆట, పాటలతో మ్యాథ్స్ నేర్పిస్తుంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా సిరసనగండ్ల జిల్లా పరిషత్ పాఠశాల టీచర్ రూపారాణి. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, లెక్కలు అంటే మక్కువ చూపే విధంగా బోధిస్తున్న ఈ టీచర్ ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే! మ్యాథ్స్ అంటే కొందరి విద్యార్థుల్లో చెప్పలేనంత భయం ఉంటుంది. కొందరికైతే అదొక ఫోబియా. అదే గేమ్స్ అంటే ఎంతో ఇష్టం చూపిస్తారు. విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో లెక్కలపై మక్కువ చూపే విధంగా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఓ కొత్త ఆలోచన చేసింది. ఆ ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టింది. ఫలితం ఇప్పుడా టీచర్ దగ్గర లెక్కల పాఠాలు నేర్చుకున్న పిల్లలకు అంకెలు, సంఖ్యలు, ఆల్జీబ్రాలు, కొలతలు, వేగాలు అన్ని మంచినీళ్ల ప్రాయంగా అర్ధమవసాగాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కానీ ఇప్పుడు వీరు కార్పొరేట్‌కు ఏ మాత్రం తీసిపోరని నిరూపిస్తున్నారు. రూపారాణి ఇటీవల కేరళ రాష్ట్రం త్రిశూర్‌లో జరిగిన జాతీయ స్థాయి సైన్స్, మ్యాథ్స్ ఎగ్జిబిషన్లో ప్రతిభ కనబర్చి, టీచర్ కేటగిరిలో ప్రత్యేక బహుమతిని సాధించారు. చార్పత్తర్తో.. విద్యార్థులు ఆడుకునే చార్ పత్తర్ ఆటతో గ్రాఫింగ్ పాయింట్లు ఎలా పెట్టవచ్చో చూపుతున్నారు. ఒక బాక్స్‌లో నాలుగు సమాన బాక్స్‌లు చేసి మధ్యలో నాలుగు రాళ్లు పెట్టి, వాటిని విద్యార్థులు తీసుకునే విధానం ద్వారా గ్రాఫింగ్ పాయింటింగ్ నేర్పిస్తున్నారు. డయల్ యువర్ ఫార్ములాతో ఫార్ములాలను కనుక్కోవడం, మ్యాజిక్ ఫార్ములాతో సమస్యలు ఎలా సాధన చేయవచ్చో, సంఖ్య రేఖపై ఆటల ద్వారా కూడికలు, తీసివేత గుణాంకాలను చేయడం, ఎలక్ట్రికల్ లైట్స్‌తో ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్స్.. ఇలా విద్యార్థులకు ఆటలతో అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేస్తున్నారు. పాటలతో ఎక్కాలు బతుకమ్మ పాటలతో ఎక్కాలను సులభంగా నేర్చుకునే విధంగా, యానిమేటెడ్ డిజిటిల్స్ ద్వారా విద్యార్థులకు దృశ్య రూపకంగా సులభంగా అర్థమయ్యేలా చేస్తున్నారు. దీంతో విద్యార్థులు మ్యాథ్స్ అంటే భయం పోయి మక్కువ చూపుతున్నారు. నాన్న స్పూర్తితోనే! మా నాన్న రాజమౌళి ప్రభుత్వం ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యారు. టూర్లకు వెళ్లిన సమయంలో విద్యార్థుల కోసం బొమ్మలను తీసుకువచ్చి, వాటి ద్వారా విద్యా బోధన చేశారు. దీంతో విద్యార్థులూ చదువు పట్ల మక్కువ చూపించేవారు. అలా నాన్న స్ఫూర్తితో నేనూ ఏదైనా చేయాలనుకుని ఆలోచించాను. విద్యార్థులకు ఆటల ద్వారా మ్యాథ్స్‌ను బోధిస్తున్నారు. మానాన్న స్పూర్తితోనే విద్యార్థులకు ఆటలు పాటల ద్వారా మాథ్స్ చెప్పుతున్నాను. దీంతో విద్యార్థుల పాస్ పర్సంటెజ్ బాగా పెరుగుతుంది. సిరసనగండ్ల జెడ్పీ స్కూల్లో మ్యాథ్స్ టీచర్‌గా ఉన్న నేను ఇటీవల డిప్యూటేషన్ పై మూట్రాజ్పల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాను. ఇక్కడా ఇదే పద్ధతిలో మ్యాథ్స్ బోధిస్తున్నాను. – పెందోట రూపారాణి జాతీయ స్థాయిలో ప్రతిభ విద్యార్థులకు ఆటలతో మ్యాథ్స్ బోధించే విధానాన్ని జాయ్ ఫూల్ లెర్నింగ్ మ్యాథ్స్ బై గేమ్స్ యూజింగ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ పేరుతో ఎగ్జిబిట్లను రూపొందించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబర్చారు. కేరళ రాష్ట్రం త్రిశూల్‌లో జరిగిన జాతీయ స్థాయిలో ఈ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. విశ్వేశ్వరయ్య ఇండ్రస్టియల్ టెక్నాలజీ మ్యూజియం తరుపున ప్రత్యేక బహుమతిని అందుకున్నారు. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట ఫొటోలు: సతీష్ కుమార్ -
చీకటిపై రణం చేసిన... గెలుపు వ్యాకరణం
చిన్నవయసులోనే డిప్రెషన్ బారిన పడిన షర్మిన్ తల్లిదండ్రుల సహాయంతో ఆ చీకటి నుంచి బయటపడింది. ‘ఆట–మాట–పాట’లలో తన ప్రతిభ చూపింది. సృజనాత్మకతకు మెరుగులు దిద్దే ఏఐ–ఆధారిత ప్లాట్‌ఫామ్ ‘ఇన్‌స్టోరీడ్’తో ఇన్స్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకుంది. ‘కస్టమర్స్ కొనుగోలు నిర్ణయాలు లాజిక్ మీద కాదు ఎమోషన్స్‌పై ఆధారపడి ఉంటాయి’ అనే సూత్రాన్ని ఆధారం చేసుకొని ఏఐ–ఆధారిత ప్లాట్‌ఫామ్ ‘ఇన్‌స్టోరీడ్’ను ప్రారంభించింది షర్మిన్ అలి. ఈ ప్లాట్‌ఫామ్ సోలోప్రెన్యూర్స్, ఫ్రీలాన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్, క్లయింట్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేసే ఏజెన్సీలకు బాగా ఉపయోగపడుతుంది. ‘కంటెంట్ రైటర్స్ కస్టమర్ మనసులోకి పరకాయప్రవేశం చేసినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది’ అంటున్న షర్మిన్ ‘ఇన్‌స్టోరీడ్’ ప్రారంభించడానికి ముందు ఎంతోమంది న్యూరో మార్కెటర్స్, న్యూరో సైంటిస్టులతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఏఐ పవర్డ్ టూల్‌ను రూపొందించడానికి పద్దెనిమిది నెలల కాలం పట్టింది.ఇంతకీ ఈ టూల్ చేసే పని ఏమిటి? మనం ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు, మన కంటెంట్ మనకు బాగానే ఉంటుంది. ‘నిజంగా ఈ కంటెంట్ బాగుందా? మార్పు, చేర్పులు ఏమైనా చేయాలా?’ అనే సందేహం వచ్చినప్పుడు ఈ టూల్‌కు పనిచెప్పవచ్చు. ‘ఈ వాక్యం సరిగ్గా లేదు’ ‘ఈ పదానికి బదులు మరో పదం వాడితే బాగుంటుందేమో’ ‘ఇలాంటి హెడ్‌లైన్స్ చాలా వచ్చాయి. వేరే హెడ్‌లైన్‌కు ప్రయత్నించండి’ ‘టు మెనీ నెగెటివ్ వర్డ్స్. మీ భావం సరిగ్గా చేరడం లేదు’ ‘ఇందులో భాషా దోషాలు కనిపిస్తున్నాయి’.....ఇలాంటి సలహాలు ఎన్నో ఇస్తుంది ఈ ఏఐ టూల్. కొన్నిసార్లు అనుకోకుండా మనం రాసిన వాక్యం, ఎవరో రాసిన వాక్యంలా ఉండి కాపీ కొట్టారు అనే ముద్ర పడడానికి అవకాశం ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కూడా ‘ఇన్‌స్టోరీడ్’ టూల్ హెచ్చరించి వేరే వాక్యాలు రాసుకునేలా చేస్తుంది. ‘చాలామంది నన్ను అడిగే ప్రశ్న...మీ ప్లాట్‌ఫామ్ ద్వారా కాపీరైటర్స్ అవసరం లేకుండా చేయవచ్చా? అది అసాధ్యం అని చెబుతాను. మానవసృజనకు ప్రత్యామ్నాయం లేదు. మా ప్లాట్‌ఫామ్ సృజనకు మెరుగులు పెట్టి మరింత చక్కగా తీర్చిదిద్దేలా చేస్తుంది’ అంటోంది షర్మిన్. షర్మిన్ ‘ఇన్‌స్టోరీడ్’కు శ్రీకారం చుట్టినప్పుడు ‘ఇది సక్సెస్ అవుతుందా?’ అనే సందేహాలు వెల్లువెత్తాయి. అయితే తన ప్రాజెక్ట్ మీద ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు షర్మిన్. ఆమె నమ్మకం నిజమైంది. బెంగళూరు కేంద్రంగా మొదలుపెట్టిన ‘ఇన్‌స్టోరీడ్’కు వేలాది మంది యూజర్స్ ఉన్నారు. ‘ఇన్‌స్టోరీడ్’కు ముందు అమెరికాలో డాటాసైన్స్, ఎనలటిక్స్ రంగాలలో పనిచేసింది షర్మిన్ పశ్చిమబెంగాల్లోని కూచ్ బెహార్లో పుట్టిన షర్మిన్ అహ్మదాబాద్‌లో పెరిగింది. ‘ఆడుతూ పాడుతూ పెరిగినదే అందమైన బాల్యం’ అంటుంటారు. అయితే షర్మిన్ మాత్రం చిన్న వయసులోనే డిప్రెషన్ బారిన పడింది. భూకంపం, వరదలు, మతకలహాలు....మొదలైన వాటి ప్రభావంతో కుంగుబాటు అనే చీకట్లోకి వెళ్లిపోయింది. రకరకాల ప్రయత్నాలు చేసి ఆ చీకటి నుంచి షర్మిన్ను బయటికి తీసుకువచ్చారు తల్లిదండ్రులు. అది మొదలు...ఆటలు, పాటలు, నృత్యాలలో చురుగ్గా పాల్గొనేది. ఇంజనీరింగ్ ఫైనలియర్లో ఉన్నప్పుడు ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ ఎలక్టివ్‌గా తీసుకుంది. ఇక అప్పటి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలనేది తన కలగా మారింది. ‘ఇన్‌స్టోరీడ్’తో సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గెలుపు జెండా ఎగరేసింది. ఎంటర్ప్రెన్యూర్గానే కాదు నటి, రచయిత్రి, మోటివేషనల్ స్పీకర్‌గా మంచి పేరు తెచ్చుకుంది షర్మిన్ అలి. -
She Is- Women In STEAM: స్ఫూర్తినిచ్చే సూపర్‌స్టార్స్.. ఆ 75 మంది మహిళలు..
అక్షరాలు అంటే వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిలే కాదు... అగ్నిజ్వాలలు కూడా. ఆ వెలుగు ఎన్నో రకాల చీకట్లను పారదోలుతుంది. ‘షీ ఈజ్–ఉమెన్ ఇన్ స్టీమ్’ పుస్తకంలో ఎన్నో జీవితాలు ఉన్నాయి. ఎన్నో పోరాటాలు ఉన్నాయి. స్ఫూర్తినిచ్చే ఎన్నో విజయాలు ఉన్నాయి... డెబ్భై అయిదేళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఎల్సా మేరి డిసిల్వా ‘షీ ఈజ్–ఉమెన్ ఇన్ స్టీమ్’ అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు. ‘స్టెమ్’(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మాథమెటిక్స్)కు విస్తరణ ఈ స్టీమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ మ్యాథమేటిక్స్). సైన్స్ నుంచి సమాజసేవ వరకు వివిధ రంగాలలో విశేష కృషి చేసిన డెబ్భై అయిదు మంది మహిళలను ఈ పుస్తకం ద్వారా పరిచయం చేశారు డిసిల్వా. పరిచయం అనడం కంటే వారి పర్సనల్, ప్రొఫెషన్ స్ట్రగుల్‌ను కళ్లకు కట్టారు అనడం సబబుగా ఉంటుంది. ఈ పుస్తకంలో చోటు చేసుకున్న వివిధ రంగాల మహిళలు... అదితి చతుర్వేది–టెక్నాలజీ పాలసీ ఆనంది అయ్యర్–క్లైమెట్ సైన్స్ అండ్ కమ్యునికేషన్ అంజలి మల్హోత్ర–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ అను ఆచార్య–హెల్త్ సైన్స్ అనుపమ్ కపూర్–హ్యూమన్ రిసోర్స్ అనుశ్రీ మాలిక్–ఎన్విరాన్మెంట్ సైన్స్ అపూర్వ బెడెకర్–మెడికల్ డివైజ్ అర్చన చుగ్–బయోలాజికల్ సైన్స్ ఆర్తి కశ్యప్–డిజైన్ అండ్ టెక్నాలజీ అజ్రా ఇస్మాయిల్–డిజైన్ అండ్ టెక్నాలజీ విజయలక్ష్మీ బిస్వాల్–హెల్త్ సైన్సెస్ బినేష్ పయట్టటి–ఎన్విరాన్మెంట్ సైన్స్ బిను వర్మ–ఎడ్యుకేషన్ బృంద సొమయ–ఆర్కిటెక్చర్చర్ చంద నిమ్బకర్–బయోలాజికల్ సైన్స్ చెర్లీ పెరైర–ఎన్జీవో దీప్తి గుప్త–ఇంజనీరింగ్ దర్శన జోషి–ఫిజిక్స్ మనిషా ఆచార్య–ఇన్నోవేషన్ రాఖీ చతుర్వేది–బయోలాజికల్ సైన్స్ శుభాంగి వుమ్బర్కర్–కెమికల్ సైన్స్ అర్చన శర్మ–ఇంజనీరింగ్ భారతి సింఘల్–బయోలాజికల్ సైన్స్ కల్పన నాగ్‌పాల్–ఫార్మాస్యూటికల్ సైన్స్ ప్రీతి షరన్–ఇంజనీరింగ్ షమిత కుమార్–ఎన్విరాన్మెంట్ సైన్స్ దుర్బసేన్గుప్త– బయోకెమిస్త్రీ ఏక్తా వివేక్ వర్మ–జెండర్ బేస్డ్ వాయిలెన్స్ గాయత్రి జోలి–డిజైన్ అండ్ టెక్నాలజీ గీత మెహత–డిజైన్ అండ్ టెక్నాలజీ గీతారాయ్–బయోలాజికల్ సైన్స్ జీవన్‌జ్యోతి పండ–బయోలాజికల్ సైన్స్ కైయిత్కి అగర్వాల్–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ కరణ్ శైవ–సస్టేనబుల్ డెవలప్మెంట్ కవితా గోంసాల్వేజ్–డిజైన్ అండ్ టెక్నాలజి కిరణ్ బాలా–ఎన్విరాన్మెంట్ సైన్స్ కిరణ్ మన్రల్–ఆర్ట్స్ అండ్ కమ్యునికేషన్ లిజీ ఫిలిప్–సివిల్ ఇంజనీరింగ్ మాధవీలత గాలి–సివిల్ ఇంజనీరింగ్ మిథాలి నికోర్–ఎకనామిక్స్ మోనాలి హజ్ర–ఎన్విరాన్మెంట్ సైన్స్ మోనాలీసా ఛటర్జీ–ఫార్మాస్యూటికల్ సైన్స్ నమ్రత రాణా–క్లైమెట్ సైన్స్ అండ్ కమ్యునికేషన్స్ నందితాదాస్ గుప్త–ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నీలమ్–సోషల్ ఇంపాక్ట్ నిహారిక మల్హోత్ర–హెల్త్ సైన్స్ నిష్మ వాంగూ–నానోసైన్స్ అండ్ నానో టెక్నాలజీ పద్మ పార్థసారథి–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ ప్రీతి అఘలయం–కెమికల్ ఇంజనీరింగ్ అర్పిత మోండల్–ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ జైదీప్ మల్హోత్ర–హెల్త్ సైన్స్, రాధిక–హెల్త్ సైన్స్ రంజని విశ్వనాథ్–కెమికల్ సైన్స్ రష్మీ పుట్చ–డిజైన్ అండ్ టెక్నాలజీ రీతూపర్ణ మండల్–సెమీ కండక్టర్స్ రుమ పాల్–హెల్త్ సైన్స్ సంఘమిత్ర బందోపాధ్యాయ–న్యూరోసైన్స్ షెలక గుప్త–కెమికల్ ఇంజనీరింగ్ శిలో శివ్–ఆర్ట్స్ అండ్ కమ్యునికేషన్ శిల్పి శర్మ–ఎన్విరాన్మెంట్ సైన్స్ షీతల్ కక్కర్ మెహ్ర–సోషల్ ఇంపాక్ట్ శ్రుతి పాండే–ఆర్కిటెక్చర్ శ్యామల రాజారామ్–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజి శిమ్మి దర్నిజ–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజి శ్రీదేవి ఉపాధ్యాయుల–కెమికల్ ఇంజనీరింగ్ సుసన్–బయోలాజికల్ సైన్స్ స్వర్ణలత జె– కమ్యూనిటి సర్వీస్ తృప్తిదాస్–ఎన్విరాన్మెంట్ సైన్స్ వందన ననల్–ఫిజిక్స్ వనమాల జైన్–డిజైన్ అండ్ టెక్నాలజీ వర్ష సింగ్–సైకాలజి విశాఖ చందేరె–క్లీన్ ఎనర్జీ యమ దీక్షిత్– క్లైమేట్ సైన్స్ అండ్ కమ్యునికేషన్స్ జైబున్నిసా మాలిక్ – కంప్యూటర్ సైన్స్. ‘ఎన్నో ఏళ్లుగా కార్పొరేట్, డెవలప్మెంట్ సెక్టర్లో పనిచేసిన నేను వివిధ రూపాల్లో ఉండే పురుషాధిక్యతను చూశాను. మహిళ అనే కారణంతో వారి ప్రతిభను పట్టించుకోని వారిని చూశాను. రకరకాల అనుభవాలు ఈ పుస్తకం తీసుకురావడానికి కారణం అయ్యాయి’ అంటోంది పుస్తక రచయిత్రి ఎల్సా మేరి డిసిల్వా. ‘షీ–ఈజ్’ బుక్సిరీస్లో ఇంకా ఎన్నో పుస్తకాలు రానున్నాయి. మహిళాశక్తిని ప్రపంచానికి చాటనున్నాయి. చదవండి: ఎంపవర్మెంట్: డైనమిక్ సిస్టర్స్ -
ఏపీ రైతులు భళా.. నీతి ఆయోగ్ కథనాల్లో 21 మందికి స్థానం
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రంగం ఆవశ్యకతను తెలుపుతూ నీతి ఆయోగ్ విడుదల చేసిన సేంద్రియ వ్యవసాయదారుల స్ఫూర్తిదాయక కథనాల్లో 21 మంది ఏపీ రైతులకు స్థానం దక్కింది. వీరంతా వరి, వేరుశనగ, కందులు, ఉల్లిపాయలు, కూరగాయలు తదితర పంటలను సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించారు. సేంద్రియ వ్యవసాయంతో తమ ఆదాయం పెంచుకున్న వీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారంటూ నీతి ఆయోగ్ ‘కాంపెడియం ఆఫ్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్’ పేరిట దేశవ్యాప్తంగా 110 మంది కథనాలు ప్రచురించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 21 మంది ఉన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సతీమణి, చీపురుపల్లి ఉప సర్పంచ్ బెల్లాన శ్రీదేవి కూడా వీరిలో ఉన్నారు. చదవండి: ఇక్కట్లు లేని ‘ఇల’ పంటలు! ఏపీ రైతులు వీరే.. (ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన..) ♦చిర్తి నారాయణమూర్తి, పి.కొత్తగూడెం, నాతవరం, విశాఖ జిల్లా ♦అనుగుల వెంకటసుగుణమ్మ, నాగమంగళం, పలమనేరు, చిత్తూరు జిల్లా ♦బెల్లాన శ్రీదేవి, చీపురుపల్లి, విజయనగరం జిల్లా ♦ఆర్.భాస్కర్‌రెడ్డి, ఎన్.గుండ్లపల్లి, బెలుగుప్ప, అనంతపురం జిల్లా ♦చందు సత్తిబాబు, అమ్మపాలెం, పెదవేగి, పశ్చిమగోదావరి జిల్లా ♦ఎస్.దిలీప్‌కుమార్, పెదకొండూరు, దుగ్గిరాల, గుంటూరు జిల్లా ♦గమ్మెలి లక్ష్మి, ఐతగుప్ప, పాడేరు, విశాఖ జిల్లా ♦గెడ్డ అప్పలనాయుడు, గజపతినగరం, విజయనగరం జిల్లా ♦హనుమంతు ముత్యాలమ్మ, కోసరవానివలస, పార్వతీపురం, విజయనగరం జిల్లా ♦కంటిపూడి సూర్యనారాయణ, తీపర్రు, పెరపలి, పశ్చిమగోదావరి జిల్లా ♦కిల్లో ధర్మారావు, రంగసిల, హుకుంపేట, విశాఖ జిల్లా ♦కొత్తపల్లి శివరామయ్య, టి.కొత్తపల్లి, మైదుకూరు, కడప జిల్లా ♦మాగంటి చంద్రయ్య, ఎన్.గొల్లపాలెం, మచిలీపట్నం, కృష్ణా జిల్లా ♦మన్నేటి గంగిరెడ్డి, చెన్నమరాజుపల్లి, పెండ్లిమర్రి, వైఎస్సార్ జిల్లా ♦ముప్పాల నిర్మలమ్మ, అరిమేనుపాడు, ఓజిలి, నెల్లూరు జిల్లా ♦వై.పద్మావతమ్మ, లొడ్డిపల్లి, ఓర్వకల్లు,కర్నూలు జిల్లా ♦బి.రామకోటేళ్వరరావు, గ్రామనపల్లె, కలసపాడు, వైఎస్సార్ జిల్లా ♦శ్యాం రఘునాథ్, బంగారుపేట, బుచ్చయ్యపేట, విశాఖ జిల్లా ♦బి.శ్రీనివాసరావు, కొణితివాడ, వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లా ♦కె.వెంకటరమణ, దుద్దుకూరు, దేవరపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ♦టి.యామిని, ఇన్నుగుంట, ఓజిలి, నెల్లూరు జిల్లా -
బతకడం కష్టమని పెదవి విరిచారు.. కట్‌చేస్తే
''ఎన్ని కష్టాలు కవ్వించినా సరే...మనిషి గుండెలో ఆత్మవిశ్వాసం అనే జెండా రెపరెపలాడుతూనే ఉండాలి. పెదాలపై చిరునవ్వు ధగధగమని మెరుస్తూనే ఉండాలి..'' హరియాణాలోని ఝజ్జార్లో ఆ వీధికి వెళ్లి ‘చురుకైన పిల్లాడు ఎవరు?’ అనే ప్రశ్నకు అన్ని జవాబులు ఒకే దిక్కు వెళ్లేవి. ఆ అబ్బాయి పేరు తిన్కేష్ కౌశిక్. తొమ్మిదేళ్ల వయసులో దురదృష్టకరమైన రోజు ఒక ప్రమాదంలో రెండు కాళ్లు, ఎడమ చేయిని పోగోట్టుకున్నాడు. బతకడం కష్టం అని పెదవి విరిచారు వైద్యులు. ‘కచ్చితంగా బతుకుతాడు’ అనే ఆత్మబలంతో ఉన్నారు తల్లిదండ్రులు. చివరికి వారి ఆత్మబలమే నెగ్గింది. చికిత్స జరిగిన మూడు సంవత్సరాల కాలంలో పిల్లాడిని కంటికి రెప్పలా కాచుకున్నారు. ఆ తరువాత....అమ్మ సహాయంతో రోజూ బడికి వెళ్లడం మొదలుపెట్టాడు కౌశిక్. పాఠాలు వినడం తప్ప స్నేహితులతో ఆటలు లేవు. అయితే స్నేహితులెప్పుడూ అతడిని చిన్నచూపు చూడలేదు. రకరకాల ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూ కూడా కౌశిక్‌కు కృత్రిమ కాలు సమకూర్చారు తల్లిదండ్రులు. దీనివల్ల బరువైన పనులు చేసే అవకాశం లేనప్పటికి తనకు తానుగా కాలేజికి వెళ్లడానికి ఉపకరించింది. డిగ్రీ పూర్తయిన తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు కౌశిక్. శారీరకశ్రమ లేకపోవడంతో బాగా బరువు పెరిగాడు. ఈ బరువు తనకు అదనపు సమస్యగా మారింది. దీంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. కొంతకాలం తరువాత... గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన రెండు కిలోమీటర్ల మారథాన్‌లో తాను పాల్గొన్న వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. అది వైరల్ అయింది. ఈ వీడియోను చూసి స్పందించిన హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ ప్రోస్థటిక్ లెగ్స్‌ను స్పాన్సర్ చేసింది. ఇది తన జీవితంలో టర్నింగ్‌పాయింట్‌గా నిలిచింది.ఫిట్నెస్ ట్రైనర్ కావాలనేది తన లక్ష్యంగా మారింది. నాగ్‌పుర్ కేంద్రంగా పనిచేసే ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ కమ్యూనిటీ ‘ఫిట్టర్’తో తన ఫిట్నెస్ జర్నీ మొదలైంది. స్విమ్మింగ్ నుంచి సైకిలింగ్ వరకు అక్కడ శిక్షణ తీసుకున్నాడు. ఈ క్రమంలో నొప్పుల బాధలు ఇంతా అంతా కాదు. అయితే ట్రైనర్స్ ఉత్తేజకరమైన మాటలతో అతడిని నిరాశకు లోనుకానివ్వలేదు. సింగిల్ హ్యాండ్‌తో పవర్ఫుల్ స్ట్రెంత్‌ను ఎలా సమకూర్చుకోవచ్చు అనే కోణంలో కోచ్ కమల్శర్మ ఎన్నో వీడియోలను తనకు షేర్ చేశాడు. అవి తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ఫిట్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్‌లో పాల్గొనడం కౌశిక్‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఐసిఎన్–ఇండియాకు అథ్లెట్ అంబాసిడర్‌గా నియామకం కావడంతో తనలో గట్టి ఆత్మవిశ్వాసానికి పునాది పడింది. ఇక నేపాల్‌లో బంగీ జంప్ చేయడం తన ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడికో తీసుకెళ్లింది. లద్దాఖ్‌లో దివ్యాంగుల కోసం ఫిట్నెస్ క్లాసులు నిర్వహించాడు కౌశిక్. తన అనుభవాలను వారితో పంచుకున్నాడు. అపారమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగించాడు. ఫిట్నెస్ ట్రైనర్ కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. అయితే తన కల అక్కడితో ఆగిపోలేదు. ఆస్ట్రేలియాలో పర్వతారోహణ చేయాలనేది తన తాజా కల. గట్టి సంకల్పబలం ఉన్నవారికి తమ కలను నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు కదా! -
జ్ఞానదుర్గమ్మలు
దుర్గాశక్తికి ప్రతిరూపం సరస్వతీదేవి. సరస్వతీదేవి స్వరూపాలు.. ఈ తొమ్మిదిమంది ‘నీట్’ టాపర్లు. ఆకాంక్ష.. స్నికిత.. అమ్రిష చైతన్య.. ఆయేష.. సాయి త్రిష మానస.. లులు.. ఇషిత.. ప్రతికూలతలను జయించి.. విజయం సాధించిన జ్ఞానదుర్గమ్మలు. ఈ ఏడాది సెప్టెంబరు 13, 14 తేదీలలో ‘నీట్’ పరీక్ష రాసిన 13 లక్షల 60 వేల మంది అభ్యర్థుల అందరి లక్ష్యం ఒక్కటే. మంచి కాలేజ్‌లో మెడిసిన్‌లో సీటు సాధించడం. లక్ష్యం ఒక్కటే కానీ, లక్ష్యాన్ని చేరుకునేందుకు చేసిన సాధనలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క అనుభవం. ఎవరి పరిస్థితులు వారివి. అననుకూలతలు, అవరోధాలు, అవాంతరాలను దాటుకుని పరీక్ష రాసే తేదీ వరకు వచ్చినవారే అంతా. చివరి నిముషంలో పరీక్ష హాలును చేరలేక ఒక ఏడాదిని కోల్పోయిన వారూ ఉన్నారు. ఈసారి పరీక్ష రాసినవాళ్లలో సగానికన్నా ఎక్కువ సంఖ్యలోనే అమ్మాయిలు ఉన్నారు. 8 లక్షల 80 వేల మంది! సాధారణంగా అబ్బాయిలతో పోల్చి చూస్తే ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెస్ట్ టెస్ట్) ప్రిపరేషన్‌కు అమ్మాయిలే ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. వాళ్లకున్నన్ని అనుకూలతలు వీళ్లకు ఉండవు. నీట్లో టాపర్ నే చూడండి, ఢిల్లీ అమ్మాయి ఆకాంక్ష రోజుకు నూట నలభై కి.మీ. దూరం కోచింగ్‌కి వెళ్లొచ్చింది! ఆమె తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే కూతురి మెడిసిన్ కోచింగ్ కోసం భారత సైన్యంలోని తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, గ్రామం నుంచి ఢిల్లీకి కుటుంబాన్ని మార్చారు ఆమె తండ్రి. ఆకాంక్షతో పాటు బాలికల్లో తొమ్మిది తొలి స్థానాల్లో ర్యాంకు సాధించిన స్నికిత, అమ్రిష, చైతన్య, ఆయేష, సాయి త్రిష, మానస, లులు, ఇషిత కూడా ప్రిపరేషన్లో ఏదో ఒక ప్రతికూలతను ఎదుర్కొని విజయం సాధించిన జ్ఞాన దుర్గమ్మలే. ఆకాంక్షా సింగ్ తర్వాతి స్థానం తుమ్మల స్నికితది. ఆమె ఆలిండియా ర్యాంకు 3. వీళ్లది వరంగల్. ఆకాంక్ష పేరెంట్స్లానే స్నికిత పేరెంట్స్ కూడా కూతురి కాలేజ్‌కి దగ్గరగా ఇల్లు చూసుకున్నారు. స్నికితకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎంత చదివినా గుర్తుండేవి కావు. ఒత్తిడి పెరిగేది. ఆ ఒత్తిడిని తట్టుకోడానికి పాటలు వినేది. అమ్మమ్మకు ఫోన్ చేసి మాట్లాడేది. అమ్మాయిల్లో మూడో స్థానంలో నిలిచిన అమ్రిష ఖైతాన్ ర్యాంకు 5. తండ్రి, తల్లి, తాతయ్య, అన్నయ్య ఇంట్లో అంతా డాక్టర్లే. ‘నువ్వూ డాక్టర్ కావాలి’ అని బంధువుల నుంచి ఆమ్రిషకు ఒత్తిడి ఉండేది. వాళ్ల ఒత్తిడి ‘ఫస్ట్ అటెంప్ట్‌లోనే వచ్చేయాలి అమ్మాయ్’ అని! అయితే ఆ మాటను తను ఒత్తిడిగా కాక, ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాను అంటుంది అమ్రిష. ఆలిండియా 6వ ర్యాంకు పొంది, అమ్మాయిల్లో నాలుగో స్థానం పొందిన ఏపీ విద్యార్థిని చైతన్య సింధు ఇంట్లో కూడా అంతా డాక్టర్లే. బయాలజీ కోసం ఎక్కువ కష్టపడవలసి వచ్చింది తను. ఇంటర్ చదువుతున్నప్పుడు ఇంటి మీద బెంగ ఉండేది. అంతా ఉండేది విజయవాడే అయినా, తను ఉండటం హాస్టల్లో. ఆ బెంగ పోగొట్టడానికి పేరెంట్స్ వచ్చిపోతుండేవారు. సింధు తర్వాత ఐదో స్థానం ఆయేషాది. 12వ ర్యాంకు. కేరళ అమ్మాయి. తండ్రి యు.ఎ.ఇ.లో సేల్స్ ఎగ్జిక్యూటివ్. గత ఏడాది ఫస్ట్ అటెంప్ట్‌లో ఆయేషా సీటు సంపాదించ లేకపోయింది. ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుతో ఒత్తిడికి లోనయింది. 14వ ర్యాంకు సాధించిన సాయి త్రిషకు అమ్మాయిల్లో ఆరో స్థానం. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి, న్యూరోసర్జన్ అవాలని ఆమె లక్ష్యం. ఎయిమ్స్‌లో సీటు వచ్చేంత ర్యాంకును తెచ్చుకోగలనా అని కొంత ఆందోళనకు గురైంది. టీచర్స్, పేరెంట్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అమ్మాయిల్లో త్రిష తర్వాత ఏడో స్థానం మానసది. ఆమె ర్యాంకు 16. రోజుకు 12 గంటలు ప్రిపేర్ అయినా, అది సరిపోదేమోనని ఆమె సందేహం. 8, 9 స్థానాల్లో లులు (కేరళ), ఇషిత (పంజాబ్) ఉన్నారు. లులు కు 22వ ర్యాంకు, ఇషితకు 24 ర్యాంకు. ఆయేషాలానే లులుకు కూడా ఇది సెకండ్ అటెంప్ట్. ఇంకో అటెంప్ట్ చేయకూడదన్న పట్టుతో కూర్చొని చదివింది. ఇషితకు ఫస్ట్ అంటెప్ట్లోనే కొట్టేయాలనే పట్టు. ‘సీటు వస్తుందంటావా.. వస్తుందంటావా’ అని తల్లిని సతాయిస్తుండేది. ‘అమ్మ నా గైడింగ్ ఏంజెల్’ అంటుంది ఇషిత. -
కుంగిపోలేదు..స్ఫూర్తిగా నిలిచాడు..
పలాస: ఒకవైపు పేదరికం.. మరోవైపు అంగవైకల్యం.. అయినా అతడు కుంగిపోలేదు.. బాలారిష్టాలను ఎన్నో ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి స్వయం ఉపాధి పొందుతున్నాడు. తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఆయనే పలాస మండలం మాకన్నపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు సైన కాంతారావు(36). నిరుపేద కుటుంబానికి చెందిన కామేశ్వరరావు, లక్ష్మీదంపతులకు కాంతారావుతో పాటు అన్న, తమ్ముడు, చెల్లెమ్మలు ఉన్నారు. పెద్దవాడు జగదీష్ మూగవాడు. కాంతారావుకి రెండు చేతులు లేవు. అయినా తోటి పిల్లలతో ఆడుకుంటూ చదువుకోవాలని కోరిక బలంగా ఉండేది. కాలి వేళ్లతో పలకమీద అక్షరాలు దిద్దడం ప్రారంభించాడు అకుంఠిత దీక్షతో విద్యాభ్యాసం బొడ్డపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి పదో తరగతి పూర్తి చేశాడు. పాఠశాలలో క్రికెట్, చెస్, క్యారం ఆటలు కూడా ఆడేవాడు. కాశీబుగ్గలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్, బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బి.ఎ, స్థానికంగా బీఈడీ సైతం పూర్తి చేశాడు. కాశీబుగ్గలో కంప్యూటరు కోర్సు చదివి ఓవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూనే మరోవైపు కాశీబుగ్గలో ఇంటర్నెట్ సెంటర్ పెట్టి స్వయం ఉపాధి పొందుతున్నాడు. తన కుటుంబాన్ని పోషించడమే కాకుండా మరో నలుగురికి తన నెట్ సెంటర్లోనే ఉపాధి చూపిస్తూ ఆదర్శంగా నిలిచాడు. ప్రస్తుతం కాశీబుగ్గలో భార్య, పాపతో కలిసి ఒక అద్దె ఇంటిలో జీవనం సాగిస్తున్నాడు. -
పాదం లేకున్నా... పట్టుదల ఉంది
స్ఫూర్తిదాయకం తంగవేలు ప్రస్థానం తమిళనాడులోని సేలం జిల్లాలో పెరియవడగమ్పట్టి అనే మారుమూల గ్రామంలో ఓ నిరుపేద కుటుంబం అది... తల్లి రోజూ కూలికి వెళితే తప్ప నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లని పేదరికం... నలుగురు సంతానం... అందులో ఒకరు తంగవేలు. ఐదేళ్ల వయసులో ఇంటి బయట ఆడుకుంటున్న తంగవేలును తమిళనాడు ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో కుడికాలి పాదం పోరుుంది. కర్ర సాయంతో కుంటుతూ నడవాల్సిన పరిస్థితి. ఓ వైపు పేదరికం... మరోవైపు వైకల్యం... దీంతో తంగవేలు తల్లి సరోజ పడిన వేదన అంతా ఇంతా కాదు. తంగవేలు తండ్రి పిల్లల చిన్నతనంలోనే కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తల్లి రోజూ కూలికి వెళ్లేది. కూరగాయలు అమ్మేది. అరుుతే తన బాధను బయటపడనీయకుండా ఆ తల్లి పిల్లాడిలో స్ఫూర్తి నింపింది. ‘నువ్వెవరి కంటే తక్కువ కాదు’ అంటూ ధైర్యం నింపింది. వయసు పెరిగే కొద్దీ తంగవేలుకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగింది. పిల్లాడిలో ఉత్సాహం చూసిన స్కూల్ పీఈటీ సేలం తీసుకెళ్లి శిక్షణ ఇప్పించమని సలహా ఇచ్చారు. అక్కడ ప్రభుత్వ క్రీడా శిక్షణ కేంద్రంలో చేర్చితే బాగుంటుందని సూచించారు. సేలంలో హాస్టల్లో చేరిస్తే ఆటల సంగతి ఎలా ఉన్నా మూడు పూటలా పిల్లాడు తినగలుగుతాడని ఆ తల్లి భావించింది. అలా తంగవేలు సేలంలోని తమిళనాడు స్పోర్ట్స అథారిటీ అథ్లెటిక్స్ శిబిరంలో చేరాడు. అక్కడి కోచ్ ఎలమ్పరితి రెగ్యులర్ అథ్లెట్లతో పాటు తనకు కూడా శిక్షణ ఇచ్చాడు. ఏనాడూ ట్రైనింగ్‌కు తంగవేలు దూరం కాలేదు. జంప్ చేసే క్రమంలో తన కాలికి అనేకసార్లు గాయాలయ్యారుు. పుండు నొప్పితో కూడా శిక్షణకు వచ్చేవాడు. ఆ క్రమశిక్షణే తనని ఈ రోజు పారాలింపిక్ మెడలిస్ట్‌ను చేసింది. 14 ఏళ్ల వయసులో ఓ అథ్లెటిక్స్ పోటీలో సాధారణ అథ్లెట్లతో పోటీ పడి తంగవేలు రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో 2013లో జాతీయ పారా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడం ద్వారా తంగవేలు జీవితం మారిపోరుుంది. అక్కడ కోచ్ సత్యనారాయణ తనలోని టాలెంట్‌ను గుర్తించి బెంగళూరు తీసుకెళ్లారు. తనని మరింతగా తీర్చిదిద్దారు. 2015 నాటికే తను ప్రపంచంలో నంబర్‌వన్‌గా ఎదిగాడు. ట్యునీషియా గ్రాండ్ ప్రిలో స్వర్ణం సాధించడం ద్వారా పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఉద్యోగం కోసం...: ఓ వైపు అథ్లెటిక్స్ మీద పూర్తి స్థారుు దృష్టిపెట్టినా చదువునూ ఏనాడూ విడిచిపెట్టలేదు. 2015లో తను బీబీఏ డిగ్రీ పూర్తి చేశాడు. ఏదో ఒక ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి తల్లికి అండగా నిలవాలనేది అతని కోరిక. తంగవేలుకు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్లు. ఇప్పుడు ఒలింపిక్స్ స్వర్ణం గెలవడంతో వచ్చే నజరానాల ద్వారా ఆ కుటుంబం ఆర్థికంగా కుదురుకుంటుంది. 1 పారాలింపిక్స్ హైజంప్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం 3 ఓవరాల్‌గా పారాలింపిక్స్‌లో మనకు ఇది మూడో స్వర్ణం. గతంలో 1972 హిడెల్‌బర్గ్ గేమ్స్‌లో మురళీకాంత్ పేట్కర్ (స్విమ్మింగ్) దేశానికి తొలిసారి స్వర్ణం అందించగా... 2004 ఏథెన్‌స గేమ్స్‌లో దేవేంద్ర జజరియా (జావెలిన్ త్రో) కూడా ఈ ఫీట్ సాధించాడు ‘ఈ ఆనందాన్ని ఎలా వర్ణించాలి. చిన్నప్పటి నుంచి తను ఎంత కష్టపడి ఈ స్థారుుకి వచ్చాడో నాకు మాత్రమే తెలుసు. తంగవేలు ఈ స్థారుుకి చేరడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు’ - తంగవేలు తల్లి సరోజ కఠిన శ్రమతో వెలుగులోకి.. న్యూఢిల్లీ: చిన్నప్పుడే పోలియో బారిన పడినా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వరుణ్ సింగ్ భటి క్రీడలపై అమితాసక్తిని పెంచుకున్నాడు. గ్రేటర్ నొరుుడాకు చెందిన తను స్థానిక సెరుుంట్ జోసెఫ్స్ స్కూల్లో చదువుకున్న రోజుల్లోనే వెలుగులోకి వచ్చాడు. అనంతరం జాతీయ మాజీ అథ్లెట్ సత్యనారాయణ ఆధ్వర్యంలో బెంగళూరు సాయ్ శిక్షణలో తను మరింత రాటుదేలాడు. 2012 లండన్ పారాలింపిక్స్ బెర్త్ కోసం ‘ఎ’ అర్హత ప్రమాణాల (1.60మీ.)ను అందుకోవడంతో వార్తల్లో నిలిచాడు. ఈ ఏడాదే జరిగిన ఐపీసీ అథ్లెటిక్స్ ఆసియా-ఓసియానియా చాంపియన్‌షిప్‌లోనూ 21 ఏళ్ల వరుణ్ భటి 1.82మీ. హైజంప్‌తో స్వర్ణం సాధించడమే కాకుండా ఆసియా రికార్డు సృష్టించాడు. అభినందనల వెల్లువ ⇔ పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తంగవేలు, కాంస్యం నెగ్గిన వరుణ్‌లపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రపతి నుంచి సామాన్యుడి దాకా... అమితాబ్ బచ్చన్, అనుష్కశర్మ నుంచి బీసీసీఐ, పలువురు క్రికెటర్ల ట్వీట్లతో సోషల్ మీడియా హోరెత్తింది. ⇔ మీ విజయం దేశంలో అందరికీ స్ఫూర్తిదాయకం. మీ ఇద్దరికీ నా అభినందనలు. భవిష్యత్‌లో మీరు మరిన్ని విజయాలు సాధించాలి. - భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ⇔ భారత దేశం మొత్తం ఆనందిస్తోంది. స్వర్ణం గెలిచిన తంగవేలుకు, కాంస్యం నెగ్గిన వరుణ్ సింగ్ భటికి అభినందనలు. -ప్రధాని మోదీ ⇔ ఈ రోజు మన అథ్లెట్లు కొత్త చరిత్ర సృష్టించారు. రాబోయే తరాలకు వీరిద్దరూ స్ఫూర్తిగా నిలుస్తారు. - ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వర్ణం నెగ్గిన క్రీడాకారుల క్లబ్‌లోకి తంగవేలుకు స్వాగతం. కాంస్యం నెగ్గిన వరుణ్‌కు అండగా నిలిచిన గోస్పోర్‌ట్స వారుుసెస్ సంస్థకూ అభినందనలు. - అభినవ్ బింద్రా తమిళనాడు రూ.2 కోట్లు పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తమ రాష్ట్ర అథ్లెట్ తంగవేలుకు తమిళనాడు ప్రభుత్వం రూ.2 కోట్లు నజరానా ప్రకటించింది. ‘నీ ప్రదర్శన పట్ల యావత్ భారతదేశం గర్వపడుతోంది. తమిళనాడు ప్రజల తరఫున శుభాకాంక్షలు. ఒలింపిక్స్ స్వర్ణం గెలిస్తే ఇచ్చే నజరానాతో సమానంగా తంగవేలుకు కూడా రూ.2 కోట్లు ప్రభుత్వం అందజేస్తుంది’ అని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తెలిపారు. కేంద్ర ప్రభుత్వ క్రీడావిధానం ప్రకారం ఒలింపిక్స్ లేదా పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన వారికి రూ.75 లక్షలు ఇస్తారు. కాంస్యం గెలిస్తే రూ.30 లక్షలు అందుతారుు. తంగవేలు, వరుణ్‌లకు ఈ నజరానా ఇస్తారు.