తల్లిదండ్రులు చనిపోయారు.బంధువులు దూరం జరిగారు. తనకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా కన్నీళ్లు, కష్టాలు మాత్రం కచ్చితంగా ఉండేవి. అయినా సరే ఆ చిన్నారి ఎప్పుడూ నిరాశపడలేదు. చెత్త ఏరుకునే స్థాయి నుంచి దిల్లీలోని ప్రముఖ హోటల్‌లో చెఫ్ వరకు ఎదిగి, కష్టాల చీకటిని ఛేదిస్తూ రెయిన్‌బోగా వెలిగి ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది లిలిమా ఖాన్...
దిల్లీ వసంత్‌కుంజ్‌లోని లె క్యాంటిన్ రెస్టారెంట్‌లో లిలిమాఖాన్ చెఫ్‌గా పనిచేస్తోంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథగా మారింది. కడుపు నింపుకోవడం కోసం చెత్త ఏరింది. ఇటుకలు మోసింది. ఇండ్లలో పనిచేసింది... ఒకటా రెండా... పొట్టనింపుకోవడానికి ఎన్నెన్నో పనులు చేసింది. డబ్బులు లేని సమయంలో ఆకలి తట్టుకోలేక చెత్తబుట్టల్లో నుంచి మెతుకులు ఏరుకుని తిన్న సందర్భాలూ ఉన్నాయి. ఆకలి తీర్చుకోవడం ఒక ఒక పనైతే పోకిరీలు, రౌడీల నుంచి తనను తాను రక్షించుకోవడం మరో పెద్ద పనిగా మారింది.
కష్టాల కత్తుల వంతెనపై నడుస్తున్న ఖాన్‌కు ‘కిల్కరి రెయిన్‌బో హోమ్’ రూపంలో దివ్యమైన దారి దొరికింది.‘ఇక్కడ నాకు ఆహారం, ప్రేమతో పాటు ఎన్నో దొరికాయి. అందులో చదువు ఒకటి’ అంటుంది ఖాన్. కుటుంబంలేని తనకు ‘రెయిన్‌బో’ అనే స్వచ్ఛందసంస్థ పెద్ద కుటుంబమై ప్రేమను పంచింది. ‘రెయిన్‌బో’లో ఖాన్‌కు ఇష్టమైన ప్రదేశం... వంటగది. వంటచేస్తున్న వాళ్లకు చిన్న చిన్న పనులలో సహాయపడేది. చదువు పూర్తయిన తరువాత ‘రెయిన్‌బో’ సహాయంతో ఖాన్ కుకింగ్‌లో అప్రెంటిస్‌షిప్ చేసింది.
శిక్షణ పూర్తయిన తరువాత దిల్లీలోని ఇటాలియన్ రెస్టారెంట్‌లో స్టాఫ్ కుక్‌గా ఖాన్‌కు అవకాశం వచ్చింది. ఆ తరువాత లె క్యాంటీన్‌లో చేరింది.‘ఇంత పెద్ద హోటల్‌లో నేను పనిచేయగలనా అని మొదట్లో భయపడ్డాను. కొన్ని రోజులకు ఆ భయం దూరమైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ అంటుంది ఖాన్. ‘స్త్రీలకు ప్రోత్సాహకరంగా ఉండని ఇండస్ట్రీని ఎందుకు ఎంచుకున్నారు’ అనేది ఖాన్‌కు తరచుగా ఎదురయ్యే ప్రశ్న. ‘చెఫ్ జూలియాకు ఇండస్ట్రీలో పెద్ద పేరు ఉంది. ఆమె నాకు ఆదర్శం. ప్రతిభ ఉంటే జెండర్ అనేది అడ్డంకి కాదు’ అంటుంది ఖాన్.
ఒకరోజు హోటల్‌కు తనను కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది. ‘ఈ అమ్మాయికి నాతో పనేమిటి’ అనుకుంది మనసులో. ఆ అమ్మాయి మాత్రం మనసు విప్పి మాట్లాడింది. ‘పరీక్షలో ఫెయిల్ అయిన నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేవి. ఆ సమయంలో మీ గురించి చదివాను. నా సమస్య చాలా చిన్నదిగా అనిపించింది. ఎన్నో కష్టాలను తట్టుకొని మీరు సక్సెస్ అయ్యారు. మీ స్ఫూర్తితో నేను కూడా విజయం సాధించాలకుంటున్నాను’ అని చెప్పింది. ‘కష్టాలలో నలిగినా వెనకడుగు వేయకుండా సాధించిన విజయాలు మనకు మాత్రమే పరిమితం కావు. అవి పదిమందికీ స్ఫూర్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తాయి అని నేను విన్న మాట ఆ సమయంలో గుర్తుకు వచ్చింది’ అంటుంది లిలిమాఖాన్.
Comments
Please login to add a commentAdd a comment