
కంపసముద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మరో రెండు గ్రామాలను పరిశీలిస్తున్నాం
ఆత్మకూరు : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూపొందించిన సంసాద్ ఆదర్శ గ్రామ యోజన (సాగీ) పథకంలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు దత్తత తీసుకున్నట్టు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పల్లెలను దత్తత తీసుకోవాలని పీఎం నరేంద్రమోదీ పార్లమెంట్ సభ్యులకు పిలుపునిచ్చారన్నారు.
ఆయన స్ఫూర్తితో తాను కంపసముద్రం గ్రామాన్ని దత్తత తీసుకున్నానన్నారు. కంపసముద్రంలో తనతో పాటు తన సోదరుడైన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి చదువుకున్నట్టు ఎంపీ తెలిపారు. అంతేకాకుండా కంపసముద్రం రాజకీయంగా చరిత్ర కలిగిన గ్రామమన్నారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవడం సరైన నిర్ణయమే అన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కావలి నియోజకవర్గంలో మరో గ్రామాన్ని కూడా ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.
గ్రామాన్ని ఎంపిక చేయాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కోరానన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలోని మరో గ్రామాన్ని కూడా ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు గ్రామాన్ని ఎంపిక చేయాల్సిందిగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావును కోరానన్నారు. ఈ రెండు గ్రామాలను కూడా ఎంపిక చేస్తే నిధులను వెచ్చించి వాటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.