kampasamudram
-
నిమ్మగడ్డ తీరుపై కన్నెర్ర చేసిన పల్లె!
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార తీరుపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ పల్లె కన్నెర్ర చేసింది. ఈ ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో మా ఊళ్లో ఎన్నికలే జరగనివ్వబోమంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా ప్రకటించారు. నామినేషన్లన్నింటినీ సోమవారం ఉపసంహరించుకున్నారు. పళళంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలైతే ఆ మండల అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఏకగ్రీవాలను రద్దు చేస్తామన్న ప్రకటనలపై ఆ గ్రామస్తులు తమ నిరసనను ఈ రూపంలో వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం కంపసముద్రం పంచాయతీ ప్రజలు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార తీరును నిరసిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేసుకున్నారు. 2,500 మందికి పైగా జనాభా ఉన్న ఈ పంచాయతీలో 1,780 మంది ఓటర్లున్నారు. ఈ గ్రామంలో విద్యావంతులు అధికంగా ఉన్నారు. రాజకీయ పరిణితి ఎక్కువ. చాలామంది ఉన్నత చదువులు చదివి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపారరీత్యా స్థిరపడ్డారు. ఈ గ్రామం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబానికి తోడుగా ఉంటుంది. ఆ గ్రామంపై ఉన్న మక్కువతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రత్యేత దృష్టి సారించి తానే స్వయంగా దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించి ఆ గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. 28 మంది నామినేషన్ల ఉపసంహరణ ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించారు. ఈనెల 13న ఎన్నికలు జరగాల్సి ఉంది. సర్పంచ్ పదవి కోసం 8 మంది, పది వార్డులకు 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని గ్రామాభివృద్ధికి ఐక్యంగా నడవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. ఎన్నిక ఏకగ్రీవమైతే ఆ ప్రాంత అధికారులపై చర్యలతోపాటు ఏకగ్రీవాలను రద్దుచేస్తామంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చేసిన ప్రకటన వారిని ఆవేదనకు, ఆగ్రహానికి గురిచేసింది. ఊరంతా ఓకే మాట, ఒకే బాటగా ఉండి ఏకగ్రీవమైనా ఎన్నికను రద్దుచేస్తే తమ మాటకు విలువ ఉండదని భావించారు. దీంతో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉన్నంతకాలం స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానం చేసుకున్నారు. సర్పంచ్, వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన 28 మంది ఉపసంహరించుకున్నారు. గతంలో కూడా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకున్నారు. మల్లు రామిరెడ్డి, నారపరెడ్డి ఓబుల్‌రెడ్డి, పుట్టం సీతారామయ్య ఏకగ్రీవంగా సర్పంచ్‌లుగా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషిచేశారు. అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం గ్రామమంతా ఏకమై ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రతిపక్ష పారీ్టకి తొత్తులా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకగ్రీవాలను రద్దుచేస్తామనటం మాకు ఆగ్రహం తెప్పించింది. అందుకే నిమ్మగడ్డ ఉన్నంతకాలం ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం. – మల్లు సుధాకర్‌రెడ్డి, కంపసముద్రం ఊరి మాటకు కట్టుబడి.. ఎస్ఈసీ నిమ్మగడ్డ చేసిన ప్రకటనపై ఊరంతా కలిసి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. గ్రామస్తులందరూ కలిసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయంతో వేసిన నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నాం. సర్పంచ్ పదవి బీసీలకు కేటాయించారు. 8 మందిమి నామినేషన్లు వేశాం. అందరం కలిసి విత్‌డ్రా చేసుకున్నాం. – చెవుల రమేష్, కంపసముద్రం ఒకే మాట.. బాట ఊరంతా ఒకే మాట, బాటగా ఉన్నాం. ఏకగ్రీవాలైతే రద్దుచేస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ చేసిన ప్రకటన మాకు ఆగ్రహం కలిగించింది. ఊరంతా కలిసి తీసుకునే నిర్ణయానికి విలువ లేనప్పుడు ఎన్నికలు ఎందుకు జరుపుకోవాలి? అందుకే నిమ్మగడ్డ పదవిలో ఉన్నంతకాలం మేము ఎన్నికలకు దూరంగా ఉంటాం. – సన్నిబోయిన బాలకృష్ణ, కంపసముద్రం -
కంపసముద్రానికి మహర్దశ
మర్రిపాడు: జిల్లాలోని కంపసముద్రానికి మహర్దశ పట్టింది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కంపసముద్రాన్ని దత్తత తీసుకోవడంతో గ్రామస్తులు తన్మయత్వానికి లోనయ్యారు. మెట్ట ప్రాంతమైన కంపసముద్రం గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ఇక అభివృద్ధికి కొదవలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి కంపసముద్రంలో 8వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ మమకారంతోనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారని స్థానికులు అభిప్రాయపడ్డారు. గ్రామంలో 470 కుటుంబాలు, 2,400 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. అయితే తగినన్ని గదులు లేవు. ఎంపీ దత్తత తీసుకోవడంతో ఆ సమస్య తీరనుంది. గ్రామానికి కీలకమైన పంచాయతీ కార్యాలయం లేదు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. గ్రామ ఎగవూరులో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎంపీ మేకపాటి చొరవతో గ్రామానికి ఎస్సీ బాలుర వసతిగృహం మంజూరైందని స్థానికులు చెప్పారు. ఇప్పటికే మేకపాటి సోదరుల సహకారంతో గ్రామం కొంత వరకు అభివృద్ధి చెందిందన్నారు. రైతులకు అవసరమైన చెరువులను కూడా అభివృద్ధి చేయాలని, పంట కాలువను బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎంతో ఆనందంగా ఉంది మా గ్రామాన్ని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. గ్రామాభివృద్ధి కోసం గతంలో పలు అభివృద్ధి పనులు చేశారు. ప్రస్తుతం దత్తత తీసుకునేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉంది. మేకపాటి కుటుంబానికి మేము ఎంతో రుణపడి ఉంటాం. -గోపవరం కాంతారెడ్డి సమస్యలు తీరనున్నాయి కంపసముద్రం గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి గ్రామస్తులందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా గ్రామంపై మమకారంతో అభివృద్ధి చేయాలని ముందుకు రావడంతో ఆనందంగా ఉంది. మా గ్రామానికి ఇక మంచి రోజులే రాబోతున్నాయి. సాగు,తాగునీరు సమస్యలు కూడా తీరనున్నాయి. -మల్లు సుధాకర్‌రెడ్డి -
కంపసముద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మరో రెండు గ్రామాలను పరిశీలిస్తున్నాం ఆత్మకూరు : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూపొందించిన సంసాద్ ఆదర్శ గ్రామ యోజన (సాగీ) పథకంలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు దత్తత తీసుకున్నట్టు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పల్లెలను దత్తత తీసుకోవాలని పీఎం నరేంద్రమోదీ పార్లమెంట్ సభ్యులకు పిలుపునిచ్చారన్నారు. ఆయన స్ఫూర్తితో తాను కంపసముద్రం గ్రామాన్ని దత్తత తీసుకున్నానన్నారు. కంపసముద్రంలో తనతో పాటు తన సోదరుడైన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి చదువుకున్నట్టు ఎంపీ తెలిపారు. అంతేకాకుండా కంపసముద్రం రాజకీయంగా చరిత్ర కలిగిన గ్రామమన్నారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవడం సరైన నిర్ణయమే అన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కావలి నియోజకవర్గంలో మరో గ్రామాన్ని కూడా ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. గ్రామాన్ని ఎంపిక చేయాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కోరానన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలోని మరో గ్రామాన్ని కూడా ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు గ్రామాన్ని ఎంపిక చేయాల్సిందిగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావును కోరానన్నారు. ఈ రెండు గ్రామాలను కూడా ఎంపిక చేస్తే నిధులను వెచ్చించి వాటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. -
‘కంపసముద్రాన్ని’ దత్తత తీసుకున్న మేకపాటి
* ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామాన్ని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దత్తత తీసుకున్నారు. గ్రామాలను అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఒక్కో గ్రామాన్ని ఎంపీలు దత్తత తీసుకోవాలని ప్రధాని మోదీ సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో భాగంగానే కంపసముద్రం గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్టు ఎంపీ మేకపాటి బుధవారం తెలిపారు. ప్రత్యేక నిధులతో ఈ గ్రామంలో మౌలిక వసతులతో పాటు అత్యాధునికి సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు.