నాయనమ్మ నవాజ్‌బాయితో రతన్ టాటా
రతన్ టాటా మన దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త. పారిశ్రామిక విజయాలలోనే కాదు, వదాన్యతలోనూ ఆయన ఎందరికో స్ఫూర్తి ప్రదాత. అంతటి రతన్ టాటాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందనే నానుడి రతన్ టాటా విషయంలోనూ నిజమే! చిన్ననాటి నుంచి రతన్ టాటాకు స్ఫూర్తి ఆయన నాయనమ్మే! రతన్ టాటా నాయనమ్మ నవాజ్‌బాయి టాటా సన్స్ కంపెనీకి మొదటి మహిళా డైరెక్టర్. టాటా ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా కూడా ఆమె సేవలందించారు.
రతన్ టాటాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన తల్లిదండ్రులు విడాకులు పొంది విడిపోయారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో రతన్ టాటా, ఆయన తమ్ముడు జిమ్మీ టాటాల బాధ్యతను నాయనమ్మ నవాజ్‌బాయి చేపట్టారు. వారిద్దరినీ అల్లారుముద్దుగా పెంచారు. సాటి మనుషులతో మెలగాల్సిన తీరును, జీవితంలో పాటించాల్సిన విలువలను నేర్పించారు.
తన జీవితాన్ని తీర్చిదిద్దిన నాయనమ్మే తనకు స్ఫూర్తి ప్రదాత అని, తాను సాధించిన విజయాల ఘనత ఆమెకే చెందుతుందని రతన్ టాటా ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. నాయనమ్మ పెంపకంలో పెరగకపోయి ఉంటే, తాను ఇంతటివాణ్ణి కాగలిగేవాణ్ణి కాదని రతన్ టాటా తరచుగా చెబుతుండేవారు.
ఇక్కడ చదువు పూర్తయ్యాక ఉన్నతవిద్య కోసం రతన్ టాటా అమెరికా వెళ్లారు. కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లాస్ ఏంజెలిస్‌లోని ఒక ఆర్కిటెక్చర్ సంస్థలో ఉద్యోగంలో చేరారు. అక్కడే స్థిరపడిపోవాలనుకున్న దశలో నాయనమ్మ నవాజ్‌బాయి అనారోగ్యానికి లోనయ్యారు. స్వదేశానికి తిరిగి వచ్చేయమని ఆమె కోరడంతో రతన్ టాటా అమెరికా జీవితానికి స్వస్తిచెప్పి, బాంబేకు వచ్చేసి, టాటా సంస్థల బాధ్యతల్లో పాలుపంచుకోవడం మొదలుపెట్టారు.
(చదవండి: నాలుగుసార్లు ప్రేమలో పడినా..!)
Comments
Please login to add a commentAdd a comment