
ఒక మనిషి చనిపోయినా.. అతడు చేసిన మంచి ఎప్పుడూ బతికే ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి, దివంగత పారిశ్రామికవేత్త 'రతన్ టాటా' (Ratan Tata) ఒకరు. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ.. లెక్కకు మించిన డబ్బును అనేక సేవా కార్యక్రమాల కోసం ఉదారంగా వెచ్చించారు. రతన్ టాటా మరణించిన తరువాత.. ఆయన ఆస్తులు, సంపద ఎవరికి చెందుతాయి? అనే ప్రశ్న.. ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. దానికి ఇప్పుడు సమాధానం లభించింది.
టాటా సామ్రాజ్యాన్ని ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించిన రతన్ టాటా ఆస్తి సుమారు రూ. 10వేలకోట్ల కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో సుమారు రూ.3800 కోట్ల సంపదను.. తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ వంటి వాటికి కేటాయించారు.
తన సవతి సోదరీమణులైన శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్ పేరుమీద రూ.800 కోట్లు రాసినట్లు తెలుస్తోంది. వీటికి కేటాయించిన ఆస్తులలో ఫిక్డ్స్ డిపాజిట్లు, ఖరీదైన పెయింటింగ్స్, వాచ్‌లు వంటివి ఉన్నాయి. రతన్ టాటాకు సన్నిహితుడైన.. మోహిన్ ఎం దత్తాకు కూడా రూ.800 కోట్లు రాశారు.
జిమ్నీ నావల్ టాటాకు.. రతన్ టాటాకు చెందిన జుహూలోని బంగ్లాలో కొంత షేర్, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను కేటాయించారు. మెహిల్ మిస్త్రీ పేరు మీద అలీబాగ్‌లోని బంగ్లా, మూడు పిస్టోళ్లను కేటాయించారు.
ఇదీ చదవండి: EPFO విత్‌డ్రా లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!
రతన్ టాటాకు కుక్కలంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే శునకాల సంరక్షణ కోసం కూడా రూ. 12 లక్షల ఫండ్ కేటాయించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 30వేలు చొప్పున వాటికి ఖర్చుచేసే విధంగా నిధులను కేటాయించారు. రతన్ టాటాకు విదేశాల్లో కూడా రూ. 40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రముఖ కంపెనీలలో షేర్స్, ఖరీదైన 65 వాచీలు కూడా ఉన్నాయి.
ఇక అందరూ తెలుసుకోవాలనుకునే విషయం.. రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుకు ఏమి కేటాయించారు అని. అయితే శంతను నాయుడుకు తనవంతు సాయం చేసినట్లు తెలుస్తోంది. అది కాకుండా.. స్టూడెంట్ లోన్ మాఫీ చేశారు. ఇది కాకుండా రతన్ టాటా పక్కింట్లో ఉండే జేక్ మాలిటే అనే వ్యక్తికి అప్పుగా ఇచ్చిన రూ. 23 లక్షలు కూడా మాఫీ చేశారు.