రతన్ టాటా ఫ్రెండ్.. శంతనుకు టాటా మోటార్స్‌లో కీలక బాధ్యతలు | Ratan Tata Friend Shantanu Naidu Joined New Position at Tata Motors Linkedin Post Viral | Sakshi
Sakshi News home page

రతన్ టాటా ఫ్రెండ్.. శంతనుకు టాటా మోటార్స్‌లో కీలక బాధ్యతలు

Published Tue, Feb 4 2025 2:56 PM | Last Updated on Tue, Feb 4 2025 3:33 PM

Ratan Tata Friend Shantanu Naidu Joined New Position at Tata Motors Linkedin Post Viral

దివంగత వ్యాపార దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) మిత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న 'శంతను నాయుడు' (Shantanu Naidu)కు టాటా మోటార్స్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈయన కంపెనీలో జనరల్ మేనేజర్ & స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని తానె స్వయంగా తన లింక్డ్ఇన్‌లో వెల్లడించారు.

''టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్ & జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నా తండ్రి తన తెల్లటి చొక్కా, నేవీ ప్యాంటుతో టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి ఇంటికి నడిచి వచ్చేవారు. ఆయన కోసం నేను కిటికీలో చూస్తూ ఉండేవాడిని. ఆ సంఘటన నాకు ఇంకా గుర్తుంది'' అని శంతను నాయుడు తన లింక్డ్ఇన్‌లో రాశారు.

ఎవరీ శంతను నాయుడు?
శంతను నాయుడు ఒక ఆటోమొబైల్ డిజైన్ ఇంజినీర్. ఇతడు ఒక రోజు రోడ్డు మధ్యలో వీధి కుక్క చనిపోయి ఉండటాన్ని గమనించిన చలించిపోయాడు. ఆ తరువాత వీధి కుక్కుల సంరక్షణకు ఏదో ఒకటి చేయాలని ఆలోచనలో పడ్డాడు. తన స్నేహితులతో కలిసి వీధి కుక్కల కోసం రేడియం స్టిక్కర్లతో తయారు చేసిన కాలర్స్‌ని తయారు చేశాడు. తన ఇంటి పరిసరాల్లోని కుక్కలకు వాటిని అమర్చాడు. ఆ పనికి మరుసటి రోజే స్థానికుల నుంచి మెప్పు పొందాడు.

ముంబైలో ఉన్న వీధి కుక్కలన్నింటికీ ఈ రేడియం కాలర్‌ అమర్చాలని నిర్ణయించారు. కానీ అది డబ్బుతో కూడకున్న వ్యవహారం కావడంతో విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. ఆయన ‘వీధి కుక్కలను కాపాడేందుకు సాయం చేయాల్సిందిగా రతన్‌ టాటాని అడుగు. ఆయనకు కుక్కలంటే ఇష్టం’ అని సలహా ఇచ్చాడు.

మోటోపాస్‌ పేరుతో స్టార్టప్‌
వీధి కుక్కలను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేందుకు ‘మోటోపాస్‌’ పేరుతో స్టార్టప్‌ ఏర్పాటు చేశానని, దానికి సాయం చేయాల్సిందిగా కోరుతూ పూర్తి వివరాలు కలిగిన ఈ మెయిల్‌ను ఏకంగా రతన్‌టాటాకే పంపాడు. రోజులు గడుస్తున్నా ఎలాంటి రిప్లై లేకపోవడంతో తన పనిలో తాను నిమగ్నమయ్యాడు.

చివరకు రెండు నెలల తర్వాత నేరుగా తనని కలవాలంటూ రతన్‌టాటా నుంచి ఆహ్వానం అందింది. అదే రతన్‌టాటాతో శంతన్‌ నాయుడికి తొలి పరిచయం ఏర్పడేలా చేసింది. వ్యక్తిగతంగా రతన్‌ టాటాను కలిసి తన ప్రాజెక్టు గురించి వివరించాడు. వీధి కుక్కల పట్ల అతను చూపించే ప్రేమకు రతన్‌టాటా ఫిదా అయ్యారు. వెంటనే సాయం చేసేందుకు అంగీకరించారు. అలా మోటోపాస్‌ స్టార్టప్‌నకు ఆర్థికసాయం అందింది.

కార్నెల్‌ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు రావడంతో శంతను అమెరికా బయల్దేరాడు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత టాటా గ్రూపులో పని చేయాలని శంతను నిర్ణయించుకున్నాడు. MBA పూర్తి చేసి ఇండియాకు వచ్చిన తర్వాత టాటా ట్రస్టులో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(డిజీఎం) హోదాలో చేరారు. అయితే కొద్ది కాలానికే శంతను నాయుడును పిలిపించుకున్న రతన్‌ టాటా..తనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉండాలని కోరారు. దాంతో 2018 నుంచి టాటా తుది శ్వాస వరకు వెన్నంటి ఉన్నాడు.

ఇదీ చదవండి: కొత్త టోల్ విధానం.. ముందుగా చెప్పిన నితిన్ గడ్కరీ

గుడ్‌ఫెలోస్‌
సాటి జీవుల పట్ల శంతను నాయుడికి ఉన్న ప్రేమ రతన్‌టాటాను ఆకట్టుకున్నాయి. శంతన్‌ ‌నాయుడి ఆలోచణ సరళి టాటాను ఆకర్షించింది. మోటోపాస్‌తోపాటు శంతన్‌ సెప్టెంబర్‌ 2022లో ‘గుడ్‌ఫెలోస్‌’ను స్థాపించారు. ఇది యువకులను మమేకం చేసి సీనియర్ సిటిజన్‌ల ఒంటరితనం పోగొట్టేందుకు పనిచేస్తోంది. అతను ‘ఐ కేమ్ అపాన్ ఎ లైట్‌హౌస్’ పేరుతో రతన్‌ టాటాతో ఉన్న జ్ఞాపకాలు, తన నుంచి నేర్చుకున్న విషయాలపై పుస్తకం రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement