దేశం అత్యంత ఎత్తైన పారిశ్రామిక శిఖారాన్ని కోల్పోయింది. టాటా గ్రూప్ ఎమిరిటస్ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. అనేక రకాల వ్యాపారాల్లో చరిత్ర సృష్టించిన టాటా గ్రూప్‌నకు వైఫల్యాలు, వాటి నుంచి అద్భుతంగా పునరాగమనం చేసిన చరిత్ర కూడా ఉంది.
టాటా కలను ఎగతాళి చేశారు..
కార్పొరేట్ చరిత్రలో టాటా వర్సెస్ ఫోర్డ్ ఉదంతానికి ప్రత్యేక స్థానం ఉంది.90 దశకం చివరలో అప్పుడు టాటా మోటర్స్ టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కో అనే పేరుతో ఉండేది. అప్పట్లో టాటా ఇండికా అనే కొత్త మోడల్ కారును లాంచ్ చేసింది. టాటా ఇండికాతో టాటా మోటర్స్‌ను దేశ ఆటోమొబైల్ రంగంలో కీలక సంస్థగా తీర్చిదిద్దాలన్నది స్వయంగా రతన్ టాటా కలగా ఉండేది. అయితే దేశంలోని కార్ల పరిశ్రమ సవాలుగా ఉన్న సమయంలో ఇండికాకు పెద్దగా ఆదరణ లభించలేదు.
అసలే టాటా గ్రూప్‌నకు కార్ల కొత్త. దీంతో టాటామోటర్స్ ప్యాసింజర్ కార్ల విభాగాన్ని అమ్మేద్దాం అనుకున్నారు. అమెరికా ఆటోమొబైల్స్ సంస్థ ఫోర్డ్.. ఈ విభాగాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. అలా 1999లో టాటా తన బృందంతో కలిసి టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ విభాగం విక్రయంపై చర్చించేందుకు ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశం కోసం డెట్రాయిట్‌కు వెళ్లారు.
అయితే సమావేశం అనుకున్న విధంగా జరగలేదు. ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్‌లు టాటాను ఎగతాళి చేశారు. "మీరు కార్ల వ్యాపారంలోకి ఎందుకు వచ్చారు? దాని గురించి మీకు ఏమీ తెలియదు. మేము మీ కార్ల విభాగాన్ని కొనుగోలు చేస్తే అది మీకు చాలా మేలు చేసినట్లవుతుంది" అని వారిలో ఒకరు చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఇది టాటాను, వారి బృందాన్ని తీవ్రంగా బాధించింది. దీంతో ఒప్పందాన్ని వద్దనుకుని భారత్‌కి తిరిగొచ్చేశారు.
ప్రతీకారం ఇలా తీరింది..
తరువాత టాటా మోటర్స్ పుంజుకుంది. టాటా ఇండికాకు క్రమంగా ఆదరణ పెరిగింది. భారతీయ కార్ మార్కెట్లో మొట్టమొదటి డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌గా విజయవంతమైంది. తొమ్మిదేళ్ల తర్వాత 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఫోర్డ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. దాని లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను విక్రయానికి పెట్టింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను ఫోర్డ్ నుండి 2.3 బిలియన్ డాలర్లకు టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. టాటాకు ఫోర్డ్ చేసిన అవమానానికి ఇలా ప్రతీకారం తీరింది.
Comments
Please login to add a commentAdd a comment